కౌముది ఇంట్లో సత్యవతి పని చేస్తుంటుంది.వయసు రీత్యా పెద్దది కావడంతో సత్యవతి మంచి చెడు సలహాలు ఇస్తూ ఉంటుంది.ఒక రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా రేపు త్వరగా వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్ళు.నేను బంధువుల ఇంటికి పలకరించడానికి వెళ్ళాలి.మొన్న ఒకాయన కాలం చేశారు కదా అనగానే అమ్మా! రేపు ఆదివారం,ఎల్లుండి సోమవారం,ఆ తర్వాత మంగళ వారం కనుక అటువంటి చోటుకు వెళ్ళకూడదు అని ఖరా ఖండిగా చెప్పి బుధ వారం వెళ్లి రండి అని సలహా చెప్పింది.అవునా!మంగళ వారం,శుక్ర వారం వెళ్ళకూడదు అంటారు అని తెలుసు కానీ మిగతా రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు? అంది కౌముది.మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికి అన్ని రోజుల్లో వెళ్ళకూడదు.అలా వెళ్తే ' నలకువ ' అని చెప్పారు అంది.నలకువ అంటే అర్ధం ఏమిటి? అంటే ఏమో అమ్మా! నాకూ తెలియదు.వెళ్ళడం మంచిది కాదు అని అనుకుంటున్నాను అంతే అంది.సత్యవతికి అంతకు మించి ఏమీ తెలియదు కనుక ఒక్క మాట కూడా మాట్లాడదు.నలకువ అంటే అర్ధం ఏమిటో ? అని సందేహం మనసుని తొలిచేస్తున్నా మెళుకువ కి వ్యతిరేకార్ధం నలకువ అనేమో అని ఊహించుకుని కౌముది అంతటితో ఆ చర్చా కార్యక్రమం ముగించింది.
No comments:
Post a Comment