Thursday, 5 November 2020

కోపం

                                                                        విహిత  బహు కోపిష్టి.ముక్కు మీద కోపం ఉంటుంది.ప్రతి చిన్నదానికి అందరి మీద అరుస్తూ ఉంటుంది.ఏ చిన్న తప్పు చేసినా ఎదుటివారిని చీల్చి చెండాడినంత పని చేస్తుంది.దానితో ఎదుటివారు బిక్క చచ్చిపోవల్సిందే.అయితే మిగతా విషయాల్లో విహిత చాలా మంచిది.ఎదుటి వారి కష్టం,బాధ చూచి అసలు తట్టుకోలేదు.వెంటనే ఇదిగో నేనున్నానంటూ ఆగమేఘాలమీద వారికి  సహాయం చేస్తుంది.ఎంత మంచితనం ఉన్నా కోపం ఎక్కువ ఉండడంతో అందరికీ విహిత అంటే భయం.చనువుగా మాట్లాడలేరు.ఒకసారి విహిత ఇంటికి మనవరాలిని చూచి పోదామని అమ్మమ్మ వచ్చింది.రెండు రోజులు విహితను గమనించిన తర్వాత మనవరాలిలో ఉన్న కోపం అనే దుర్గుణాన్ని ఎలాగయినా పోగొట్టాలని ఖాళీగా ఉన్నప్పుడు ఆ కబురు ఈ కబురు చెబుతూ ఈ రోజు కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది అమ్మా!తినలేకపోయాను.కూరలో ఉప్పు ఎక్కువైనా తినలేము.అలాగని కాస్త తక్కువైనా తినలేము కదా! అలాగే మనకున్న కోపం కూడా ఉప్పులాంటిదే.ఎక్కువ అయితే ఎంత మంచితనం ఉన్నా విలువ ఉండదు.తక్కువ అయితే మర్యాద ఉండదు.కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ఉప్పులా అవసరమైనంత మేరకు మాత్రమే వాడాలని సున్నితంగా తెలియచేసింది అమ్మమ్మ.అమ్మమ్మ చెప్పిన విధానానికి విహిత మారు మాట్లాడలేకపోయింది.ఇది విన్న విహిత కొద్దిసేపు నిశ్శబ్ధంగా కూర్చుని తర్వాత నెమ్మదిగా నా పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అమ్మమ్మా అని చెప్పింది.చెప్పే రీతిలో నచ్చే విధంగా చెప్తే ఎంతటి  మొండివారైనా తప్పకుండా మాట వింటారు.

1 comment:

  1. మీకు తెలిసిన అనుభవాన్ని చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. కోపం ఆవశ్యకతను గుర్తించేట్లు చేసారు. అలాగే ఇదే ప్రస్థావనపై నా అభిప్రాయాన్ని నా బ్లాగులో వ్రాసాను. అవకాశముంటే చదవండి. https://telugujigi.blogspot.com/p/0039.html

    ReplyDelete