కూరలో కరివేపాకు వెయ్యనిదే కూరకు రుచి,మంచి సువాసన ఉండదు.రోటి పచ్చళ్ళకు,నిల్వ పచ్చళ్ళకు,సాంబారు,రకరకాల చారులకు అయితే కొంచెంఎక్కువ కరివేపాకుతో తాలింపు వేస్తేనే ఘుమఘుమలాడుతూ నోరూరిస్తాయి.ఇంతా చేసి తినేటప్పుడు చాలామంది కూరల్లో,పచ్చళ్ళలో కరివేపాకును ఏరి ప్రక్కన పడేస్తుంటారు.ఇదే విధంగా కొంతమంది ఎదుటి వారిని తమ అవసరాలు తీరేవరకు విసిగించి,వేధించి,బ్రతిమాలి,బామాలి తమ అవసరాలు తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకును తీసేసినంత తేలిగ్గా తీసిపడేస్తుంటారు అంటే తేలిగ్గా ఆ ఏమి సహాయం చేసారులే అంటారు.కూరలో కరివేపాకును ఏరేస్తే దానిలో ఉన్న పోషక విలువలు మనకు పూర్తిగా అందవు.కనుక రెండు చెడ్డ అలవాట్లే.సహాయం చేసిన వారిని మర్చిపోతే అవసరమైనప్పుడు మరల సహాయం అందకపోవడమే కాక అంతకు ముందు ఉన్న విలువ తగ్గిపోతుంది.సహాయం చేసిన వారు అయ్యో!ఇదేమిటి వీళ్ళ కోసమా!మనం ఇంతా కష్టపడి ఎన్నో పనులు మానుకుని మన సమయాన్ని,డబ్బుని వృధా చేసుకున్నాము అని మనసులో బాధ పడతారు.కూరలో కరివేపాకును ఏరేస్తే కరివేపాకుకు,సహాయం చేసిన వారిని మర్చిపోతే సహాయపడిన వాళ్ళకు నష్టం ఏమీ ఉండదు.ఆ విధంగా ఏరేసిన వారికే నష్టం.అందు వలన ఎన్నో పోషక విలువలు ఉన్న కరివేపాకును, సహాయం చేసిన వారిని కూడా తీసిపడేయడం మనకే శ్రేయస్కరం కాదు.
Tuesday, 13 July 2021
Sunday, 11 July 2021
వర్షాకాలంలో ఆరోగ్యంగా
వర్షాకాలంలో రోజుకి ఒకసారైనా ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంటుంది.వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా కాఫీనో,టీనో త్రాగాలని అనిపిస్తుంది. వాటికి ప్రత్యామ్నాయంగా కారట్,మునగాకు,టమోట,పాలకూర,క్యాబేజ్ సూపులు, ఆకులు, పువ్వులు,పొడులతో రకరకాల కషాయాలు తీసుకోవచ్చు.రకరకాల రుచులు,సువాసనలతో మనసుకు ఆహ్లాదంతోపాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందచేస్తాయి.వేడి నీటిలో మన వంట ఇంటిలో దొరికే జీరా,దాల్చిన చెక్క,ధనియాలు,వాము,సోంపు వేయించి చేసిన పొడులు,శొంఠీ పొడి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చిటికెడు పొడి నుండి 1/4 చెంచా వరకు వేసి 2 ని.ల తర్వాత త్రాగాలి.ఇవే కాక మన పెరటిలో దొరికే కొత్తిమీర,పుదీనా,కరివేపాకు,తమలపాకు,వాము ఆకు కూడా కప్పు వేడి నీటికి 5,6 ఆకులు చొప్పున వేసుకుని వేడిగా త్రాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.తాజాగా మందార,శంఖు పువ్వులు,చామంతి,బిళ్ళ గన్నేరు,మునగ పువ్వుల టీ కూడా తీసుకుంటున్నారు.కొంచెం,కొంచెం అల్లం తురుము,వెల్లుల్లి తురుము కూడా నీటిలో వేసి వేరు వేరుగా మరిగించి ఎవరికి నచ్చిన విధంగా వారు తీసుకుంటున్నారు.పాలతో చేసిన కాఫీ,టీ బదులు వీటిలో ఏది తీసుకున్నా బరువు పెరగకుండా ఉండడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాము.
Saturday, 10 July 2021
కరక్కాయ్
పొరుగింటి తేజ వయసు పదేళ్ళు.కానీ తన తోటి వాళ్ళను,పెద్ద వాళ్ళను కూడా ఏది పడితే అది ఏమైనా అనుకుంటారో,బాధ పడతారో అనుకోకుండా గేలి చేస్తుంటాడు.తప్పు ఆ విధంగా చెయ్యకూడదు అని చెప్పినా ఒకటి రెండు రోజులు ఊరుకున్నా షరా మామూలే.ఒకరోజు తేజ కరక్కాయ్,కరక్కాయ్ అని ఎవరినో పిలుస్తున్నాడు.పనివాళ్ళను కూడా చీపురు లాక్కోవడం,సబ్బు లాక్కోవడం వంటి పనులు చేసి విసిగిస్తుంటాడు.ఈ సారి వీడికి ఎవరు దొరికారోనని చూస్తే వాడి నాయనమ్మ.ఇంతకీ అసలు విషయం ఏమిటి? అంటే తేజ అమ్మ బయటికి వెళ్లిందట.తేజ వాళ్ళు పై అంతస్తులో ఉంటారు.క్రింద నాయనమ్మ వాళ్ళు ఉంటారు.తేజా కరక్కాయ ఒకటి ఇంట్లో నుండి తీసుకురారా అని నాయనమ్మ క్రింద నుండి కేక వేసింది.కరక్కాయ అంటే ఏంటో కూడా వాడికి తెలియదు. తెలియదని చెప్పకుండా లేదు అని అబద్దం చెప్పేసరికి నాయనమ్మకు కోపం వచ్చి ఈ సారి క్రిందికి వచ్చి ఏమైనా ఉంటే తినడానికి పెట్టు నాయనమ్మా !అని అడిగినప్పుడు నీ పని చెప్తాను అని కోపంగా అందట.దీనితో తేజ నాయనమ్మను కరక్కాయ్,కరక్కాయ్ అని పిలవడం మొదలెట్టాడు.మనవడంటే నాయనమ్మకు చాలా ఇష్టం.అందుకే నాయనమ్మ మురిపెంగా పోరా అబద్దాలు చెప్పడమే కాకుండా నీ పిలుపులు నువ్వూ మీ అమ్మకి చెప్తాను ఉండు అంటుంది.పెద్దవాళ్ళు పిల్లలు అంటే ఎంత ఇష్టం ఉన్నా తప్పుని తప్పు అని వాళ్లకు అర్ధమయ్యే రీతిలో చెప్పి చెడ్డ అలవాట్లు మానిపించాలి.పిల్లలంటే ప్రేమ ప్రేమే క్రమశిక్షణ క్రమశిక్షణే.అలా అని పిల్లల్ని మరీ ఇబ్బంది పెట్టకుండా వారితో స్నేహంగా ఉంటూనే మంచి పద్దతులు నేర్పితే ముందు ముందు వారికీ మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
పొన్నగంటి ఆకు పచ్చడి
పొన్నగంటి ఆకు - 2 పెద్ద కట్టలు
ఎండు మిరపకాయలు - 12 పెద్దవి
పచ్చి మిరపకాయలు - 4
మినప గుళ్ళు - 2 పెద్ద చెంచాలు
పచ్చి శనగ పప్పు - 2 పెద్ద చెంచాలు
ధనియాలు - 2 పెద్ద చెంచాలు
జీలకర్ర - 1 పెద్ద చెంచా
నువ్వులు - 2 పెద్ద చెంచాలు
చింత పండు - పెద్ద నిమ్మకాయంత
వెల్లుల్లి పాయ - 1
తాలింపు కోసం :
ఎండు మిర్చి - 2
ఆవాలు - 1 చెంచా
మినప్పప్పు - 1 చెంచా
శనగపప్పు - 1 చెంచా
మెంతులు - 1 చిన్న చెంచా
వెల్లుల్లి ముక్కలు - 1 చెంచా
జీలకర్ర - 1/2 చెంచా
ఇంగువ - కొద్దిగా
కొత్తిమీర - 1 చిన్న కట్ట
కరివేపాకు - 2 రెమ్మలు
ముందుగా పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.ఒక బాణలిలో ఎండు మిర్చి,పప్పులు,ధనియాలు,జీలకరర,నువ్వులు విడివిడిగా నూనె లేకుండా మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి.బాణలిలో ఒక చెంచా నూనె వేసి పచ్చి మిర్చి వేయించి తీసి దానిలోనే పొన్నగంటి కూర కూడా వేసి నీరు పోయే వరకు వేయించాలి.నువ్వులు,పచ్చి మిర్చి,పొన్నగంటి ఆకు తప్ప మిగిలిన పదార్ధాలు మిక్సీ లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.తర్వాత నువ్వులు వేసి మెత్తగా చేయాలి. చివరగా వెల్లుల్లి, వేయించిన ఆకు నానబెట్టిన చింతపండు,పచ్చి మిర్చి వేసి కొద్దిగా వేడి నీరు పోసి మెత్తగా లేదా కచ్చాపచ్చాగా నచ్చిన రీతిలో పచ్చడి చేసుకోవచ్చు.ఈలోగా బాణలిలో ఒక పెద్ద చెంచా నూనె వేసి కాగిన తర్వాత వరుసగా ఎండు మిర్చి,ఆవాలు,పప్పులు,మెంతులు,వెల్లుల్లి ముక్కలు,కొద్దిగా ఇంగువ వేసి కరివేపాకు కూడా వేసి వేయించి చివరగా కొత్తమీర వేసి దానిలో పొన్నగంటి పచ్చడి కూడా వేసి ఒకసారి కలియతిప్పి పొయ్యి మీద నుండి దించేయాలి. అంతే కమ్మటి పొన్నగంటి పచ్చడి తయారయినట్లే.వేడి వేడి అన్నంలో కొంచెం మంచి నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.పొన్నగంటి ఆకుతో చాలా రకాల కూరలు,పచ్చళ్ళు చేసుకోవచ్చు.అన్నట్లు నేను ఈ ఆకుతో పకోడీ కూడా వేశాను. చాలా రుచిగా ఉన్నాయి.పొన్నగంటి ఆకు కంటి చూపును మెరుగు పరుస్తుంది. దృష్టి లోపం రాకుండా కాపాడుతుంది.అందుకే పిల్లలకు చిన్నప్పటి నుండి తినడం అలవాటు చేస్తే కంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
Wednesday, 7 July 2021
రేయ్ నీకు రాసిందే
అమృత వల్లి జేజి తాత (అమమ్మ నాన్నగారు) గారు అంటే ఆ రోజుల్లో ఊరిలో అందరికీ ఎంతో గౌరవం తోపాటు కించిత్తు భయం,భక్తి.ఆయన ఆరడుగుల ఎత్తుతో అందంగా,హుందాగా,గంభీరంగా చూడగానే చేతులెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉండేవారు. కొడుకులు,కూతుళ్ళు,మనవళ్ళు,మనవరాళ్ళు ఏ పని చేయలన్నా ఆయనను సంప్రదించిన తర్వాత ఆయన అనుమతితోనే చేసేవారు.వీరితోపాటు ఇరుగుపొరుగు,బంధువులు,ఊరిలో అందరూ ఆయన సలహా కోసం వచ్చేవారు.మామూలుగా ఎంత శాంతంగా,ప్రేమగా ఉండేవారో కోపం వస్తే ఆయనతో మాట్లాడడానికి జేజిమ్మతో సహా అందరూ వణికి పోయేవారు.ఏదైనా నచ్చని పనులు,చెడ్డ పనులు చేసినప్పుడు "రేయ్ నీకు రాసిందే"అని చూపుడువేలు చూయించి కళ్ళు ఎర్రగా చేసేవారు.ముని మనవళ్ళు మనవరాళ్ళకు అయితే భయంతో లాగులు తడిచి పోయేవి."రేయ్ నీకు రాసిందే "అనే ఒక్క మాటతో జేజిమ్మతో సహా ఎవరిని అంటే వాళ్ళ కళ్ళ వెంట ధారగా నీళ్ళు కారిపోయేవి.ఆ రోజుల్లో పెద్దలంటే అంత గౌరవం,భక్తి,ప్రేమ.ముని మనవరాళ్ళూ ,మనవళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా కథలుగా చెప్తూ జేజి తాత గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు .
Monday, 5 July 2021
నేరేడు
వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో నేరేడు పండు ఒకటి.తీపి పులుపు,వగరు కలిసిన రుచితో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది.నేరేడు పండు ఎన్నో పోషకాల గని.ఆరోగ్య ఫల ప్రదాయిని.కాయలే కాక గింజలు,ఆకులు,బెరడు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారైనా ఈ పండు తినాలని పెద్దల సలహా.శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడంతో పాటు గుండెకు చాలా మంచిది.గింజల పొడి,కాయలు మధుమేహాన్ని నియంత్రించడంలో దిట్ట.పంచదార,కొద్దిగా నీరు,నేరేడు కాయలు వేసి ఉడికించి గుజ్జును నిల్వ చేసుకోవచ్చు.ఇష్టమైన పండు అని ఎక్కువగా తింటే విరేచనాలు పట్టుకుంటాయి.కనుక మితంగా తినడం మంచిది.రోడ్డు మీద అమ్మేవాళ్ళు కాయలు మెరుస్తూ కనబడడం కోసం మైనం పూత వేస్తారు కనుక తినే ముందు గోరు వెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసి కాసేపు నానబెట్టి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి.అన్నట్లు తెల్ల నేరేడు కాయలు కూడా వస్తున్నాయట.నేనైతే తినలేదు.ఏ రంగులో ఉన్నా నేరేడు పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అందు వలన నేరేడు పండ్లు వచ్చే కాలంలో తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
Sunday, 4 July 2021
బోడ కాకర
కాకర కాయలు అనేక రకాలు ఉన్నాకూడా వర్షాకాలంలో కొద్ది రోజులు మాత్రమే మనకు దొరికే కాయ బోడ కాకరకాయ లేదా ఆకాకర కాయ చాలా ప్రత్యేకమైనది .దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇది అనేక వ్యాధులకు దివ్య ఔషధం.జుట్టు రాలడం,తల నొప్పి తగ్గడంతో పాటు మధుమేహం,రక్తపోటు వంటివి అదుపులో ఉంటాయి.ఈ కాయలతో చేదు లేకుండా నువ్వులు,పల్లీలు,పుట్నాల పప్పుల పొడులు వేసి రకరకాల వంటలు చేయవచ్చు.చాలా రుచిగా కూడా ఉంటాయి.మరెన్నో ఉపయోగాలు ఉన్న ఈ బోడ కాకరకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.కాయలే కాక ఆకులు,కాడలు,వేర్లు, పువ్వులు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.ఈ ఆకుల పసరు విష జంతువులు,పురుగులు కుట్టిన చోట వచ్చే వాపు,దురదలను తగ్గిస్తుంది.