పొన్నగంటి ఆకు - 2 పెద్ద కట్టలు
ఎండు మిరపకాయలు - 12 పెద్దవి
పచ్చి మిరపకాయలు - 4
మినప గుళ్ళు - 2 పెద్ద చెంచాలు
పచ్చి శనగ పప్పు - 2 పెద్ద చెంచాలు
ధనియాలు - 2 పెద్ద చెంచాలు
జీలకర్ర - 1 పెద్ద చెంచా
నువ్వులు - 2 పెద్ద చెంచాలు
చింత పండు - పెద్ద నిమ్మకాయంత
వెల్లుల్లి పాయ - 1
తాలింపు కోసం :
ఎండు మిర్చి - 2
ఆవాలు - 1 చెంచా
మినప్పప్పు - 1 చెంచా
శనగపప్పు - 1 చెంచా
మెంతులు - 1 చిన్న చెంచా
వెల్లుల్లి ముక్కలు - 1 చెంచా
జీలకర్ర - 1/2 చెంచా
ఇంగువ - కొద్దిగా
కొత్తిమీర - 1 చిన్న కట్ట
కరివేపాకు - 2 రెమ్మలు
ముందుగా పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.ఒక బాణలిలో ఎండు మిర్చి,పప్పులు,ధనియాలు,జీలకరర,నువ్వులు విడివిడిగా నూనె లేకుండా మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి.బాణలిలో ఒక చెంచా నూనె వేసి పచ్చి మిర్చి వేయించి తీసి దానిలోనే పొన్నగంటి కూర కూడా వేసి నీరు పోయే వరకు వేయించాలి.నువ్వులు,పచ్చి మిర్చి,పొన్నగంటి ఆకు తప్ప మిగిలిన పదార్ధాలు మిక్సీ లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.తర్వాత నువ్వులు వేసి మెత్తగా చేయాలి. చివరగా వెల్లుల్లి, వేయించిన ఆకు నానబెట్టిన చింతపండు,పచ్చి మిర్చి వేసి కొద్దిగా వేడి నీరు పోసి మెత్తగా లేదా కచ్చాపచ్చాగా నచ్చిన రీతిలో పచ్చడి చేసుకోవచ్చు.ఈలోగా బాణలిలో ఒక పెద్ద చెంచా నూనె వేసి కాగిన తర్వాత వరుసగా ఎండు మిర్చి,ఆవాలు,పప్పులు,మెంతులు,వెల్లుల్లి ముక్కలు,కొద్దిగా ఇంగువ వేసి కరివేపాకు కూడా వేసి వేయించి చివరగా కొత్తమీర వేసి దానిలో పొన్నగంటి పచ్చడి కూడా వేసి ఒకసారి కలియతిప్పి పొయ్యి మీద నుండి దించేయాలి. అంతే కమ్మటి పొన్నగంటి పచ్చడి తయారయినట్లే.వేడి వేడి అన్నంలో కొంచెం మంచి నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.పొన్నగంటి ఆకుతో చాలా రకాల కూరలు,పచ్చళ్ళు చేసుకోవచ్చు.అన్నట్లు నేను ఈ ఆకుతో పకోడీ కూడా వేశాను. చాలా రుచిగా ఉన్నాయి.పొన్నగంటి ఆకు కంటి చూపును మెరుగు పరుస్తుంది. దృష్టి లోపం రాకుండా కాపాడుతుంది.అందుకే పిల్లలకు చిన్నప్పటి నుండి తినడం అలవాటు చేస్తే కంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
No comments:
Post a Comment