వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో నేరేడు పండు ఒకటి.తీపి పులుపు,వగరు కలిసిన రుచితో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది.నేరేడు పండు ఎన్నో పోషకాల గని.ఆరోగ్య ఫల ప్రదాయిని.కాయలే కాక గింజలు,ఆకులు,బెరడు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారైనా ఈ పండు తినాలని పెద్దల సలహా.శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడంతో పాటు గుండెకు చాలా మంచిది.గింజల పొడి,కాయలు మధుమేహాన్ని నియంత్రించడంలో దిట్ట.పంచదార,కొద్దిగా నీరు,నేరేడు కాయలు వేసి ఉడికించి గుజ్జును నిల్వ చేసుకోవచ్చు.ఇష్టమైన పండు అని ఎక్కువగా తింటే విరేచనాలు పట్టుకుంటాయి.కనుక మితంగా తినడం మంచిది.రోడ్డు మీద అమ్మేవాళ్ళు కాయలు మెరుస్తూ కనబడడం కోసం మైనం పూత వేస్తారు కనుక తినే ముందు గోరు వెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసి కాసేపు నానబెట్టి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి.అన్నట్లు తెల్ల నేరేడు కాయలు కూడా వస్తున్నాయట.నేనైతే తినలేదు.ఏ రంగులో ఉన్నా నేరేడు పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అందు వలన నేరేడు పండ్లు వచ్చే కాలంలో తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
No comments:
Post a Comment