ఈ రోజుల్లో అన్ని పనులు యంత్రాల ద్వారా సులువుగా అయిపోతుండటంతో ఖాళీ సమయం ఎక్కువగా ఉండడం వలన చరవాణి ద్వారా,కిట్టి పార్టీలలో చాలామంది పోచుకోలు కబుర్లు చెప్పుకోవడం ఎక్కువైపోయింది.మన ఎదుట మనల్ని పొగుడుతూ మన వెనుక మన గురించి తేలిక భావంతో ఎగతాళిగా,చెడుగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది.మాములుగా మాట్లాడిన మాటలను వాళ్ళకు తోచిన విధంగా అన్వయించుకుని వేరే విధంగా ప్రచారాలు చెయ్యడం చాలామందికి అలవాటయిపోయింది.మన మాటల వలన ఎదుటివాళ్ళు బాధ పడతారు అనే జ్ఞానం ఉండదు.అభినవ గురించి కూడా అలాగే మాట్లాడడంతో మొదట్లో బాధపడి తరువాత అటువంటి వాళ్ళ మాటలు వినడం తనకు ఇష్టం లేకపోవడంతో చరవాణి అంటే విరక్తి వచ్చి అవసరం అయితే తప్ప ఉపయోగించడం లేదు. దానితో మనతో మాట్లాడడం ఇష్టం లేక ఎన్ని సార్లు ఫోను చేసిన ఎత్తడం లేదని నిందలు వేయడం మొదలెట్టారు.మొదట్లో వాళ్ళ మాటలకి కొంచెం బాధ పడిన మాట నిజమే కానీ తర్వాత వాళ్ళను పట్టించుకోవడం మానేసింది.ఇటువంటి వాళ్ళు అందరూ ఎదుటివాళ్ళు బాధ పడుతుంటే చూచి వాళ్ళు సంతోషపడుతుంటారు.వాళ్ళను పట్టించుకున్నంత కాలం వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతుంటారు.కనుక వాళ్ళను అసలు మనం పట్టించుకోకపోవడం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.ఒకరి వలన మన మనసు బాధ పెట్టుకోవలసిన అవసరం ఏముంది? అదీకాక ఇటువంటి వాళ్ళ స్థానం ఎప్పుడూ మన వెనుకే ఉంటుంది.
No comments:
Post a Comment