దుష్యంత్,అతని స్నేహితులు ఒక పది మంది కలిసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి చదువుకుందామని అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత వీసా కోసం వెళ్లారు.దుష్యంత్ స్నేహితుల్లో ఒకడికి మాత్రమే వీసా వచ్చింది.మిగతా అందరూ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశారు.చివరికి దుష్యంత్ ఒక్కడే మిగిలాడు.ఈలోపు దుష్యంత్ తల్లిదండ్రులు ఇంటి దగ్గర మా వాడికి కూడా వీసా వస్తుందో,రాదో వాడికి అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఉంది అంటూ తెగ కంగారు పడుతున్నారు.కాసేపటికి నాకు వీసా వచ్చిందోచ్!అంటూ దుష్యంత్ ఫోను చేశాడు.వాళ్ళ నాన్నకు ఆనందంతో కళ్ళవెంట ఆగకుండా ధారగా కన్నీళ్లు అనే ఆనంద భాష్పాలు వచ్చేశాయి.దుష్యంత్ అమ్మ నేను మొదటే చెప్పానుగా!మన వాడికి తప్పకుండా వీసా వస్తుందని చిన్నప్పటి నుండి వాడికి సుడి ఉండి కష్టపడక పోయినా తరగతిలో మొదటి స్థానంలో ఉంటాడని మనకు తెలిసిన విషయమే.అలాగే ఇది కూడా.వాడు ఎలాగైనా సుడిగాడు అందుకే ఎవరికీ వీసా రాకపోయినా వాడికి వచ్చింది అని అందరికీ ఫోన్లు చేసి మరీ చెప్పింది. ఇంతకీ సుడిగాడు అంటే అదృష్టవంతుడు అన్నమాట.
Thursday, 28 July 2016
తులసి టీ
మూడు కప్పుల నీళ్ళు పోసి ఒక స్పూను ఆకుపచ్చ టీ పొడి, 8 తులసి ఆకులు,ఒక 1/4 లో సగం టీ స్పూను దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి వడకట్టి చల్లారాక ఒక చిన్న నిమ్మకాయ పిండాలి.ఈ టీ వర్షాకాలంలో తాగితే జలుబు,దగ్గు వంటివి రాకుండా ఉంటాయి.గొంతులో గరగర,కఫం పేరుకోవడం లాంటి సమస్యలు ఉండవు.కావాలనుకుంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు.
Wednesday, 27 July 2016
బిచ్చగాళ్ళలో మార్పు
శ్రీవాత్సవ్ ఎంబిఎ చదివి ఎంఫిల్ చేస్తున్నాడు.దానిలో భాగంగా అతను బిచ్చగాళ్ళలో మార్పు తీసుకొచ్చి కష్టపడి పని చేసుకుని స్వతంత్రంగా బతికేలా చేయాలనే సంకల్పంతో స్వంత ఊరు వచ్చి చుట్టుపక్కల ఉండే ఒక ఇరవై మందిని ఒకచోట చేర్చాడు.మీరు అందరి ముందు చేయి చాచి డబ్బు అడగడం తప్పు.మీరు కష్టపడి పని చేసుకుని ఆడబ్బుతో తింటే ఆ సంతోషం వేరు.అందుకు నేను సహాయం చేస్తానని చెప్పినా ఒక నెల వరకు వాళ్ళల్లో మార్పు రాలేదు.ఇంట్లోవాళ్ళు,స్నేహితులు,చుట్టుపక్కలవాళ్ళు ఆఖరికి వాళ్ళ ప్రొఫెసర్ కూడా నీవల్ల కాదు వాళ్ళు మారరు అని నిరుత్సాహపరిచారు.అయినా ఇంత చదువు చదువుకుని ఉద్యోగం చేసుకోక వాళ్ళ చుట్టూ తిరగటం ఏమిటి?అని తల్లిదండ్రులు గొడవ చేయడం మొదలెట్టారు.అయినా పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఓపికగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి తన మాటలతో ఎలాగైతే ఒక ఐదుగురిలో మార్పు తేగలిగాడు.ఒక చేయి లేకపోయినా వాళ్ళల్లో ఒకతను రిక్షా తొక్కి తన బ్రతుకు తను బ్రతుకుతూ సంతోషంగా ఉన్నాడు.అదే తన తొలి విజయంగా భావించి మిగతా అందరిలో కూడా మార్పు తేగలననే నమ్మకంతో తనే ఒక సంస్థను స్థాపించి వాళ్ళందరికీ పని ఇచ్చి,పునరావాసం కల్పించి ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించాలని తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి వాళ్ళ కోసం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు.అందరి ఛీత్కారాలు భరిస్తూ వచ్చే డబ్బుతో ఊరికే తిని తిరిగే కన్నా కష్టపడి సంపాదించిన డబ్బుతో వచ్చే విలువ,ఆనందం వాళ్ళకు తెలియచేసి బిచ్చాగాళ్ళలో మార్పు తీసుకురావాలని తపన పడుతున్నాడు.ఈవిషయంలో కుటుంబ సహకారం కానీ,స్నేహితుల సహాయ సహకారాలు కానీ లేకపోయినా శ్రీవాత్సవ్ ఒంటరిగా పట్టుదలతో తను అనుకున్నది సాధించగలననే నమ్మకంతో తన వంతు కృషి చేస్తున్నాడు.
Monday, 25 July 2016
జర భద్రం
వర్షాకాలం వచ్చిందంటే చాలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రకరకాల వ్యాధులు వెన్నంటి వస్తాయి.వర్షాలు పడక ముందే ఇంటి చుట్టుపక్కల,ఇంట్లో బూజు,దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేయాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.వర్షం పడినప్పుడు ఇంటి బయట నీరు నిల్వ లేకుండా చూడాలి.దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి.వర్షం పడుతుంది కదా అని వేడివేడిగా కాఫీ,టీ ఎక్కువగా తీసుకోకుండా గోరువెచ్చటి నీరు తాగటం మంచిది.నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువ కనుక పరిశుభ్రమైన నీటిని వీలైతే కాచి చల్లార్చిన నీటిని రోజుకు కనీసం 8 గ్లాసులు తాగాలి.వర్షంలో తడవటం సరదాగా ఉంటుంది కానీ తర్వాత వెన్నంటే వచ్చే జలుబును భరించడం కష్టం.ఒకరికి వచ్చిపోదు కదా!తగిన జాగ్రత్త తీసుకోకుంటే ఇంటిల్లిపాదీ చుట్టబెడుతుంది.అందుకే చిన్న గొడుగు వెంట తీసుకెళ్ళడం శ్రేయస్కరం.పొరపాటున వర్షంలో తడిస్తే ఇంటికి రాగానే జుట్టు ఆరబెట్టుకున్నాం కదా!అనుకోకుండా తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.ఇకపోతే వర్షాకాలంలో వేడివేడిగా మిరియాలపొడి వేసిన సూపులు,వేడిగా ఉన్నప్పుడే ఆహరం తీసుకోవాలి.సాద్యమైనంత వరకు బయట చిరుతిళ్ళు తినకపోవడమే మంచిది.ఎందుకంటే ఉల్లి.కీరా,కారట్,కాబేజీ వంటి పచ్చి కూరగాయ ముక్కలు,తురిమి నిల్వ ఉంచితే బాక్టీరియా చేరి త్వరగా డయేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.జర భద్రంగా ఉంటే ఖాళీ సమయంలో వేడివేడి మొక్కజొన్నపొత్తులు,మిరపకాయ బజ్జీలు,ఈ సమయంలో దొరికే నేరేడు,సీమ రేగు పండ్లు తింటూ,బత్తాయి రసం తాగుతూ,మరీ ముఖ్యంగా సహజంగా దొరికే పుట్టగొడుగులతో రకరకాల వంటలు తింటూ వర్షా కాలాన్ని చక్కగా సంతోషంగా ఆస్వాదించవచ్చు.
పిల్లి మొగ్గలు తెచ్చిన తంటా
శార్విక ఇద్దరు మగ బిడ్డల తల్లి.ఒకరోజు ఆడపడుచు.తోటికోడళ్ళు అందరూ సమావేశమై పిల్లల చిన్నప్పటి ముచ్చట్లు చెప్తుండగా శార్విక పెద్దవాడు రామన్ ఎప్పుడన్నా అల్లరిచేసి దెబ్బలు తిన్నాడు కానీ చిన్నవాడు లక్ష్మణ్ మాత్రం ఎప్పుడూ దెబ్బలు తినలేదు అని చెప్పింది.ఇంతలో లక్ష్మణ్ అమ్మా!నువ్వు అన్నయ్యను మాములుగా కొట్టావేమో కానీ నన్ను చిన్నప్పుడు సెంటర్ పాయింట్ లో కొట్టావు నాకు బాగా గుర్తు అన్నాడు.నేను కొట్టాలని కొట్టలేదురా కన్నా!నువ్వు మంచంపై పిల్లి మొగ్గలు వేస్తుంటే కింద పడిపోతావని దగ్గరలో బెల్టు ఉంటే కాలు మీద ఒకటి వేద్దామని అనుకుంటే సమయానికి నువ్వు తల కిందికి కాళ్ళు రెండు పైకి ఎత్తేసరికి ఆదెబ్బ సెంటర్ లో పడింది.నువ్వు ఆపకుండా గిలగిలా ఏడ్చేసరికి భయం వేసి వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళాను.ఏమీ కాలేదు బాగానే ఉన్నాడు అని చెప్పగానే ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పింది.అది పిల్లి మొగ్గలు తెచ్చిన తంటా నేను మర్చిపోయాను నీకు బాగానే గుర్తుందే!అని శార్విక అంది.అది మర్చిపోయే విషయమా అమ్మా!అని ఎప్పటిలా నవ్వేశాడు లక్ష్మణ్.చిన్నప్పుడు కూడా అంతే ఎదుటివాళ్ళకు ఎంత కోపం వచ్చి ఒకదెబ్బ వేద్దామనుకున్నా అమాయకంగా కళ్ళు,ముఖం పెట్టేవాడు అని మురిసిపోయింది శార్విక.
Saturday, 23 July 2016
ఇద్దరి జీవితాలకు వెలుగు
రత్నాకరరావు గారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుండి కాయకష్టం చేసి మోతుబరి రైతుగా ఎదిగారు.ఎనభై సంవత్సరాలు వచ్చినా కూడా ఆయనకు కంటి చూపు ఇసుమంతైనా మందగించలేదు.సంపూర్ణ ఆరోగ్యంతో ఇప్పటికీ తన పని తను చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు ఇస్తుంటారు.ఊరిలో ఎవరింట్లో ఆవు,గేదె ఈనినా ముందుగా దూడకు తాడు రత్నాకర రావు గారు పేనాల్సిందే.ఆయన చనిపోయినా ఆయన కళ్ళు ఒకరో,ఇద్దరో అంధుల జీవితాలలో వెలుగులు నింపుతాయనే ఉద్దేశ్యంతో ఇంట్లో వాళ్లకు ముందుగానే చెప్పి కళ్ళు దానం చేస్తానని ఐ బ్యాంకు అసోసియేషన్ లో రిజిస్టరు చేయించుకున్నారు.ఒకరోజు తెల్లవారుఝామున ఉన్నట్లుండి నిద్రలోనే తుది శ్వాస విడిచారు.అకస్మాత్తుగా
చనిపోయేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.తర్వాత తేరుకుని ఆయన కోరిక ప్రకారం ఐ బాంక్ వాళ్లకు సమాచారం అందించారు.వాళ్ళు వెంటనే వచ్చి కళ్ళు సేకరించి తీసుకుని వెళ్లారు.రత్నాకర రావు గారు చనిపోయి కూడా ఇద్దరి జీవితాలకు వెలుగుని ఇచ్చారు.ధన్య జీవి.
Tuesday, 19 July 2016
పసుపు టీ
నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుని దానిలో ఒక 1/4 స్పూను పసుపు వేసి ఒక 1/4 గంట సన్నటి మంటపై మరిగించాలి.ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 స్పూను తేనె,ఒక నిమ్మకాయ రసం,చిటికెడు మిరియాల పొడి వేసి రోజు మొత్తంలో కొంచెం కొంచెం తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు,కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం కలుగుతుంది.శరీరంలో ఎక్కడైనా వాపులు ఉన్నా తగ్గుతాయి.
Monday, 18 July 2016
నవనవలాడే మునగాకు
కుసుమ ఇంటి పెరట్లో పనిమనిషి ఎక్కడినుండో తెచ్చి ఒక మునగ మొక్క పెట్టింది.అది వర్షాలు పడేసరికి నవనవలాడుతూ రెండు అడుగుల ఎత్తు పెరిగింది.లేతగా పచ్చిఆకు చూడటానికి ఎంతో బాగుండేసరికి కుసుమ భర్త నాలుగు రెమ్మలు తెచ్చి పప్పులో వేయమనేసరికి అది ఎలా చేయాలో తెలియక బిత్తరపోయింది.తర్వాత తేరుకుని పక్కింట్లో ఉన్నఆడపడుచును పిలిచి మీ ఆన్నయ్య మునగాకు తెచ్చి పప్పులో వెయ్యమన్నారు.నాకేమో ఎలా చెయ్యాలో తెలియదు.నీకు ఏమైనా తెలుసా?అని అడిగింది.నాకూ తెలియదు కానీ మా పిన్ని కూతురు రకరకాల వంటలు చేస్తుంది.ఆమెను అడగమని ఒక నంబరు ఇచ్చింది.ఆమెను అడగగానే చేసే విధానం చెప్పింది.చెప్పడమే కాక మునగాకుతో ఎన్ని రకాలు చేయవచ్చో అన్నీ పేపరు మీద రాసి ఒకతనికి ఇచ్చి పంపింది.ఆమె అలా అడగగానే బాధ్యతగా పంపినందుకు కుసుమకు చాలా సంతోషంగా అనిపించి తర్వాత రోజు ఫోనుచేసి మరీ కృతజ్ఞతలు తెలిపి పప్పు చాలా బాగుంది.పప్పు తినని మా అబ్బాయి కూడా ఇష్టంగా తిన్నాడు అని చెప్పింది.ఆషాడం వచ్చిందంటే నవనవలాడుతూ లేత మునగాకు నోరూరిస్తూ ఉంటుంది.ఎప్పుడూ తినని వాళ్ళకు కూడా తినాలనిపించేలా చేసింది.
Sunday, 17 July 2016
గమ్యం
మంచి పని చేయాలన్నా,వ్యాపారం చేయలన్నా ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే దారిలో ముళ్ళు ఉన్నా,ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదుర్కుని సాఫీగా నడక దానంతట అదే సాగి ఎంత ఎత్తులో ఉన్నా గమ్యాన్ని చేరుకుని విజయాన్నిసాధించవచ్చు.గమ్యాన్నిచేరే మార్గం మన మొదటి అడుగు నుండే మొదలు అవుతుంది.
Saturday, 9 July 2016
నిద్ర పట్టకపోతే .....
నిద్ర సుఖమెరుగదు అన్నట్లు బాగా నిద్ర వచ్చినప్పుడు మెత్తటి పరుపు మీదే పడుకోవాలి అనుకోకుండా ఎక్కడ అయినా నిద్రపోతాము.అదే ఒక్కొక్కసారి మెత్తటి పరుపుపై పడుకున్నాఎంత ప్రయత్నించినా నిద్ర రాదు.అటువంటప్పుడు ఒక కప్పు పాలల్లో ఒక స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే వెంటనే హాయిగా నిద్ర పడుతుంది.
Friday, 8 July 2016
తల ఇటు తిప్పి అటు తిప్పి
త్రిపుర ఇంట్లో రోజూ వేకువఝామున వరండాలో గట్టుపై ఒక కుర్రాడు పాలపాకెట్లు పెట్టి వెళ్తాడు.పెట్టీ పెట్టగానే ఒక కాకి వచ్చి ఒకదాన్ని ముక్కుతో పొడిచి పాలు తాగటం మొదలెట్టింది.ఈ ప్రక్రియలో కొంచెం పాలు వరండాలో పడుతున్నాయి.త్రిపుర,భర్త 5గం.లకు నడకకు వెళదామంటే వరండా శుభ్రం చేస్తే గానీ వెళ్ళలేని పరిస్థితి.పాల అబ్బాయిని పాకెట్లు వేయగానే గంట మోగించమంటే వాడికి మతిమరుపు.త్రిపుర ఎలాగైనా కాకిని రాకుండా చేయాలని రెండు రోజులు అలారం పెట్టుకుని మరీ కాపలా కాసి పాకెట్లు లోపల పెట్టింది.వీళ్ళు నడకకు వెళ్ళి వచ్చేటప్పటికి కాకి అలవాటు ప్రకారం వచ్చి పాలు కనపడకపోయేసరికి తల అటు తిప్పి ఇటు తిప్పి వరండా మొత్తం కలియ తిరిగి మూల మూలలా శోధించటం మొదలెట్టింది.వీళ్ళను చూచి ఎగిరి పోవటము,మళ్ళీ వచ్చి వరండా అంతా వెతకటము అదే పని.ఏమాటకామాటే కానీ పాల కోసం కాకి పడే తపన,తల తిప్పి వెతికే విధానానికి ముచ్చట వేసింది.
Saturday, 2 July 2016
ఫీల్ గుడ్
ఎవరికి వాళ్ళు అద్దంలో తమ ప్రతిబింబాన్నిచూడగానే ఎలా ఉన్నా నేను అందంగా చాలా బాగున్నాను అనే అనుకుంటారు.అలాగే అనుకోవాలి.అలా అనుకోవటం వలన ఆత్మవిశ్వాసంతో పాటు ఆనందంగా,సంతృప్తిగా జీవించగలరు.కొద్ది మంది మాత్రం ఛీ!నేను అందంగా లేను అని బాధ పడుతుంటారు.అలా అనుకోవటం వలన జీవితం నిస్సారంగా అసంతృప్తిగా ఉంటుంది.ఆత్మ విశ్వాసం కూడా లోపిస్తుంది.అందుకే ముందుగా ఎవరి రూపాన్ని వాళ్ళే ఇష్టపడాలి.ఫీల్ గుడ్ చాలా అవసరం.
Friday, 1 July 2016
జుట్టుకు పోషణ
వాతావరణంలో వచ్చిన మార్పుల వలన వర్షం పడిన కొద్దిసేపు తప్ప ఒకటే ఉక్కపోత.వంటగదిలో ఒక అరగంట ఉంటే తలలో నుండి కూడా ధారగా కారే చెమటలు.దీనితో ఒకటే చికాకు.రోజూ తలస్నానం చేయాలన్నాఉరుకులు పరుగుల జీవితంలో అతి కష్టం.జుట్టు పూర్తిగా ఆరక పోయినా తలనొప్పితోపాటు చుండ్రు సమస్య.చెమట పట్టిన జుట్టును అలాగే వదిలేసినా తలలో దురదతోపాటు చుండ్రు మొదలవుతుంది.అందుకే
శరీరానికి ఎంత పోషణ అవసరమో జుట్టుకు కూడా అంతే పోషణ అవసరం.వారానికి రెండుసార్లు చొప్పున ఒకసారి ఒక గుప్పెడు తాజా లేత మెంతి ఆకులను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసి అందులో ఒక నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య లేకుండా జుట్టుకు తగిన పోషణ అందటంతో జుట్టు నల్లగా,మెత్తగా పట్టుకుచ్చులా మెరుస్తుంది.వారంలో రెండవసారి లేత మందారఆకులు కొద్దిగా,లేత వేప ఆకులు కొద్దిగా తీసుకుని వీటిని మిక్సీలో వేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే తలలో పొట్టు,చుండ్రు సమస్య లేకుండా జుట్టు అందంగా,ఆరోగ్యంగా పెరగటంతో పాటు మెరుపును సంతరించుకుంటుంది.తడి జుట్టును వెంటనే ముడి వేయడమో,జడ వేయడమో చేయకూడదు.జుట్టు పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి.ఇలా చేయడం వలన జుట్టు రాలిపోకుండా,చివర్లు చిట్లకుండా చక్కగా ఉంటుంది.ఒక గంట సమయం కేటాయించితే అందమైన జుట్టు మన స్వంతం.
Subscribe to:
Posts (Atom)