వాతావరణంలో వచ్చిన మార్పుల వలన వర్షం పడిన కొద్దిసేపు తప్ప ఒకటే ఉక్కపోత.వంటగదిలో ఒక అరగంట ఉంటే తలలో నుండి కూడా ధారగా కారే చెమటలు.దీనితో ఒకటే చికాకు.రోజూ తలస్నానం చేయాలన్నాఉరుకులు పరుగుల జీవితంలో అతి కష్టం.జుట్టు పూర్తిగా ఆరక పోయినా తలనొప్పితోపాటు చుండ్రు సమస్య.చెమట పట్టిన జుట్టును అలాగే వదిలేసినా తలలో దురదతోపాటు చుండ్రు మొదలవుతుంది.అందుకే
శరీరానికి ఎంత పోషణ అవసరమో జుట్టుకు కూడా అంతే పోషణ అవసరం.వారానికి రెండుసార్లు చొప్పున ఒకసారి ఒక గుప్పెడు తాజా లేత మెంతి ఆకులను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసి అందులో ఒక నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య లేకుండా జుట్టుకు తగిన పోషణ అందటంతో జుట్టు నల్లగా,మెత్తగా పట్టుకుచ్చులా మెరుస్తుంది.వారంలో రెండవసారి లేత మందారఆకులు కొద్దిగా,లేత వేప ఆకులు కొద్దిగా తీసుకుని వీటిని మిక్సీలో వేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే తలలో పొట్టు,చుండ్రు సమస్య లేకుండా జుట్టు అందంగా,ఆరోగ్యంగా పెరగటంతో పాటు మెరుపును సంతరించుకుంటుంది.తడి జుట్టును వెంటనే ముడి వేయడమో,జడ వేయడమో చేయకూడదు.జుట్టు పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి.ఇలా చేయడం వలన జుట్టు రాలిపోకుండా,చివర్లు చిట్లకుండా చక్కగా ఉంటుంది.ఒక గంట సమయం కేటాయించితే అందమైన జుట్టు మన స్వంతం.
No comments:
Post a Comment