Tuesday, 13 December 2016

జగత్కిలాడీలు

                                                                ఆశ్రిత వస్త్ర దుకాణాలకు,విందు భోజనాలకు వెళ్ళమని చెబితే 5 ని.ల్లో తయారైపోతుంది.ఇంట్లో వంట చెయ్యాలంటే మహా బద్దకం.డెబ్బై సంవత్సరాల వయసున్న అత్తగారు వంట చేస్తే తిని కూర్చుంటుంది.ఆశ్రితకు ఎదుటివాళ్ళ ఇళ్ళకు ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ముఖాన నవ్వు పులుముకుని వెళ్ళిపోతుంది.ఆమెకు అవసరం లేనప్పుడు ఎదుటివాళ్ళు ఎవరో తనకు పరిచయం లేనట్లు ప్రవర్తిస్తుంది.ఇదేమిటి?నిన్న గాక మొన్ననే కదా!మనింటికి భోజనానికి వచ్చింది అని విస్తుపోవటం ఎదుటి వారి వంతు అవుతుంది.భోజనం మాట దేముడెరుగు ఊరికే కూడా ఇంటికి ఎవరినీ రమ్మని పిలవదు.ఒకవేళ ఎవరైనా వచ్చినా మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా కూర్చున్న చోట నుండి కదలకుండా ముళ్ళ మీద కూర్చున్న విధంగా ముఖం మాడ్చుకుని ఎప్పుడు వెళ్లిపోతార్రా బాబూ?అన్నట్లు వాళ్ళ ముఖంలోకి చూస్తూ కూర్చుంటుంది.ఆశ్రిత భర్త దగ్గరి బంధువులు విదేశాలలో ఉంటూ వాళ్ళ ఇంట్లో ఉండి స్వంత సంస్థను జాగ్రత్తగా కాపాడమంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అన్నం పెట్టిన చేతినే నరికేసిన చందంగా వాటినే కబ్జా చేసే స్థాయికి ఎదిగారు.విదేశాలనుండి సంవత్సరానికి ఒకసారి వచ్చే బంధువుల సొమ్ము పీకలదాకా తింటూనే సంస్థ బాగోగులు చూడటానికి నాలుగు రోజులు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తుంటేనే భోజనం పెట్టాలంటే బాధపడి నేనేమైనా వంటగత్తెనా?అందరికీ వండి వార్చటానికి అని రుసరుసలాడుతుంది.అసలు కారణం సంస్థలో ఉన్న లోటుపాట్లు తెలిసిపోతాయని సంస్థను డొల్ల చేసి డబ్బు తినేస్తున్నారు కనుక అవన్నీ బయటపడతాయని వాళ్ళు రావటం ఇష్టం లేదు.ఆశ్రిత,భర్త తామే స్వంత యజమానులమని గొప్పలు పోతున్నారు.మావల్లే మీసంస్థ బాగుంది అని వాళ్ళకు చెప్తే నిజమే కాబోలు అని సంతోష పడుతుంటారు.పాపం అసలు విషయం విదేశీ బంధువులకు తెలియదు కదా!గొర్రె కటికవాడిని నమ్మినట్లు వీళ్ళను నమ్ముతున్నారు.భార్యాభర్తలు ఇద్దరూ కిలాడీల్లో కూడా జగత్కిలాడీలు. 

No comments:

Post a Comment