జయంతమ్మ వయసు అరవై సంవత్సరాల పైబడి ఉంటుంది.ఆవిడకు సాయి అంటే ఎంతో భక్తి.భర్త కానీ,పిల్లలు కానీ అటు పుల్ల తీసి ఇటు పెట్టరు.వీళ్ళకు తోడు అత్తగారికి సేవ చేయాలి.ఆవిడకు అన్ని పనులు ఎదురు చెయ్యాల్సిందే.ఏకాస్త అటూ ఇటూ అయినా తల్లీ కొడుకులు రాకాసుల్లా మీద పడినంత పని చేస్తారు.అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రప్పుడు మెలుకువగా ఉండి లైటు వేసినా నిద్ర వృధా అంటారని టేబుల్ లైటు దగ్గర కూర్చుని తన మనసులో బాబా అంటే ఎంత భక్తి మనసులో ఉన్నదో కాగితంపై అక్షర రూపంలో పెట్టి సాయి సంకీర్తనా కుసుమాలు అని నామకరణం చేసింది.భర్త పదవీ విరమణ చేసిన తర్వాత భర్త ఇంట్లో ఉన్నంతసేపు ఆయన ఎదురుగా పని ఉన్నా లేకపోయినా నిలబడే ఉండాలి.అందువల్ల ఆయన ఇంట్లో లేని సమయంలో వంటగదిలో పని చేసుకుంటూ తన శ్రావ్యమైన కంఠంతో గొంతెత్తి పాడుకునేది.ఆమె కూతురిలా భావించే నేను అమ్మా!మీరు చాలా చక్కగా పాడుతున్నారు అనగానే అసలు విషయం చెప్పేసింది.సాయి అంటే ఉన్న భక్తితో వ్రాసుకున్నాను అవి సాయికే అంకితము అంది. కావాలంటే నీకు కూడా ఇస్తాను అని చెప్పింది.మీరు ఎంతో కష్టపడి వ్రాసినవి కదా!అనగానే ఊరికే కాదు నీబ్లాగులో పెడితే సాయి అంటే ఇష్టమైన వాళ్ళు సంకీర్తన చేసుకుంటారు అని చెప్పింది.పెద్దావిడ అడిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోయింది.జయంతమ్మ గారు సాయి అంటే ఎంతో భక్తితో వ్రాసుకున్నవి ఎంత ప్రయత్నించినా బ్లాగులో పెట్టలేకపోయానే అని బాధ ఉన్నా ఆపనికి నేటికి మోక్షం కలిగింది.ఆమె పేరు మాత్రం మార్చి ఆమె భక్తితో వ్రాసుకున్న సాయి సంకీర్తనా కుసుమాలు యదాతధంగా మీ ముందుకు తెస్తున్నాను.
No comments:
Post a Comment