Sunday, 30 September 2018

నిత్య కళ్యాణి

                                                                కొంచెం నీళ్ళు పోస్తే చాలు ఎక్కడైనా ఇట్టే పెరిగి నిండుగా పువ్వులు పూస్తుంది.పద్మాల్లా అందంగా నిండుగా ఏడాది పొడుగునా రంగు రంగుల పువ్వులు పూసే అందమైన బిళ్ళ గన్నేరు మొక్కే నిత్యకల్యాణి.ఈ పువ్వులు పూజకు పనికిరావని ఒకప్పుడు అంత శ్రద్దగా పెంచేవాళ్ళు కాదు.తాజాగా ఈ మొక్క మొత్తంలో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసి ప్రత్యేకంగా పెంచుతున్నారు.ఆకులు,కాండంలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర వహిస్తున్నాయి.ఆకుల్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిచేసి రోజూ ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా వేసి సగం అయ్యే వరకు మరిగించి తాగితే అధిక రక్తపీడనం అదుపులో ఉంటుంది.పరగడుపున నాలుగు ఆకుల్ని నమిలినా,నీళ్ళల్లో మరిగించి తాగినా మధుమేహం అదుపులో ఉంటుంది.ఆకులు నూరి పసుపు కలిపి గాయాలకు పూస్తే త్వరగా తగ్గుతాయి. వైద్యంలో ఆకులు,పువ్వులు మాత్రమే వాడాలి.వేళ్ళు,కాండం వాడాలంటే నిపుణుల సలహాతో  తీసుకోవాలి.ఏది ఏమైనా నిత్య కల్యాణి అందానికి అందంతోపాటు వైద్యానికి కూడా ఎంతో ఉపయోగకరం.

Saturday, 29 September 2018

గుండె లయ

                                                                      ఇంతకు ముందు రోజుల్లో అరవై ఏళ్ళు పైబడిన వారిలో గుండె లయ తప్పి మరణాలు సంభవించేవి.ఈ రోజుల్లో ముప్పై ఏళ్లకే గుండె లయ తప్పుతోంది.గుండె పోటు మరణాల్లో ఎక్కువ శాతం మన స్వయంకృతాపరాధమే.దీనికి మనలో అవగాహనా రాహిత్యమే కారణం.ఛాతీనొప్పి అనిపించగానే పొట్ట ఉబ్బరమేమో అనుకోకుండా వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదిస్తే యాబై శాతం మరణాలు అరికట్టవచ్చు.సంవత్సరానికి ఒకసారైనా గుండెకు సంబంధించి అన్ని పరీక్షలు చేయించుకోవాలి.శరీరం మొత్తం చేయించుకోగలిగితే మరీ మంచిది.చాలామంది సన్నగా ఉన్నామని కొలెస్టరాల్ పరీక్షలు మాకు అవసరం లేదు అనుకుంటారు.కానీ ముప్పై ఏళ్ళు పైబడిన దగ్గర నుండి కొలెస్టరాల్ తోపాటు బి.పి కూడా పరీక్ష చేయించుకోవాలి.మహిళలకు గుండె నొప్పి రాదు పురుషులకు మాత్రమే వస్తుంది అనుకుంటారు.అది కేవలం  అపోహ  మాత్రమే.గుండె ఎవరికైనా ఒకటే.దవడల నొప్పి,వెన్ను నొప్పి,ఆయాసం,పొట్టలో నొప్పి ఇవన్నీ గుండె నొప్పి లక్షణాలు.వీటిని అశ్రద్ద చేయడంతో గుండె లయ తప్పి మరణం సంభవిస్తుంది.గుండె పదిలంగా ఉండాలంటే చేపలు,గింజలు,తృణధాన్యాలు,ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటుంది.అవగాహనతో అప్రమత్తంగా ఉంటే ఎనభై శాతం మరణాలను అరికట్టవచ్చు.అద్దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా గుండెను కాపాడుకోవాలి.అప్పుడు మనవళ్ళు,మనవరాళ్ళతో కూడా హాయిగా ఆడుకోవచ్చు.                      

జీవనశైలిలో మార్పులు

                                                                 ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల కొంతైనా అవగాహన ఉండాలి.
ఈరోజుల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో అందరూ కూడా ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉంటున్నారు.దీనితో ఊబకాయం,అధిక రక్తపోటు,మధుమేహం,కొలెస్టరాల్,గుండె జబ్బులు పిలవకుండానే చిన్న వయసులోనే వరుస కట్టేస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి మన జీవితంలో భాగమై పోయింది.ఒత్తిడి లేని జీవితం కష్టం కనుక మనమే జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలావరకు వ్యాధులకు దూరంగా బ్రతకవచ్చు.బద్దకించకుండా తప్పనిసరిగా అనునిత్యం  వ్యాయామం చేయాల్సిందే.రోజువారీ పనులు చేస్తూనే ఉన్నాం కదా అదే సరిపోతుందిలే అని మాకు తగినంత సమయం లేదు అని అనుకోకుండా ఎంతోకొంత సమయం అంటే కనీసం ఒక్క పావుగంట చేసినా చేసినట్లే.ఖచ్చితమైన సమయపాలన,చక్కటి కుటుంబ జీవితం,ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి  చేసుకోవడం వలన ఒత్తిడిని జయించవచ్చు.యోగా,ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఆహారంలో నూనె పదార్ధాలు తగ్గించి పండ్లు,కూరగాయలు,గింజలు,తృణ ధాన్యాలు తీసుకున్నట్లయితే  బరువు కూడా అదుపులో ఉంటుంది.కొద్దిపాటి శ్రద్ధ పెడితే ఇవ్వన్నీ పాటించదగిన అంశాలే.ముఖ్యంగా మహిళలు ఇంటిల్లపాది అందరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు కానీ తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టరు.ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు కళకళలాడుతుంది.అందుకే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఏ కొంచెం తేడా ఉన్నా వైద్యుల సలహా తీసుకుంటుంటే చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు.

Friday, 28 September 2018

సమస్యలు

                                                             ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లు ఎవరికి తగిన సమస్యలు వారికి ఉంటాయి.కొంతమంది వాటిని భూతద్దంలో చూసి భయపడి చిన్నవాటిని పెద్దవి చేసి ఇబ్బంది పడుతుంటారు.కొంతమంది తెలివితేటలతో తేలిగ్గా సమస్యల నుండి బయటపడి హాయిగా చీకుచింత లేకుండా జీవనాన్ని సాగిస్తుంటారు.ఏది ఏమైనా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే చిరునవ్వు,మౌనం మాత్రమే పరిష్కారాలు.చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.మౌనం అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.ఈ జీవిత సత్యం తెలుసుకుంటే ఎవరైనా హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేయవచ్చు.

Tuesday, 25 September 2018

లోకంతీరు

                                                                 నా బ్లాగ్ అంటేనే స్వతంత్రంగా నా మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఒక వేదిక.లోకం తీరు ఎలా ఉందో దాని వల్ల నాకు ఎదురయ్యే అనుభవాలు మంచి చెడు ఏదైనా మనసుకు తోచినది అందరికీ తెలియచెప్పడమే నా ప్రధాన ఉద్దేశ్యం.అంతే కానీ ఎవరినీ ఉద్దేశించి రాసేవి కావు.మంచి వుంటే గ్రహించాలి.చెడు ఏదైనా ఉంటే ఇలా కూడా ఉంటారు కాబోలు అని అర్ధం చేసుకోవాలి.చేతనైతే అభినందించ వచ్చు లేదా ఈ విధంగా రాస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వవచ్చు.కొంతమంది వాళ్ళ మనస్తత్వానికి దగ్గరగా ఒక పాత్ర ఉందని వాళ్లకు అన్వయించుకుని  ఇంకో పాత్ర నీదే అంటూ ఎదుటి వాళ్ళకు ఆపాదించడం సబబు కాదు.నన్నే అన్నారని వ్యక్తిగత సందేశాలు పంపడం సంకుచిత స్వభావానికి నిదర్శనం.అది సభ్యత,సంస్కారం కూడా కాదు.నా బ్లాగ్ చదవకపోయినా నాకు ఇబ్బంది లేదు.చెడు ఏదైనా ఉంటే విమర్శించినా,మంచి ఉంటే అభినందించినా ఏదైనా బ్లాగ్ ద్వారా మాత్రమే చేయాలి.నా ప్రశాంతతను భగ్నం చేసే హక్కు ఎవరికీ లేదు.ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు తావులేదు.వ్యక్తిగత సందేశాలు కూడా పంపవద్దు.దయచేసి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

తగిన శాస్తి

                                                                 ఉత్తరప్రదేశ్ లో రైతులు అధికారులు లంచం అడిగినందుకు ఒక మూటలో చాలా పాములను పట్టుకొచ్చి కార్యాలయంలో లంచం అడిగిన అధికారుల గదిలో వదిలి పెట్టి తలుపు గడియ పెట్టారట.అప్పుడు అధికారులు భయంతో బిక్కు బిక్కు మంటూ ఇప్పుడే కాదు జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరినీ లంచం అడగము.దయచేసి తలుపులు తీయండి అని వేడుకున్నారట.లంచం అడిగి ఇచ్చేవరకు పనిచేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పి జలగల మాదిరి ప్రజలను పీడించుకుని తినే అధికారులకు రైతులు తగిన శాస్తి చేసి బుద్ది వచ్చేలా చేశారు.మన పని అయిపోవడం ముఖ్యం అని ఎవరికి వాళ్ళు చూసి చూడనట్లు అడిగినంత సమర్పించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడినంత కాలం లంచ గొండులు పుట్టగొడుగుల మాదిరిగా తయారవుతూనే ఉంటారు.ఒక్కళ్ళు ఎదిరించినా అతనికే నష్టం.ఉపయోగం ఉండదు.అందరూ కలిసి సమిష్టిగా చేసినప్పుడే ఏ పనైనా సాధ్యపడుతుంది.రైతులందరూ సమిష్టిగా ఎదిరించడం వల్లే అధికారులకు వాళ్ళ తప్పు తెలిసి వచ్చింది.

చిరుగుల పోకడ

                                                                   ఒకప్పుడు పెద్దవాళ్ళు,పిల్లలు కూడా వస్త్రం ఎక్కడైనా చిరిగితే ఆ చిరుగులు బయటకు కనబడకుండా సూది దారంతో కుట్టి వేసుకునేవాళ్ళు.నేటి తరం పిల్లలు ఆడపిల్లలు,మగపిల్లలు తేడా లేకుండా ప్యాంటుకు ఎంత ఎక్కువ చిరుగులు ఉంటే అంత గొప్ప సోకు అనుకుంటున్నారు.ఒకరోజు విరాట్ తమ్ముడి ఇంటికి వెళ్ళాడు.ఒక అరగంట కూర్చుంటే కూర్చున్నంతసేపు వాళ్ళ పిల్లలు రెండు భుజాల నిండుగా చున్నీలు కప్పుకుని అవి జారిపోతుంటే మాటిమాటికీ సర్దుకుంటున్నారు.వాళ్ళు ఎందుకు ఆవిధంగా ప్రవర్తిస్తున్నారో మొదట అర్ధం కాలేదు.కాసేపటికి చిన్న పాప చున్నీ నేల మీద పడిపోయింది.అనుకోకుండా అటు చూసిన విరాట్ కంట పాప భుజం పైన పెద్ద చిరుగు కనపడింది.పిల్లలు ఆధునిక దుస్తులు వేసుకున్నారు కాబోలు అనుకుని అర్ధం చేసుకుని ఊరుకున్నాడు.తర్వాత రోజు విరాట్ గుడికి వెళ్ళాడు.అక్కడ ఒక కళాశాల అమ్మాయి కూడా అలాగే రెండు భుజాల మీద చిరుగులు ఉన్న దుస్తులు వేసుకుని గుడికి వచ్చింది.ఒక పెద్దాయన పాపా!గుడికి వస్తూ చిరిగిపోయిన దుస్తులు వేసుకున్నావు.చూడకుండా వేసుకున్నావేమోనమ్మా?అంటూ బాధగా మొహం పెట్టాడు.ఆ అమ్మాయి ఏమి చెప్పాలో తెలియక ఊ ఊ అంటూ నట్లు కొడుతూ ఊరు వెళ్ళటానికి వేసుకున్నాను అంది.పెద్దాయనకు నేటి ఆధునిక పోకడ గురించి తెలియక వేసుకునే ముందు చూచి వేసుకోవాల్సిందమ్మా!అన్నాడు.ఆ అమ్మాయి ఏమీ సమాధానం చెప్పకుండా వేగంగా వెళ్ళిపోయింది.ఇదంతా చూస్తున్న విరాట్ అది చిరగటం కాదు తాతగారూ!నేటి ఆధునిక పోకడ అని చెప్పాడు.గుడికి సంప్రదాయబద్దంగా రావాలి కానీ చిరుగులు ఉన్న దుస్తులు వేసుకుని రావడం ఆధునిక పోకడ ఏంటో?ఈ కాలం పిల్లలకు ఏమి సోకులో?ఎక్కడికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలో పెద్దలు చెప్పరు.చెప్పేవాళ్ళు లేక పిల్లలికి తెలియదు.ఈ చిరుగుల పోకడ గోల ఏంటో? అంటూ ఆ పెద్దాయన బుర్ర గోక్కున్నాడు.

Tuesday, 18 September 2018

అతి గారాబంతో పెద్దలే ........

                                                                 మనీష్,మీనాక్షిలకు  ఇద్దరు కూతుళ్ళు.పిల్లల్ని చిన్నప్పటి నుండి అతి గారాబం చేసి పెద్ద అమ్మాయిని పాఠశాలలో సకాలంలో చేర్చకుండా చిన్న అమ్మాయిని చేర్పించే వరకు వదిలేసేసరికి చుట్టుపక్కల తనకన్నా చిన్న పిల్లల్ని పోగేసి వాళ్ళతో ఆటలు ఆడుకోవడం నేర్చుకుంది.వాళ్ళందరిపై అజమాయిషీ చేస్తూ అందరి కన్నా పెద్దది కనుక తనే వాళ్లకి బాస్ లా అనుకునేది.పెద్దైన తర్వాత తల్లి,చెల్లి,తండ్రితో సహా నేను చెప్పిందే వినాలనే స్థాయికి ఎదిగింది.చిన్నప్పటినుండి పాఠశాలకు పంపినా కూడా ఎక్కువగా ఏదో ఒక వంకతో ఇంట్లోనే ఉండిపోయి చిన్నపిల్లలతో ఆటలాడుకోవడానికి ఇష్టపడేది.దానికి తోడు పెద్దయితే తనే చదువుకుంటుందిలే అంటూ తల్లి వత్తాసు.పెద్దైనా ఆ పిల్ల ఆ అలవాటు మాత్రం మార్చుకోలేదు.కళాశాలకు వచ్చినా అదే పద్ధతి.దీనితో చదువులో బాగా రాణించలేక అత్తెసరు మార్కులతో పాసవడం మొదలెట్టింది.తాను చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు చెల్లిని కూడా ఎప్పుడూ ఏమి చదువు? చరవాణిలో ఆటలు,బుల్లితెరపై చలన చిత్రాలు చూద్దామంటూ ప్రోత్సహించేది.ఇద్దరూ చెరొక చరవాణి పట్టుకుని ఆడుకునేవాళ్ళు.దీనితో ఇద్దరూ దొందు దొందే అన్నట్లు తయారయ్యారు. వీళ్ళతోపాటు తల్లి కూడా పిల్లల్ని చదువుకోమని చెప్పకుండా వాళ్ళతో పాటు ఆటలు ఆడుకోవడమో లేదా ఇంకో చరవాణిలో ఆటలు ఆడుకుంటూ కూర్చునేది.దీనితో పిల్లలు చదువులో వెనకబడి విశ్వవిద్యాలయంలో సీటు సాధించలేక రెండు సంవత్సరాలు పెద్దమ్మాయికి,ఒక సంవత్సరం చిన్నమ్మాయికీ వృధా అయిపోయింది.తోటి అమ్మ తొడ కోసుకుందని మనం మెడ కోసుకుందాం అన్నట్లు పక్క వాళ్ళ పిల్లలు వైద్యవిద్య చదివారని తల్లిదండ్రులు పిల్లలు కష్టపడకుండా దొడ్డిదారుల్లో సీట్లు సాధిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ఏ పిల్లలు చదువుతారు?దానికి తోడు వీళ్ళకు అసలే ఒళ్ళు వంగదు.తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకుని మా పిల్లలు తెలివిగలవాళ్ళు.చదవాలని చదివితే సంవత్సరమంతా చదివేది ఒక్క నెలలోనే  చదివేయగలరు అనడం మొదలెట్టేసరికి వాళ్ళు అదే నిజమనుకుని వయసు పెరిగినా సరిగా పరిణతి లేక నూతిలో కప్పల్లా బయటి ప్రపంచం తెలియకుండా మాకు తెలిసిందే వేదం అన్నట్లు ఉంటున్నారు.ఒక్క నెలలో చదివేట్లయితే ఉన్నచోటే ఉండడం ఎందుకు? మిగతా పిల్లలు అందరూ కస్టపడి  సంవత్సరమంతా చదవడం ఎందుకో మరి?వినడానికి హాస్యాస్పదంగా ఉంటుందని తెలిసినా ప్రగల్భాలు పోతుంటారు.అతి గారాబంతో పెద్దలే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు.వీళ్ళే కాదు వీళ్ళలా ఎంతో మంది మా పిల్లల్ని అందరికన్నా బాగా బాగా  పెంచుతున్నాము అనుకుని ఏమి చేసినా చూసి చూడనట్లు వదిలేసి పిల్లల్ని చెడగొడుతున్నారు.చిన్నప్పటి నుండి పిల్లలకు లోక జ్ఞానం తోపాటు మంచి బుద్ధులు,క్రమశిక్షణతో కూడిన విలువలు నేర్పడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ పిల్లల భవిష్యత్తు బాగుండి మానవతా విలువలతో కూడిన మంచి పౌరులుగా తయారవ్వాలంటే ప్రేమగా ఉంటూనే సరైన ప్రణాళికతో,క్రమశిక్షణతో సరైన దారిలో నడిచేలా పెంచాలి. భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది ఉండదు.వాళ్ళ వల్ల తోటి వారికీ ఇబ్బంది ఉండదు. 

Monday, 17 September 2018

కాలువలో తోసేస్తా

                                                                 నీలావతమ్మ అశ్వితకు వరుసకు నానమ్మ.నీలావతమ్మకు  అశ్విత అంటే చాలా ఇష్టం.ఆవిడ బాగా తిరిగే రోజుల్లో వారానికి ఒకసారైనా అశ్వితను చూడడానికి వచ్చేది.ఆశ్వితా నిన్ను,మనవడిని,ముని మనవడ్ని చూడాలనిపిస్తుంది.ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అని కబురు పంపితే నానమ్మను చూద్ధామని వచ్చింది.అశ్విత కుటుంబం వచ్చిందన్న ఆనందంలో నీలావతమ్మ తన చిన్ననాటి కబుర్ల నుండి నేటి రాజకీయాల వరకు అనర్గళంగా మాట్లాడుతూనే ఉంది.ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఆగుతుంది.కానీ నీలావతమ్మ మాటల ప్రవాహానికి ఎవరు అడ్డుకట్ట వేసినా ఊరుకోదు.అందుకే ఎవరూ ఆ సాహసం చేయరు.నాకు మోకాలి శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది.అప్పుడు అనుకోకుండా అమెరికా నుండి నా మేనల్లుడు నన్ను చూసి పోదామని  వచ్చాడు.అతను వైద్యుడు కావడంతో సకాలంలో వైద్యం అందుబాటులో ఉండడమేకాక నాకు భూమి మీద ఇంకా నూకలు ఉండబట్టి  నేను బతికి బట్ట కట్టాను కానీ కంటిచూపు పోయింది.అప్పుడు పొరుగింటి ఆమె పరామర్శించడానికి వచ్చి మా వేలు విడిచిన మేనమామకు  కూడా ఇలాగే మోకాళ్ళ శస్త్ర చికిత్స జరిగి మంచాన పడ్డాడు మామ్మా!నువ్వు అదృష్టవంతురాలివి కనుక కంటిచూపు పోయినా ఆరోగ్యంగా నీపని నువ్వు చేసుకుంటూ తిరగగలుగుతున్నావు అంది అని గుర్తుచేసుకుంది నీలావతమ్మ.ఆ విషయం అక్కడ ఉన్నవారికి  అశ్వితకు చెప్తుండగా రయ్ మంటూ ఎక్కడినుండో కూతురు పరుగెత్తుకుని వచ్చి గయ్ గయ్ మంది.నువ్వు మంచాన పడితే ఎవరు చూస్తారు? నావల్ల కాని పని.నేను నిన్ను కాలువలోకి తోసేస్తా!అంది.అవును నిజంగానే ఆ పరిస్థితి వస్తే నేను తనని కాలువలోకి తోసేసేదాన్ని అంది. అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టి గుడ్లప్పగించి చోద్యం చూస్తున్నారు.కడుపున పుట్టిన కూతురు కన్నతల్లిని అంత మాట అనేసరికి వింటున్న ఎవరికీ నోట మాట రాలేదు.పాపం ఆ కన్న తల్లికి సరిగా వినిపించక అశ్వితా నా కూతురు ఏమంటుందమ్మా?అంది.ఏమీలేదులే  నానమ్మా!ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతుంది అనేసింది.అమ్మో!ఇలాంటి కూతురు కూడా లోకంలో ఉంటుందా?అనుకుని నానమ్మకు కూతురు అన్నమాట వినిపించితే ఆ తల్లిమనసు ఎంత క్షోభ పడేదో కదా!వినిపించకపోవడం నానమ్మ అదృష్టం అనుకుంది అశ్విత.నీలావతమ్మ కొడుకు విదేశాల్లో ఉండడం వల్ల అల్లుడు చనిపోతే పనివాళ్ళు ఉన్నా నువ్వు అమ్మ దగ్గర ఉండి అమ్మను జాగ్రత్తగా చూడమ్మా!అని చెల్లికి కూడా తనే డబ్బు పంపుతూ మూడు నెలలకు ఒకసారి వచ్చి రెండు వారాలు ఉండి వెళ్తుంటాడు.అన్న వచ్చినప్పుడు మంచిగా ఉంటూ మిగతా రోజుల్లో ఇలా నోరు పారేసుకుంటూ ఉంటుంది నీలావతమ్మ కూతురు.పెద్దావిడ ఉన్నన్నాళ్ళు చక్కగా చూసి ఆమె శేషజీవితాన్ని ప్రశాంతంగా వెళ్ళమారిస్తే ఎంత బాగుంటుంది అనుకుంది అశ్విత.ఎన్ని తిట్టినా కూతురు అంటే నీలావతమ్మకు అమిత ప్రేమ.కాసేపు కూతురు ఎక్కడికయినా వెళ్తే అందరికీ ఫోన్లు చేసి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా?అంటూ అడుగుతూ ఉంటుంది.కూతురు కూడా అమ్మకు అన్నీ చేస్తుంది కానీ తిక్క వచ్చినప్పుడు మాత్రం నోటికి అడ్డు అదుపు  ఉండదు.ఎవరినైనా సరే ఎంత మాట పడితే అంత మాట అంటుంది.ఎవరైనా చెప్పినా వినదు.

Saturday, 15 September 2018

స్థిత ప్రజ్ఞులు

                                                                   పసిపిల్లలు,కల్లాకపటం లేనివారు ఆనందంగా ఉంటారు.
పిచ్చివాళ్ళు తమదైన ప్రపంచంలో ఆనందంగా ఉంటారు.స్థిత ప్రజ్ఞులకు ఆనందం తమ వెంటే ఉంటుంది.కనిపించే ప్రతి ప్రతికూలతలో కూడా ఒక అనుకులాంశం నిగూఢముగా దాగి ఉంటుంది.కొంతమంది ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా నిబ్బరంగా ఉంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.ఆ విధంగా జీవించే ప్రతి మనిషి ఆనంద స్వరూపులే.వారే స్థిత ప్రజ్ఞులు.గొంతెమ్మ కోరికలు తీర్చుకోవటం కోసం జీవితమంతా పరుగులు తీసి అలసిపోయి అవి తీరినవారి కంటే అతి కోరికలు త్యజించిన వారు,ఉన్నదానితో సంతృప్తి పడేవారే ఎక్కువ ఆనందమయ జీవితాన్ని గడపగలరు .

Wednesday, 12 September 2018

వినాయకచవితి శుభాకాంక్షలు

                                                        నా బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు,తోటి బ్లాగర్లకు,నా శ్రేయోభిలాషులకు,విమర్శకులకు,ప్రపంచంలో ఏ దేశంలో స్థిరపడినా కానీ  మన భారతదేశపు ముద్దుబిడ్డలందరికి   వినాయకచవితి శుభాకాంక్షలు.ఆ వినాయకస్వామి దయవల్ల ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతూ అన్నింటా విజయాన్ని సాధించాలని,అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో  తులతూగుతూ,చేతనైనంతవరకు మంచిపనులు చేస్తూ,తోటివారికి సహాయపడుతూ  ఆనందంగా జీవించాలని,ఆస్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంకుంటూ అందరికీ మరోసారి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 
                                      

Sunday, 9 September 2018

ఉచిడీ

                                                               శస్త్ర చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు వద్దన్న పనే చేస్తూ తిక్క చేష్టలు చేస్తుండేది.బంధువులు,కొత్తవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే మరీ ఎ(హె)చ్చుగా చేసేది.వచ్చిన వాళ్ళు తనని మెచ్చుకోవాలనే తపనతో ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేసేది.వాళ్ళకు మంచినీళ్ళు,తినుబండారాలు నేనే తీసుకెళ్తానని మొండిపట్టు పట్టి అవి మోయలేక ఒక్కొక్కసారి దారిలో పడేసేది.నువ్వు తీసుకెళ్ళలేవు శస్త్రా!అని అమ్మ,అమ్మమ్మ అంటే వినకుండా నేనే ఇస్తానంటూ తయారయ్యేది.వచ్చిన వాళ్ళేమో పోనీలెండి నెమ్మదిగా తనే నేర్చుకుంటుంది అని శస్త్రను వెనకేసుకుని వచ్చేవాళ్ళు.అదుగో చూశారా!మీరే నన్ను ఏపనీ చెయ్యనివ్వడంలేదు.వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు అంటూ వాళ్ళ ఎదుటే ఏడుపు లంకించుకునేది.అదే అలవాటు పెళ్ళయి పిల్లలు పుట్టినా ఇప్పటికీ పోలేదు.ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నా ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే అవే తింగరి వేషాలు.భర్త నీకెందుకు శ్రమ పనివాళ్ళు చూసుకుంటారు కదా శస్త్రా!అంటే ఒక పట్టాన ఉన్నచోట ఉండదు.ఒకచోట కూర్చోదు.బొంగరంలా గిరగిరా తిరుగుతూనే ఉంటుంది.తర్వాత ఉష్....అష్.....అంటూ ఆపసోపాలు పడుతూ ఉంటుంది.ఒకరోజు స్నేహితురాలు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ హుషారుగా ఉండే శస్త్ర కాస్త నీరసంగా కనిపించింది.ఏమిటి అలా ఉన్నావు?అని అడిగింది స్నేహితురాలు.నాకు చిన్నప్పటి నుండి ఉచిడీ ఎక్కువని నీకు తెలుసుగా!అంది. అంటే?ఏముంది చిన్నప్పటి నుండి ఇంటికి ఎవరైనా వచ్చారంటే నాకు ఎ(హె)చ్చు ఎక్కువ కదా!  అవసరమున్నా,లేకున్నా ఏదో చెయ్యాలనే తాపత్రయంతో అటుఇటు తిరగటం వలన ఈ తిప్పలు అంది.అప్పుడంటే చిన్నతనం ఇప్పుడు వయసు మీదపడుతోంది కదా! అంది శస్త్ర.  

Saturday, 8 September 2018

విషపుగాయ

                                                       పాముకు కోరల్లో తేలుకు కొండిలో మాత్రమే విషం వుంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనమే అన్విత్.ఎంతసేపు తన స్వార్ధమే తప్ప వేరే ఆలోచన ఉండదు.దాని కోసం ఏమి చెయ్యడానికైనా చివరికి తోడబుట్టిన వాళ్ళని నష్ట పెట్టడానికి కూడా వెనుక ముందు ఆలోచించడు.అతను అతని భార్య,పిల్లలు ఇద్దరూ మాత్రమే ఒక కుటుంబమని మేము అంటూ అమ్మ,నాన్న,ఇతర కుటుంబసభ్యులతో (అంటే అన్న,చెల్లి కుటుంబ సభ్యులు) కూడా మాట్లాడుతుంటాడు.పోనీ మిగతా వాళ్ళందరితో అనుకూలంగా ఉండకపోయినా తను తన కుటుంబం అన్నా సంతోషంగా ఉన్నారా?అంటే అదేమీలేదు.ఎంతవరకు అన్విత్  భార్యాబిడ్డలు అని ప్రాకులాడడమే తప్ప వాళ్ళు మాత్రం సుతిమతి లేనట్లు ఉంటారు.వాళ్ళల్లో వాళ్ళకే ఒకరికంటే ఒకరు మేమే గొప్ప అని,మా మాటే నెగ్గాలని పోటీ పడుతుంటారు.అతి గారాబంతో పిల్లలు కూడా మొండిగా ఎవరన్నా లెక్కలేకుండా నిర్లక్ష్యంగా తయారయ్యారు.చదువుకోకుండా ఐ పాడ్,లాప్ టాప్ ముందేసుకుని సినిమాలు చూడటమే పనిగా పెట్టుకుని కళాశాలకు కూడా సరిగా వెళ్ళకుండా పరీక్షలు పాసవకుండానే పాసయ్యామని అబద్దాలు చెప్పడం నేర్చుకున్నారు.వాళ్ళను  అమ్మ వెనకేసుకుని పిల్లల్ని ఒక్క మాట అననివ్వదు.అమ్మ వాళ్ళను సరిగా చదువుకోమని కానీ పద్దతిగా ఉండమని కానీ చెప్పదు.అన్విత్ తన వాళ్ళకు బుద్దులు చెప్పి సరైన దారిలో పెట్టుకోకుండా అన్న పిల్లలు,చెల్లి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని అన్న,చెల్లివాళ్ళన్నా,వాళ్ళ పిల్లలన్నా ఈర్ష్య పడుతుంటాడు.బంధువుల పెళ్ళికి అన్విత్ చెల్లి,పిన్ని,అత్త వాళ్ళు కలిసి వెళ్లారు.ఏమ్మా!మీ అన్న చిన్నప్పటినుండి విషపుగాయ.తోటి పిల్లలు తన కన్నా బాగున్నా,బాగా చదివినా ఓర్చుకునేవాడు కాదు.ఇప్పుడు మరీ ఎక్కువై పొయిందటగా!వాళ్ళ పిల్లలు చదువుకోకుండా మీ పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారని మీ పైనే కాకుండా మీ పిల్లలమీద కూడా విషం కక్కుతున్నాడటగా!అని అడిగింది.వాడు మారడు.ఎప్పటికీ అంతే అంది.అన్విత్ చెల్లి తన అన్నను అందరిలో చులకన చెయ్యడం బాగోదు కనుక ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.

Tuesday, 4 September 2018

మా ఊరి పిల్ల

                                                                        కృష్ణవేణి మనుమరాలు యుక్తాన్వితకు ఓణీలు అంటే నూతన వస్త్రాలంకరణ వేడుక ఆడంబరంగా చేద్దామని నెలరోజుల ముందు నుండే బంధువులు అందరినీ పిలిచే పనిలో హడావిడిగా ఉంది.నీలవేణి,కృష్ణవేణి కన్నా వయసులో చిన్నదైనా ఒకే ఊరివాళ్ళు కనుక స్నేహంగా ఉండేవాళ్ళు.నీలవేణి భర్త ఉద్యోగరీత్యా వేరే నగరంలో ఉండడంతో చిరునామా కానీ చరవాణి నంబరు కానీ సరిగా తెలియకపోవడంతో ఎలాగైనా నీలవేణిని పిలవాలని చెల్లెలు ద్వారా రేపు ఉదయం వేడుక అనగా ఈరోజు సాయంత్రం ఫోను చేయించి మాట్లాడింది.అప్పుడు కృష్ణవేణి అమ్మా!ఇప్పుడు పిలిచానని అనుకోకుండా మనవరాలికి ఓణీలు ఇస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి నీలవేణీ అని చెప్పింది.చక్కగా గుర్తుపెట్టుకుని పిలిచిందని నీలవేణి ఎంతో సంతోషపడింది.అంతవరకు బాగానే ఉంది.మీ వీధికి అనుకోకుండా తెలిసిన వాళ్ళను పిలవటానికి వచ్చాము.సరిగా చిరునామా తెలియదు కనుక మా ఊరి పిల్ల ఇక్కడే ఎక్కడో ఉండాలి అని ఆమెను అడిగితే నాకు తెలియదు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాము అంది.ఎంతో ప్రయాసపడి ప్రేమతో కావాలని పిలిచినా మా ఊరి పిల్ల అని అడిగాను అనేసరికి నీలవేణి మనసు చివుక్కుమంది.చిన్న పిల్లలు కాదుగా యాభై సంవత్సరాల ఆమెను పట్టుకుని మా ఊరి పిల్ల అని అడిగింది సరే మళ్ళీ వచ్చి అంత స్నేహంగా ఉండేదల్లా అదే మాట నీలవేణికి చెప్పడం వల్ల బాధ అనిపించి  వెళ్ళాలని అనిపించక వేడుకకు వెళ్ళడం మానేసింది.పెద్దావిడ కదా!పోనీలే అని సరిపెట్టుకుని వెళదామని అనుకున్నా మనసు అంగీకరించలేదు.అడిగితే అడిగింది మళ్ళీ వచ్చి అదే మాట ఇలా అన్నాను అని చెప్పకుండా ఉండి ఉంటే పిలిచిందని ఎంతో సంతోషంగా పిలిచినందుకు మాట దక్కించి వెళ్ళి వచ్చేదాన్ని కదా!అని  నీలవేణి మనసులో బాధపడింది.మాట్లాడే విధానం చక్కగా ఉంటే అందరికీ ఎంతో సంతోషంగా బాగుంటుంది.ఈ విషయం అనే కాదు కొంతమందికి ఎంత వయసు పెరిగినా మాట్లాడే విధానం చేతకాక లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు.

Sunday, 2 September 2018

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

                                                     మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహాదానంద భరితంగా ఎలా మలచుకోవాలో,ప్రతి పనిలో ఆనందాన్ని ఎలా వెదుక్కోవాలో యుగాలనాడే చేసి చూపాడు కృష్ణస్వామి.సమస్య  ఎదురైనా అదే చిరునవ్వు,గెలిచినా అదే చిరునవ్వు.కష్టాలు ఎదురైనా సంతోష సాగరంలో ఎలా మునకలు వేయాలో  సులువుగా చూపడమే శ్రీకృష్ణ తత్వం.ఆ కృష్ణతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటూ మనమందరమూ కూడా ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Saturday, 1 September 2018

కొర్రబియ్యం పులిహోర

కొర్రబియ్యం - 2 కప్పులు
నీళ్ళు - 3 కప్పులు
కారట్ తురుము 1/2 కప్పు
నిమ్మకాయలు - 2
అల్లం - 2 అంగుళాల ముక్క
పచ్చిమిర్చి - 4
ఉప్పు - సరిపడా
కొత్తమీర తురుము - 1 కప్పు
వేరుశనగ పప్పు - 1/2 కప్పు
తాలింపు కోసం :
ఆవాలు - 2 చెంచాలు
శనగపప్పు -2 చెంచాలు 
పసుపు -2 చెంచాలు
మినప్పప్పు -2  చెంచాలు
కరివేపాకు - 1/2 కప్పు 
నువ్వుల నూనె - చిన్న గరిటెడు
                                        ముందుగా ఒక కుక్కర్లో కొర్ర బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు వంపి మూడు కప్పుల నీళ్ళు పోసి రెండు గం.ల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి.ఆ తర్వాత పొడిగా ఉండేలా వండి ఒక పక్కన పెట్టుకోవాలి.పొయ్యి వెలిగించి ఒక బాండీలో నూనె  వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగపప్పు,కరివేపాకు,పసుపు అన్నీ వేసి దోరగా వేయించాలి.తర్వాత కారట్ తురుము వేసి కొద్దిగా వేగాక కొర్రబియ్యం అన్నంతోపాటు ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంటపై కొద్దిసేపు ఉంచాలి.ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం చల్లి కొత్తిమీర వేసి బాగా కలియ తిప్పి దించేయాలి.అంతే రుచికరమైన కొర్ర బియ్యం పులిహోర తయారయినట్లే.వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

ఆరోగ్య చేతన

                                              ఒకప్పుడు తృణ ధాన్యాల వాడకం ఎక్కువగా ఉండేది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కష్టపడి  పనిచేయడం వలన కూడా అధిక బరువు పెరగకుండా చురుకుగా ఆరోగ్యంగా  ఉండేవారు.మధ్యలో తృణ ధాన్యాలు బాగుచేసి వండడం కూడా కష్టం కనుక సులువుగా బియ్యంతో తయారు చేసిన పదార్ధాలు వండడం తినడం అలవాటయింది. అందు వలన చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ దాన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ దాని నిమిత్తం అధిక డబ్బు ఖర్చుపెడుతూ,కొంతమంది శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ నానా తంటాలు పడుతున్నారు.దీనితో ఏది ఏమైనా పాతది బంగారం అన్న నిజం తెలుసుకుని మరల తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపడం మొదలెట్టారు.వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని,దీనితో అధిక బరువు తగ్గడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందని పెద్దలు శాస్త్రవేత్తలు చెప్పడంతో మరల అందరూ ఆచరించడం మొదలు పెట్టారు.అదీ కాక రసాయన రహిత తృణ ధాన్యాలు,కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు శుభ్రం చేసినవి బజారులో అమ్ముతున్నారు. కనుక వండడం కూడా తేలికగా ఉంటుంది.అధిక బరువు ఉండడం వలన వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా అనేక గడ్డు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అందువల్ల ఈమధ్య బరువును అదుపులో ఉంచుకోవాలనే ఆలోచన అందరిలోనూ రావడంతో ఆరోగ్యచేతన(హెల్త్ కాన్షస్) ప్రారంభమైంది.ఇది చాలా శుభ పరిణామం.