పాముకు కోరల్లో తేలుకు కొండిలో మాత్రమే విషం వుంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనమే అన్విత్.ఎంతసేపు తన స్వార్ధమే తప్ప వేరే ఆలోచన ఉండదు.దాని కోసం ఏమి చెయ్యడానికైనా చివరికి తోడబుట్టిన వాళ్ళని నష్ట పెట్టడానికి కూడా వెనుక ముందు ఆలోచించడు.అతను అతని భార్య,పిల్లలు ఇద్దరూ మాత్రమే ఒక కుటుంబమని మేము అంటూ అమ్మ,నాన్న,ఇతర కుటుంబసభ్యులతో (అంటే అన్న,చెల్లి కుటుంబ సభ్యులు) కూడా మాట్లాడుతుంటాడు.పోనీ మిగతా వాళ్ళందరితో అనుకూలంగా ఉండకపోయినా తను తన కుటుంబం అన్నా సంతోషంగా ఉన్నారా?అంటే అదేమీలేదు.ఎంతవరకు అన్విత్ భార్యాబిడ్డలు అని ప్రాకులాడడమే తప్ప వాళ్ళు మాత్రం సుతిమతి లేనట్లు ఉంటారు.వాళ్ళల్లో వాళ్ళకే ఒకరికంటే ఒకరు మేమే గొప్ప అని,మా మాటే నెగ్గాలని పోటీ పడుతుంటారు.అతి గారాబంతో పిల్లలు కూడా మొండిగా ఎవరన్నా లెక్కలేకుండా నిర్లక్ష్యంగా తయారయ్యారు.చదువుకోకుండా ఐ పాడ్,లాప్ టాప్ ముందేసుకుని సినిమాలు చూడటమే పనిగా పెట్టుకుని కళాశాలకు కూడా సరిగా వెళ్ళకుండా పరీక్షలు పాసవకుండానే పాసయ్యామని అబద్దాలు చెప్పడం నేర్చుకున్నారు.వాళ్ళను అమ్మ వెనకేసుకుని పిల్లల్ని ఒక్క మాట అననివ్వదు.అమ్మ వాళ్ళను సరిగా చదువుకోమని కానీ పద్దతిగా ఉండమని కానీ చెప్పదు.అన్విత్ తన వాళ్ళకు బుద్దులు చెప్పి సరైన దారిలో పెట్టుకోకుండా అన్న పిల్లలు,చెల్లి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని అన్న,చెల్లివాళ్ళన్నా,వాళ్ళ పిల్లలన్నా ఈర్ష్య పడుతుంటాడు.బంధువుల పెళ్ళికి అన్విత్ చెల్లి,పిన్ని,అత్త వాళ్ళు కలిసి వెళ్లారు.ఏమ్మా!మీ అన్న చిన్నప్పటినుండి విషపుగాయ.తోటి పిల్లలు తన కన్నా బాగున్నా,బాగా చదివినా ఓర్చుకునేవాడు కాదు.ఇప్పుడు మరీ ఎక్కువై పొయిందటగా!వాళ్ళ పిల్లలు చదువుకోకుండా మీ పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారని మీ పైనే కాకుండా మీ పిల్లలమీద కూడా విషం కక్కుతున్నాడటగా!అని అడిగింది.వాడు మారడు.ఎప్పటికీ అంతే అంది.అన్విత్ చెల్లి తన అన్నను అందరిలో చులకన చెయ్యడం బాగోదు కనుక ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.
No comments:
Post a Comment