నీలావతమ్మ అశ్వితకు వరుసకు నానమ్మ.నీలావతమ్మకు అశ్విత అంటే చాలా ఇష్టం.ఆవిడ బాగా తిరిగే రోజుల్లో వారానికి ఒకసారైనా అశ్వితను చూడడానికి వచ్చేది.ఆశ్వితా నిన్ను,మనవడిని,ముని మనవడ్ని చూడాలనిపిస్తుంది.ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అని కబురు పంపితే నానమ్మను చూద్ధామని వచ్చింది.అశ్విత కుటుంబం వచ్చిందన్న ఆనందంలో నీలావతమ్మ తన చిన్ననాటి కబుర్ల నుండి నేటి రాజకీయాల వరకు అనర్గళంగా మాట్లాడుతూనే ఉంది.ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఆగుతుంది.కానీ నీలావతమ్మ మాటల ప్రవాహానికి ఎవరు అడ్డుకట్ట వేసినా ఊరుకోదు.అందుకే ఎవరూ ఆ సాహసం చేయరు.నాకు మోకాలి శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది.అప్పుడు అనుకోకుండా అమెరికా నుండి నా మేనల్లుడు నన్ను చూసి పోదామని వచ్చాడు.అతను వైద్యుడు కావడంతో సకాలంలో వైద్యం అందుబాటులో ఉండడమేకాక నాకు భూమి మీద ఇంకా నూకలు ఉండబట్టి నేను బతికి బట్ట కట్టాను కానీ కంటిచూపు పోయింది.అప్పుడు పొరుగింటి ఆమె పరామర్శించడానికి వచ్చి మా వేలు విడిచిన మేనమామకు కూడా ఇలాగే మోకాళ్ళ శస్త్ర చికిత్స జరిగి మంచాన పడ్డాడు మామ్మా!నువ్వు అదృష్టవంతురాలివి కనుక కంటిచూపు పోయినా ఆరోగ్యంగా నీపని నువ్వు చేసుకుంటూ తిరగగలుగుతున్నావు అంది అని గుర్తుచేసుకుంది నీలావతమ్మ.ఆ విషయం అక్కడ ఉన్నవారికి అశ్వితకు చెప్తుండగా రయ్ మంటూ ఎక్కడినుండో కూతురు పరుగెత్తుకుని వచ్చి గయ్ గయ్ మంది.నువ్వు మంచాన పడితే ఎవరు చూస్తారు? నావల్ల కాని పని.నేను నిన్ను కాలువలోకి తోసేస్తా!అంది.అవును నిజంగానే ఆ పరిస్థితి వస్తే నేను తనని కాలువలోకి తోసేసేదాన్ని అంది. అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టి గుడ్లప్పగించి చోద్యం చూస్తున్నారు.కడుపున పుట్టిన కూతురు కన్నతల్లిని అంత మాట అనేసరికి వింటున్న ఎవరికీ నోట మాట రాలేదు.పాపం ఆ కన్న తల్లికి సరిగా వినిపించక అశ్వితా నా కూతురు ఏమంటుందమ్మా?అంది.ఏమీలేదులే నానమ్మా!ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతుంది అనేసింది.అమ్మో!ఇలాంటి కూతురు కూడా లోకంలో ఉంటుందా?అనుకుని నానమ్మకు కూతురు అన్నమాట వినిపించితే ఆ తల్లిమనసు ఎంత క్షోభ పడేదో కదా!వినిపించకపోవడం నానమ్మ అదృష్టం అనుకుంది అశ్విత.నీలావతమ్మ కొడుకు విదేశాల్లో ఉండడం వల్ల అల్లుడు చనిపోతే పనివాళ్ళు ఉన్నా నువ్వు అమ్మ దగ్గర ఉండి అమ్మను జాగ్రత్తగా చూడమ్మా!అని చెల్లికి కూడా తనే డబ్బు పంపుతూ మూడు నెలలకు ఒకసారి వచ్చి రెండు వారాలు ఉండి వెళ్తుంటాడు.అన్న వచ్చినప్పుడు మంచిగా ఉంటూ మిగతా రోజుల్లో ఇలా నోరు పారేసుకుంటూ ఉంటుంది నీలావతమ్మ కూతురు.పెద్దావిడ ఉన్నన్నాళ్ళు చక్కగా చూసి ఆమె శేషజీవితాన్ని ప్రశాంతంగా వెళ్ళమారిస్తే ఎంత బాగుంటుంది అనుకుంది అశ్విత.ఎన్ని తిట్టినా కూతురు అంటే నీలావతమ్మకు అమిత ప్రేమ.కాసేపు కూతురు ఎక్కడికయినా వెళ్తే అందరికీ ఫోన్లు చేసి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా?అంటూ అడుగుతూ ఉంటుంది.కూతురు కూడా అమ్మకు అన్నీ చేస్తుంది కానీ తిక్క వచ్చినప్పుడు మాత్రం నోటికి అడ్డు అదుపు ఉండదు.ఎవరినైనా సరే ఎంత మాట పడితే అంత మాట అంటుంది.ఎవరైనా చెప్పినా వినదు.
No comments:
Post a Comment