మనీష్,మీనాక్షిలకు ఇద్దరు కూతుళ్ళు.పిల్లల్ని చిన్నప్పటి నుండి అతి గారాబం చేసి పెద్ద అమ్మాయిని పాఠశాలలో సకాలంలో చేర్చకుండా చిన్న అమ్మాయిని చేర్పించే వరకు వదిలేసేసరికి చుట్టుపక్కల తనకన్నా చిన్న పిల్లల్ని పోగేసి వాళ్ళతో ఆటలు ఆడుకోవడం నేర్చుకుంది.వాళ్ళందరిపై అజమాయిషీ చేస్తూ అందరి కన్నా పెద్దది కనుక తనే వాళ్లకి బాస్ లా అనుకునేది.పెద్దైన తర్వాత తల్లి,చెల్లి,తండ్రితో సహా నేను చెప్పిందే వినాలనే స్థాయికి ఎదిగింది.చిన్నప్పటినుండి పాఠశాలకు పంపినా కూడా ఎక్కువగా ఏదో ఒక వంకతో ఇంట్లోనే ఉండిపోయి చిన్నపిల్లలతో ఆటలాడుకోవడానికి ఇష్టపడేది.దానికి తోడు పెద్దయితే తనే చదువుకుంటుందిలే అంటూ తల్లి వత్తాసు.పెద్దైనా ఆ పిల్ల ఆ అలవాటు మాత్రం మార్చుకోలేదు.కళాశాలకు వచ్చినా అదే పద్ధతి.దీనితో చదువులో బాగా రాణించలేక అత్తెసరు మార్కులతో పాసవడం మొదలెట్టింది.తాను చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు చెల్లిని కూడా ఎప్పుడూ ఏమి చదువు? చరవాణిలో ఆటలు,బుల్లితెరపై చలన చిత్రాలు చూద్దామంటూ ప్రోత్సహించేది.ఇద్దరూ చెరొక చరవాణి పట్టుకుని ఆడుకునేవాళ్ళు.దీనితో ఇద్దరూ దొందు దొందే అన్నట్లు తయారయ్యారు. వీళ్ళతోపాటు తల్లి కూడా పిల్లల్ని చదువుకోమని చెప్పకుండా వాళ్ళతో పాటు ఆటలు ఆడుకోవడమో లేదా ఇంకో చరవాణిలో ఆటలు ఆడుకుంటూ కూర్చునేది.దీనితో పిల్లలు చదువులో వెనకబడి విశ్వవిద్యాలయంలో సీటు సాధించలేక రెండు సంవత్సరాలు పెద్దమ్మాయికి,ఒక సంవత్సరం చిన్నమ్మాయికీ వృధా అయిపోయింది.తోటి అమ్మ తొడ కోసుకుందని మనం మెడ కోసుకుందాం అన్నట్లు పక్క వాళ్ళ పిల్లలు వైద్యవిద్య చదివారని తల్లిదండ్రులు పిల్లలు కష్టపడకుండా దొడ్డిదారుల్లో సీట్లు సాధిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ఏ పిల్లలు చదువుతారు?దానికి తోడు వీళ్ళకు అసలే ఒళ్ళు వంగదు.తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకుని మా పిల్లలు తెలివిగలవాళ్ళు.చదవాలని చదివితే సంవత్సరమంతా చదివేది ఒక్క నెలలోనే చదివేయగలరు అనడం మొదలెట్టేసరికి వాళ్ళు అదే నిజమనుకుని వయసు పెరిగినా సరిగా పరిణతి లేక నూతిలో కప్పల్లా బయటి ప్రపంచం తెలియకుండా మాకు తెలిసిందే వేదం అన్నట్లు ఉంటున్నారు.ఒక్క నెలలో చదివేట్లయితే ఉన్నచోటే ఉండడం ఎందుకు? మిగతా పిల్లలు అందరూ కస్టపడి సంవత్సరమంతా చదవడం ఎందుకో మరి?వినడానికి హాస్యాస్పదంగా ఉంటుందని తెలిసినా ప్రగల్భాలు పోతుంటారు.అతి గారాబంతో పెద్దలే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు.వీళ్ళే కాదు వీళ్ళలా ఎంతో మంది మా పిల్లల్ని అందరికన్నా బాగా బాగా పెంచుతున్నాము అనుకుని ఏమి చేసినా చూసి చూడనట్లు వదిలేసి పిల్లల్ని చెడగొడుతున్నారు.చిన్నప్పటి నుండి పిల్లలకు లోక జ్ఞానం తోపాటు మంచి బుద్ధులు,క్రమశిక్షణతో కూడిన విలువలు నేర్పడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ పిల్లల భవిష్యత్తు బాగుండి మానవతా విలువలతో కూడిన మంచి పౌరులుగా తయారవ్వాలంటే ప్రేమగా ఉంటూనే సరైన ప్రణాళికతో,క్రమశిక్షణతో సరైన దారిలో నడిచేలా పెంచాలి. భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది ఉండదు.వాళ్ళ వల్ల తోటి వారికీ ఇబ్బంది ఉండదు.
No comments:
Post a Comment