దీపావళి అంటేనే పిల్లల పండుగ.దీపాల పండుగ.పిల్లలు ఎక్కువ దీపాలు ఎవరు ఇంటి ముందు పెడితే వాళ్ళు గొప్ప అని పోటీ పడి మరీ వెలిగించేవారు.ఆ మధ్య కాలంలో కొంత మంది మధ్య మధ్యలో కొవ్వొత్తులు పెట్టడం మొదలెట్టారు.దీపావళికి నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం మంచిదని పెద్దలు,పండితులు చెప్పడంతో ఈమధ్య నూనె దీపాలు వెలిగిస్తున్నారు.దివ్వె దివ్వె దీపావళి అంటూ ఒకప్పుడు పిల్లలందరూ ఒకచోట చేరి సరదాగా ఆటలాడుతూ ఉండేవారు.ఒక నెల ముందు నుండే పిల్లల హడావిడి అంతా ఇంతా కాదు.పెద్దవాళ్ళు కూడా కొంతమంది కలిసి పిల్లల కోసం స్వయంగా చిచ్చుబుడ్లు,మతాబులు,అవ్వాయ్ సువ్వాయ్ లు,దివిటీలు రకరకాలు తయారు చేసి ఇచ్ఛేవాళ్ళు.పిల్లలకు పగలంతా వాటిని ఎండబెట్టే కార్యక్రమం సరిపోయేది.వాటిని అందరూ తలా కాసిని పంచుకునేవాళ్ళు.ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు బయట తెచ్చి టపాకాయలు కాల్చడంతో ప్రమాదాలు జరగటమే కాక అవి సరిగా వెలగకపోవడంతో పాటు శబ్ద కాలుష్యం ఎక్కువైపోవడంతో పిల్లలకు కూడా అంతగా ఆసక్తి ఉండడం లేదు.టపాకాయల రసాయన వాసనలు,శబ్దాల కన్నా దీపాల వెలుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇల్లంతా దీపాల వెలుగులు ప్రకాశించినట్లే లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన యందు ప్రసరించి మీ మా మనందరి జీవితాలు ప్రకాశవంతంగా వెలిగిపోవాలని,ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Saturday, 26 October 2019
Friday, 25 October 2019
ధన త్రయోదశి
రేపు శనివారం త్రయోదశి కలిసి రావడంతో శని త్రయోదశి,మాస శివరాత్రి,ధన త్రయోదశి,నరక చతుర్దశి,వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అన్నీ కలసి రావడంతో ఎంతో మంచి రోజు.ధన త్రయోదశి నాడు బంగారం కొనుక్కోవాలని నియమం ఏమీ లేదు.వీలయితే కొనుక్కొవచ్చు.లేకపోతే లేదు.కానీ భక్తితో లక్ష్మీ దేవి పూజ చేసుకుంటే మంచిది.మరీ ముఖ్యంగా రేపు ఐదు విధాలుగా పండుగ కలిసి రావడంతో వీలయినవాళ్లు శివాలయం,వైష్ణవాలయాల సందర్శనం చాలా చాలా మంచిది.వీలయితే సమయాన్ని బట్టి తైలాభిషేకం,రుద్రాభిషేకం,అమ్మవార్లకు కుంకుమ పూజలు,వేంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోగలిగితే మరీ మంచిది.వీలు కాని వాళ్ళు ఇంట్లో భక్తితో ఒక నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.ఏదైనా మన మనస్సు తృప్తిని బట్టి చేసుకోవడం అంతే కదా!పనిలో పనిగా ఈ ధన త్రయోదశి మీ,మా,మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని,కొంగ్రొత్త ఆశలు,ఆకాంక్షలు నెరవేరాలని,లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Wednesday, 23 October 2019
మునగాకు ముడి పెసర దోసె
ప్రతిమ కూతురు విదేశాలలో ఉండడంతో కొన్ని రోజులు వాళ్ళతో ఉండి రావడానికి వెళ్తూ ప్రయాణానికి నెల రోజులు ముందు నుండే కూతురికి తీసుకుని వెళ్ళేవన్నీ సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టింది.అందులో భాగంగా మునగాకు కొమ్మలను కడిగి రెండు రోజులు కాగితంపై వరండాలో వేసి ఆకులు రాలిన తర్వాత వాటిని ఒక పెద్ద పళ్ళెంలో వేసి గలగలలాడేలా నీడలో ఆరబెట్టి పొడి చేసి పట్టుకెళ్ళి ఒక డబ్బాలో భద్రపరిచింది.ఒకరోజు ముడి పెసలు,కొంచెం బియ్యం నానబెట్టి ఉప్పు,అల్లం,పచ్చిమిర్చి మిక్సిలో వేసి జీలకర్ర కలిపి దోసె వేసి దానిపై మునగాకు పొడి,సన్నటి ఉల్లి ముక్కలు పలుచగా చల్లి వేడి వేడిగా ఒక్కొక్క దోసె వేసి ఇస్తుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు.దోసె వేస్తుంటే మునగాకు పొడి వాసన ఘుమఘుమలాడిపోయేది.ప్రతిమ మొదట పిల్లలు ఆమ్మో!మునగాకు చేదు మాకు వద్దు బాబోయ్ అంటారేమో అనుకుంది.కానీ ముడి పెసర దోసె వేసి దానిపై మునగాకు పొడి చల్లడంతో ముక్కుపుటాలు అదిరిపోయేలా వచ్ఛే ఆ సువాసన,లేత పెసరపొట్టు రంగుతో చూడటానికి ఇంపుగా తినడానికి రుచిగా ఎంతో బాగుంటుంది.నోరూరెలా వచ్చిన ఆ ఘుమఘుమలకు మేము సైతం అంటూ మాకు కూడా కావాలని అడిగి మరీ ఎంతో ఇష్టంగా తినడంతో ప్రతిమ చాలా సంతోషించింది.మునగాకులో పోషక విలువలతో పాటు ఔషధీ గుణాలు కలిగి ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం అని తెలిసినా ఎవరికి వారికి తెలిసి తినడం బాగుంటుంది కదా!అదీ కాక అసలు చేదు కానీ,మునగాకు వాసన అనేదే లేదు.ఎవరికైనా మునగాకు పొడి వేసినట్లు చెప్తే కానీ తెలియదు.భారత దేశం నుండి ఎంతో శ్రమపడి చేసి తీసుకెళ్ళినందుకు ఎంత బాగానో అందరికీ ఉపయోగపడింది.వీలయితే మీరు కూడా ప్రయత్నించండి.ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత అద్భుతమైన రుచి.
కొసమెరుపు:ప్రతిమ మూడు నెలల మనవడు కూడా దోసె వేస్తుంటే ఆ వాసనకు ఊ ఊ అంటూ దోసె పైకి వంగి మరీ నోట్లో నుండి లాలాజలం తెచ్చేస్తుంటాడు.పసి పిల్లలకు కూడా ఆ వాసన అంత బాగుందన్న మాట.
కొసమెరుపు:ప్రతిమ మూడు నెలల మనవడు కూడా దోసె వేస్తుంటే ఆ వాసనకు ఊ ఊ అంటూ దోసె పైకి వంగి మరీ నోట్లో నుండి లాలాజలం తెచ్చేస్తుంటాడు.పసి పిల్లలకు కూడా ఆ వాసన అంత బాగుందన్న మాట.
Monday, 14 October 2019
చిరుజల్లులు
అమీలిత మనవరాలు పుట్టడంతో యు .కె లో కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది.వర్షాకాలం మొదలవగానే రోజంతా లేత ఎండ తోపాటు చిరుజల్లులా వర్షం పడుతూనే ఉంటుంది.ఏ కొద్దిసేపో వర్షం ఆగినప్పుడు ఎండ బాగానే వఛ్చినట్లు అనిపించినా చల్లగానే ఉంటుంది.అదే తన ఊరిలో ఉన్నప్పుడైతే అబ్బా!జిడ్డు వర్షం రోజంతా ఇంట్లో నుండి కాలు బయట పెట్టనీయకుండా రోజంతా పడుతూనే అని విసుక్కునేది.కానీ ఇక్కడ చిరుజల్లులు సర్వ సాధారణం.రాత్రి పగలు తేడా లేకుండా రోజంతా ఆలా పడుతూనే ఉంటాయి.వర్షపు కోటు వేసుకుని ఒక గొడుగు పట్టుకుని ఆడవాళ్లు,మగవాళ్ళు కూడా కుక్కలను వ్యాహ్యాళికి తీసుకు వెళ్తూ ఉంటారు.కుక్కలకు కూడా తడవకుండా పైన ఒక తొడుగు వేసి తాపీగా నడుచుకుంటూ వెళ్తారు.మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు అవడంతో అమీలిత కిటికీ పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటూ మధ్యమధ్యలో టీ తాగుతూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను,చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ వచ్ఛేపోయే వాళ్ళను,వాహనాలను గమనిస్తూ చిన్నప్పుడు చిరుజల్లులలో తడుస్తూ ఆడుకోవటాన్ని గుర్తుచేసుకుంటూ హాయిగా,ప్రశాంతంగా రోజూ చిరుజల్లులను చూస్తూ గడపడం అలవాటైపోయింది.ఇది ఒక మరుపురాని మధురానుభూతి.
Friday, 11 October 2019
చలిగాడ్పులు
సౌశీల్య యునైటెడ్ కింగ్ డమ్ వెళ్ళినప్పుడు ఎటు చూసినా పచ్చదనం,పెద్ద పెద్ద చెట్లను చూసి తెగ మురిసిపోయింది.వేసవి వెళ్లిన తర్వాత నుండి రోజూ సన్నగా వర్షంతో పాటు ఎండ ఉన్నా కూడా బయటకు వెళ్తే చాలు హోరుమంటూ చలి గాలి వేస్తుంటుంది.చెవుల వరకు కోట్లు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి.ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కనుక ప్రతి ఒక్కళ్లు కారులో గొడుగులు పట్టుకెళ్లి దిగి వెళ్ళేటప్పుడు చేతిలో గొడుగు లు తీసుకుని వెళ్తుంటారు.సౌశీల్య కయితే మొదట్లో మన భారత దేశంలో తుఫాను వచ్ఛేటప్పుడు పిచ్చి గాలి వేసినట్లు హోరుమంటూ శబ్దం వస్తుందేమిటి? అనిపించింది.మన లాగా చెట్లయితే ఊగిపోవు కానీ శబ్దం మాత్రం అదే శబ్దం.సౌశీల్య కూతురు ఇక్కడ గాలులు సర్వ సాధారణం అమ్మా!ఒక్కొక్కసారి మనుషులు పైకి లేచిపోతారేమో అన్నంతగా వస్తాయి అని చెప్పింది.మనకు వడగాడ్పులు మాదిరిగా ఇక్కడ చలిగాడ్పులు అన్నమాట అనుకుంది సౌశీల్య.
Monday, 7 October 2019
విజయదశమి శుభాకాంక్షలు
ముగ్గురమ్మల మూలపుటమ్మ మా అమ్మ కనక దుర్గమ్మ తల్లి చల్లని చూపులు మనందరిపై ప్రసరించాలని,అమ్మ దయ వలన మనందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,భోగభాగ్యాలు,సుఖసంతోషాలను ప్రసాదించాలని మరియు అన్నింటా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నాబ్లాగు వీక్షకులకు,పాఠకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ దుర్గామాత ఆశీస్సులతో అందరూ తమతమ సంప్రదాయానుసారం పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
Tuesday, 1 October 2019
ఎదురు చూడకండి
నిద్ర పోవడానికి నిద్ర వచ్ఛే వరకు ఎదురు చూడకండి.రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకుంటే హాయిగా,ప్రశాంతంగా చక్కటి నిద్ర మన స్వంతమవుతుంది.విశ్రాంతి తీసుకోవడానికి మన శరీరం పూర్తిగా అలిసిపోయేవరకు ఎదురు చూడకండి.మద్యమద్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ పని చేసుకుంటే అలుపు సలుపు లేకుండా ఎంతటి పని అయినా హైరానా పడకుండా తేలిగ్గా చేసుకోవచ్చు.దేవుడిని ప్రార్ధించడానికి కష్టాలు వచ్ఛే వరకు ఎదురు చూడకండి.నిత్యం దైవ ప్రార్ధన మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాక ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోగల మానసిక స్థయిర్యాన్నికలిగిస్తుంది.స్నేహితులను కలవాలంటే వాళ్ళు మన కోసం ఎదురు చూచి చూచి విసుగు వచ్ఛేలా చేయకండి.చరవాణి లో మాట్లాడుకున్నా కానీ అప్పుడప్పుడు కలిసి ఒకరి యోగ క్షేమాలు ఒకరు కనుక్కుని మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ స్నేహంలో ఉన్న మాధుర్యమే వేరు.చిన్న చిన్న విషయాలే అయినా ఇవన్నీ ప్రశాంత జీవనానికి సోపానాలు.
Subscribe to:
Posts (Atom)