Sunday, 16 July 2023

చిరు ప్రయత్నం

                                                                    మనం ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నప్పుడు చెయ్యాలా? వద్దా? అని సంశయంతో అదే పనిగా దాని గురించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకునే బదులు ఒక చిరు ప్రయత్నం చేయడమే మంచిది.ఒకవేళ వైఫల్యం సంభవించినా దాన్ని ఒక పాఠంగా తీసుకుని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేలా మనసును దృఢంగా చేసుకుని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం  ఎన్నటికీ వృధా కాదు.వైఫల్యం శాశ్వతము కాదు కనుక ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి.మనం చేసే చిరు ప్రయత్నమే మనకు ఉన్నత స్థితి కల్పిస్తుంది.  

ఎవరు మంచో ఎవరు చెడో

                                                       ఈ రోజుల్లో ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోలేని పరిస్థితిగా ఉంది.పైకి నవ్వుతూ మాట్లాడినా కానీ అది పైపైనే అన్న చందంగా తయరైపోతున్నారు.మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడుతూ ఉండడంతో అయోమయంగా ఉంటుంది.పైకి తియ్యని మాటలు మాట్లాడుతూ మనసులో విషం కక్కుతూ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారు.అందరూ ఆ విధంగా ఉండకపోయినా ఎక్కువ మంది అలా ఉండడంతో అందరినీ ఒకే గాటన కట్టాల్సిరావడం నిజంగా బాధాకరమే.అందుకే ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడుతూ స్వంత విషయాలు ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోకపోవడమే మంచిది.మళ్ళీ వాటిని వేరేవాళ్ళ దగ్గర ప్రస్తావించి ఎగతాళి చెయ్యడమో లేక వాటిని ఆసరా చేసుకుని వేరే విధంగా బెదిరించడం లాంటి  మోసాలు జరగడం మామూలైపోయింది.కనుక మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. 

Thursday, 13 July 2023

బుడుగు

                                              సాహ్ని వైద్య విద్య అభ్యసిస్తుండగా తనతోపాటు చదువుకునే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అన్నింటికీ తొందరే అన్నట్లు పెళ్ళైన వెంటనే గర్భం దాల్చింది.ఎలాగో ఇద్దరూ చదువుకుంటూనే డెబ్బై అయిదేళ్ళ నానమ్మ,మేనత్తల సహాయంతో పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణురాలైంది.తొమ్మిదో నెల నిండగానే స్వంత ఊరికి వచ్చింది.వచ్చిన రెండవ రోజే నొప్పులు మొదలవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.లోపలకు అడుగు పెట్టి పెట్టడంతోనే బుడుంగున  బుడుగు బయటకు వచ్చేశాడు.ఇంట్లో అందరూ బుడుగును చూచి సంతోషించారు.గర్భం వచ్చింది మొదలు ఖాళీగా కూర్చోకుండా కళాశాలకు ఇంటికి తిరుగుతూ పనులు చేసుకోవడంతో తేలికగా ప్రసవం అయిందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని నానమ్మ,మేనత్త పెద్ద వయసులో కష్టపడినా కానీ ఆ కష్టాన్ని మరిచిపోయి బుడుగును చూచి మురిసిపోయారు.     

Tuesday, 9 May 2023

మన ఆరోగ్యం మన చేతుల్లో

                                                                         మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలాగంటారా ? సంతోషమే సగం బలం అని మన పెద్దల ఉవాచ.ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ,స్వచ్చమైన మనస్సుతో  మంచి స్నేహితులతో సత్సంబంధాలు నెలకొల్పుతూ, స్వచ్చమైన చిరునవ్వును ముఖంపై నుండి చెరగనీయకుండా,ఇంకా ఇంట్లో వారితో ఉన్నంత స్వచ్చమైన ప్రేమతో బంధుమిత్రులతో,ఇరుగుపొరుగుతో కూడా ఉండగలిగితే ఆ అనందం చెప్పనలవి కానిది.దానితో సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో  ఉన్నట్లే కదా! మందులకన్నా ఇది మిన్న.అనారోగ్యమే దరి చేరదు.

Tuesday, 18 April 2023

అక్కియ తుత్తియ

                                                        గౌరి అక్షర ఇంట్లో పనిచేస్తుంది.ఇంటికి వచ్చిన దగ్గరనుండి వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉంటుంది.అక్షర వంట గది నుండి  హాలులోకి వచ్చినా కూడా అమ్మా! ఆ వస్తువు ఎక్కడుంది? ఈ వస్తువు ఎక్కడుంది అంటు పిలుస్తూ ఉంటుంది.అమ్మా! నేను వెళ్ళేవరకు ఇక్కడే కుర్చీలో  కూర్చోండి.నాకు మీరు దగ్గర లేకపోయినా మీకు కబుర్లు చెప్పకపోయినా తోచదు అంటూ నిష్కల్మషమైన మనసుతో గలగల మాట్లాడుతూ ఉంటుంది.ఒకరోజు గౌరి అమ్మా!అక్కియ తుత్తియ దగ్గర పడిందట కదమ్మా!అని అక్షరను అడిగింది.అక్షర గౌరి ఏమని అడిగిందో అర్థం కాక అలాగే చూస్తుంది.మళ్ళీ గౌరి బంగారం బాగా రేటు పెరిగింది అంటున్నారు కదమ్మా! రోజువారీ పోగులు కొనుక్కుందామని అనుకున్నాను ఆని చెప్పింది.అప్పుడు అక్షర అక్షయ తృతీయ గురించి గౌరి అక్కియ తుత్తియ అని ఆడిగింది కాబోలు అనుకుని నవ్వు వచ్చినా గౌరీ ముఖం చిన్నబోతుందని అవును దగ్గరలోనే అక్షయ తృతీయ ఉంది.రోజువారీ  పోగులు అంటున్నావు కదా!పెద్దగా తేడా వచ్చేదేముంది కొనుక్కో అని అక్షర గౌరికి చెప్పింది.సరేనమ్మా!అంటూ గౌరి సంతోషంగా ఇంటికి వెళ్ళింది.

Tuesday, 11 April 2023

సత్సంబంధాలు

                                           ఏదైనా అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది.అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది.పదేపదే అడిగి తీసుకునేదానిలో కష్టం ఉంటుంది.అది బంధంఅయినా వస్తువు అయినా సరే.అందుకే అది అర్ధం చేసుకుని మన స్వార్ధం ఒక్కటే చూచుకోకుండా ఎదుటి వారి మనసుని అర్ధం  చేసుకోవడానికి ప్రయత్నించితే  అందరికీ బాగుంటుంది.ఏదైనా శృతి  మించితే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది.ఒక్కొక్కసారి విసుగు,కోపం కూడా రావచ్చు.ఏదైనా శృతి మించకుండా  ఉన్నంతవరకే కదా! అప్పుడే అందరితో సత్సంబంధాలు ఏర్పడి మనం అందరము సంతోషంగా ఉండగలము.ఇది లోక సహజం.జగమెరిగిన సత్యం. 

Tuesday, 21 March 2023

ఉగాది శుభాకాంక్షలు

                                                                ఎంత చెట్టుకి అంత గాలి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ ఎంతటి  వారమైనా ఎవరికి తగిన విధంగా వారు గడచిన జీవితం కన్నాభావి జీవితం బాగుండాలని మనమంతా  కోరుకుంటాము.మానవులం ఆశజీవులం కదా! అందుకే శుభకృత్ నామ సంవత్సర  అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మనమందరమూ రాబోయే శోభకృత్ నామ సంవత్సరంలో జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని,సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని,అందరి ఆశలు,ఆశయాలు నెరవేరాలని ఆనందంగా అందరి జీవితాలు మరింత శోభాయమానంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగు వీక్షకులకు, నా ప్రియ పాఠకులకు,నా తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,మన తెలుగు వారందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.ప్రకృతిని ప్రేమిస్తూ ,ఉన్నత విలువలను గౌరవిస్తూ ఉగాది    ప్రత్యేకమైన ఉగాది పచ్చడి  స్వీకరించి పంచాంగ శ్రవణం చేయడం అనే మన సత్సంప్రదాయాన్ని మనం పాటిస్తూ మన ముందు తరాలు కూడా పాటించాలని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

                                              

Friday, 3 February 2023

గతం గతః

                                                         మనలో చాలామంది ఎప్పుడు చూసినా గతాన్ని తవ్వుకుంటూ ఉంటారు.వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు అని,అప్పుడు అలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అంటూ ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉంటారు.గతం మర్చిపోలేనిది.భవిష్యత్తు ఎవరూ లాక్కోలేనిది.గతం భవిష్యత్తుపై ఏ మాత్రం ప్రభావం చూపకుండా ప్రస్తుతం ఎలా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా జీవితాన్ని మలచుకోవాలి.గతం గతః అని మంచి అయితే అప్పుడప్పుడు తలుచుకుంటే సంతోషం.చెడు అయితే దాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ముందు ముందు అటువంటి తప్పులు చేయకుండా భవిష్యత్తును పూలబాటగా మలచుకుంటే అందరికీ మనశ్శాంతి తోపాటు శారీరకంగా ,మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.

ధృవ తార

                                              ఏనాటికీ వెలుగు తగ్గని ధృవ తార కళా తపస్వి విశ్వనాధ్ గారు.చరిత్రలో    నిలిచిపోయే అభిమాన నటులు,దర్శకులు.ఆయన సినిమాలలో ప్రతి కథ,పాట వన్నె తగ్గని వెలుగు పువ్వులే.ఆయన సినిమాలలో కథకు,సంగీతానికి,గాయకులకు పెద్ద పీట వేస్తారు.ప్రతి పాట ఒక ఆణిముత్యం.ప్రేక్షకుల మనసులను వీణ మీటినట్లుగా మీటి  సినిమా చూస్తున్నంతసేపు ఎదో లోకంలో విహరించిన అనుభూతి కలిగేట్లు చేసే ఉత్తమ దర్శకులు. ప్రతి పాత్ర,ప్రతి మాట,పాట  ఒక చక్కటి  సాంప్రదాయబద్దమైన ఇంటికి కట్టిన మామిడి తోరణాల వంటివి.ఏమీ తెలియని వారికి కూడా మన తెలుగు కళలు,సంగీతం,నాట్యం అంటే ఏమిటో చక్కగా తేలికగా తెలిసేలా సినిమాలను మలిచిన మహోన్నత వ్యక్తి.సినిమాలో నిజరూప పాత్రధారులుగా చేయకూడని తప్పును చెవి పట్టుకుని  మరీ తెలియచేసినట్లు  మనకు మంచి జ్ఞానాన్ని నేర్పుతున్నట్లుగా మన తాతయ్యే వచ్చి చెప్తున్నఅనుభూతి కలుగుతుంది.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లు నిగర్వి,కళా తపస్వి,మహోన్నతమైన మనసు కలిగిన మహనీయుడు,మహానుభావుడు మనందరి అభిమాని   కె.విశ్వనాథ్ గారికి నివాళులు అర్పించుకుందాము.

Monday, 23 January 2023

మనశ్శాంతికి చక్కటి మార్గం

                                                                                    తెలిసో తెలియకో ఒక్కొక్కసారి ఎదుటి వారికి మనవలన ఇబ్బంది  కలుగవచ్చు.సాధ్యమైనంతవరకు ఏదైనా క్రొత్త పని  చేసేటప్పుడు ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ఒకటికి పదిసార్లు అలోచించి చెయ్యడం సంస్కారవంతుల లక్షణం.నా పని అయితే చాలులే ప్రక్కవాడు ఎలా పోతే నాకు ఎందుకు? అని అనుకునేవారి గురించి ఇక్కడ అప్రస్తుతం.కనుక పొరపాటున గతంలో ఏదైనా తప్పు జరిగితే ఆ జరిగిపోయిన దాని గురించే  ప్రతి క్షణం ఆలోచిస్తూ  మనం బాధపడుతూ చుట్టుప్రక్కల  ఉన్న మనవారిని  బాధ పెట్టి దానివలన మనశ్శాంతిని కోల్పోవడం మంచిది కాదు.దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని మళ్ళీ జీవితంలో అటువంటి తప్పులు జరగకుండా చూచుకోవడం ఉత్తమం.ఎదుటి వారికి మనవలన ఇబ్బంది  కలిగితే వెంటనే వారికి క్షమాపణ చెప్పి ఆ తప్పును సాధ్యమైనంత వరకు సరిదిద్దాలి.అప్పుడు  అందరికీ మనశ్శాంతి.క్షమాపణ చెప్పడం సంస్కారం.ఇదే మనశ్శాంతికి చక్కటి మార్గం..

Friday, 20 January 2023

పోచుకోలు కబుర్లు

                                                                ఈ రోజుల్లో  అన్ని పనులు యంత్రాల ద్వారా  సులువుగా అయిపోతుండటంతో ఖాళీ సమయం ఎక్కువగా ఉండడం వలన చరవాణి ద్వారా,కిట్టి పార్టీలలో  చాలామంది పోచుకోలు కబుర్లు చెప్పుకోవడం ఎక్కువైపోయింది.మన ఎదుట మనల్ని పొగుడుతూ మన వెనుక మన గురించి తేలిక భావంతో ఎగతాళిగా,చెడుగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది.మాములుగా మాట్లాడిన మాటలను వాళ్ళకు తోచిన విధంగా అన్వయించుకుని వేరే విధంగా ప్రచారాలు చెయ్యడం చాలామందికి అలవాటయిపోయింది.మన మాటల వలన ఎదుటివాళ్ళు బాధ పడతారు అనే జ్ఞానం ఉండదు.అభినవ  గురించి కూడా అలాగే మాట్లాడడంతో మొదట్లో బాధపడి తరువాత అటువంటి వాళ్ళ మాటలు వినడం తనకు ఇష్టం లేకపోవడంతో చరవాణి అంటే విరక్తి వచ్చి అవసరం అయితే తప్ప ఉపయోగించడం లేదు. దానితో మనతో మాట్లాడడం ఇష్టం లేక ఎన్ని సార్లు ఫోను చేసిన ఎత్తడం లేదని నిందలు వేయడం మొదలెట్టారు.మొదట్లో వాళ్ళ మాటలకి కొంచెం బాధ పడిన మాట నిజమే కానీ తర్వాత వాళ్ళను పట్టించుకోవడం మానేసింది.ఇటువంటి వాళ్ళు అందరూ ఎదుటివాళ్ళు బాధ పడుతుంటే చూచి వాళ్ళు సంతోషపడుతుంటారు.వాళ్ళను పట్టించుకున్నంత కాలం వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతుంటారు.కనుక వాళ్ళను అసలు మనం  పట్టించుకోకపోవడం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.ఒకరి వలన మన మనసు బాధ పెట్టుకోవలసిన అవసరం ఏముంది? అదీకాక ఇటువంటి వాళ్ళ  స్థానం ఎప్పుడూ మన వెనుకే ఉంటుంది.                                                        

Saturday, 14 January 2023

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

                                                        భోగి భోగభాగ్యాలతో,సంక్రాంతి సిరిసంపదలతో,కనుమ కనువిందుగా,,ఆనందంగా జరుపుకోవాలని,అన్నింటా రైతులకు,అన్ని వృత్తులవారికి విజయం చేకూరాలని   మనస్పూర్తిగా కోరుకుంటూ మన తెలుగువారందరికీ  మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

సంక్రాంతి రోజు చెయ్యవలసిన పనులు

                                   సంక్రాంతి తెలుగు వారికి ప్రత్యేకమైన పెద్ద పండుగ.భోగి,సంక్రాంతి,కనుమ మూడు రోజులు ఏ రోజుకారోజు ప్రత్యేకమైనదే.యధావిధిగా భోగిమంటలు,నలుగు పెట్టుకుని తలంటు స్నానాలు,నూతన వస్త్ర ధారణలు,రంగవల్లులు,గొబ్బెమ్మలు,పువ్వుల అలంకరణలు,పిండి వంటలు మామూలే.సంక్రాంతి అంటేనే గంగిరెడ్లు విన్యాసాలు,హరిదాసు సంకీర్తనలు,కోడి పందేలు,పేకాటలు సర్వ సాధారణం.గాలి పటాలతో పిల్లల సందడి చెప్పనవసరం లేదు.ఇవన్నీ ఒకెత్తు.సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పెద్దలను తలుచుకుని వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేసి వాళ్లకు ఇష్టమైన వస్త్రాలు పెట్టి కొంతమంది పేదలకు పంచిపెట్టడం సంప్రదాయం.పండుగ రోజు ఇంటి ముందుకు హరిదాసులు కానీ ,గంగి రెడ్లు మేళం కానీ వస్తే పనిలో ఉండి చూచి చూడనట్లు వదిలెయ్యకుండా వారిని తగిన రీతిని సత్కరించాలి.ఇంటి ముందు హరిదాసుల భగవన్నామ సంకీర్తన,సన్నాయి మేళంతో శివుని వాహనమైన బసవన్న రావడం సర్వ  శుభకరం.కనీసం ఒక పేద బ్రాహ్మణుడికి అయినా స్వయంపాకం ఇవ్వడం మంచిది.మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు కనుక ఆదిత్య హృదయం,గజేంద్ర మోక్షం వినడం కానీ,చదవడం కానీ చాల మంచిది.