Friday 20 September 2024

మహానటులు

                                                                   మహానటులు ఎక్కడో ఉండరు. మనమధ్యనే బంధువుల రూపంలో, స్నేహితుల రూపంలో తిరుగుతూ ఉంటారు.మన ముందు ఒక మాట. మన వెనుక ఒక మాట. ఇటువంటి మహానటులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎవరు ఎటువంటివాళ్ళో తెలుసుకుని వాళ్ళతో ఎంతవరకు ఉండాలో,వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి.కనుక వీరితో తస్మాత్ జాగ్రత్త.

డబ్బుతో కొనలేనివి

                                                       మనలో చాలామంది జీవితము అంటే డబ్బు ఒక్కటే ముఖ్యం అని డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాటిని లెక్కచేయకుండా డబ్బు ముందు అన్నీ బలాదూరు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.డబ్బుతో ఏదైనా కొనగలము, చేయగలము, దేన్నైనా సాధించగలము అని అనుకుంటారు. కానీ అన్నింటి కన్నా విలువైన కాలము, సంతోషము,నిజమైన స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆప్యాయతలు, ఆరోగ్యం ...... మొదలైనవి డబ్బుతో కొనలేనటువంటివి.కొనుక్కుందామని అనుకున్నా ప్రపంచములో ఎక్కడా దొరకనటువంటివి చాలా ఉన్నాయి.కనుక డబ్బు వెనుకే ఉరుకులు పరుగులు తీస్తూ చిన్నచిన్న సంతోషాలను కోల్పోకూడదు. ఎల్లప్పుడూ పరుగులు తీయకుండా అప్పుడప్పుడూ విరామం తీసుకుంటూ ఆ విరామంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉండాలి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే ప్రకృతిని ప్రేమిచడం, ప్రకృతి వనరులను వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో,ఆపదలో అవసరమైన వారికి సాయం చేయడం,పెద్దలను గౌరవించడం వంటివి తెలియచెప్పాలి.పుస్తకపఠనము అలవాటు చేస్తూ పుస్తకజ్ఞానంతోపాటు లోకాజ్ఞానాన్ని కూడా కలుగచేయాలి.డబ్బుంది కదా అని బయట చిరుతిండి అలవాటు చేయకుండా ఆరోగ్యకరమైన ఆహారపుఅలవాట్లు చేస్తుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.పిల్లలు చిన్నప్పటినుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేలా ప్రోత్సహించాలి.పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం పెద్దల బాధ్యత. సంస్కారం కూడా డబ్బుతో కొనలేనిది.

Thursday 12 September 2024

అంతా మన మంచికే

                                                           మన పనులను భక్తితో భగవంతుడ్ని, సద్గురువుని స్మరిస్తూ చేయడం వలన  మనకు దైవానుగ్రహము, సద్గురుబలం తోడుగా ఉంటుంది.దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించి దిగులు పడటం మంచిది కాదు. మనము అనుకున్నవన్నీ జరగాలనే నియమం ఏమీ లేదు.కానీ దైవసంకల్పంతో మనకు జరిగేవన్నీ మన మంచికే జరుగుతాయాని అర్థం చేసుకోవాలి.మంచి అయినా, చెడు అయినా అన్నింటిని సానుకూల దృక్పధంతో చూడగలిగినప్పుడే అంతా మన మంచికే అనే భావంతో ముందడుగు వేసి విజయాన్ని  సాధించగలుగుతాము.

Wednesday 11 September 2024

బంగారు బాట

                                                   జీవితం అంటే అందరికీ వడ్డించిన విస్తరి కాదు.ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది.ఆలా అని పదే పదే ఒకే విషయం గురించి ఆలోచిస్తూ దాన్నే తలచుకుని బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు. సాధ్యమైనంతవరకు గతాన్ని మరిచిపోయి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అంతే తప్ప గడిచిపోయిన గతాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ వర్తమానాన్ని ప్రశాంతత లేకుండా చేసుకుని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా స్థబ్దతతో ఉండకూడదు. ఎన్ని బాధలున్నా చిరునవ్వు ముఖంపై నుండి చెరగనీయకుండా ఆత్మస్థైర్యంతో,మనోనిబ్బరంతో గతాన్ని ఒక పాఠంగా తీసుకుని వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవాలి.అప్పుడే జీవితం అమృతతుల్యంగా ఉంటుంది.