Friday 20 September 2024

డబ్బుతో కొనలేనివి

                                                       మనలో చాలామంది జీవితము అంటే డబ్బు ఒక్కటే ముఖ్యం అని డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాటిని లెక్కచేయకుండా డబ్బు ముందు అన్నీ బలాదూరు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.డబ్బుతో ఏదైనా కొనగలము, చేయగలము, దేన్నైనా సాధించగలము అని అనుకుంటారు. కానీ అన్నింటి కన్నా విలువైన కాలము, సంతోషము,నిజమైన స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆప్యాయతలు, ఆరోగ్యం ...... మొదలైనవి డబ్బుతో కొనలేనటువంటివి.కొనుక్కుందామని అనుకున్నా ప్రపంచములో ఎక్కడా దొరకనటువంటివి చాలా ఉన్నాయి.కనుక డబ్బు వెనుకే ఉరుకులు పరుగులు తీస్తూ చిన్నచిన్న సంతోషాలను కోల్పోకూడదు. ఎల్లప్పుడూ పరుగులు తీయకుండా అప్పుడప్పుడూ విరామం తీసుకుంటూ ఆ విరామంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉండాలి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే ప్రకృతిని ప్రేమిచడం, ప్రకృతి వనరులను వృధా చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో,ఆపదలో అవసరమైన వారికి సాయం చేయడం,పెద్దలను గౌరవించడం వంటివి తెలియచెప్పాలి.పుస్తకపఠనము అలవాటు చేస్తూ పుస్తకజ్ఞానంతోపాటు లోకాజ్ఞానాన్ని కూడా కలుగచేయాలి.డబ్బుంది కదా అని బయట చిరుతిండి అలవాటు చేయకుండా ఆరోగ్యకరమైన ఆహారపుఅలవాట్లు చేస్తుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.పిల్లలు చిన్నప్పటినుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేలా ప్రోత్సహించాలి.పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం పెద్దల బాధ్యత. సంస్కారం కూడా డబ్బుతో కొనలేనిది.

No comments:

Post a Comment