మనిషి మెదడు పూలతోట వంటిది. మంచి ఆలోచనలతో అందమైన పూలతోటగా మార్చుకుంటామో, చెడు ఆలోచనలతో బీడుగా మార్చుకుంటామో మన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కలుపు మొక్కలు, తెగులు వఛ్చిన మొక్కలు, ఆకులు ఎప్పటికప్పుడు తీసేసి జాగ్రత్తగా తోటను కాపాడుకుంటే అందమైన పూతోటగా మారిపోతుంది. అదే విధంగా ఈర్ష్య,అసూయా, ద్వేషాలు అనే చెడు లక్షణాలను మన మెదడు నుండి తీసేస్తే జీవితం నందనవనంగా మారిపోతుంది.అంతా మన చేతులలోనే ఉంది.మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకుని మంచిదారిలో నడుస్తూ పదిమందికి చేతనైన సహాయం చేస్తూ జీవితాన్ని నందనవనంగా మార్చుకుంటారు అని ఆశిస్తూ అందరికీ నమఃసుమాంజలి .
Wednesday, 16 October 2024
Monday, 14 October 2024
మంచివాడు - ముంచేవాడు
మంచివాడు నిజం చెప్పినా, మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు. ముంచేవాడు అబద్దాలు చెప్పినా, ఎదుటివారు నష్టపోవాలని తియ్యటి మాటలు చెప్పి మోసం చెయ్యాలనుకున్నా వాడినే గుడ్డిగా నమ్ముతారు.అందుకే ముంచేవాడు ఎప్పుడూ మందిలో ఉంటాడు. మంచివాడు ఒంటరిగా ఉంటాడు.నిజం నిలకడ మీద తెలుస్తుంది కనుక ఎప్పటికైనా మంచివాడి మంచితనమే ముంచేవాడి మోసం పైన గెలుస్తుంది.ముంచేవాడి బడాయిమాటలు విని మోసపోకుండా కాస్త లోకాజ్ఞానంతో ముందే జాగ్రత్త పడటం ఉతత్తమం.
Sunday, 13 October 2024
విజేత - పరాజిత
ఏ పని మొదలుపెట్టినా కష్టాలు, నష్టాలు, బాధలు,అడ్డంకులు,తిరస్కరణలు, వైఫల్యాలు, అవమానాలు ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టుదలగా శ్రమించి విజయం సాధించేవారే విజేతలు .ఈ క్లిష్ట ప్రయాణంలో ఏమాత్రం అలసత్వంతో విశ్రమించినా, ఏమరపాటుతో ఉన్నా, ఇబ్బందులను సాకులుగా చూపుతూ ఆగిపోయినా పరాజితులుగా మిగిలిపోతారు.కనుక మొదలుపెట్టేటప్పుడే అన్నీ అలోచించి ఆచితూచి ధైర్యంగా ముందడుగు వేసి మధ్యలో ఆగిపోకుండా ముందుకు సాగిపోతూ లక్ష్యాన్ని చేరుకొని విజేతలుగా మారాలి.
Thursday, 3 October 2024
తమాషాకి కూడా ఎగతాళి చేయకండి
కొంతమంది సరదాగానో, తమాషాగానో మాట్లాడుతున్నామని అనుకుని ఎదుటివారిని వారి రూపాన్ని బట్టి మారుపేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు.మనం మాట్లాడే మాట చిన్నదే అనుకుంటాము. కానీ వాళ్ళ మనసుకు ఎంత బలంగా తగులుతుందో ఆ బాధ అనుభవించేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది.ఒక దెబ్బ కొట్టినా రెండు రోజులకు పోతుంది. కానీ మనసుకు బాధ కలిగే విధంగా ఒక మాట అంటే వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది.కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు కానీ కొంతమంది ప్రాణం పోతున్నట్లు విలవిలలా డిపోతుంటారు.బయటకు చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ మానసిక క్షోభకు గురై ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కళాశాలల్లో, పాఠశాలల్లో, ఇరుగుపొరుగు వారిని కూడా కొంతమంది సంస్కారం లేక ఇటువంటి పిచ్చి పనులు చేస్తుంటారు.దయచేసి ఎవరైనా సరే తోటివారిని తమాషాకి కూడా ఎగతాళి చేయకండి.
విజయానికి దారి
జీవితంలో మనకు ఎదురైన ప్రతి సవాలు మన శక్తిని, నమ్మకాన్ని పరీక్షస్తుంది.ధైర్యంగా నిలబడితే అదే మన విజయానికి దారిగా మారుతుంది. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది. అదే విజయానికి అర్హతను ఇచ్చి అందలం ఎక్కిస్తుంది.
Tuesday, 1 October 2024
చిన్నదే మహా అద్భుతం
చిన్న విత్తనం నుండి పుట్టిన మొక్క మహావృక్షముగా పెరిగినట్లు, చిన్న జలపాతం మహానదిగా మారినట్లు,చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారినట్లు, మనం వేసే చిన్ని మొదటి అడుగే మనకు అద్భుతమైన విజయాలను తెస్తుంది.ప్రపంచంలో అన్నీ చిన్నగానే ప్రారంభమై తర్వాతే అద్భుతాలుగా రూపు దిద్దుకుంటాయి.ఒకేసారి భారీగా మొదలుపెట్టి సక్రమంగా నిర్వహించలేక చతికిలపడే బదులు మనకు తగినంతలో చిన్నగా మొదలుపెట్టి దానిని అభివృద్ధిలోకి తేవడానికి తగినంత కృషి చేసి విజయం సాధించగలిగితే వచ్ఛే అనందం అంతాయింతా కాదు .చిన్నదే మహా అద్భుతం.కొండంత తృప్తి.
నిజమైన అదృష్టం
అదృష్టం అంటే ఆస్తులు, అంతస్థులు కలిగి ఉండటం కాదు. ప్రతిరోజు మనల్ని అర్థం చేసుకుని,గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మంచి మనసున్న మనుషులు మనవాళ్ళుగా ఉండటమే మన నిజమైన అదృష్టం.