ఒకటి కొంటే మూడు ఉచితం అని మార్కెట్లో వస్తువుల కొనుగోళ్ళు పెరిగేందుకు వచ్చే ప్రకటనలు తరచుగా చూస్తూ ఉంటాము.అందులో ఎంత మనకు లాభం ఉంటుందో తెలియదు కానీ మనం జీవితంలో సాధ్యమైనంత వరకు సత్యాన్నిపాటిస్తే ఎప్పటికయినా న్యాయం,సుగుణం,సంపద అనే మూడు ఉచితంగా లభిస్తాయన్న మాట.ఇది జగమెరిగిన సత్యం.
Monday, 29 February 2016
గుప్పెడు తులసిఆకులు
రోజూ ఉదయం ఒక లీటరు నీటిలో గుప్పెడు తులసి ఆకులు వేసి మరిగించి వడకట్టి గోరువెచ్చటి నీటిని ఇంట్లో అందరూ తాగటం అలవాటు చేసుకుంటే జలుబు,గొంతు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
Sunday, 28 February 2016
ఓర్పు
ఒక్క రోజులోనో,ఒక నెలలోనో,ఒక సంవత్సరంలోనో మనల్నివిజయం వరిస్తుందని ఆశించకూడదు.ఓర్పు అనేదిధైర్య గుణాలలో ముఖ్యమైన గుణం.క్లిష్ట పరిస్థుతులు ఎదురైనప్పుడు బలహీన మనస్కులు వెంటనే విరమించుకుంటారు.కానీ ఓర్పు అనే ధైర్య గుణం కలవారు ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకుని చివరకు అనుకున్న విజయాన్ని సాధిస్తారు.
Monday, 22 February 2016
ఇలా చేస్తే ముడతలు మాయం
వారానికి ఒకసారి బాగా మగ్గిన చిన్నఅరటిపండు ముక్కను మెత్తగా చేసి 1/2 స్పూను తేనె,ఒక టేబుల్ స్పూను పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఒక పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇలా చేస్తే ముఖానికి ఉన్న ముడతలు మాయం అవుతాయి.
Saturday, 20 February 2016
వేసవి వచ్చేస్తోందోచ్
రధసప్తమి నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని పెద్దలు చెప్పినట్లే అప్పుడే ఎండ చురుక్కుమంటూ చెమటలు పట్టిస్తూ వేసవి వచ్చేస్తోందోచ్!తగిన జాగ్రత్తలు తీసుకోవాలోచ్! అంటూ మనల్నిహెచ్చరిస్తోంది.మారిన వాతావరణానికి అనుగుణంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో ఇబ్బంది కలుగకుండా హాయిగా ఆరోగ్యంగా ఉంటాము.సాధ్యమైనంతవరకు మరీ బిగుతుగా కాకుండా గాలి ఆడేలా తేలికపాటి నూలు,ఖాదీ వస్త్రాలు సౌకర్యవంతంగా ఉండేలా వేసుకొంటే చెమటతో చిరాగ్గా లేకుండా హాయిగా ఉంటుంది.నలుపు,ముదురు రంగులు వేడిని త్వరగా గ్రహిస్తాయి కనుక వేసవిలో తెలుపు,లేత రంగులు వేసుకుంటే బాగుంటుంది.దాహం వేస్తేనే నీళ్ళు తాగుదామని అనుకోకుండా వీలైనంత ఎక్కువగా నీళ్ళు తాగాలి.కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు,బార్లీ,సబ్జా గింజలు నానబెట్టిన నీళ్ళు తాగటం మంచిది.నీరు చెమట రూపంలోబయటకు వెళుతుంది కనుక డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.రోజూ ఒక అరగంట వ్యాయామం తప్పనిసరి.శరీరంలోని మలినాలు చెమట ద్వారా బయటకు పోవటంతో శ్వాస క్రియ సక్రమంగా జరుగుతుంది. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కనుక మండుటెండలో బయటకు వెళ్ళకపోవటమే మంచిది.అంతగా తప్పనిసరయితే కళ్ళకు చలువ అద్దాలు పెట్టుకుని గొడుగు వేసుకుని వెళ్ళటం మంచిది.
Thursday, 18 February 2016
గొంతు సమస్యలకు......
కాలంతో సంబంధం లేకుండా కొంతమందికి తరచుగా గొంతు నొప్పి,గొంతులో ఏదో అడ్డుపడినట్లు గరగరమన్నట్లుగా ఉంటూ ఉంటుంది.ఇలా గొంతు సమస్యలు ఎక్కువగా వచ్చేవాళ్ళు నీళ్ళల్లో 5,6 తులసి ఆకులు,చిన్న అల్లం ముక్క వేసి మరిగించి రోజూ ఒక గ్లాసు తాగాలి.ఇలా చేస్తే గొంతు మాములైపోతుంది.
జుట్టు నిగనిగలాడాలంటే.........
మందర ఆకులూ,పువ్వులు నీడలో ఆరబెట్టి గలగలలాడిన తర్వాత పొడిచేసి నువ్వుల నూనెలో వేసి కాచి చల్లార్చి సీసాలో పోసుకుని రోజు వాడుతుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పట్టుకుచ్చులా నిగనిగలాడుతుంది.
Wednesday, 17 February 2016
తరచుగా షాంపూతో........
తరచుగా షాంపూతో తలస్నానం చెయ్యడం జుట్టుకు అంత మంచిది కాదు.అప్పుడప్పుడు షాంపూలో అరస్పూను కలబంద గుజ్జు,ఐదు చుక్కల నిమ్మరసం కలిపి దానితో తలస్నానం చేస్తే జిడ్డు పోవడమే కాక చుండ్రు,జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
Tuesday, 16 February 2016
దాల్చిన చెక్క
మధుమేహం,కొలెస్టరాల్ ఉన్నవాళ్ళు రోజూ అన్నం వండేటప్పుడు రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్క వేసి వండుకుని తినడం మంచిది.
Monday, 15 February 2016
జీర్ణశక్తి పెరగాలంటే........
జీర్ణశక్తి పెరగాలంటే రోజూ భోజనం చేసిన తర్వాత పొట్టు తీసిన 2 వెల్లుల్లి రెబ్బలు తినాలి.రోజూఇలా చేస్తే జీర్ణశక్తి పెరగటమే కాక బి.పి,షుగరు అదుపులో ఉంటాయి.ఇంతే కాకుండా ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
Sunday, 14 February 2016
చీమలు రాకుండా.........
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి చీమలు ఎక్కడ నుండి వస్తాయో కానీ చుట్టూ కనిపించకుండా పంచదార డబ్బాలోనో,తేనె సీసాలోనో చేరతాయి.పొద్దున్నే కాఫీలోనో,నిమ్మరసంలోనో వేసుకుందామని మూత తియ్యగానే చీమలు కనిపిస్తే వెంటనే బయటకు వెళ్ళవు కదా!అప్పుడు ఏమి చేయాలో తెలియక విసుగు వచ్చేస్తుంది.మనకు ఉదయానే విసుగు రాకుండా, అలానే చీమలు రాకుండా ఉండాలంటే డబ్బా చుట్టూ లేక సీసా చుట్టూ మిరియాల పొడి,ఉప్పు కలిపి చల్లాలి.అప్పుడు చీమల బెడద ఉండదు.మనకూ ప్రశాంతంగా ఉంటుంది.
మోకాళ్ళ నొప్పులకు.....
నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుండి ఎక్కువ మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.బరువు పెరగకుండా చూచుకుంటూ ఉండాలి.ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే తగ్గటానికి ప్రయత్నించాలి.సాధ్యమైనంతవరకు నొప్పులు పెరగకుండా చూచుకోవాలి.రోజూ లేత మునగాకు నేతిలో వేయించి తినాలి.వామును మెత్తగా నూరి నువ్వుల నూనెలో కలిపి వేడిచేసి నొప్పి ఉన్నచోట మర్దన చేయాలి.మునగాకును వేయించి వాపు ఉన్నచోట కట్టుకడితే వాపు,నొప్పి తగ్గిపోతుంది.ఈ చిట్కాలు పాటిస్తుంటే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది.
కంటిచూపు మెరుగుపడటానికి........
రోజూ ఒక 5ని.లు కనుబొమలు కొంచెం నొక్కాలి.నువ్వుల నూనె 2 చుక్కలు తీసుకుని కళ్ళ చుట్టూ రాయాలి.తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక చేతిరుమాలు ముంచి నీళ్ళు పిండి 5 ని.లు కళ్ళ మీద పెట్టుకోవాలి.ఆ తర్వాత పైకి ,క్రిందకు,ప్రక్కలకు,గుండ్రంగా కళ్ళను తిప్పాలి.ఈ విధంగా రోజూ చేస్తుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
Saturday, 13 February 2016
శ్రీ పంచమి
శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవిని భక్తి,శ్రద్ధలతో పూజించి అక్షర జ్ఞాన సంపదలను ప్రసాదించమని వేడుకొంటే తప్పకుండా నెరవేరుతుందని ప్రజల నమ్మకం.సరస్వతీ దేవి గుణాల్లో ప్రధాన గుణమైన సత్వ గుణానికి,శుక్ల వర్ణానికి సంకేతం.శుచి,శుభ్రత ఉన్నచోట తెల్లదనం,స్వచ్ఛత ఉంటుంది.ఇవి ఒక్క వస్త్రధారణకు మాత్రమే పరిమితం చేయకుండా మంచి ఆలోచనలతో మన మనసును కూడా పవిత్రంగాఉంచుకోవాలి.సాధ్యమైనంత వరకు మంచి మాటలతో,చేతలతో స్వచ్ఛతను మన చుట్టూ ఉన్న వారికి కూడా పంచినప్పుడే జన్మకు సార్ధకత.
Friday, 12 February 2016
అందరికీ సాధ్యమే
చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం వచ్చిసంపాదన దారిలో పడినా,ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి పరిస్థితులు అనుకూలించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టినా కూడా వెంటనే కోట్లు సంపాదించడం అనేది సాధ్యం కాని పని.కానీ అందరికీ సాధ్యమయ్యే పని ఒకటుంది.అదేమిటంటే ఎవరికి వారే తాము నిజాయతీపరులుగా ఉండాలని అనుకుని నిజాయతీపరులు కావడం అనేది మన చేతిలో పనే కనుక అది అందరికీ సాధ్యమే.
సహజ సిద్ధంగా.....
ఈ రోజుల్లో ఇంటా బయటా కూడా స్వచ్చమైన గాలి పీల్చుకోలేని పరిస్థితి.గాలిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది.పెద్ద ఇల్లు ఉన్నా చాకిరీ చెయ్యలేని పరిస్థితి.దానికి తోడు భద్రత ఉంటుందని అపోహతో కానీ,స్థలాల విలువ పెరగటం వలన కానీ,మరేదైనా కారణంతో కానీ పల్లెటూర్లతో సహా ఎక్కడ చూసినా ఈ మధ్య అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిపోయింది.దాంతో ధారాళంగా ఇంట్లోకి గాలి,వెలుతురు వచ్చే ఇళ్ళ సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది.పెద్ద చెట్లను నరికివేయడంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి కాలుష్యం ఎక్కువై శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువైపోయాయి.పెద్ద పెద్ద చెట్లను ఎలాగూ తీసుకురాలేము కనుక ఇంట్లో ఎక్కడైనా నీడలో కూడా పెరుగుతూ గాలిని శుద్ది చేసే అందమైన మొక్కలను పెంచుకోవడం మేలు.కలబంద,పీస్ లిల్లీ,క్రిస్మస్ కాక్టస్,గెర్బెరా,డైసీ,అరేకా పామ్,బాంబూ పామ్,బోస్టన్ ఫెర్న్ లాంటి మొక్కలు ఇంటిలోని గదుల్లో పెంచుకుంటే సహజ సిద్ధంగా గాలిని శుద్ధి చేస్తాయి.మొక్కలు పచ్చగా కళకళలాడుతూ ఇంటికి అందాన్ని తెస్తాయి.ఈమొక్కలు ఇంటికి అందంతో పాటు గాలిలోని విషపూరితాలను కూడా తొలగిస్తాయి.
Thursday, 11 February 2016
అన్నింటికన్నా.......
అన్నింటికన్నాఈ రోజుల్లో పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ఔషధం ఏదైనా ఉందంటే అది చిరునవ్వు మాత్రమే.అంతే కాక చిరునవ్వు విలువ వెల కట్టలేనిది.ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు చూడగానే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది.ఎంత కోపంలో ఉన్నాచిరునవ్వు చూడగానే కోపం కాస్తా ఇట్టే ఎగిరిపోతుంది.ఒక్క చిరునవ్వుతో ఒత్తిడి కాస్తా అటక ఎక్కుతుంది.తన కోపమే తన శత్రువు తన శాంతమే తన మిత్రువు అన్నట్లు సాధ్యమైనంత వరకు ఎంత శాంతంగా ఉంటే అంత అన్ని విధాలా శ్రేయస్కరము.ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
Sunday, 7 February 2016
28 ఏళ్లకు ఒకసారి
సోమవారం నాడు అమావాస్య,శ్రవణా నక్షత్రం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉంటే మహోదయ పుణ్యకాలం సంభవిస్తుంది.మహోదయ పుణ్యకాలం 28 ఏళ్లకు ఒకసారి వస్తుంది.మహోదయ పుణ్యకాలంలో నదీ స్నానం,సముద్ర స్నానం చేయటం మంచిది.నది సాగర సంగమమయ్యే ప్రాంతంలో పుణ్య స్నానాలు చేస్తే ఇంకా ఎంతో మంచిది.ప్రభుత్వం మహేంద్రతనయ నది సాగర సంగమ ప్రాంతం అయిన బారువలో మహోదయం ఏర్పాట్లు చేసింది.మహోదయ పుణ్యకాలం ఆదివారం రాత్రి 10.21 గం.ల నుండి 24 గంటల పాటు ఉంటుంది.ఈసమయంలో పుణ్యస్నానాలు చేయగలగడం ఎన్నోజన్మల పుణ్య ఫలం.అమావాస్య నాడు శివాభిషేకం,శివదర్శనం చాలా మంచిది.అమావాస్యలన్నింటిలోకి ప్రత్యేకమైనది సోమవారం వచ్చేది.శ్రవణా నక్షత్రం కూడా కలిస్తే అది మహోదయం.ఎంతో విశిష్టమైన ఈరోజు శివారాధన చేయటం అన్నివిధాల శ్రేయోదాయకం.
ప్రేమ లేకపోయినా ..........
ఈ రోజుల్లో కొంతమంది నేను,నాభార్య,నాపిల్లలు ఇంతవరకే నాకుటుంబం అని స్వార్ధంతో అనుకుంటున్నారు తప్ప కని పెంచిన తల్లి,తండ్రి అని కానీ ,అక్క,చెల్లి,అన్న,తమ్ముడు అనే ప్రేమ కానీ అసలు ఉండటంలేదు.స్వార్ధం ముందు భాంధవ్యాల విలువ తెలుసుకోవటం లేదు.ప్రతి మనిషి ఎవరికి తగిన పని వాళ్ళు చేసుకునే రోజులు పోయి ఊరికే తిని కూర్చుని డబ్బు ఆత్రం ఎక్కువై తరతమ భేదం లేకుండా తోడబుట్టిన వాళ్ళ ఆస్తి కూడా మనమే మోసంతో తినేద్దామనే విపరీతపు ఆలోచనలు చేస్తున్నారు.తన వాళ్ళు అని ప్రేమ లేకపోయినా ఫర్వాలేదు కానీ ద్వేషం,ఈర్ష్య,అసూయ అసలు ఉండకూడదు.ఇంకొంత మంది వాళ్ళకే ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించి,తన వాళ్ళకు తనపై అసలు ప్రేమ లేనట్లుగా ఎదుటివాళ్ళకు వినిపిస్తూ ఉంటారు."వినాశ కాలే విపరీత బుద్ధి"అన్నట్లు తయారవుతున్నారు.
Friday, 5 February 2016
గొప్ప మనసు
షర్మిల వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు.సాంకేతిక విద్యను అభ్యసించి విదేశాలలో మంచి ఉద్యోగం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తుంది.కానీ పెళ్ళి చేసుకోకుండా ఆధ్యాత్మిక సేవారంగంలో జీవితం గడపాలని నిర్ణయించుకుంది.కొంత సంపాదించుకుని స్వదేశానికి వచ్చి స్వంత ఊరిలో కోట్లు విలువ చేసే ఆస్తిని ప్రజల సేవకు వినియోగిద్దామని చిన్న వయసైనా మంచి ఆలోచనతో తన వాటా కింద వచ్చిన ఊరికి దగ్గరగా ఉన్న పొలంలో వృద్ధాశ్రమం కట్టించడం మొదలు పెట్టింది.ఇంటిని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం,ఊరిలో అందరూ యోగాసనాలు నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని యోగా తరగతులు నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేసింది.ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరిగే ఈ రోజుల్లో గొప్ప మనసుతో ఆలోచించి తన ఊరివారి కోసమే కాక చుట్టు పక్కల ఊళ్ళకు కూడా ఉపయోగపడేలా చేసింది.ఇది మనస్పూర్తిగా అభినందించదగ్గ విషయం.
Thursday, 4 February 2016
జాగ్రత్త పడదాం
ప్రపంచ కాన్సర్ దినోత్సవం సందర్భంగా నాలుగు మాటలు.కాన్సర్ అనేది వంశపారంపర్యంగా కాన్సర్ చరిత్ర ఉన్నవాళ్ళకు మాత్రమే వస్తుందిలే అందరికీ రాదులే అనుకోవటానికి లేదు.అది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేము.ముందు జాగ్రత్తగా సంవత్సరానికి ఒకసారైనా అన్ని పరీక్షలు చేయించుకోవడం మేలు.ముప్పై సంవత్సరాలు దాటిన దగ్గర నుండే ఎప్పటికప్పుడు అవగాహనతో ఉంటూ ముందు జాగ్రత్త ఒక్కటే ముప్పుని తప్పిస్తుందని ఎవరికీ వారే మనల్ని మనం ఆరోగ్యవంతులుగా ఉండేలా చూచుకోవాలి.ఈ రోజుల్లో ఒకవేళ వచ్చినా చాలామంది ఆత్మవిశ్వాసంతో మృత్యుంజయులు అవుతున్నారు.కానీ కాన్సర్ వచ్చిన తర్వాత శారీరకంగా,మానసికంగా బాధను అనుభవించి బయట పడేకన్నారాకముందే జాగ్రత్త పడటం మేలు కదా!అందుకే ముందే జాగ్రత్త పడదాం.మనల్ని మనం కాపాడుకుందాము.
తొట్టి పిల్లలు
సింధూర చెల్లెలు సింధుజ తన స్వంత ఇంటిలో మొదటి అంతస్తులో ఉంటుంది.ఒకరోజు సింధూర చెల్లెలు ఇంటికి వెళ్ళింది.ఎండలకు తట్టుకోలేక వేసవి కాలం వచ్చే లోపు రెండో అంతస్తు వేద్దామని హడావిడిగా మొదలు పెట్టామని సింధూరకు చెప్పింది.మీరు పైఅంతస్తులోకి మారతారా?అంటే అదేమీ లేదు అక్కా!అంది.ఎండలకు తట్టుకోలేకపోతే చల్లగా ఉండటానికి హాల్లో కూడా ఏ.సి పెట్టుకోకపోయారా?అంది సింధూర.హాలు పెద్దది కనుక చల్లగా ఉండాలంటే మధ్యలో అద్దాలు పెట్టాలని మేస్త్రి చెప్పాడు.మా పిల్లల సంగతి నీకు తెలియనిదేముంది.అసలే తొట్టి పిల్లలు(కొంటె పిల్లలు కాబోలు) అద్దాలు రెండో రోజుకే పగలగొట్టేస్తారు.అందుకే చల్లగా ఉండటానికి ఇంకో అంతస్తు వెయ్యాల్సి వస్తుంది అని అక్కకు చెప్పింది.
Wednesday, 3 February 2016
ఖచ్చితంగా బరువు తగ్గాలి అంటే.......
మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుని కొద్దిరోజులు పూర్తిగా ఆహారం తగ్గించి,అతి వ్యాయామం చేసి విసుగొచ్చి మళ్ళీ యధా రాజా తథా ప్రజా అన్నట్లు చేస్తుంటారు.అంతే కాకుండా కొంతమంది పదార్ధాలు రుచిగా ఉన్నాయని ఇష్టంగా తినేసి అమ్మో!నా పొట్టలో మంచి నీళ్ళు కూడా పట్టవు.పొట్ట నిండుగా ఉంది అని అంటూ ఉంటారు.ఈ రెండు విధానాలు సరయినవి కాదు.నచ్చినవి కదా!అని పొట్టనిండుగా తినకూడదు.అలాగని అసలు తినకుండా ఉండకూడదు.అతిగా వ్యాయామం చేయకూడదు.అసలు వ్యాయామం చేయకుండా కూడా ఉండకూడదు.తెల్లటి అన్నం,పప్పునూనె,పంచదార,నెయ్యి వాడకం తగ్గించి,ఆలివ్ నూనె వాడటం అలవాటు చేసుకుంటే మంచిది.ముడిబియ్యం,ఉడికించిన కూరగాయల ముక్కలు,ఆకులతో రకరకాల సలాడ్లు,అన్ని రకాల పండ్ల ముక్కలు,ఆకుకూరలు,గుగ్గిళ్ళు,సూపులు,చిరుధాన్యలతో చేసిన పదార్ధాలు తింటూ మధ్యమధ్యలో నీళ్ళు తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్ధాలు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి.ఖచ్చితంగా బరువు తగ్గాలి అంటే రాత్రిపూట ఆహారం త్వరగా తీసుకుని నిద్ర పోయే లోపు తాగగలిగినన్ని అంటే నాలుగు గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్ళు తాగాలి.ఈవిధంగా రోజూ చేస్తుంటే జీర్ణశక్తి మెరుగుపడటమే కాక పగలంతా పనులతో అలసిన శరీరానికి చక్కటి నిద్ర పట్టి మర్నాటికి ఉత్సాహంగా ఉండటమే కాక బరువు తగ్గుతారు.వ్యాయామం కూడా ఒక అరగంట తప్పనిసరిగా చేయాలి.
Tuesday, 2 February 2016
ఇల్లు గుల్ల
సావిత్రికి బంగారు నగలంటే తగని మోజు.తన దగ్గర ఉన్న డబ్బు అవసరానికి అడిగారు కదా అని అన్నకు,అక్కకు ఇస్తే డబ్బు తిరిగి ఇవ్వకుండా చెల్లితో మాట్లాడటం మానేశారు.డబ్బు ఇచ్చి ఎదురు పగ ఎందుకులే అని ఎప్పటికప్పుడు ఉన్న డబ్బుతో బంగారం కొనుక్కోవడం మొదలుపెట్టింది.ఆడపిల్లలకు కూడా తలా 100 కాసులు పెట్టింది.తను కూడా ఒక 100 కాసులు పెట్టి రకరకాలుగా నగలు చేయించుకుంది.పిల్లలు విదేశాలలో ఉంటారు కనుక అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ నగలు పెట్టుకుంటారు.చిన్నఅమ్మాయి మరిది పెళ్ళికి వచ్చి అమ్మ నగలు లాకరు నుండి తెచ్చిఅమ్మాకూతుళ్ళు పెట్టుకున్నాక ఇంట్లో పెట్టేసి లాకరులో పెట్టకుండా ఊరు వెళ్లారు.చిన్న అమ్మాయిని విమానం ఎక్కించి అటునుండిఅటు భార్యాభర్తలు యాత్రలకు వెళ్ళి 10 రోజులకు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు గుల్లయింది.సావిత్రి 100 కాసుల నగలు దొంగలు మూట కట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా తలుపులు దగ్గరకు వేసి వెళ్ళి పోయారు.స్నేహితులు పరామర్శించటానికి వెళ్తే సావిత్రి లబోదిబో అంటూ పైసాపైసా కూడబెట్టి తినోతినకో బంగారం అమర్చుకుందామని నగలు చేయించుకుని దొంగల పాలు చేసినట్లయిందని భోరున ఏడుస్తుంటే చూడటానికి,వినటానికి కూడా చాలా భాధ అనిపించింది.
Monday, 1 February 2016
పూలరంగడు
ఆర్యేష్ వయసుకు చిన్నవాడైనా పాతకాలంలో పూలరంగడిలా వేషధారణ,ముఖంలో హావభావాలు పలికిస్తూ అచ్చు అలాగే తయారవుతాడు.ఎత్తుకు ఎత్తు,లావుకు లావు తెల్లటి బట్టలతో చేతికి బంగారు కడియం,మెడలో పులిగోరుతో ఉరితాడు లాంటి బంగారపు గొలుసు చొక్కా పైకి వేలాడేలా వేసుకుని,చేతి వేళ్ళకు మందంగా రంగురంగుల రాళ్ళతో ఉంగరాలు ధరించి,కళ్ళకు నల్లద్దాల కళ్ళజోడు ధరించి,కాళ్ళకు తెల్లటి చెప్పులు వేసుకుని చదువుకోరా!బాబూ అంటే కళాశాలకు ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళక కనిపించిన అమ్మాయినల్లా మేక కళ్ళేసుకుని నోరు తెరుచుకుని చూస్తుంటే ప్రతి ఆడపిల్ల తిట్టడమే.పూర్వం పనీపాట లేక ఈ విధంగా ముస్తాబు చేసుకుని రోడ్లపై తిరిగే వాళ్ళను పూలరంగడిలా తయారయ్యాడు అనేవాళ్ళు.ఆర్యేష్ చూడటానికి అచ్చు పాతకాలం నాటి పూలరంగడిని తలపిస్తాడు.
Subscribe to:
Posts (Atom)