Friday, 12 August 2016

కృష్ణవేణి పుష్కర సందడి

                                                                         పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సందడే సందడి.ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి పుష్కర స్నానానికి వచ్చే బంధువులతో కళకళలాడే లోగిళ్ళు,ప్రతి ఒక్క ఇంట్లో ఎవరి వీలునుబట్టి  వాళ్ళు తరతరాల పెద్దలకు పిండ ప్రధానం చేసి ఆ సందర్భంగా ఏదేశంలో ఉన్నా ఆడపడుచులను ఆహ్వానించి దగ్గర బంధువులకు కూడా విందు ఏర్పాటు చేస్తున్నారు.మగపిల్లలు ఆడపడుచులకు బట్టలు పెట్టే సంప్రదాయం ఉండటంతో తన ఆడపడుచు,తండ్రి ఆడపడుచు,బ్రతికి ఉంటే తాత ఆడపడుచులను కూడా పిలిచి బట్టలు పెట్టటంతో షాపులు దగ్గర సందడి.దీనితో రోడ్లు రద్దీతో రోడ్లన్నీ కళకళ.కృష్ణవేణీ నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని,స్వయంగా గంగా మాత హంస రూపంలో వచ్చి స్నానమాచరిస్తుంది అని అంటారు కనుకపరమం,పవిత్రం,పావనం అని వీలైనంత వరకు వచ్చిన వాళ్ళందరు పుష్కర స్నానానికి వెళ్ళడంతో నదీతీరంలో ఉన్న గ్రామాల్లో ఒకటే సందడి.స్నానానంతరం దైవదర్శనం ఉత్తమం కనుక గ్రామాల్లో ఉన్న ఆలయాల శోభ ఇంతని వర్ణింపలేనిది.ఇకపోతే కృష్ణాగోదావరి సంగమం వద్ద ఇచ్చే హారతి అత్యద్భుతం,సుమనోహరం.చూడటానికి రెండు కళ్ళు,వర్ణించడానికి ఒక నోరు సరిపోదన్నమాట అతిశయోక్తి కాదు.మొత్తం మీద ఈ పన్నెండు రోజులు సందడే సందడి.అంతర్జాలం పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడున్నా వీక్షించే సదుపాయం ఉండటంతో మన తెలుగు వారందరూ కృష్ణాగోదావరి పుష్కర హారతి పరమాద్భుతమని చూచి తరిస్తున్నారు.  


No comments:

Post a Comment