Friday, 26 August 2016

నిలువెల్లా గర్వం

                                                                          జానకమ్మ మనుమళ్ళు,మనుమరాళ్ళు అందరూ అమెరికాలో ఉంటున్నారు.జానకమ్మ అక్క సంతానం,మనవ సంతానం కూడా ఉద్యోగ రీత్యా భారతదేశంలోనే వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు.అందరూ ఉన్నత స్థానాలలోనే ఉన్నారు.జానకమ్మ మనవరాలి పెళ్ళికి అందరూ తప్పకుండా రావాలని అమెరికా నుండి కూడా అందరూ వస్తున్నారని మరీ మరీ చెప్పింది.చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళిలో అందరూ కలిసి మాట్లాడుకోవచ్చని ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు.ఇంతా కష్టపడి వస్తే జానకమ్మ మనవళ్ళు,మనవరాళ్ళు తెల్లారి లేచిన దగ్గర నుండి ముఖ పుస్తకాల్లో ఛాయాచిత్రాలు చూస్తూనే ఉంటారు.ఎదురుగా వున్నవాళ్ళు కూడా ఎవరో తెలియనట్లు ఎవరినీ పలుకరించకుండా ఏటో చూస్తూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.అమెరికాలో డాలర్లు సంపాదించుతున్నామని మీకన్నా మేమే గొప్ప అని నిలువెల్లా గర్వంతో విర్రవీగి పోతున్నారు.అక్కడ చిన్న ఉద్యోగం చేసినా,మెతుకు పోతే బతుకు పోతుందేమో అన్నట్లుగా బతికినా ఇక్కడ ఎవరికీ తెలియదులే అనే ధీమా.ఒకవేళ చాలా డబ్బు పోగేసుకున్నా ఎవరికీ వాళ్ళే తింటారు,ఖర్చు పెట్టుకుంటారు.ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదు.ఎప్పుడైనా ఒకసారి కనిపించే బంధువులతో ప్రేమగా ఒక మాట మాట్లాడితే చాలు కదా!దీని భాగ్యానికి చోద్యాలు.పెళ్ళిలో ఇదో పెద్ద చర్చ.మొత్తానికి జానకమ్మ ఒదిన జానకమ్మను అందరిలో అడగనే అడిగేసింది.ఏమిటే ఆ పిల్లలకు అంత మిడిసిపాటు?నువ్వు రావాల్సిందే అన్నావని పనులన్నీ పక్కనపెట్టి వస్తే  ఇదా ప్రతిఫలం అంటూ దులిపేసింది.పాపం జానకమ్మ బిక్కచచ్చిపోయింది.తను మాత్రం ఏమి చేయగలదు.తనదీ అదే పరిస్థితి.బయటకు చెప్పుకోలేదు కదా.!ఇదండీ నేటి కొత్త పోకడ.

No comments:

Post a Comment