Tuesday, 7 July 2020

రజాయిలో అక్కీ

                                       అఖిల్ మూడేళ్ళ బాబు.అక్కీ ముద్దు పేరు.అందంగా ముద్దుముద్దుగా మాటలు చెప్తూ ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తుంటాడు.దానికి తోడు అల్లరి,ఆటలు ఎక్కువ.రోజంతా అమ్మకి  వాడితోనే సరిపోతుంది.అమెరికాలో ఉండడంతో అక్కీకి అమ్మానాన్నే లోకం.ప్రపంచ వ్యాప్తంగా నిర్భంద సమయంలో ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో నుండి పనిచేయడంతో అక్కీ  బాగా అల్లరి చేస్తుంటే అక్కీ అమ్మ దివ్య కోప్పడింది.దానితో వాడికి కోపం వచ్చింది.అమ్మేమో కార్యాలయం పనిలో పడి అక్కీని గమనించలేదు.వాడి సంగతి ఒక అరగంట మర్చిపోయింది.కాసేపటికి అక్కీ ఎక్కడ ఉన్నాడో?ఏమి చేస్తున్నాడో ? అని కంగారుపడి అక్కీ అమ్మ దివ్య ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు.మోటారు వాహనాలు పెట్టే గది తలుపు తెరిచి ఉండడంతో బయటికి వెళ్ళాడేమోనని చుట్టుప్రక్కల అంతా వెతికినా కనపడకపోయేసరికి అమ్మ ఒకటే ఏడుపు.స్నేహితులు అందరూ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చారు.అందరూ కలిసి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. సి సి టి.వి పుటేజిలో చూస్తే అక్కీ బయటకు వెళ్ళినట్లు కనిపించలేదు.అందువల్ల ఇంట్లోనే ఉండి ఉండవచ్చని నిర్ధారించుకుని ఇల్లంతా వెతుకుతుంటే పడకగదిలో మంచం మీద మందంగా ఉన్న రజాయి (కంఫర్టర్) లో దూరి నిండా ముసుగు వేసుకుని నిద్రపోతున్నాడు.మొట్టమొదటే వాళ్ళ నాన్న రజాయిని లాగి చూచినా ఆ కంగారులో చిన్నవాడు కదా!కనిపించలేదు.అందరూ రెండు గంటలు నానా హైరానా పడి వెతికి అమ్మ క్రింద పడి పొర్లి పొర్లి ఏడ్చిన తర్వాత చిట్ట చివరకు ఇంట్లోనే ఉండడంతో అందరూ సంతోషించారు.అక్కీ ఎందుకు ఇలా చేశావు? అని అడిగితే నువ్వు తిట్టావు అందుకే కోపం వచ్చి నిద్రపోయాను అని చెప్పడంతో వేలెడంత లేడు.వీడికి అప్పుడే కోపం అంటూ అంతవరకు పడిన కంగారు మర్చిపోయి తేలిక పడిన మనసుతో హాయిగా నవ్వుకున్నారు. 

Monday, 6 July 2020

భలేగున్నవు సాయి

                                                              మహా అయితే గురు పౌర్ణిమ సందర్భంగా వీలయితే గుడికి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటాము.సహజంగా ఇంట్లో పూజ చేసుకుంటాము.ఇంకా చెయ్యగలిగితే  రక రకాల పిండి వంటలు చేసి నివేదన పెడతాము.కానీ నిన్న గురు పౌర్ణమి మాత్రం నా జీవితంలో మర్చిపోలేనిది.ఎప్పుడు బాబా గుడికి వెళ్ళినా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావడమే కానీ హారతులు అంటే ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టగూడదు అనే ఉద్దేశ్యంతో   ఆ సమయంలో వెళితే గంట పడుతుంది అని తప్పించుకునేదాన్ని.ఈమధ్య నిర్భంద కాలంలో ప్రవచనాలు వినడంతో  సాయి హారతుల వలన మన కర్మలు తొలగుతాయని తెలిసింది.కరోనా సమయంలో రక్షణ కోసం పౌర్ణమి,అమావాస్య తిధుల్లో చేసుకోవలసిన పూజలు,హోమాలు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్లో సాయి సర్వస్వం లైవ్ ద్వారా ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోమనడంతో నచ్చి ఆచరించడం జరిగింది.దీనితో సమయపాలన,క్రమశిక్షణ అలవడింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సాయి సర్వస్వం వాళ్ళదే ద్వారకామాయి టి.వి ద్వారా లైవ్ లో నిన్నటి గురుపుజోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించడంతో చక్కగా పనులు చేసుకుంటూనే అన్ని హారతులు,అభిషేకాలు,స్వర్ణ పుష్పాలతో స్వర్ణ పాదుకల పూజ,యంత్ర పూజ,బాబా అష్టోత్తర శతనామావళి,సాయంత్రం నక్షత్ర హారతి,సాయికి పూలాభిషేకమ్ అన్ని చక్కగా చూడడం జరిగింది.ఇంతకీ విశేషం ఏమిటంటే మిగతా అన్ని సేవల్లో ఇంతకు ముందు పాల్గొన్నా కానీ ఐదు రకాల కేరళ పంచ వాయిద్యాలతో ఇరవై ఏడు రకాల నక్షత్ర హారతులు చూడడం,గురూజీ హారతులు ఇచ్చే విధానం అత్యంత అధ్భుతం.చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఒళ్ళంతా పులకించిపోయింది.భలేగున్నవు సాయి అంటూ పాట పడుతూ చేసే పూలాభిషేకం ఎంతో మధురం.ఆ పాట అంటే నాకూ చాలా ఇష్టం.ఏడు రోజులు ఏడు రకాల పువ్వులు తెస్తాం అంటూ లయబద్దంగా పాడుతూ ఉంటే    వింటూ బాబాను చూస్తూ భలేగున్నవు సాయి అనుకుంటూ ఆనందోత్సాహాలలో తేలియాడుతూ మానసికంగా చిన్నపిల్లలా గంతులు వేసినంత ఆనందం కలిగింది.సాయి అనుగ్రహం లేనిదే ఆయన దర్శనానికి కూడా వెళ్ళలేమని మనకు అనుభవమే కదా!టి.వి ఎక్కువగా  చూడని నేను నిజంగా సాయి అనుగ్రహంతోనే  ఈరోజు కుదురుగా కూర్చుని చూడగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ సాయికి,గ్రాండ్ మాష్టర్ సాయికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను. 

Friday, 3 July 2020

దెబ్బ మీద దెబ్బ

                                                                          సీత కష్టాలు సీతవి.పీత కష్టాలు పీతవి అన్నట్లు ఈ నిర్భంధ సమయంలో (లాక్ డౌన్) అందరికీ చిన్నవో,పెద్దవో ఏదో ఒక ఇబ్బందులు ఎదురౌతూనే ఉన్నాయి.అందులో కష్టపడి పని చేసుకునే జానకి అప్పోసప్పో చేసయినా కూతురు జమున పెళ్ళి ఘనంగా చేయాలని చేసింది.పెళ్ళి  బాగా జరిగిందని అందరూ సంతోషపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని ఎదురు దెబ్బ తగిలి బొక్క బోర్లా పడిపోయింది.దొరికిన చోటల్లా అప్పులు చేసి మంచి సంబంధం ఉద్యోగస్తుడయితే  పిల్ల సుఖపడుతుందని చదువుకుంటున్న అమ్మాయికి పెళ్ళి చేసింది.పెళ్ళయిన తెల్లారి నుండే మీ వాళ్ళందరిని వదిలెయ్యాలి లేకపోతే నీకు విడాకులు ఇస్తానంటూ పాట పాడడం మొదలెట్టాడు.మా వాళ్ళను వదిలెయ్యడం ఏమిటి?అని ఎదురు ప్రశ్న వేస్తే కొట్టడం మొదలెట్టాడు.దీనికి తోడు మద్యపానం,ధూమపానం,గంజాయి బిళ్ళలు తీసుకోవడం దీనివల్ల నరాల బలహీనత,అవయవాలు పనిచేయకపోవడంతో  దానికోసం మందులు వాడడం ఇవ్వన్నీ  తెలియకుండా కప్పి పుచ్చుకోవడానికి జమునను కొట్టడం,బూతులు తిట్టడం పరిపాటి అయిపోయింది.జమున తెలివిగలది కనుక కొట్టిన దెబ్బలు ఫోటో తీసి,బూతులు తిట్టినప్పుడు రికార్డ్ చేసి చరవాణిలో రహస్య ఫైలులో దాచి పెట్టినది.దరిద్రుడికి 64 కళలు అన్నట్లు చరవాణి తనిఖీ చేయడంతో ఎందుకైనా మంచిదని శ్రేయోభిలాషికి,అన్నయ్యకు అన్ని ఆధారాలు పంపింది.వాడిలో లోపం కప్పి పుచ్చుకోవడానికి మీ అమ్మాయి సంసారానికి పనికి రాదు అని జానకి వాళ్ళకు,బంధువులకు అబద్దాలు చెప్పడం మొదలెట్టాడు.ఎవరిలో లోపం ఉందో వెళ్ళి ఆసుపత్రిలో తేల్చుకుందాము అని జమున గట్టిగా అనడంతో వీరావేశంతో కొట్టి చరవాణి లాక్కుని నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది.జానకి,భర్త ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు మీ అమ్మా,నాన్న కూడా ఊరిలో లేరు  నిన్ను చంపేస్తే  ఏమి చేస్తావు?అంటూ తాగి వెకిలిగా మాట్లాడడంతో ప్రాణభయంతో తెలిసినవాళ్ళకు చంపేస్తున్నాడని సమాచారం అందించడంతో జమున అన్నయ్య ఆగమేఘాలమీద వెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. ఇదంతా పెళ్ళయిన వారంలోపే జరిగింది.పెళ్ళి మాట దేముడెరుగు కూతురు బతికుంటే చాలు అనుకుని పంచాయితీ పెట్టి విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.అన్ని ఆధారాలు ఉండడంతో తప్పు ఒప్పుకుని నష్టపరిహారం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.కూతురికి పెళ్ళి చేసి లేని కష్టాలు కొని తెచ్చుకున్నామనే బాధలో ఉండగానే  జానకి కొడుకు రోషన్ కు కడుపునొప్పి వచ్చి అప్పటికప్పుడు శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది.కరోనా గోలతో 40,000 /- కడితేనే వైద్యం అనడంతో మళ్ళీ అప్పు చేయవలసి వచ్చింది.ఏమంటా ఈ పెళ్ళి చేశామో దెబ్బ మీద దెబ్బ అని జానకి లబోదిబోమని ఏడవడం మొదలెట్టింది.ఏడవకు జానకి కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో  ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కుంటే అవే కాలానుగుణంగా సర్దుకుంటాయి అని అందరు చెప్పడంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది.

Wednesday, 1 July 2020

సర్వేజనా సుఖినోభవంతు

                                     అందరికి నమస్తే.చాలా రోజుల తర్వాత తెలుగు వారి బ్లాగుకు స్వాగతం.ఈ కరోనా హంగామాతో అందరు ఇంటికే పరిమితమైనా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండి ఉంటారని ఆశిస్తున్నాను.అందరూ ఎవరికి తోచినది వారు చేసే ఉండి ఉంటారు.కాకపోతే నేను ఉడతా భక్తిగా ఏమి చేశానంటే? ఇన్ని రోజులు నేను నాకు  సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందిస్తూ మేము,మీరు,మన అందరితోపాటు సర్వేజనా సుఖినోభవంతు,సమస్తా లోకా సుఖినోభవంతు అంటూ అందరూ బాగుండాలని సూర్యోదయానికి,సూర్యాస్తమయానికి ముందుగా దీపాలు వెలిగించి పూజలు,పారాయణాలు చేస్తూ భగవంతుని ప్రార్ధించడం దినచర్యలో భాగం అయిపోయింది.దీనితో ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది.కళ్ళు మూసి తెరిచినట్లుగా నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి.అకస్మాత్తుగా రోజువారీ  అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.ఏ పని చేయాలని అనిపించేది కాదు.ఆ తర్వాత మనసుకు ఒక్కసారిగా స్తబ్దత ఆవరించినట్లు రోజంతా నిద్ర.అలసటతో శరీరమంతా బద్ధకం.ఒక పది రోజులు గడిచిపోయినాయి.ఎందుకు ఇలా ?దీని నుండి ఎలాగైనా బయటపడాలని బాబాకి నమస్కారం చేసుకుని చరవాణి చేతిలోకి తీసుకుని సానుకూల దృక్పధం అని నొక్కగానే సాయి సర్వస్వంలో  బాబా సానుకూల దృక్పధం చైతన్య క్రియ చూచి ఆచరించడంతో ఆశ్చర్యంగా మనసుకు  ఆవరించిన స్తబ్దత ఒక్కసారిగా దుమ్ము దులిపినట్లు తొలగిపోయింది.ఇది నిజంగా మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.మనకు సహాయం చేసినవారికి ధన్యవాదములు తెలియచేయడం  మన సంస్కారం.బాబాకు,సాయి సర్వస్వం వారికి ధన్యవాదములు.రోజూ మీ అందరితో ఎన్నెన్నో ఊసులు,కొత్తకొత్త కబుర్లు చెప్పాలని ప్రయత్నించడం బద్దకంతో అక్కడ నుండి వెళ్ళిపోవడం నిజంగా నాకే విచిత్రంగా ఉండేది.ఇక ముందు వీలయినప్పుడల్లా తప్పకుండా కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను.మరి ఎప్పటిలా నా కబుర్లు ఆసక్తిగా చదువుతారు కదూ.