Friday 3 July 2020

దెబ్బ మీద దెబ్బ

                                                                          సీత కష్టాలు సీతవి.పీత కష్టాలు పీతవి అన్నట్లు ఈ నిర్భంధ సమయంలో (లాక్ డౌన్) అందరికీ చిన్నవో,పెద్దవో ఏదో ఒక ఇబ్బందులు ఎదురౌతూనే ఉన్నాయి.అందులో కష్టపడి పని చేసుకునే జానకి అప్పోసప్పో చేసయినా కూతురు జమున పెళ్ళి ఘనంగా చేయాలని చేసింది.పెళ్ళి  బాగా జరిగిందని అందరూ సంతోషపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని ఎదురు దెబ్బ తగిలి బొక్క బోర్లా పడిపోయింది.దొరికిన చోటల్లా అప్పులు చేసి మంచి సంబంధం ఉద్యోగస్తుడయితే  పిల్ల సుఖపడుతుందని చదువుకుంటున్న అమ్మాయికి పెళ్ళి చేసింది.పెళ్ళయిన తెల్లారి నుండే మీ వాళ్ళందరిని వదిలెయ్యాలి లేకపోతే నీకు విడాకులు ఇస్తానంటూ పాట పాడడం మొదలెట్టాడు.మా వాళ్ళను వదిలెయ్యడం ఏమిటి?అని ఎదురు ప్రశ్న వేస్తే కొట్టడం మొదలెట్టాడు.దీనికి తోడు మద్యపానం,ధూమపానం,గంజాయి బిళ్ళలు తీసుకోవడం దీనివల్ల నరాల బలహీనత,అవయవాలు పనిచేయకపోవడంతో  దానికోసం మందులు వాడడం ఇవ్వన్నీ  తెలియకుండా కప్పి పుచ్చుకోవడానికి జమునను కొట్టడం,బూతులు తిట్టడం పరిపాటి అయిపోయింది.జమున తెలివిగలది కనుక కొట్టిన దెబ్బలు ఫోటో తీసి,బూతులు తిట్టినప్పుడు రికార్డ్ చేసి చరవాణిలో రహస్య ఫైలులో దాచి పెట్టినది.దరిద్రుడికి 64 కళలు అన్నట్లు చరవాణి తనిఖీ చేయడంతో ఎందుకైనా మంచిదని శ్రేయోభిలాషికి,అన్నయ్యకు అన్ని ఆధారాలు పంపింది.వాడిలో లోపం కప్పి పుచ్చుకోవడానికి మీ అమ్మాయి సంసారానికి పనికి రాదు అని జానకి వాళ్ళకు,బంధువులకు అబద్దాలు చెప్పడం మొదలెట్టాడు.ఎవరిలో లోపం ఉందో వెళ్ళి ఆసుపత్రిలో తేల్చుకుందాము అని జమున గట్టిగా అనడంతో వీరావేశంతో కొట్టి చరవాణి లాక్కుని నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది.జానకి,భర్త ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు మీ అమ్మా,నాన్న కూడా ఊరిలో లేరు  నిన్ను చంపేస్తే  ఏమి చేస్తావు?అంటూ తాగి వెకిలిగా మాట్లాడడంతో ప్రాణభయంతో తెలిసినవాళ్ళకు చంపేస్తున్నాడని సమాచారం అందించడంతో జమున అన్నయ్య ఆగమేఘాలమీద వెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. ఇదంతా పెళ్ళయిన వారంలోపే జరిగింది.పెళ్ళి మాట దేముడెరుగు కూతురు బతికుంటే చాలు అనుకుని పంచాయితీ పెట్టి విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.అన్ని ఆధారాలు ఉండడంతో తప్పు ఒప్పుకుని నష్టపరిహారం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.కూతురికి పెళ్ళి చేసి లేని కష్టాలు కొని తెచ్చుకున్నామనే బాధలో ఉండగానే  జానకి కొడుకు రోషన్ కు కడుపునొప్పి వచ్చి అప్పటికప్పుడు శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది.కరోనా గోలతో 40,000 /- కడితేనే వైద్యం అనడంతో మళ్ళీ అప్పు చేయవలసి వచ్చింది.ఏమంటా ఈ పెళ్ళి చేశామో దెబ్బ మీద దెబ్బ అని జానకి లబోదిబోమని ఏడవడం మొదలెట్టింది.ఏడవకు జానకి కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో  ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కుంటే అవే కాలానుగుణంగా సర్దుకుంటాయి అని అందరు చెప్పడంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది.

No comments:

Post a Comment