Tuesday, 7 July 2020

రజాయిలో అక్కీ

                                       అఖిల్ మూడేళ్ళ బాబు.అక్కీ ముద్దు పేరు.అందంగా ముద్దుముద్దుగా మాటలు చెప్తూ ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తుంటాడు.దానికి తోడు అల్లరి,ఆటలు ఎక్కువ.రోజంతా అమ్మకి  వాడితోనే సరిపోతుంది.అమెరికాలో ఉండడంతో అక్కీకి అమ్మానాన్నే లోకం.ప్రపంచ వ్యాప్తంగా నిర్భంద సమయంలో ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో నుండి పనిచేయడంతో అక్కీ  బాగా అల్లరి చేస్తుంటే అక్కీ అమ్మ దివ్య కోప్పడింది.దానితో వాడికి కోపం వచ్చింది.అమ్మేమో కార్యాలయం పనిలో పడి అక్కీని గమనించలేదు.వాడి సంగతి ఒక అరగంట మర్చిపోయింది.కాసేపటికి అక్కీ ఎక్కడ ఉన్నాడో?ఏమి చేస్తున్నాడో ? అని కంగారుపడి అక్కీ అమ్మ దివ్య ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు.మోటారు వాహనాలు పెట్టే గది తలుపు తెరిచి ఉండడంతో బయటికి వెళ్ళాడేమోనని చుట్టుప్రక్కల అంతా వెతికినా కనపడకపోయేసరికి అమ్మ ఒకటే ఏడుపు.స్నేహితులు అందరూ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చారు.అందరూ కలిసి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. సి సి టి.వి పుటేజిలో చూస్తే అక్కీ బయటకు వెళ్ళినట్లు కనిపించలేదు.అందువల్ల ఇంట్లోనే ఉండి ఉండవచ్చని నిర్ధారించుకుని ఇల్లంతా వెతుకుతుంటే పడకగదిలో మంచం మీద మందంగా ఉన్న రజాయి (కంఫర్టర్) లో దూరి నిండా ముసుగు వేసుకుని నిద్రపోతున్నాడు.మొట్టమొదటే వాళ్ళ నాన్న రజాయిని లాగి చూచినా ఆ కంగారులో చిన్నవాడు కదా!కనిపించలేదు.అందరూ రెండు గంటలు నానా హైరానా పడి వెతికి అమ్మ క్రింద పడి పొర్లి పొర్లి ఏడ్చిన తర్వాత చిట్ట చివరకు ఇంట్లోనే ఉండడంతో అందరూ సంతోషించారు.అక్కీ ఎందుకు ఇలా చేశావు? అని అడిగితే నువ్వు తిట్టావు అందుకే కోపం వచ్చి నిద్రపోయాను అని చెప్పడంతో వేలెడంత లేడు.వీడికి అప్పుడే కోపం అంటూ అంతవరకు పడిన కంగారు మర్చిపోయి తేలిక పడిన మనసుతో హాయిగా నవ్వుకున్నారు. 

No comments:

Post a Comment