Monday 6 July 2020

భలేగున్నవు సాయి

                                                              మహా అయితే గురు పౌర్ణిమ సందర్భంగా వీలయితే గుడికి వెళ్ళి సాయి దర్శనం చేసుకుంటాము.సహజంగా ఇంట్లో పూజ చేసుకుంటాము.ఇంకా చెయ్యగలిగితే  రక రకాల పిండి వంటలు చేసి నివేదన పెడతాము.కానీ నిన్న గురు పౌర్ణమి మాత్రం నా జీవితంలో మర్చిపోలేనిది.ఎప్పుడు బాబా గుడికి వెళ్ళినా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావడమే కానీ హారతులు అంటే ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టగూడదు అనే ఉద్దేశ్యంతో   ఆ సమయంలో వెళితే గంట పడుతుంది అని తప్పించుకునేదాన్ని.ఈమధ్య నిర్భంద కాలంలో ప్రవచనాలు వినడంతో  సాయి హారతుల వలన మన కర్మలు తొలగుతాయని తెలిసింది.కరోనా సమయంలో రక్షణ కోసం పౌర్ణమి,అమావాస్య తిధుల్లో చేసుకోవలసిన పూజలు,హోమాలు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్లో సాయి సర్వస్వం లైవ్ ద్వారా ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకోమనడంతో నచ్చి ఆచరించడం జరిగింది.దీనితో సమయపాలన,క్రమశిక్షణ అలవడింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సాయి సర్వస్వం వాళ్ళదే ద్వారకామాయి టి.వి ద్వారా లైవ్ లో నిన్నటి గురుపుజోత్సవ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించడంతో చక్కగా పనులు చేసుకుంటూనే అన్ని హారతులు,అభిషేకాలు,స్వర్ణ పుష్పాలతో స్వర్ణ పాదుకల పూజ,యంత్ర పూజ,బాబా అష్టోత్తర శతనామావళి,సాయంత్రం నక్షత్ర హారతి,సాయికి పూలాభిషేకమ్ అన్ని చక్కగా చూడడం జరిగింది.ఇంతకీ విశేషం ఏమిటంటే మిగతా అన్ని సేవల్లో ఇంతకు ముందు పాల్గొన్నా కానీ ఐదు రకాల కేరళ పంచ వాయిద్యాలతో ఇరవై ఏడు రకాల నక్షత్ర హారతులు చూడడం,గురూజీ హారతులు ఇచ్చే విధానం అత్యంత అధ్భుతం.చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఒళ్ళంతా పులకించిపోయింది.భలేగున్నవు సాయి అంటూ పాట పడుతూ చేసే పూలాభిషేకం ఎంతో మధురం.ఆ పాట అంటే నాకూ చాలా ఇష్టం.ఏడు రోజులు ఏడు రకాల పువ్వులు తెస్తాం అంటూ లయబద్దంగా పాడుతూ ఉంటే    వింటూ బాబాను చూస్తూ భలేగున్నవు సాయి అనుకుంటూ ఆనందోత్సాహాలలో తేలియాడుతూ మానసికంగా చిన్నపిల్లలా గంతులు వేసినంత ఆనందం కలిగింది.సాయి అనుగ్రహం లేనిదే ఆయన దర్శనానికి కూడా వెళ్ళలేమని మనకు అనుభవమే కదా!టి.వి ఎక్కువగా  చూడని నేను నిజంగా సాయి అనుగ్రహంతోనే  ఈరోజు కుదురుగా కూర్చుని చూడగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ సాయికి,గ్రాండ్ మాష్టర్ సాయికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను. 

No comments:

Post a Comment