చిత్రాంజలి పేరుకు తగ్గట్లే చిత్ర విచిత్ర మనస్తత్వంతో ఎదుటి వారిని అయోమయంలోను,సంకట పరిస్థితిలోనూ పడేస్తుంటుంది.ఒక్కోసారి ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతుంది.ఒక్కొక్కసారి చిటపటలాడుతూ ఉంటుంది.ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు.మాములుగా మాట్లాడినా కూడా ఏదో తనను తిట్టేశారని కళ్ళు నులుముకుంటూ పెద్ద పెద్ద శోకాలు పెట్టి ఏడుస్తుంటుంది.చిత్రాంజలి పెళ్ళై అత్తవారింటికి వచ్చిన క్రొత్తలో ఇంట్లో వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉండేది.పాతిక ఏళ్ళు దాటినా చిన్న పిల్లల కన్నా కనాకష్టంగా మొండిగా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేది.పైగా ఎదుటి వారి మీద ఉన్నవి లేనివి కల్పించి నిజమనుకునేలాగ కథలు అల్లి చెప్పేది.అత్తారింట్లో వాళ్ళు సహనం కలవారు కనుక మన ఆడపిల్ల అయినా పరాయి ఆడపిల్ల అయినా ఒకటే అనుకుని ఎవరితో చెప్పకుండా పోనీలే తల్లి లేని పిల్ల అని కడుపులో పెట్టుకుని చూచుకున్నారు.కాలక్రమంలో ఇద్దరు బిడ్డల తల్లయింది.అయినా ఆమెలో మార్పు రాలేదు.కూతురు పుట్టగానే ఆడపడుచు కొడుకు నాలుగేళ్ళ ఆస్కార్ కిచ్చి పెళ్ళి చేస్తానని ఆడపడుచుని మాట ఇవ్వమంది.పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో? అదీ కాక మేనరికాలు చేసుకోకూడదు కదా!అంది ఆడపడుచు సాకేతిక.దాంతో చిత్రాంజలికి కోపం వచ్చి ఆస్కార్ ని అన్నయ్య అని పిలిపించడం మొదలు పెట్టింది.పిల్లలు పెద్దవాళ్ళయి పెళ్ళి వయసుకి వచ్చారు. చిత్రాంజలి మనసులో మాత్రం ఆస్కార్ కి ఎలాగైనా కూతుర్నిఇచ్చి చెయ్యాలనే పిచ్చి ఆలోచన ఉండడంతో తన కుటిల బుద్ధితో ఆస్కార్ కి వచ్చిన పెళ్ళి సంబంధాలను చెడగొట్టడం మొదలు పెట్టింది.ఇంతలో అనుకోకుండా ఆస్కార్ కి పెళ్ళి కుదిరింది.చిత్రాంజలి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అప్పుడే ఆస్కార్ పెళ్ళికి ఏమి తొందర?అంటూ నేలపై చతికిలపడి క్రింద కూర్చుని ఏడ్చి తిట్టుకుంది.ఇంట్లో వాళ్ళకు అలవాటైపోయింది కనుక ఎవరూ పట్టించుకోలేదు.పెళ్ళిలో కూడా నేను ఏడుస్తా అని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం మొదలెట్టింది చిత్రాంజలి.నువ్వు ఎందుకు ఏడవడం?అని కూతురు అడిగితే ఏమో నేను ఏడుస్తా అంతే అంది.పాతిక ఏళ్ళ నుండి ఆమెతో ఇబ్బందులు పడి ఉండడంతో విగిపోయి ఏడ్చుకో తల్లీ !ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన నీ ఏడుపు ఊరందరికీ తెలిసి నీ వీపుకు తాటాకులు కడతారు అనుకుని చిత్రాంజలి అజ్ఞానానికి,మూర్ఖత్వానికి ఆడపడుచు సాకేతిక మనసులోనే తిట్టుకుంది.
No comments:
Post a Comment