Friday 16 October 2020

అనుకోని అతిథి

                                                                            ఒకరోజు మధ్యాహ్నం యుతిక హాలులో సోఫాలో కూర్చుని ప్రక్కన  ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా స్నేహితురాలితో చరవాణి లో బాతాఖానీ కొడుతోంది.చిన్ననాటి కబుర్లతో పాటు పాత స్నేహితురాళ్ళు,కొత్త స్నేహితురాళ్ళ  గురించి గుక్క తిప్పుకోకుండా  రెండు గంటలపాటు సంభాషణ అలా అలా సాగిపోయింది.ఈ లోపు ప్రధాన ద్వారపు మెష్  తలుపు తీసి ఉండడంతో ఒక ఉడుత హడావిడిగా లోపలికి వచ్చి క్రింద పడిన గింజలు ఏరుకుని తిని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అనే వెతుకులాటలో యుతిక కూర్చున్న సోఫా క్రిందికి వచ్చినప్పుడు అనుకోకుండా ఉడుత తోక యుతిక చీరకు తగలడంతో ఏమి వచ్చిందో ? అని కంగారుపడి యుతిక సంభాషణ ఆపి క్రిందకు చూసేసరికి ఉడుత తోక కనబడింది.మళ్ళీ ఫోను చేస్తాను అని స్నేహితురాలికి చెప్పి ఎటు వెళ్లిందో చూద్దామనుకుంటే కన్ను మూసి తెరిచే లోపే ప్రక్కింటి చెట్టు మీద పరుగెత్తుతూ కనిపించింది.ఇంతకీ అదెలా వెళ్ళింది అంటే వాకిలి ముందున్న  వేప చెట్టు కొమ్మలు యుతిక వరండాలోకి రావడంతో వాటి మీదుగా ప్రక్కింట్లో ఉన్నచెట్టుమీదికి దూకిందన్నమాట.రోజూ యుతిక తులసి మొక్కకు పూజ చేసి లోపలకు రావడం ఆలస్యం ప్రసాదం,అక్షింతలు తినడం ఉడుత దినచర్య.మొదట్లో యుతిక పిట్టలు తింటున్నాయేమో అని  అనుకుంది.ఒకరోజు యుతిక కాపలా కాసి మరీ ఈ విషయాన్ని కనిపెట్టింది.ఇంతకుముందు చరవాణి లో సంభాషణ ఆగిపోయింది కదా! మళ్ళీ చేసి స్నేహితురాలికి మా ఇంటికి ఈరోజు ఒక అనుకోని అతిథి వచ్చిందోచ్  అంటూ  కాసేపు ఉడుత కబుర్లు చెప్పింది. 

               

No comments:

Post a Comment