Sunday, 26 September 2021

స్నేహం అనే ముసుగు

                                             ఒకరోజు మిహిత భర్తతో కలిసి సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళింది.దారిలో స్నేహితురాలి ఇంటికి వెళ్తే చీకటి పడిపోతుంది కనుక నువ్వు వాళ్ళ ఇంటి వైపు చూడకుండా వచ్చెయ్యమని ముందే హెచ్చరించడంతో తల దించుకుని వచ్చేస్తుండగా స్నేహితురాలి భర్త చరవాణిలో మాట్లాడుతూ వీళ్ళను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.చిన్ననాటి స్నేహితురాలు కావడంతో కాదనలేక మిహిత,భర్తతోసహా తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.వెళ్ళిన కాసేపటికి అమ్మా కూతుళ్ళు ఇద్దరూ చేతితో సైగలు చేసుకుని అమ్మ వంటగదిలోకి వెళ్ళి ఒక నిమ్మకాయ తీసుకుని వచ్చి నీకోసం ఒకటి చెట్టు నుండి రాలింది.రసం తీసుకుని త్రాగమని బలవంతంగా అరచేతిలో పెట్టి వద్దని చెప్పినా వినకుండా చెయ్యి మొత్తం నిమ్మకాయతో రుద్దింది.అంతకు ముందు రోజు గుంటూరు జిల్లా 'కాకాని' వెళ్లి రాహుకాల పూజ చేయించుకుని వచ్చింది.సంకల్పం ఆరోగ్యం బాగుండాలని చెప్పుకుంటే పూజారి అందరూ డబ్బు కావాలని కోరుకుంటారు.నువ్వేంటి?ఆరోగ్యం కావాలంటున్నావు?అని అడుగగా రెండు సంవత్సరముల నుండి ఆమె,ఆమె కుటుంబం మానసిక సమస్యతో బాధ పడుతున్నామని చెప్పిందట.ఆదివారం సాయంత్రం రాహుకాలంలో ఒక పరిహారం చెయ్యమని చెప్పాడట.ఆ విషయం మిహితకు చెప్పకుండా నిన్ను బాబాగారే నా దగ్గరకు పంపి ఉంటారు అంది.అప్పటికీ మిహితకు అనుమానం రాలేదు.అమ్మ నిమ్మకాయ చేతిలో బలవంతాన పెట్టి రుద్దింది.కూతురు రవికల ముక్క పళ్ళు తెచ్చి బొట్టు పెట్టి చేతిలో పెట్టింది.అసలే మిహితకు రాహుకాలం అంటే పట్టింపు.నిమ్మకాయ మేజాబల్ల పై పెట్టి వస్తుంటే అమ్మా కూతుళ్ళు మొహం మాడ్చుకున్నారని బయట పడేయవచ్చులే అని తెచ్చి ఎవరూ తొక్కని స్థలంలో పడేసింది మిహిత.ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే చెయ్యి జిగురుగా దురదగా అనిపించింది.అప్పుడు మిహితకు అనుమానం వచ్చింది.పూజారి దోష పరిహారం చెప్పి ఎవరికైనా ఇస్తే మీ దోషాలు పోతాయని చెప్పి ఉంటాడని మిహిత వెంటనే సిద్ధాంతికి కబురు చేసి విషయం చెప్పగా ఒక నిమ్మకాయ తెచ్చి బలవంతంగా పెట్టడమనేది అనుమానాస్పదంగా ఉంది.మీకు ఏమైనా తేడాగా ఉంటే రాహుకాలంలో రాహుకేతువుల పూజ చేసి,అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి అని చెప్పారు.స్నేహం అనే ముసుగులో తన బాధలు పోవడం కోసం చిన్ననాటి స్నేహితురాలు అలా చేసేసరికి మిహితకు చాలా బాధ అనిపించింది.పైగా బాబాను అడ్డుపెట్టుకోవడం తెలివితక్కువతో  కూడిన మూర్ఖత్వం అని మిహిత భావించి ఆవిధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని స్నేహితురాలిని తిరిగి  అడగాలని కూడా అనిపించనంత విరక్తి వచ్చేసింది.స్నేహంలో కూడా ఇంత స్వార్ధం  దాగి ఉండదాన్ని మిహిత మొదటిసారి  చవిచూసింది. 

సూచన:ఏదైనా దోష పరిహారం చేసుకోవాలంటే అవి చెయ్యడానికి,తీసుకోవడానికి వేరే వాళ్ళు గుడిలో అందుబాటులో ఉంటారు.వాళ్ళను సంప్రదిస్తే ఏర్పాటు చేస్తారు.దయచేసి తెలిసో తెలియకో ఎవరో చెప్పారని స్వార్ధంతో ఇటువంటి పనులు చేసి స్నేహం అనే ముసుగులో స్నేహితులను,బంధువులను ఎవరూ ఎవరినీ ఇబ్బందుల్లో పడేయకండి. అంతకన్నా దోషం మరొకటి ఉండదు.పాత ఇబ్బంది తొలగే బదులు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవడమే  కాక  స్నేహం, బంధుత్వాలు చెడిపోతాయి.ఉన్న విలువ,గౌరవం పోగొట్టుకుంటారు.స్నేహితులైనా,బంధువులైనా ఎవరైనా ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త. 

Monday, 23 August 2021

పెంచిన ప్రేమ

                                                                  ఒక నలభై సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు పిల్లలకు ప్రేమతో మగ పిల్లలను 'మయ్య' కదు తినయ్యా! అని,ఆడ పిల్లలను 'మమ్మ' కదు తినమ్మా అని అంటూ మురిపెంగా గోరు ముద్దలు తినిపించేవారు.ఇప్పటికి చిన్నప్పుడు అక్క పిల్లలను పెంచిన ప్రేమతో ధీరజ్ పిన్ని సవిత ధీరజ్ ని 'మయ్య' అనే అంటుంది.ఇప్పుడు ధీరజ్ వృత్తి పరంగా సాంకేతిక నిపుణుడు.అమెరికాలో ఒక పెద్ద సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నాడు.విదేశాలలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారోజువారీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోక  తప్పదు.అక్కడ అది సర్వ సాధారణం అని సవితకు కూడా తెలుసు.అయినా 'మయ్య ' ఇంటా బయటా కూడా ఎంతో కష్టపడతాడు పాపం అని సవిత తన స్నేహితురాళ్ళకు చెప్పి పెంచిన ప్రేమ కదా ! అందుకే నాకు  బాధగా ఉంటుంది అని జాలి పడుతూ ఉంటుంది. 

Friday, 20 August 2021

వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

                                                               శ్రావణ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమే.కానీ స్త్రీలకు మంగళ వారం మంగళ గౌరీ  నోములు,శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలకు ఎంతో ప్రత్యేకం.స్త్రీలకు సకల సౌభాగ్యాలను ఇచ్చే వరలక్ష్మి వ్రతం చూచిన వారికి పుణ్యం.చేసిన వారికి సౌభాగ్యం.అలాంటి సకల సౌభాగ్యాలను కలిగించే వరలక్ష్మి దేవి మనందరికీ సకలైశ్వర్యాలను,భోగభాగ్యాలను,సంపూర్ణ ఆయురారోగ్యలను,మానసిక ప్రశాంతతను ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ  వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.ఈ గడ్డు కాలంలో ముత్తైదువలు ఎవరూ రాకపోయినా అమ్మవారికి వాయనం ఇచ్చుకుని ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఉత్తమం.

Tuesday, 13 July 2021

కూరలో కరివేపాకు

                                                        కూరలో కరివేపాకు వెయ్యనిదే కూరకు రుచి,మంచి సువాసన ఉండదు.రోటి పచ్చళ్ళకు,నిల్వ పచ్చళ్ళకు,సాంబారు,రకరకాల చారులకు అయితే కొంచెంఎక్కువ  కరివేపాకుతో తాలింపు వేస్తేనే ఘుమఘుమలాడుతూ నోరూరిస్తాయి.ఇంతా చేసి తినేటప్పుడు చాలామంది కూరల్లో,పచ్చళ్ళలో కరివేపాకును ఏరి ప్రక్కన పడేస్తుంటారు.ఇదే విధంగా కొంతమంది ఎదుటి వారిని తమ అవసరాలు తీరేవరకు విసిగించి,వేధించి,బ్రతిమాలి,బామాలి తమ అవసరాలు తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకును తీసేసినంత తేలిగ్గా తీసిపడేస్తుంటారు అంటే తేలిగ్గా ఆ  ఏమి సహాయం చేసారులే అంటారు.కూరలో కరివేపాకును  ఏరేస్తే దానిలో ఉన్న పోషక విలువలు మనకు పూర్తిగా అందవు.కనుక  రెండు చెడ్డ అలవాట్లే.సహాయం చేసిన వారిని మర్చిపోతే అవసరమైనప్పుడు మరల సహాయం అందకపోవడమే కాక అంతకు ముందు ఉన్న విలువ తగ్గిపోతుంది.సహాయం  చేసిన వారు అయ్యో!ఇదేమిటి వీళ్ళ కోసమా!మనం ఇంతా కష్టపడి ఎన్నో పనులు మానుకుని మన సమయాన్ని,డబ్బుని వృధా చేసుకున్నాము అని మనసులో బాధ పడతారు.కూరలో కరివేపాకును  ఏరేస్తే కరివేపాకుకు,సహాయం చేసిన వారిని మర్చిపోతే సహాయపడిన వాళ్ళకు నష్టం ఏమీ ఉండదు.ఆ విధంగా ఏరేసిన వారికే నష్టం.అందు వలన ఎన్నో పోషక విలువలు ఉన్న కరివేపాకును, సహాయం చేసిన వారిని కూడా తీసిపడేయడం మనకే శ్రేయస్కరం కాదు.

Sunday, 11 July 2021

వర్షాకాలంలో ఆరోగ్యంగా

                                                                         వర్షాకాలంలో రోజుకి ఒకసారైనా ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంటుంది.వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా కాఫీనో,టీనో త్రాగాలని అనిపిస్తుంది. వాటికి ప్రత్యామ్నాయంగా కారట్,మునగాకు,టమోట,పాలకూర,క్యాబేజ్ సూపులు, ఆకులు, పువ్వులు,పొడులతో రకరకాల కషాయాలు తీసుకోవచ్చు.రకరకాల రుచులు,సువాసనలతో మనసుకు ఆహ్లాదంతోపాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందచేస్తాయి.వేడి నీటిలో మన వంట ఇంటిలో దొరికే జీరా,దాల్చిన చెక్క,ధనియాలు,వాము,సోంపు వేయించి చేసిన పొడులు,శొంఠీ పొడి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చిటికెడు పొడి నుండి  1/4 చెంచా వరకు వేసి 2 ని.ల తర్వాత త్రాగాలి.ఇవే కాక మన పెరటిలో దొరికే కొత్తిమీర,పుదీనా,కరివేపాకు,తమలపాకు,వాము ఆకు కూడా కప్పు వేడి నీటికి 5,6 ఆకులు చొప్పున వేసుకుని వేడిగా త్రాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.తాజాగా మందార,శంఖు పువ్వులు,చామంతి,బిళ్ళ గన్నేరు,మునగ పువ్వుల టీ కూడా తీసుకుంటున్నారు.కొంచెం,కొంచెం అల్లం తురుము,వెల్లుల్లి తురుము కూడా నీటిలో వేసి వేరు వేరుగా మరిగించి ఎవరికి నచ్చిన విధంగా వారు తీసుకుంటున్నారు.పాలతో చేసిన కాఫీ,టీ బదులు వీటిలో ఏది తీసుకున్నా బరువు పెరగకుండా ఉండడంతో పాటు వ్యాధి  నిరోధక శక్తి  పెరిగి  ఆరోగ్యంగా ఉంటాము.                                                     

Saturday, 10 July 2021

కరక్కాయ్

                                                          పొరుగింటి  తేజ వయసు పదేళ్ళు.కానీ తన తోటి వాళ్ళను,పెద్ద  వాళ్ళను కూడా ఏది పడితే అది ఏమైనా అనుకుంటారో,బాధ పడతారో అనుకోకుండా గేలి చేస్తుంటాడు.తప్పు ఆ విధంగా  చెయ్యకూడదు అని చెప్పినా ఒకటి రెండు రోజులు ఊరుకున్నా షరా  మామూలే.ఒకరోజు తేజ కరక్కాయ్,కరక్కాయ్ అని ఎవరినో  పిలుస్తున్నాడు.పనివాళ్ళను కూడా చీపురు లాక్కోవడం,సబ్బు లాక్కోవడం వంటి పనులు చేసి విసిగిస్తుంటాడు.ఈ సారి వీడికి ఎవరు  దొరికారోనని చూస్తే వాడి నాయనమ్మ.ఇంతకీ అసలు విషయం ఏమిటి? అంటే తేజ అమ్మ బయటికి వెళ్లిందట.తేజ వాళ్ళు  పై అంతస్తులో ఉంటారు.క్రింద నాయనమ్మ వాళ్ళు ఉంటారు.తేజా కరక్కాయ ఒకటి ఇంట్లో నుండి తీసుకురారా అని నాయనమ్మ క్రింద నుండి కేక వేసింది.కరక్కాయ అంటే ఏంటో కూడా వాడికి తెలియదు. తెలియదని చెప్పకుండా లేదు అని అబద్దం చెప్పేసరికి నాయనమ్మకు కోపం వచ్చి ఈ సారి క్రిందికి వచ్చి ఏమైనా ఉంటే తినడానికి పెట్టు నాయనమ్మా !అని అడిగినప్పుడు నీ పని చెప్తాను అని కోపంగా అందట.దీనితో తేజ నాయనమ్మను కరక్కాయ్,కరక్కాయ్ అని పిలవడం మొదలెట్టాడు.మనవడంటే నాయనమ్మకు చాలా ఇష్టం.అందుకే నాయనమ్మ మురిపెంగా పోరా అబద్దాలు చెప్పడమే కాకుండా నీ పిలుపులు నువ్వూ మీ అమ్మకి చెప్తాను ఉండు అంటుంది.పెద్దవాళ్ళు పిల్లలు అంటే ఎంత ఇష్టం ఉన్నా తప్పుని తప్పు అని వాళ్లకు అర్ధమయ్యే రీతిలో చెప్పి చెడ్డ అలవాట్లు మానిపించాలి.పిల్లలంటే ప్రేమ ప్రేమే క్రమశిక్షణ క్రమశిక్షణే.అలా అని పిల్లల్ని మరీ ఇబ్బంది పెట్టకుండా వారితో స్నేహంగా ఉంటూనే మంచి పద్దతులు నేర్పితే ముందు ముందు వారికీ మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.

పొన్నగంటి ఆకు పచ్చడి

పొన్నగంటి ఆకు -  2 పెద్ద కట్టలు  

ఎండు మిరపకాయలు  - 12  పెద్దవి 

పచ్చి మిరపకాయలు - 4 

మినప గుళ్ళు - 2 పెద్ద చెంచాలు 

పచ్చి శనగ పప్పు - 2 పెద్ద చెంచాలు 

ధనియాలు  - 2 పెద్ద చెంచాలు 

జీలకర్ర - 1 పెద్ద చెంచా

నువ్వులు - 2 పెద్ద  చెంచాలు  

చింత పండు - పెద్ద నిమ్మకాయంత 

వెల్లుల్లి పాయ - 1 

  తాలింపు కోసం :

ఎండు మిర్చి - 2 

ఆవాలు - 1 చెంచా 

మినప్పప్పు - 1 చెంచా

 శనగపప్పు - 1 చెంచా 

మెంతులు - 1 చిన్న చెంచా 

 వెల్లుల్లి  ముక్కలు - 1 చెంచా

జీలకర్ర - 1/2 చెంచా 

ఇంగువ - కొద్దిగా 

కొత్తిమీర - 1 చిన్న కట్ట 

కరివేపాకు  - 2 రెమ్మలు 

                                                    ముందుగా పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.ఒక బాణలిలో ఎండు మిర్చి,పప్పులు,ధనియాలు,జీలకరర,నువ్వులు విడివిడిగా నూనె లేకుండా మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి.బాణలిలో ఒక చెంచా నూనె వేసి పచ్చి మిర్చి వేయించి తీసి దానిలోనే పొన్నగంటి కూర కూడా వేసి నీరు పోయే వరకు వేయించాలి.నువ్వులు,పచ్చి మిర్చి,పొన్నగంటి ఆకు తప్ప మిగిలిన పదార్ధాలు మిక్సీ లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.తర్వాత నువ్వులు వేసి మెత్తగా చేయాలి. చివరగా వెల్లుల్లి, వేయించిన ఆకు నానబెట్టిన చింతపండు,పచ్చి మిర్చి వేసి కొద్దిగా వేడి నీరు పోసి మెత్తగా లేదా కచ్చాపచ్చాగా నచ్చిన రీతిలో పచ్చడి చేసుకోవచ్చు.ఈలోగా బాణలిలో ఒక పెద్ద చెంచా నూనె వేసి కాగిన తర్వాత వరుసగా ఎండు మిర్చి,ఆవాలు,పప్పులు,మెంతులు,వెల్లుల్లి ముక్కలు,కొద్దిగా ఇంగువ వేసి కరివేపాకు కూడా వేసి వేయించి చివరగా కొత్తమీర వేసి దానిలో పొన్నగంటి పచ్చడి కూడా వేసి ఒకసారి  కలియతిప్పి పొయ్యి మీద నుండి దించేయాలి. అంతే కమ్మటి పొన్నగంటి పచ్చడి తయారయినట్లే.వేడి వేడి అన్నంలో కొంచెం మంచి నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.పొన్నగంటి ఆకుతో చాలా రకాల కూరలు,పచ్చళ్ళు చేసుకోవచ్చు.అన్నట్లు నేను ఈ ఆకుతో పకోడీ కూడా వేశాను. చాలా రుచిగా ఉన్నాయి.పొన్నగంటి  ఆకు కంటి చూపును మెరుగు పరుస్తుంది. దృష్టి లోపం రాకుండా  కాపాడుతుంది.అందుకే పిల్లలకు చిన్నప్పటి నుండి తినడం అలవాటు చేస్తే కంటికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి.  

 

Wednesday, 7 July 2021

రేయ్ నీకు రాసిందే

                                                               అమృత వల్లి జేజి తాత (అమమ్మ నాన్నగారు) గారు అంటే ఆ రోజుల్లో ఊరిలో అందరికీ ఎంతో గౌరవం తోపాటు కించిత్తు భయం,భక్తి.ఆయన ఆరడుగుల ఎత్తుతో అందంగా,హుందాగా,గంభీరంగా చూడగానే చేతులెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉండేవారు.  కొడుకులు,కూతుళ్ళు,మనవళ్ళు,మనవరాళ్ళు ఏ పని చేయలన్నా ఆయనను సంప్రదించిన తర్వాత ఆయన అనుమతితోనే చేసేవారు.వీరితోపాటు ఇరుగుపొరుగు,బంధువులు,ఊరిలో అందరూ  ఆయన సలహా కోసం వచ్చేవారు.మామూలుగా ఎంత శాంతంగా,ప్రేమగా ఉండేవారో  కోపం వస్తే ఆయనతో మాట్లాడడానికి జేజిమ్మతో సహా అందరూ వణికి పోయేవారు.ఏదైనా నచ్చని పనులు,చెడ్డ పనులు చేసినప్పుడు "రేయ్ నీకు రాసిందే"అని చూపుడువేలు చూయించి కళ్ళు ఎర్రగా చేసేవారు.ముని మనవళ్ళు మనవరాళ్ళకు అయితే భయంతో లాగులు తడిచి పోయేవి."రేయ్ నీకు రాసిందే "అనే ఒక్క మాటతో జేజిమ్మతో సహా ఎవరిని అంటే వాళ్ళ కళ్ళ వెంట ధారగా నీళ్ళు కారిపోయేవి.ఆ రోజుల్లో పెద్దలంటే అంత గౌరవం,భక్తి,ప్రేమ.ముని మనవరాళ్ళూ ,మనవళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా కథలుగా చెప్తూ జేజి తాత గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు .

Monday, 5 July 2021

నేరేడు

                                                                 వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో నేరేడు పండు ఒకటి.తీపి పులుపు,వగరు కలిసిన రుచితో నోట్లో వేసుకోగానే ఇట్టే  కరిగిపోతుంది.నేరేడు పండు ఎన్నో పోషకాల  గని.ఆరోగ్య ఫల ప్రదాయిని.కాయలే కాక గింజలు,ఆకులు,బెరడు అన్నీ ఆరోగ్యానికి చాలా  మంచిది.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా  ఒకసారైనా ఈ పండు తినాలని పెద్దల సలహా.శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడంతో పాటు గుండెకు చాలా మంచిది.గింజల పొడి,కాయలు మధుమేహాన్ని నియంత్రించడంలో దిట్ట.పంచదార,కొద్దిగా నీరు,నేరేడు కాయలు వేసి ఉడికించి గుజ్జును నిల్వ చేసుకోవచ్చు.ఇష్టమైన పండు అని ఎక్కువగా తింటే విరేచనాలు పట్టుకుంటాయి.కనుక మితంగా తినడం మంచిది.రోడ్డు మీద అమ్మేవాళ్ళు కాయలు మెరుస్తూ కనబడడం కోసం మైనం పూత వేస్తారు కనుక తినే ముందు గోరు వెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసి కాసేపు నానబెట్టి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి.అన్నట్లు తెల్ల నేరేడు కాయలు కూడా వస్తున్నాయట.నేనైతే తినలేదు.ఏ రంగులో ఉన్నా నేరేడు పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అందు వలన నేరేడు పండ్లు వచ్చే కాలంలో తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Sunday, 4 July 2021

బోడ కాకర

                                                                                 కాకర కాయలు అనేక రకాలు ఉన్నాకూడా వర్షాకాలంలో కొద్ది రోజులు మాత్రమే  మనకు దొరికే కాయ బోడ కాకరకాయ లేదా ఆకాకర కాయ చాలా  ప్రత్యేకమైనది .దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇది అనేక వ్యాధులకు దివ్య ఔషధం.జుట్టు రాలడం,తల నొప్పి తగ్గడంతో పాటు మధుమేహం,రక్తపోటు వంటివి అదుపులో ఉంటాయి.ఈ కాయలతో చేదు లేకుండా నువ్వులు,పల్లీలు,పుట్నాల పప్పుల పొడులు వేసి రకరకాల వంటలు చేయవచ్చు.చాలా రుచిగా కూడా ఉంటాయి.మరెన్నో  ఉపయోగాలు ఉన్న ఈ బోడ కాకరకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.కాయలే కాక ఆకులు,కాడలు,వేర్లు, పువ్వులు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.ఈ ఆకుల పసరు విష జంతువులు,పురుగులు కుట్టిన చోట వచ్చే వాపు,దురదలను తగ్గిస్తుంది.

Saturday, 12 June 2021

మతిమరుపు దరిచేరకుండా ......

                                                                    ప్రకృతి విపత్తులతో వచ్చే ఆర్ధిక ఇబ్బందులే కాక అధిక ఆలోచనలతో వచ్చే ఒత్తిడి కారణంగా వయసుతో  నిమిత్తం లేకుండా చాలామంది మతిమరుపు వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.చిన్నప్పటి నుండి పిల్లలకు ఏ పరిస్థితులను అయినా తట్టుకోనగలిగేలా స్థిరంగా ఆలోచించగలిగే విధంగా,దీనితోపాటు ఆర్ధిక నిర్వహణ కూడా పెద్దలు నేర్పించాలి.అంతే కాకుండా పిల్లలకు సమతులాహారంతోపాటు,సమయపాలనను ,ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటుచేసి పెద్దలు కూడా పాటిస్తూ ఉంటే ఎంత వయసు మీదపడినా ఆలోచనాశక్తి  తగ్గదని,మతిమరుపు రాదనీ పరిశోధనలు తెలియచేస్తున్నాయి.ఏభై సంవత్సరాలు వచ్చినాయంటే ఇంక ఏముంది మా వల్ల ఏమీ కాదు మేము ఏ పనీ చేయలేము విశ్రాంతి తీసుకోవడమే అని అనుకునే వాళ్ళకి మతిమరుపు త్వరగా వచ్చేస్తుందట.హుషారుగా ఉంటూ మేము ఇంకా చిన్నవాళ్ళమే ఏ పనైనా ఇట్టే చేయగలము అనుకునే వాళ్ళకి మతిమరుపు రాకుండా డెభై ఏళ్ళ వయసు వచ్చినా చివరి వరకూ చురుగ్గా ఉంటారట.అందువల్ల మనము అందరమూ హుషారుగా ఉంటూ చకచకా పనులు చేస్తూ ప్రకృతిని,పెద్దలను ప్రేమిస్తూ,గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మంచి మంచి అలవాట్లతో  ఉత్సాహంగా ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆపదలో ఉన్న వారికి చేతనైన  సహాయం చేస్తూ,శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ సంపూర్ణ  ఆరోగ్యంతో మతిమరుపు దరిచేరకుండా పూర్ణ ఆయుషుతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

Sunday, 21 February 2021

నా మాటే శాసనం

                                                                           డెబ్భై సంవత్సరాల రవీంద్ర గారు అంత నాకే తెలుసు అనుకుంటారు.నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అనుకుంటారు .దీనికి తోడు భార్య ఒక నెరజాణ.జ్ఞాని  అనబడే అజ్ఞాని.ఆమె చెప్పిందే వేదం అంటారు రవీంద్రగారు.భర్తను గుప్పెట్లో పెట్టుకుని ఆమెకు ఎవరిపై కోపం ఉంటే వాళ్ళను పోట్లాడమని తను రోట్లో రోటి పచ్చడి చెయ్యడం అలవాటు.వయసు పెరిగినా ఆమెలో ఆ చెడ్డ గుణం పోలేదు. పెద్దవాళ్ళనే  గౌరవంతో ఫోను చేసి మరీ తిట్టినా ఎవరూ ఎదురు చెప్పరు.పెద్దవాళ్ళను ఏమీ అనకూడదు కనుక ఎదురుగా ఏమీ అనలేక  తర్వాత చాటున అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటారు.అది వేరే విషయం.కాలం మారింది మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అని అర్ధం చేసుకోవడం లేదు.పెద్దవాళ్ళుగా మంచి సలహాలు ఇవ్వడం ఎవరికైనా బాగానే ఉంటుంది.ఒక్క రవీంద్ర గారే కాదు పెద్దవారు ఎవరైనా  ప్రతి విషయంలో తలదూర్చి నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అని అనుకోకూడదు.ఎవరికి వారికి వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలూ ఉంటాయి కదా!అందువలన పెద్దలు కూడా ఈ తరం వాళ్ళను అతిగా విసిగించి ఉన్న విలువ పోగొట్టుకోవటం కన్నా అడిగిన వాళ్ళకు సలహాలు ఇచ్చి ఆధ్యాత్మికంగా ఎదిగితే చివరి దశలో ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు.అప్పుడు అందరూ మనస్పూర్తిగా ఇష్టపడతారు.లేకపోతే వీళ్ళ గోల ఏమిటో?వీళ్ళు ఎప్పుడుపైకి పోతారురా బాబూ? అని కొంతమంది ఎదురు చూస్తుంటారు.కనుక ఈరోజుల్లో పెద్దలే కాదు ఎవరైనా వారి పరిధిలో వారు ఉండడం మంచిది.

జీవితం మన చేతిలోనే

                                                                 పునర్నవి  చిన్నప్పటి నుండి  అతిగా గారాబం చేయడంతో  మొండితనంతో పాటు గర్విష్టి అయింది.ఇంట్లో ఆడింది ఆట,పాడింది పాట కావడంతో అమ్మా నాన్నలకు మా చిట్టి (ముద్దు పేరు) చెప్పిందే వేదం అని డు డు బసవన్నలా తలలు ఊపడం అలవాటు అయిపోయింది.చదువుతోపాటు అదృష్టం కూడా  కలిసి రావడంతో వయసుతో పాటు మహా గర్వం కూడా పెరిగింది.తన స్వార్ధం తన ఎదుగుదల తప్ప వేరే ధ్యాస ఉండదు.ఈ క్రమంలో ఎవరినైనా అణగతొక్కేయ్యడానికి వెనకాడదు.పైకి నెమ్మదిగా ఉన్నట్లు కనిపించడంతో మంచి అమ్మాయి అనుకుని బుట్టలో పడిపోతారు జనం.ఆమెలో ఉన్న ఇంకొక కోణం అర్ధం చేసుకునేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది.ఎప్పుడూ కాలం ఒకే రకంగా మనకు అనుకూలంగా ఉండదు కదా!అదృష్టం మన ముందు,మన వెన్నంటే ఉంటుందని విర్రవీగి కళ్ళు నెత్తి మీదకు తెచ్చుకుంటే ఆ తలుపు తట్టిన అదృష్టం ఒక్కొక్కసారి వెనక్కు వెళ్ళిపోతుంది. పునర్నవికి ఇప్పుడు  అదే పరిస్థితి ఎదురైంది.  ప్రేమించానంటే మా కూతురు తెలివిగలది కనుక మంచి అల్లుడు వెదకకుండా దొరికాడని అమ్మానాన్న మురిసిపోయారు.పెళ్ళై అత్తవారింటికి వెళ్ళినా నా ఇష్టం నాది నేను ఎప్పుడూ లేచినా ఏమి చేసినా మా ఇంట్లో ఏమీ అనరు అందరూ నేను  చెప్పినట్లు వింటారు మీరు కూడా విని డుడు బసవన్నల్లా తలలు ఊపాలి,నన్ను మా అమ్మా నాన్నలను సవరదీయాలి  అన్నట్లు ప్రవర్తిస్తుండడంతో అత్తింటి వారు సంస్కారవంతులు కావడంతో  కొడుకు ఇష్టపడ్డాడు కనుక మనసు బాధ పెట్టకూడదని,గొడవలు పడకూడదని తనే పద్దతులు తెలుసుకుంటుందిలే అని ఊరుకున్నారు.ఎన్నాళ్లున్నా ఆమెలో మార్పు రాలేదు.దానితో పునర్నవి అత్తింటి వారి మనసులో స్థానాన్ని సంపాదించుకోలేక పోయింది.అదే అణకువతో ఉంటే ఆమె తలుపు తట్టిన అదృష్టాన్ని  సఫలీకృతం  చేసుకుని అందరి గుండెల్లో నిలిచిపోయేది.ఇది ఒక పునర్నవి విషయమే కాదు.ఈరోజుల్లో నూటికి అరవై మంది గొడవలు పడి విడాకుల వరకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంస్కారవంతులు కాకపోతే తల్లిదండ్రుల పెంపకాన్నే వేలెత్తి చూపుతారు.పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు దానితోపాటు చిన్నప్పటి నుండి బంధాలు,బాంధవ్యాల విలువలు క్రమశిక్షణ,సంస్కారం నేర్పితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.జీవితం అంటే భర్త,భార్య,పిల్లలు మాత్రమే కాదు. భర్త  తరపువారు,భార్య తరపువారు మనమంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడే జీవితం ఆనందంగా సాగిపోతుంది.కుటుంబంతో సంతోషంగా ఉంటే ఆరోగ్యం,డబ్బు కూడా పుష్కలంగా ఉంటాయి.జీవితం ఆనందంగా ఉండాలన్నా,నిస్సారంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది.                           

Monday, 25 January 2021

జాతీయ పండుగ

                                                                 మన భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అందరూ  కలిసి కట్టుగా ఉండడమే మన సంప్రదాయం.అందులో మన దేశానికి రెండు కళ్ళు రైతులు,సైనికులు .దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో  ప్రకృతి విపత్తుల వలన కానీ,మానవ తప్పిదాలవలన కానీ  వారికి సరైన  ప్రతిఫలం లభించడం లేదు. ఏది ఏమైనా ఇప్పటి నుండి అయినా  భగవంతుని దయవలన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ,భారతీయురాలిగా పుట్టినందుకు గర్విస్తూ,మన దేశాన్ని ప్రేమిస్తూ మన భారతీయులందరికీ జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.             

తామర గింజలు

                                                           తామర గింజలు మనకు ప్రకృతి ప్రసాదించిన పరమౌషధం అని ఈమధ్యనే  తెలిసింది.ఎప్పుడన్నా ఒకసారి వాడడమే కానీ వీటి ప్రయోజనాలు అంతగా తెలియక పోవడంతో వీటిని ఎక్కువగా వాడుకోము.కానీ వీటిలో ఎన్నో పోషకాలతోపాటు వయసు మీద పడనీయని ఎంజైమ్ పుష్కలంగా ఉండడంతో చర్మం మృదువుగా ఉంటుందట.నిద్రలేమిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుందని,రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును నియత్రణలో ఉంచుతుందని తెలిసింది.దీనిలో కాలరీలు తక్కువ వుండి పీచు ఎక్కువ ఉండడంతో ఆకలి తగ్గి బరువు తగ్గడంతోపాటు చక్కర వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి  దోహదపడుతుంది.వీటిని నేతిలో వేయించి కొద్దిగా ఉప్పు,కారం చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.ఫూల్ మఖానా అని పిలువబడే వీటిని ఎన్నో రకాల వంటలలో ఉపయోగించుకోవచ్చు.

Tuesday, 12 January 2021

పెద్ద పండుగ శుభాకాంక్షలు

                                  సంక్రాంతి పండుగ అంటేనే మూడు  రోజుల పెద్ద పండుగ.భోగి,సంక్రాంతి,కనుమ.ఎన్నెన్నో పండుగ సంబరాలు.పిల్లలకు,పెద్దలకు కూడా ఎంతో హడావిడి.ఈ హడావిడిలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు పెద్ద పండుగ అయిన భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. 

నిండు కుండ

                                                 చరవాణిలో వార్తలు చూస్తున్న జయంతిని ఒక వార్త ఆకర్షించింది.  భూమి తన చుట్టూ తాను వేగంగా తిరగటం వలన 365 రోజుల కన్నా ఎక్కువ రోజులు పడుతుందని దీనితో రోజులో సమయం తగ్గడంతో రోజు త్వరగా గడిచిపోతుందని దీని గురించి ఆందోళన చెందుతూ ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారట అన్న వార్త  జానకిని ఆకర్షించింది? ఒకప్పుడు స్కైల్యాబ్ భూమిపై పడి అందరూ చనిపోతారని  చెప్పడంతో  అందరూ భయపడి ఎలాగూ చనిపోతామని ఉన్నన్నాళ్ళు దర్జాగా బ్రతుకుదామని ఉన్న ఆస్తులు అమ్మేసుకుని మరీ జల్సాలు చేశారు.చివరికి అది సముద్రంలో పడడంతో హమ్మయ్య బ్రతికిపోయాం అని ఊపిరి పీల్చుకున్నా ఆస్తులు అన్నీ అమ్మేసుకోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు.అందుకే ఏ వార్త విన్నా అతిగా కంగారుపడి ఆందోళన చెందడం అనవసరం.ఎప్పుడో ఏదో జరుగుతుందని మనం ఇప్పటినుండే కంగారుపడి అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవడం  కూడా అనవసరం.ప్రశాంతంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ మానసికస్థైర్యాన్ని,ధైర్యాన్ని ప్రసాదించాలని నిర్మలమైన మనసుతో భగవంతుని ప్రార్ధించడం ఉత్తమం.అందరూ బాగుండాలి.అందరితోపాటు మనము బాగుండాలి.ఏది ఎప్పుడు?ఎలా?జరగాలో అలాగే  జరుగుతుంది.ఆందోళన పడడం వలన ప్రయోజనం శూన్యం.కనుక సానుకూల దృక్పధం అలవరచుకుంటే జీవితం  నిండు కుండలా ఎప్పుడూ తొణకకుండా ఉంటుంది.