సాహ్ని వైద్య విద్య అభ్యసిస్తుండగా తనతోపాటు చదువుకునే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అన్నింటికీ తొందరే అన్నట్లు పెళ్ళైన వెంటనే గర్భం దాల్చింది.ఎలాగో ఇద్దరూ చదువుకుంటూనే డెబ్బై అయిదేళ్ళ నానమ్మ,మేనత్తల సహాయంతో పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణురాలైంది.తొమ్మిదో నెల నిండగానే స్వంత ఊరికి వచ్చింది.వచ్చిన రెండవ రోజే నొప్పులు మొదలవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.లోపలకు అడుగు పెట్టి పెట్టడంతోనే బుడుంగున బుడుగు బయటకు వచ్చేశాడు.ఇంట్లో అందరూ బుడుగును చూచి సంతోషించారు.గర్భం వచ్చింది మొదలు ఖాళీగా కూర్చోకుండా కళాశాలకు ఇంటికి తిరుగుతూ పనులు చేసుకోవడంతో తేలికగా ప్రసవం అయిందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని నానమ్మ,మేనత్త పెద్ద వయసులో కష్టపడినా కానీ ఆ కష్టాన్ని మరిచిపోయి బుడుగును చూచి మురిసిపోయారు.
Thursday, 13 July 2023
Tuesday, 9 May 2023
మన ఆరోగ్యం మన చేతుల్లో
మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలాగంటారా ? సంతోషమే సగం బలం అని మన పెద్దల ఉవాచ.ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ,స్వచ్చమైన మనస్సుతో మంచి స్నేహితులతో సత్సంబంధాలు నెలకొల్పుతూ, స్వచ్చమైన చిరునవ్వును ముఖంపై నుండి చెరగనీయకుండా,ఇంకా ఇంట్లో వారితో ఉన్నంత స్వచ్చమైన ప్రేమతో బంధుమిత్రులతో,ఇరుగుపొరుగుతో కూడా ఉండగలిగితే ఆ అనందం చెప్పనలవి కానిది.దానితో సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే కదా! మందులకన్నా ఇది మిన్న.అనారోగ్యమే దరి చేరదు.
Tuesday, 18 April 2023
అక్కియ తుత్తియ
గౌరి అక్షర ఇంట్లో పనిచేస్తుంది.ఇంటికి వచ్చిన దగ్గరనుండి వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉంటుంది.అక్షర వంట గది నుండి హాలులోకి వచ్చినా కూడా అమ్మా! ఆ వస్తువు ఎక్కడుంది? ఈ వస్తువు ఎక్కడుంది అంటు పిలుస్తూ ఉంటుంది.అమ్మా! నేను వెళ్ళేవరకు ఇక్కడే కుర్చీలో కూర్చోండి.నాకు మీరు దగ్గర లేకపోయినా మీకు కబుర్లు చెప్పకపోయినా తోచదు అంటూ నిష్కల్మషమైన మనసుతో గలగల మాట్లాడుతూ ఉంటుంది.ఒకరోజు గౌరి అమ్మా!అక్కియ తుత్తియ దగ్గర పడిందట కదమ్మా!అని అక్షరను అడిగింది.అక్షర గౌరి ఏమని అడిగిందో అర్థం కాక అలాగే చూస్తుంది.మళ్ళీ గౌరి బంగారం బాగా రేటు పెరిగింది అంటున్నారు కదమ్మా! రోజువారీ పోగులు కొనుక్కుందామని అనుకున్నాను ఆని చెప్పింది.అప్పుడు అక్షర అక్షయ తృతీయ గురించి గౌరి అక్కియ తుత్తియ అని ఆడిగింది కాబోలు అనుకుని నవ్వు వచ్చినా గౌరీ ముఖం చిన్నబోతుందని అవును దగ్గరలోనే అక్షయ తృతీయ ఉంది.రోజువారీ పోగులు అంటున్నావు కదా!పెద్దగా తేడా వచ్చేదేముంది కొనుక్కో అని అక్షర గౌరికి చెప్పింది.సరేనమ్మా!అంటూ గౌరి సంతోషంగా ఇంటికి వెళ్ళింది.
Tuesday, 11 April 2023
సత్సంబంధాలు
ఏదైనా అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది.అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది.పదేపదే అడిగి తీసుకునేదానిలో కష్టం ఉంటుంది.అది బంధంఅయినా వస్తువు అయినా సరే.అందుకే అది అర్ధం చేసుకుని మన స్వార్ధం ఒక్కటే చూచుకోకుండా ఎదుటి వారి మనసుని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించితే అందరికీ బాగుంటుంది.ఏదైనా శృతి మించితే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది.ఒక్కొక్కసారి విసుగు,కోపం కూడా రావచ్చు.ఏదైనా శృతి మించకుండా ఉన్నంతవరకే కదా! అప్పుడే అందరితో సత్సంబంధాలు ఏర్పడి మనం అందరము సంతోషంగా ఉండగలము.ఇది లోక సహజం.జగమెరిగిన సత్యం.
Tuesday, 21 March 2023
ఉగాది శుభాకాంక్షలు
ఎంత చెట్టుకి అంత గాలి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ ఎంతటి వారమైనా ఎవరికి తగిన విధంగా వారు గడచిన జీవితం కన్నాభావి జీవితం బాగుండాలని మనమంతా కోరుకుంటాము.మానవులం ఆశజీవులం కదా! అందుకే శుభకృత్ నామ సంవత్సర అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మనమందరమూ రాబోయే శోభకృత్ నామ సంవత్సరంలో జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని,సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని,అందరి ఆశలు,ఆశయాలు నెరవేరాలని ఆనందంగా అందరి జీవితాలు మరింత శోభాయమానంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగు వీక్షకులకు, నా ప్రియ పాఠకులకు,నా తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,మన తెలుగు వారందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.ప్రకృతిని ప్రేమిస్తూ ,ఉన్నత విలువలను గౌరవిస్తూ ఉగాది ప్రత్యేకమైన ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగ శ్రవణం చేయడం అనే మన సత్సంప్రదాయాన్ని మనం పాటిస్తూ మన ముందు తరాలు కూడా పాటించాలని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
Friday, 3 February 2023
గతం గతః
మనలో చాలామంది ఎప్పుడు చూసినా గతాన్ని తవ్వుకుంటూ ఉంటారు.వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు అని,అప్పుడు అలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అంటూ ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉంటారు.గతం మర్చిపోలేనిది.భవిష్యత్తు ఎవరూ లాక్కోలేనిది.గతం భవిష్యత్తుపై ఏ మాత్రం ప్రభావం చూపకుండా ప్రస్తుతం ఎలా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా జీవితాన్ని మలచుకోవాలి.గతం గతః అని మంచి అయితే అప్పుడప్పుడు తలుచుకుంటే సంతోషం.చెడు అయితే దాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ముందు ముందు అటువంటి తప్పులు చేయకుండా భవిష్యత్తును పూలబాటగా మలచుకుంటే అందరికీ మనశ్శాంతి తోపాటు శారీరకంగా ,మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.
ధృవ తార
ఏనాటికీ వెలుగు తగ్గని ధృవ తార కళా తపస్వి విశ్వనాధ్ గారు.చరిత్రలో నిలిచిపోయే అభిమాన నటులు,దర్శకులు.ఆయన సినిమాలలో ప్రతి కథ,పాట వన్నె తగ్గని వెలుగు పువ్వులే.ఆయన సినిమాలలో కథకు,సంగీతానికి,గాయకులకు పెద్ద పీట వేస్తారు.ప్రతి పాట ఒక ఆణిముత్యం.ప్రేక్షకుల మనసులను వీణ మీటినట్లుగా మీటి సినిమా చూస్తున్నంతసేపు ఎదో లోకంలో విహరించిన అనుభూతి కలిగేట్లు చేసే ఉత్తమ దర్శకులు. ప్రతి పాత్ర,ప్రతి మాట,పాట ఒక చక్కటి సాంప్రదాయబద్దమైన ఇంటికి కట్టిన మామిడి తోరణాల వంటివి.ఏమీ తెలియని వారికి కూడా మన తెలుగు కళలు,సంగీతం,నాట్యం అంటే ఏమిటో చక్కగా తేలికగా తెలిసేలా సినిమాలను మలిచిన మహోన్నత వ్యక్తి.సినిమాలో నిజరూప పాత్రధారులుగా చేయకూడని తప్పును చెవి పట్టుకుని మరీ తెలియచేసినట్లు మనకు మంచి జ్ఞానాన్ని నేర్పుతున్నట్లుగా మన తాతయ్యే వచ్చి చెప్తున్నఅనుభూతి కలుగుతుంది.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్లు నిగర్వి,కళా తపస్వి,మహోన్నతమైన మనసు కలిగిన మహనీయుడు,మహానుభావుడు మనందరి అభిమాని కె.విశ్వనాథ్ గారికి నివాళులు అర్పించుకుందాము.