భారతదేశంలో తొంభై శాతం పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు.పూర్వం అటు ఏడూ తరాలు చూసి అన్ని కోణాల్లో పరిశీలించి కుదిర్చేవాళ్ళు.ఇప్పుడు అంతలా కాకపోయినా అటు కుటుంబం ఇటు కుటుంబం ఒకరికొకరు,అమ్మాయి,అబ్బాయికి నచ్చితే పెళ్ళిళ్ళు చేస్తున్నారు.విదేశాలలో ఒకదేశంలో భార్యాభర్తలు చదువుకోవటానికి వెళ్ళినా,పనిచేయటానికి వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరినీ ఒకే చోట వేస్తారు.ఆ నేపధ్యంలో ఒక జంట ఒకే చోట చదువుకుంటూ పనిచేస్తున్నారు.వీళ్ళను చూచి కొంతమంది మీది ప్రేమ పెళ్ళా?పెద్దలు కుదిర్చిన పెళ్ళా?అని అడిగారు.పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిన తర్వాత చేసుకున్న పెళ్ళిళ్ళు మాత్రమే విజయవంతం అవుతాయని మా ఉద్దేశ్యం.ఇక్కడ ఒకరినొకరు ఇష్టపడి,అర్ధం చేసుకున్నామనుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నా సంతోషంగా లేని జంటలే ఎక్కువగా ఉన్నాయి.మీ ఇద్దరినీ చూచిన తర్వాత మీ దేశపు సంస్కృతి,సంప్రదాయాలు,పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు విజయవంతం అయ్యే విధానం మాకు ఎంతో నచ్చింది.అదెలాగో మాకు చెప్పమంటూ,మేము కూడా అలా చేసుకుంటామని అడగటం మొదలుపెట్టారు.అది ఎంతవరకు అక్కడ సాధ్యపడుతుందో చెప్పలేకపోయినా భారతదేశం పద్దతులు,ఆచారాలు విదేశీయులను సైతం ఆకట్టుకోవటం నిజంగా మనందరికీ గర్వకారణం.
Wednesday, 30 March 2016
Monday, 28 March 2016
వేసవిలో ఆహారం
వేసవికాలంలో ఎండల నుండి ఉపశమనం పొందేందుకు ఆహారంలో కూడా ప్రత్యేకమైన మార్పులు చేసుకోవాలి.మనందరికీ తెలిసినవే అయినా ఒక పద్దతిగా పాటిస్తే వేసవిలో తలెత్తే ఇబ్బందులు నుండి తేలికగా బయటపడవచ్చు.దాహార్తి తీర్చుకోవటానికి ఫ్రిజ్ లోని ఐస్ నీళ్ళ కన్నా కుండలోని చల్లటి నీళ్ళు తాగటం శ్రేయస్కరం.చల్లటి నిమ్మకాయనీళ్ళు,ప్రత్యేకంగా కరివేపాకు,పచ్చిమిర్చివేసి తయారుచేసిన చల్లటి నిమ్మకాయ మజ్జిగ,నిమ్మరసం,చెరుకు రసం,కొబ్బరి నీళ్ళు,సబ్జా గింజల నీళ్ళు,బార్లీ నీళ్ళు,ఎండు కర్జురాలు నానబెట్టిన నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.వాటితోపాటు నీటిశాతం ఎక్కువగా ఉన్నపండ్లు,కూరగాయలు తినాలి.పుచ్చకాయ,ద్రాక్ష,బత్తాయి,కర్భూజ,సపోటా,అనాస,తాటిముంజెలు,జామ,బొప్పాయి,వాటర్ యాపిల్,ఈత కాయలు ఖర్జూరకాయలు,యాపిల్ వంటివి ఎక్కువగా తినాలి.నీటిశాతం ఎక్కువగా ఉన్నకీరదోసకాయ,ఒకరకమైన తినే దోసకాయ,కారట్,టొమాటో వంటి కూరగాయలతో చేసిన సలాడ్లు, రకరకాల పండ్లతో చేసిన సలాడ్లు,తాజా పెరుగుతోతయారుచేసినవి,సొర,బీర,దోస,ఉల్లిపాయ,కాబేజ్,కాలిఫ్లవర్,వంకాయ,టొమాటో,పొట్లకాయ,ఆకుకూరలు కూరగాయలతో చేసిన పదార్ధాలు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.వేసవికాలం ఎక్కువగా పాలు పోసిన కూరలు,కలగలుపు కూరలు,పులుసు కూరలు,పచ్చి పులుసు,రకరకాల చారులు వంటి వాటితో తేలికపాటి ఆహారం తీసుకోవాలి.వీటితో పాటు తప్పనిసరిగా రోజుకొక అరటిపండు కూడా తినడం మాత్రం మర్చిపోకూడదు.ఈవిధంగా చేస్తే వేసవిలో భుక్తాయాసంతో ఆపసోపాలు పడకుండా హాయిగా ఉండొచ్చు.
బంధుత్వం
బాంధవ్యాల విలువ తెలియనివారితోను,బంధాలకు విలువ ఇవ్వనివారితోను అసలు ఎన్నటికీ బంధుత్వం కలుపుకోకూడదు.
Saturday, 26 March 2016
లటుకు,చిటుకు
విద్యాధరి కి పిల్లలంటే చాలా ఇష్టం.అందులో ఆడ పిల్లలంటే మరీ ఇష్టం.విద్యాధరి చెల్లెలికి ఇద్దరు కూతుళ్ళు.అల్లరి చేస్తూ విసుగిస్తున్నారని ఎప్పుడైనా పిల్లలను తీసుకు రాకుండా ఏదైనా శుభకార్యానికి వచ్చిందంటే అక్క చేతిలో చెల్లెలు పని అయిపోయినట్లే.చెల్లెలు పిల్లలను లటుకు,చిటుకు అని ముద్దుగా పిలుచుకుంటుంది.లటుకు,చిటుకు లేనిదే సందడే ఉండదు.వాళ్ళను తీసుకు రాకుండా రావడమేమిటి?అంటూ వెళ్ళేవరకు సతాయిస్తూ ఉంటుంది.అక్క గొడవ భరించలేక పిల్లలను తీసుకువచ్చి వాళ్ళ బాధ్యత అక్కకే వదిలేస్తుంది.విద్యాధరి లటుకు,చిటుకుతోపాటు ఇంకా కొంతమంది పిల్లలను పోగుచేసి అందరితో కలిసి చిన్నపిల్లలా ఆమె కూడా గెంతుతూ ఆట పాటలతో కాలక్షేపం చేస్తుంటుంది.లటుకు,చిటుకు కూడా కాసేపు అమ్మను మర్చిపోయి పెద్దమ్మతో కలిసి ఆడుకుంటూ ఉంటారు.
ఇంట్లోనే ఓ.ఆర్.ఎస్ తయారీ
మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి.వాతావరణం మార్చి నెలా? లేక మే నెలా?అన్నట్లుగా ఉంటుంది.ఒకటే దాహం.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చల్లటి నీళ్ళు గ్లాసుల కొద్దీ తాగే స్తుంటారు.అలా అని నీళ్ళు అదే పనిగా తాగకూడదు.వడ దెబ్బ తగలకుండా మంచి నీళ్ళతో పాటు కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ రసం,ఉప్పు,పంచదార కలిపిన నీళ్ళు తాగాలి.దాహం వేసిందని కూల్ డ్రింకులు,పాకెట్ల నీళ్ళు అసలు తాగకూడదు.బయటకు వెళ్ళే ముందు ఇంట్లోనే ఓ.ఆర్.ఎస్ ద్రావణం తయారు చేసుకుని ఒక సీసా వెంట తీసుకు వెళ్ళాలి.అదెలా అంటే ఒక లీటరు చల్లటి మంచి నీళ్ళు,ఆరు స్పూనుల పంచదార,ఒక అర స్పూను ఉప్పు బాగా కలిపితే ఈ ద్రావణం తయారు అవుతుంది.దాహం వేసినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
Wednesday, 23 March 2016
ఖాళీ దొరికినప్పుడు.....
రోజులో ఒక అరగంట నడవటమో లేదా జిమ్ కి వెళ్ళినంత మాత్రాన వ్యాయామం చేసినట్లు అవదు.మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడు ఐదు నిమిషాలయినా సరే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి.ముందుకు వంగి లేవడం,అటూ ఇటూ నడవడం,చేతులు,కాళ్ళు కదిలిస్తూ ఏదో ఒకటి చేస్తుంటే కెలోరీలు త్వరగా ఖర్చవుతాయి.టి.వి చూస్తూ సైకిల్ తొక్కడం,పాటలు వింటూ నాట్యం చేయడం వంటివి చేస్తుంటే త్వరగా బరువు తగ్గి అనుకున్న విధంగా సన్నబడతారు.
Tuesday, 22 March 2016
వసంతోత్సవం,లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు వసంతోత్సవ శుభాకాంక్షలు.హోలీ పండుగ రోజు అందరూ సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకుంటే శరీరానికి,మనసుకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.వ్యక్తులతో సామరస్యం పెంపొందించుకోవాలని ఈ రంగులకేళి ఆత్మీయ సందేశం.హోలీ రోజు ఎన్ని రంగులు ఉపయోగిస్తామో అన్ని రంగుల పండ్లు,కూరగాయలు ఆహారంలో భాగం చేసుకుంటూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఫాల్గుణ పౌర్ణమి అంటే లక్ష్మీదేవి జయంతి కనుక అందరికీ లక్ష్మీ కటాక్షం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఎంచక్కా......
పనిమనిషి గిన్నెలు కడిగినంతసేపు,బట్టలు ఉతికినంతసేపు పంపు కట్టేయకుండా నీళ్ళు వదిలేస్తుంటే ప్రాణం పోతునట్లు అనిపిస్తుంటుంది.పంపు కట్టేసి అవసరమైనప్పుడు నీళ్ళు వదులుకోమని చెప్తే ఇదిగో ఇప్పుడే పంపు వదిలానమ్మా!అంటుంది.అటు వెళ్ళగానే యధా రాజా తధా ప్రజా! అన్నట్లు మామూలే.చెప్పీ చెప్పీ కంఠ శోష తప్ప ఉపయోగం ఉండదు.నీటి ఎద్దడి.ప్రజల అవసరాలు,ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అసలు నీళ్ళతో పని లేకుండా బట్టలు ఉతుక్కోవటానికి వాషింగ్ మెషీన్,ఒక గ్లాసు నీళ్ళతో నెల రోజులు గిన్నెలు కడుక్కోవటానికి డిష్ వాషర్ సరికొత్త పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారని త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది.ఎందుకంటే ఎంచక్కా పనివాళ్ళతో కంఠ శోష లేకుండా వాళ్ళు,మనం వృధా చేసే నీరు మరి కొంతమంది తాగునీటికి,ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి కదా!
నీటి వృధా అరికడదాం - చెట్లను పెంచుదాం
కూరగాయలు ఒక గిన్నెలో వేసి కడిగితే తక్కువ నీళ్ళు పట్టడమే కాక ఆ నీరు వృధా కాకుండా మొక్కలకు పోయవచ్చు.అదే పంపు కింద కడిగితే ఎక్కువ నీళ్ళు పట్టడమే కాక నీరు వృధాగా డ్రైనేజి పాలవుతాయి.బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలో పోసి వాటిని మొక్కలకు ఉపయోగించవచ్చు.పైపుతో కారు కడిగితే 200 లీటర్లు నీళ్ళు పడతాయి.అలా కాకుండా ఒక బకెట్ నీటిలో మెత్తటి టవల్ ఉపయోగించి శుభ్రం చేస్తే 20 లీటర్లు సరిపోతాయి.బ్రష్ చేసేటప్పుడు,ముఖం కడిగేటప్పుడు,గడ్డం చేసేటప్పుడు ఆపని పూర్తయ్యేవరకు పంపు వదిలేస్తే చాలా నీరు వృధా అవుతుంది కనుక అవసరమైనప్పుడు మాత్రమే పంపు వదులుకుంటే నీటి వృధాకి అడ్డుకట్ట వేసినట్లవుతుంది.స్నానం చేయాలంటే షవర్ బాత్ కి 90 లీటర్లు,టబ్ బాత్ కి 250 లీటర్లు అవసరం కనుక ఒక బకెట్ స్నానం అయితే 20 లీటర్లు మాత్రమే సరిపోతాయి.స్నానం చేసేటప్పుడు మధ్యరకం మగ్గు వాడితే ఒక్కొక్కళ్ళు రోజుకి 25 లీటర్లు ఆదా చేసినట్లే.పంపు నుండి ఒక్కొక్క చుక్క నీరు పోతుంటే రోజుకి 30 లీటర్లు వృధా అవుతున్నట్లే.అందుకే ఎప్పటికప్పుడు పంపులు లీక్ అవకుండా చూచుకోవాలి.ఒక్కొక్క చెట్టు వాతావరణ కాలుష్యాన్నిఅరికట్టడంతోపాటు రోజుకి 265 లీటర్ల నీటిని తేమ రూపంలో గాలిలోకి విడుదల చేస్తుంటుంది.కనుక నీటి వృధా అరికట్టడంతోపాటు,నీటిని పొదుపుగా వాడుకుని ప్రతి ఒక్కరు వాన నీటిని ఒడిసిపట్టి,ఇంకుడుగుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచడంతోపాటు,చెట్లను పెంచితే నీటి లభ్యత పెరుగుతుంది.మనకు సాధ్యమైనంతవరకు నీటి వృధా అరికడదాం - చెట్లను పెంచుదాం.ఎవరికి వారే తమతమ శాయశక్తులా ప్రయత్నించాలని మనసారా కోరుకుంటున్నాను.
Monday, 21 March 2016
పోసగున్న
క్రిష్ మేనత్త కూతురికి ఒక కూతురు,ఒక కొడుకు.పిల్లలు చక్కగా అందంగా,ముద్దుగా,బొద్దుగా ఉంటారు.క్రిష్ కి అప్పుడు పన్నెండేళ్ళ వయసు.వేసవి కాలంలో చల్లదనం కోసం పిల్లలను పడుకోబెట్టటానికి అరిటాకులు తెమ్మని మేనత్త పురమాయిస్తే నిమిషాలలో తెచ్చేవాడు క్రిష్.ఇంకొక మేనత్తకొడుకు తాటిచెట్టు ఎక్కి తాటికాయలు కొస్తే క్రిష్ తాటికాయలు తెచ్చేవాడు.తాటి ముంజెలలో ఉన్న నీళ్ళు పిల్లల శరీరానికి రాస్తే చర్మం ఎండకు పేలకుండా,ఎర్రబడకుండా ఉంటుందని అలా చేసేవాళ్ళు.క్రిష్ చిన్నప్పుడు సన్నగా,రివటలాగా గాలి వస్తే పడిపోయేలా ఉండేవాడు.తను ఎత్తుకోలేకపోయినా పిల్లలు ముద్దొచ్చి ఎత్తుకోవటానికి ఇవ్వమని మేనత్తని అడిగేవాడు.పిల్లలకు ఎక్కడ దిష్టి తగులుతుందోనని నువ్వు ఎత్తుకోలేవు,పడేస్తావు అని చెప్పకుండా ఒక నవ్వు నవ్వేసేది.పిల్లలకు అవసరమైనవి అన్నీ తెస్తున్నాను అయినా ఎత్తుకోవటానికి ఇవ్వటంలేదు అంటూ మారం చేస్తే పోసగున్న అంటూ ముద్దుగా తిట్టి పెద్దగా నవ్వేది తప్ప ఎత్తుకోవటానికి ఎవరికీ ఇచ్చేది కాదు.మేనత్త లేకపోయినా మేనత్త జ్ఞాపకాలు తలుచుకుని పిల్లలను కూర్చోబెట్టి మిమ్మల్ని ఎత్తుకోవటానికి పిల్లలందరమూ పోటీ పడేవాళ్ళమని మీ అమ్మమ్మ,మా మేనత్త ఎవరికీ ఇచ్చేది కాదంటూ క్రిష్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు.
సహజ టోనర్
చిన్న గిన్నెలో కొద్దిగా టీట్రీ ఆయిల్ తీసుకుని దానిలో 4,5 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి సగం వరకు నీళ్ళు పోసి మళ్ళీ బాగా కలపాలి.దీనిలో మెత్తటి చిన్న రుమాలు వేసి పిండి దానితో ముఖం తుడుచుకుంటే చర్మం శుభ్రపడుతుంది.ఇది సహజ టోనర్ అన్నమాట.
Saturday, 19 March 2016
ఎండల్లో హాయిగా........
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి.పెద్ద,చిన్న అనే తేడా లేకుండా వడదెబ్బ తగలకుండా అందరూ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండల్లో కూడా హాయిగా ఉండొచ్చు.లేత రంగుల్లో తేలికగా ఉండే నూలు దుస్తులు ధరించాలి.ఇంట్లో ఉన్నా,బయటకు వెళ్ళినా మధ్యమధ్యలో చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి లేదా రుమాలు తడిపి ముఖం తుడుచుకోవాలి.ఎండలో నుండి వచ్చిన తర్వాత చన్నీటితో ముఖం కడిగి రెండు స్పూనుల బొప్పాయి గుజ్జుకి ఒక స్పూను తేనె కలిపి రాసుకుంటే చర్మంపై ఎండ ప్రభావం పడకుండా ఉంటుంది. అల్పాహారం ఎట్టిపరిస్థితుల్లో అశ్రద్ధ చెయ్యకుండా తినాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి. పుచ్చకాయ,కీరా,ఖర్భూజ,నిమ్మరసం,కొబ్బరి నీళ్ళు,పండ్ల రసాలు,మజ్జిగ,బార్లీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని తాగుతూ ఉండాలి.వేపుళ్ళు తగ్గించాలి.పండ్లు ఎక్కువగా తినాలి.పై జాగ్రత్తలు పాటిస్తే ఎండల్లో కూడా ఎంతో హాయిగా,ఆరోగ్యంగా ఉండొచ్చు.
Friday, 18 March 2016
సహజ పీలింగ్ ఏజెంట్
బాగా పండిన బొప్పాయి ముక్కలు రెండు తీసుకోవాలి.ఒక చిన్న గిన్నెలో వేసి మెత్తగా చేసి దానికి ఒక స్పూను తేనె,1/4 స్పూను కలబంద గుజ్జు వేసి బాగాకలపాలి.దానికి రెండు స్పూనుల శనగ పిండి చేర్చి మొత్తం బాగా కలిపి ముఖానికి పట్టించాలి.20 ని.ల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ముఖాన్ని చుబుకం నుండి మొదలెట్టి పైకి కడగాలి.దీని వల్ల ఎక్కువగా ఉన్న బుగ్గలు తగ్గటమే కాక ముఖానికి రక్తప్రసరణ బాగా జరిగి మొటిమల తాలుకు మచ్చలు కూడా తొలగిపోతాయి.మన పెరటిలో పండిన బొప్పాయి అయితే మరీ శ్రేష్టం.బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్.అప్పటికప్పుడు తాజాగా.సహజ సౌదర్యంతో ఏ వయసు వారైనా అందంగా మెరిసిపోవచ్చు.
Thursday, 17 March 2016
సుగంధభరిత కొవ్వొత్తులు
దోమలు రాకుండా ఇంట్లో వాడే దోమల నివారిణి వలన చాలామందికి ముఖ్యంగా పిల్లలకు,పెద్దలకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తూ ఉంటాయి.సుగంధభరిత కొవ్వొత్తులు దీనికి చక్కటి ప్రత్యామ్నాయం.వీటిలో రకరకాల సువాసనలతో అందమైన ఆకృతుల్లో ఇప్పుడు మార్కెట్లో విరివిగా అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి.ఒకసారి కొని ఇంటికి తెచ్చుకుంటే కొన్ని వారాలపాటు వీటిని వాడుకోవచ్చు.నిమ్మగడ్డితో తయారుచేసిన కొవ్వొత్తులు దోమల నివారణకు బాగా ఉపయోగపడతాయి.వీటిని వంటగదిలో,పడకగదిలో వెలిగిస్తే దోమలు రాకుండా ఉంటాయి.ఈ వాసనకు పని ఒత్తిడితో కూడిన అలసట దూరమవటంతోపాటు ఈగలు కూడా పారిపోతాయి.నిద్రలేమికి,తలనొప్పికి చక్కటి పరిష్కారం లావెండర్ కొవ్వొత్తి.పుదీనా,దాల్చినచెక్క వాసనఉన్న కొవ్వొత్తులు వెలిగిస్తే మెదడు చురుకుదనంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.మల్లెలు,గులాబీల వాసన మనసుకు హాయిగా ఉండటమే కాక శ్వాసకోస ఇబ్బందులు తొలగుతాయి.
Wednesday, 16 March 2016
సహజ క్లెన్సర్
మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంటుంది.అలాంటప్పుడు మార్కెట్లో దొరికే ఏదో ఒక క్రీమ్ రాసుకునే కన్నా ఇంట్లోనే సహజంగా ఉండే వాటితో తేలిగ్గా ఎటువంటి ఇబ్బందులు(సైడ్ ఎఫెక్ట్స్) రాకుండా చేసుకోవచ్చు.ముఖంపై వాతావరణ కాలుష్యం వల్ల మనకు తెలియకుండానే మురికి పేరుకుంటుంది.దీనితో చర్మం కాంతి విహీనంగా మారుతుంది.కనుక అప్పుడు ఒక పండు టొమాటో సగానికి కోసి రెండు భాగాలుగా చేసి ఒకదానికి పంచదారను అద్ది ముఖంపై రుద్దితే నలుపుదనం తగ్గి ముఖం కాంతివంతంగా ఉంటుంది.మిగిలిన సగ భాగంపై కూడా పంచదార వేసి మెడ,చేతులు కూడా రుద్దితే చర్మం తెల్లగా.అందంగా తయారవుతుంది.టొమాటో సహజ క్లెన్సర్ అన్నమాట.
Tuesday, 15 March 2016
చర్మం చక్కటి రంగుతో.......
చల్లటి పెరుగు కాస్త చేతిలో వేసుకుని ముఖానికి,మెడకు పట్టించి కాసేపు పొడిగా అయ్యేవరకు ఆరనివ్వాలి.తర్వాత కొంచెం అలా అలా రుద్దుతూ కడిగేయాలి.ఇలా చేయడం వల్ల అలసిన చర్మం జీవకళను సంతరించుకుని చక్కటి రంగుతో నిగనిగలాడుతూ అందంగా తయారవుతుంది.
Monday, 14 March 2016
మంచి బాక్టీరియాను పెంచే బార్లీ
బార్లీ పేరు చెప్పగానే మనకెందుకులే అది గర్బిణీ స్త్రీలకు లేదా జ్వరం వచ్చిన వాళ్లకులే అని చాలామంది అభిప్రాయపడుతుంటారు.కానీ బార్లీని అందరూ ఏదోఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.దీనిలోని పీచు పొట్టలోకి వెళ్ళగానే మంచి బాక్టీరియాను పెంచుతుంది.గుండె సంబంధిత వ్యాధులు కానీ మధుమేహం కానీ రాకుండా కాపాడుతుంది.రోజులో ఏదోఒక సమయంలో బార్లీ ఉడికించి తినటం కానీ ఆ నీళ్ళు తాగడం కానీ చేస్తుంటే రక్తంలో చక్కర నిల్వలు తగ్గి జీవక్రియ వేగం పెరుగుతుంది.
Thursday, 10 March 2016
నిద్ర లేవగానే......
ఉదయం నిద్ర లేచిన వెంటనే,సాయంత్రం దీపాలు వెలిగించే సమయంలో అరచేతుల్ని దర్శించడం శుభప్రదం.అరచేతిలో సమస్త దేవతలు ఉంటారు కనుక అరచేతుల్నిచూడటం వల్ల రోజంతా బాగుంటుందని పెద్దల ఉవాచ,మన నమ్మకం.
Tuesday, 8 March 2016
చర్మం నిగారింపుగా.........
చర్మం నిగారింపుగా ఉండటానికి పై పూత ఒక్కటే కాదు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.కారట్ రసం,టొమాటో రసం రోజూ ఏదోఒకటి తాగుతుండాలి.ఇష్టమైతే నాలుగు చుక్కల నిమ్మరసం,తేనె కలుపుకోవచ్చు.స్వీట్లు,వేపుళ్ళు,నూనె పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది.పైపూతఒక్కటే అయితే 4,5 రోజులకొకసారి వేసుకోవాలి,ఆహారంలో మార్పుతోపాటు పండ్లు,కారట్,టొమాటో రసం కూడా తీసుకోవడం వల్ల సహజంగానే చర్మం నిగారింపుగా ఉంటుంది.
Sunday, 6 March 2016
తాజా కూరగాయలు,పండ్లు
తాజా పండ్లు,కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే.అయినా శ్రమపడి హడావిడిగా అప్పటికప్పుడు ముక్కలు కొయ్యాల్సిన అవసరం లేకుండా పండ్లు,కూరగాయల ముక్కలు కోసి మరీ సూపర్ మార్కెట్లలో అమ్ముతున్నారు కనుక వాటిని ఇంటికి తెచ్చుకుంటాము.కానీ వాటిని తినటం వలన మధుమేహం,గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని కనుక తాజా పండ్లు,కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు,అనుభవజ్ఞుల సలహా.మనకు తెలిసిన విషయాన్ని, పెద్దలు,అనుభవజ్ఞుల సలహాని తూ.చ తప్పక పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాము.
మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివుడు భోళాశంకరుడు.అభిషేక ప్రియుడు.ఉపవాసం,జాగరణ ఈ పండుగ ప్రత్యేకత అయినా అవేమీ చేయకపోయినా భక్తితో మనసారా ఓం నమఃశివాయ అంటూ మారేడు దళాన్ని సమర్పించినా ప్రసన్నుడై సకల జనావళిని తన చల్లని చూపులతో కాపాడుతుంటాడు.అట్టి పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించి అందరికీ మనశ్శాంతిని,ఆయురారోగ్యాలను,అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు, నాతోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Saturday, 5 March 2016
వయసు ఎంతో ?
నాలుగు స్పూనుల మెంతులు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా చేసి దానిలో ఒక స్పూను తేనె కలిపి ముఖానికి,మెడకు పట్టించి ఒక అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి.ఇలా వారానికి ఒకసారి చేస్తే ఎదుటివారు వయసు ఎంతో?కూడా కనిపెట్టలేనంత అందంగా యవ్వనంగా మారిపోతారు.
వారానికి మూడుసార్లు
అన్నపూర్ణమ్మ మామ్మకు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి.అయినా మతిమరుపు కానీ,బి.పి,షుగరు,కొలెస్టరాల్ వంటివి ఏమీ లేవు.అవే కాదు ఎటువంటి రోగాలు తనను దరిచేరవని బల్లగుద్ది మరీ చెప్తుంది.అంత నమ్మకంగా ఎందుకు చెప్తుందంటే ద్రాక్ష పండ్లంటే తనకు చాలా ఇష్టమనీ ఎక్కువగా తింటానని అవి తింటే గుండెజబ్బులు,కాన్సర్ వంటివి రావని వాళ్ళ అమ్మమ్మ చెప్పిందని చెప్పింది.వారానికి మూడు అంతకన్నా ఎక్కువసార్లు ద్రాక్ష పండ్లు తింటే ఆరోగ్యానికి రక్షణ అని చెప్పింది.కాకపోతే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.గోరువెచ్చటి నీళ్ళు,ఉప్పుకలిపి ఆనీటిలోఒక 20 ని.లు నానిన తర్వాత శుభ్రంగా కడిగి తింటే మంచిది.
Friday, 4 March 2016
ఉసిరి రసం
ఉసిరి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగు పడుతుంది.కంటిపై పొర ఆరోగ్యంగా తయారయి త్వరగా కళ్ళజోడు అవసరం రాకుండా ఉంటుంది.ఉసిరిని నేరుగా కానీ ఏదో ఒక రూపంలో కానీ రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తహీనతతో పాటు కొవ్వును తగ్గించి అధిక బరువును అదుపులోఉంచి గుండెను కాపాడుతుంది.వ్యాధి నిరోధక శక్తి పెరిగి కాన్సర్ కణాలను అదుపులో ఉంచుతుంది.ఇంతే కాదండోయ్!జుట్టు నల్లగా,ఒత్తుగా.మెరిసేలా చేయటమే కాక వెంట్రుకలు త్వరగా తెల్లబడనివ్వదు.చుండ్రును దరిచేరనివ్వదు.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.పుల్లపుల్లగా ఉండే ఉసిరికాయ తిని వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగితే నోరంతా తియ్యగా ఉంటుంది.ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని రోజు ఏదో ఒక రూపంలో తినడం మేలు.
బిట్టుగాడు
నందిత చిన్ననాటి స్నేహితురాలు నందిని చాలా సంవత్సరాల తర్వాత విజయ రాజరాజేశ్వరి దేవి గుడిలో కనిపించింది.చాలాకాలం తర్వాత కనిపించారు కనుక అమ్మవారి దర్శనం అయిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఒక ప్రక్కన కూర్చున్నారు.కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఒక అరగంట చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నాక పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే ఎంతవరకు మా బిట్టుగాడు అలా మా బిట్టుగాడు ఇలా అంటూ మా బిట్టుగాడు ఉన్నంతసేపు ఎవరినీ ఇంటికి రానివ్వడు అంటూ వసపిట్టలా చెప్తుంది.ఇక్కడకు తీసుకురాకపోయవా?అంటే గుడికి తీసుకుని రాకూడదు కదా!అంది.ఎందుకని?అని ఆశ్చర్యంగా అడిగింది నందిత.ఇంతకీ బిట్టుగాడు అంటే మా ప్రియాతి ప్రియమైన పెంపుడు కుక్క.మా అబ్బాయి వేరే రాష్ట్రంలో చదువుకుంటున్నాడు.ఇందాకటి నుండి బిట్టుగాడు అంటే మా అబ్బాయనుకున్నావా?మా అబ్బాయి కన్నా ఎక్కువే అనేసింది నందిని.
Thursday, 3 March 2016
సూదిలో దారం
సరస్వతమ్మకు ఎంబ్రాయిడరీ చేయడమంటే ఎంతో ఇష్టం.డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఖాళీగా ఉన్నప్పుడు చకచకా సూదిలో దారం ఎక్కించి రకరకాల డిజైన్లు ముచ్చటగా వేసి అందంగా కుట్టడం చేస్తుంటుంది.ఇప్పటి పిల్లలకు సూదిలో దారం ఎక్కించటమే తెలియదు.ప్రత్యేకంగా కుట్లు,అల్లికలు నేర్చుకుందామని ఆసక్తి ఉంటే తప్ప సూదిలో దారం ఎక్కించాల్సిన అవసరం ఏముంది?అయినా కానీ ఎప్పుడైనా ఒకసారి గుండీలు కుట్టాలంటే ఎవరూ కుట్టరు కనుక అవసరమైనప్పుడు ఎక్కించాలంటే దారం చివర గోళ్ళరంగు రాసి గట్టిపడగానే ఎక్కించితే తేలికగా ఎక్కించవచ్చు.
Wednesday, 2 March 2016
చర్మం నిగారింపుతో .......
కమలా రసంలో కొద్దిగా నీళ్ళు కలిపి ఐస్ ట్రేలలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. గడ్డకట్టిన తర్వాత ఈ ఐస్ ముక్కలను తీసుకుని ముఖంపై సున్నితంగా రాయాలి.తర్వాత మెత్తటి పొడి వస్త్రంతో ముఖాన్ని తుడవాలి.కమలా రసంతో తయారుచేసుకున్న ఐస్ ముక్కలతో రుద్దటం వల్ల సహజంగా ఏ క్రీములూ రాయాల్సిన అవసరం లేకుండా చర్మం చక్కటి నిగారింపుతో ఉంటుంది.
వినూత్న పర్యావరణ పరిరక్షణ
వేసవికాలంలో మనకు మార్కెట్లో రకరకాల పండ్లు దొరుకుతాయి కదా!నేరేడు,మామిడి,పనస,పంపరపనస,ఈత,సపోటా,ఉసిరి,రాతి ఉసిరి మొదలైన పండ్లు మనం తిన్న తర్వాత గింజలు పడేస్తుంటాము. ఇకమీదట అలా బయటా పడేయకుండా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడిలేకుండా ఒక సంచిలో వేసి కారులో కానీ,మరేదైనా వాహనంలో గానీ పెట్టుకుంటే దూరప్రయాణం చేసేటప్పుడు వాటిని దారిలో చల్లుకుంటూ వెళుతుంటే వర్షాలు పడగానే అవి మొలకెత్తుతాయి.అవి పెరిగి పెద్ద చెట్లు అయిన తర్వాత చక్కటి గాలిని అందివ్వడంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ భావితరాలకు పండ్లను అందిస్తాయి.ఈ వినూత్న ఆలోచన వల్ల భావితరాలకు ఎంతో మేలు చేయటమే కాక పర్యావరణాన్ని కాపాడటంలో మన వంతు సహాయం అందించిన వాళ్ళం అవుతాము.చెమటోడ్చి పనిచేయాల్సిన అవసరం లేదు కనుక మనందరమూ కూడా ఈ వినూత్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకోగలిగితే ధన్యులము.
సహాయం
కష్టాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో మన వంతు సహాయం మనస్పూర్తిగా చేయగలిగినంత చేస్తుంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు.
Tuesday, 1 March 2016
గాలి బుడగలు
కొద్దిగా నీటిలో సువాసనతో కూడిన సబ్బు గిలకొట్టి ఆనీటిలో రెండు చుక్కల గ్లిజరిన్ కలపాలి.ఈ రెండింటిని కలిపితే గాలి బుడగల ద్రవం సిద్దమౌతుంది.దీనిని సీసాలో కానీ గ్లాసులో కానీ పోసి ఒక స్ట్రా తీసుకుని ఊదితే గాలి బుడగలు పెద్దగా వస్తాయి.ఇది పిల్లలకే కాదు పెద్దలు కూడా సరదాగా ఉంటుంది. పెద్దవాళ్ళు బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మనసులో ఉన్న ఆందోళన గాలి బుడగల్లా ఉఫ్ అంటూ ఇట్టే ఎగిరిపోతుంది.
Subscribe to:
Posts (Atom)