కూరగాయలు ఒక గిన్నెలో వేసి కడిగితే తక్కువ నీళ్ళు పట్టడమే కాక ఆ నీరు వృధా కాకుండా మొక్కలకు పోయవచ్చు.అదే పంపు కింద కడిగితే ఎక్కువ నీళ్ళు పట్టడమే కాక నీరు వృధాగా డ్రైనేజి పాలవుతాయి.బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలో పోసి వాటిని మొక్కలకు ఉపయోగించవచ్చు.పైపుతో కారు కడిగితే 200 లీటర్లు నీళ్ళు పడతాయి.అలా కాకుండా ఒక బకెట్ నీటిలో మెత్తటి టవల్ ఉపయోగించి శుభ్రం చేస్తే 20 లీటర్లు సరిపోతాయి.బ్రష్ చేసేటప్పుడు,ముఖం కడిగేటప్పుడు,గడ్డం చేసేటప్పుడు ఆపని పూర్తయ్యేవరకు పంపు వదిలేస్తే చాలా నీరు వృధా అవుతుంది కనుక అవసరమైనప్పుడు మాత్రమే పంపు వదులుకుంటే నీటి వృధాకి అడ్డుకట్ట వేసినట్లవుతుంది.స్నానం చేయాలంటే షవర్ బాత్ కి 90 లీటర్లు,టబ్ బాత్ కి 250 లీటర్లు అవసరం కనుక ఒక బకెట్ స్నానం అయితే 20 లీటర్లు మాత్రమే సరిపోతాయి.స్నానం చేసేటప్పుడు మధ్యరకం మగ్గు వాడితే ఒక్కొక్కళ్ళు రోజుకి 25 లీటర్లు ఆదా చేసినట్లే.పంపు నుండి ఒక్కొక్క చుక్క నీరు పోతుంటే రోజుకి 30 లీటర్లు వృధా అవుతున్నట్లే.అందుకే ఎప్పటికప్పుడు పంపులు లీక్ అవకుండా చూచుకోవాలి.ఒక్కొక్క చెట్టు వాతావరణ కాలుష్యాన్నిఅరికట్టడంతోపాటు రోజుకి 265 లీటర్ల నీటిని తేమ రూపంలో గాలిలోకి విడుదల చేస్తుంటుంది.కనుక నీటి వృధా అరికట్టడంతోపాటు,నీటిని పొదుపుగా వాడుకుని ప్రతి ఒక్కరు వాన నీటిని ఒడిసిపట్టి,ఇంకుడుగుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచడంతోపాటు,చెట్లను పెంచితే నీటి లభ్యత పెరుగుతుంది.మనకు సాధ్యమైనంతవరకు నీటి వృధా అరికడదాం - చెట్లను పెంచుదాం.ఎవరికి వారే తమతమ శాయశక్తులా ప్రయత్నించాలని మనసారా కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment