Saturday, 31 December 2022

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                2 0 2 3 వ సంవత్సరంలో అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో,ఆనందోత్సాహాలతో,ధన కనక వస్తు వాహనాలతో,ప్రశాంత చిత్తంతో,చురుకుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.


స్థబ్దుగా

                                                                హాసిని ఎప్పుడూ చలాకీగా ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు తోచినంతలో సరైన పరిష్కారాలు సూచిస్తూ అందరితో కలివిడిగా ఉంటూ సంతోషంగా ఉండేది.కానీ గత కొన్ని నెలలుగా స్థబ్దుగా తన కుటుంబం వరకే పనులు చేసుకుంటూ ఎవరితో  ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ,నిస్సంతోషంగా ఉంటుండడంతో ఒకరోజు స్నేహితురాలు శ్రావ్య హాసిని  దగ్గరకు వచ్చింది.మాటల మధ్యలో హాసిని తనకు బద్ధకంగా రోజువారీ పనులు పట్ల కూడా ఆసక్తి ఉండడం లేదు అని చెప్పడంతో నీకే కాదు హాసిని ఈ సంవత్సరం చాలామంది దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు.రాబోయే క్రొత్త సంవత్సరంలో అయినా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిద్దాము అని హసినితో స్నేహితురాలు చెప్పడంతో ఇద్దరూ ఉత్సాహంగా ఒకరికొకరు నూతన సంవతర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Wednesday, 10 August 2022

ఆనందమే అందం

                                                       ఒకానొకప్పుడు అందమే ఆనందం అనేది నానుడి.ఇప్పుడు ఆనందమే అందం అనేది నానుడి.అందంతోపాటు అందమైన మనసు కూడా  ఉంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి.అంతటి అదృష్టం బహు కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది.వాళ్ళతోపాటు ఇంట్లో వాళ్ళు,స్నేహితులు,చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అదృష్టవంతులు. కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుండి  ముఖంపై నవ్వు లేకుండా చిటచిటలాడుతూ అవసరం  అయినదానికి,కానిదానికి అందరిపై ఎగిరెగిరి పడుతూ ఉంటారు.ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే అందరూ ఆమడ దూరం పరుగెత్తుతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ముఖంపై ఎల్లప్పుడు చెరగని చిరునవ్వుతో ఉంటూ మంచి మనసుతో నలుగురికి చేతనైన సహాయం చేస్తూ ఆనందంగా ఉంటే అందరూ ఇష్టపడతారు.దానితో ఒత్తిడికి గురికాకుండా మానసికంగా,శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.ఆనందంగా ఉంటే అందం దానంతట అదే రెట్టింపు అవుతుంది అనేది అక్షరాల నిజం. 

Thursday, 28 July 2022

చేతనైనంత సహాయం

                                                              గురువారం అమావాస్య రావడంతో ఆషాడ అమావాస్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈరోజు వీలయినంతవరకు భగవన్నామస్మరణ చేసుకోవడం మంచిది.పారాయణ చేసుకోవడం కుదరకపోతే చరవాణి లో వింటూ ఎవరి పని వారు చేసుకోవచ్చు.ఈ రోజు దైవ సంబంధమైన శ్లోకాలు విన్నా చదివినా మామూలు రోజుల్లో కన్నా ఎన్నో రెట్లు ఫలితం ఉంటుందని పెద్దలు,పండితుల ఉవాచ.అమ్మవాస్య రోజు పెద్దలను తలుచుకుని ఒక కిలో బియ్యం,అర కిలో చొప్పున రెండు రకాల కూరగాయలు గుడిలో పూజారి గారికి ఇవ్వడం మంచిది.పూజారి గారు అందుబాటులో లేకపోతే ఎవరైనా భోజనానికి  ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు ఇవ్వగలిగినంత మందికి ఇవ్వవచ్చు.ఈవిధంగా చేసినట్లు అయితే పితృదేవతలు సంతోషపడి మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతూ ఉంటారట.అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో రోజులుగా వాయిదా పడిన పనులతో పాటు పిల్లల పెళ్ళిళ్ళు కూడా త్వరగా పూర్తి అవుతాయట.పెద్దలు అనుభవంతో చెప్పడంతో  చాల మందికి తెలిసిన విషయమే అయినా దీన్ని ఆచరించడం వలన మంచి జరుగడమే  కాకుండా కొంతమందికి చేతనైనంత సహాయపడిన వాళ్ళము అవుతాము కదా! మనం ఎదుటివారికి ఎంత సహాయపడితే మనకు అంతకన్నా ఎక్కువ మానసిక ప్రశాంతత లభిస్తుంది.నెలలో ఒకరోజు మనకు వచ్చే ఆదాయంలో కొంచెం ఖర్చుపెట్టి ఈ పద్దతిని ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఆచరిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు. 

Saturday, 16 July 2022

పిత్తకాయలు

                                                      పూర్వం రోజుల్లో బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరికి ఒకరు ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఇంటి ఆవరణలో కానీ ,చేలల్లో కానీ కాసిన పండ్లు ,కూరగాయలు తీసుకుని వెళ్ళేవారు.సూర్య ప్రకాష్,శేఖర్ మనస్తత్వాలు వేరయినా ఇద్దరూ మంచి స్నేహితులు.స్నేహితుని ఊరిలో పెళ్ళికి వెళ్తూ శేఖర్ కి ఒక గంప నిండా తన ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కాయలు పక్వానికి వచ్చిన వాటిని కోసి వరిగడ్డిలో పెట్టి మగ్గిన పండ్లను ఎంతో కష్టపడి స్నేహితుని కోసం ప్రేమగా  తీసుకుని వచ్చాడు.మా దొడ్లో మామిడి కాయలు చాలా తియ్యగా ఉండి రుచి బాగుంటుంది అని చెప్పాడు.శేఖర్ ఎవరికీ ఏమీ ఇవ్వడు.ఇచ్చిన వాళ్ళకి పేర్లు పెడుతూ ఉంటాడు.మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు?మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు?అనే మనస్తత్వం.సూర్య ప్రకాష్ వెళ్ళగానే పెట్టె మూత తీసి చూచి కాయలు చిన్నగా ఉన్నాయని భార్యాభర్తలు ఇద్దరూ ఇవి పిత్తకాయలు హిహి హి అన్నారు.అక్కడ  ఉన్న వారికి విషయం అర్ధం కాలేదు.అదేమిటి?మామిడి కాయలు కాదా? అని అడిగారు.మామిడి కాయలే కానీ చిన్న కాయలు వాటిని అలాగే అంటాము అన్నారు.చిన్న కాయలో,పెద్ద కాయలో ఎంతో ప్రేమతో తెచ్చాడు.అందుకు మనం సంతోషపడాలి కానీ విమర్శించకూడదు.ప్రేమ విలువ,మనుషుల విలువ తెలియని వాళ్ళకు ఏదైనా ఇవ్వకపోవడమే మంచిది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పిత్తకాయలు శేఖర్ వాళ్ళు తినరంట.తినకపోతే ఎవరో ఒకరికి తినేవాళ్ళకు ఇవ్వవచ్చు.కానీ గంపను అలా వదిలేస్తే ఎలుక  ఒకటి వచ్చి గంప నుండి రోజుకొక మామిడి కాయ తిని వెళ్తుందట.ఈ విషయాన్ని  ఇద్దరూ  అందరికీ గొప్పగా డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నారు.అందులో స్నేహితుని ప్రేమ,ఆప్యాయత చూడగలిగితే ఆ పని చేసేవాళ్ళు కాదు.తెలిసో తెలియకో దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చెయ్యకండి.చిన్న,పెద్ద అని  కాకుండా ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది ముఖ్యం.అది అర్ధం చేసుకుంటే అందరికీ సంతోషం.

Thursday, 26 May 2022

ఉగ్గు గిన్నె - నేతి గిన్నె

                                    రామచంద్రయ్య గారు,సీతమ్మ గారు నడి వయసు దాటిన దంపతులు.ఆయన నవ్వకుండా ఎదుటివారిని నవ్విస్తూ వాళ్ళకు నచ్చినా నచ్చక పోయినా పిచ్చి జోకులు వేస్తుంటారు. పెద్దాయన కనుక నచ్చక పోయినా ఎవరూ ఏమీ అనరు.దానితో నోటికి మూత లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.ఆవిడ ఈయనకు పూర్తిగా వ్యతిరేకం.నెమ్మదిగా నిండు కుండ మాదిరిగా చిరునవ్వే సమాధానంగా హుందాగా ఉంటుంది.ఈ మధ్య ఒక పెళ్ళిలో కనిపించి మనవరాలిని పరిచయం చేసి అమెరికా వెళ్తుందని చెప్పి అమ్మ,అమ్మమ్మల చేతి వంట తింటుంటేనే సన్నగా ఉంది.రేపు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో? ఈ రోజుల్లో పిల్లలు ఉగ్గు గిన్నె - నేతి గిన్నె తిండేగా తినేది అనేశారు.ఆ తిండి ఎవరికీ సరిపోదు కదా!ఆ విధంగా ఉగ్గు గిన్నె-నేతి గిన్నెలను మర్చిపోకుండా అందరికీ గుర్తు చేశారన్నమాట.

Tuesday, 10 May 2022

మొదటి ముద్ద

                                                               ఈ రోజుల్లో చిన్నపెద్ద అనే తేడా లేకుండా మనలో చాలా మందికి ఆకలి మందగించడం లేదా పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించడం సర్వసాధారణం అయిపొయింది.దీనికి అంతటికి కారణం జీర్ణశక్తి మందగించడమే.మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పొడి తయారుచేసుకుని మొదటి ముద్దలో రోజూ తినడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.దీని కోసం మనం శొంఠీ పొడి ఒక చెంచా పిప్పళ్ళ పొడి ఒక చెంచా,దోరగా వేయించి చేసిన వాము పొడి ఒక చెంచా,కరక్కాయ పొడి ఒక చెంచా,సైంధవ లవణం ఒక చెంచా అన్నీ కలిపి ఒక సీసాలో పోసుకుని రోజూ ఈ పొడి ఒక అర చెంచా,ఒక చెంచా మంచి నెయ్యి కలిపి మొదటి ముద్దలో తింటే ఎటువంటి ఆహారం తిన్నా త్వరగా  అరిగిపోతుంది.దీన్ని ఎవరైనా పది సంవత్సరాలు దాటిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పాటించవచ్చు.

Monday, 2 May 2022

మళ్ళీ మళ్ళీ

                                                            గత రెండు మూడు సంవత్సరాల నుండి కరోనా పుణ్యమా అని ఒకరికొకరు కనిపించడం,మాట్లాడుకోవడం లాంటి వాటితోపాటు సంబంధ  బాంధవ్యాలు సరిగా లేకపోవడంతో మొహం వాచిపోయినట్లు కొన్నాళ్ళు అందరూ ఎంతో  ప్రేమ ఆప్యాయతలతో ఉన్నారు.పరిస్థితులు కొద్దిగా చక్కబడేసరికి కొంతమందికి మళ్ళీ తల పొగరు ఎక్కువై ఎదుటి వారంటే చులకన భావం,నిర్లక్ష్యం ఎక్కువైపోతున్నాయి.ఆకలి తీరిన తర్వాత అన్నాన్ని,అవసరం తీరిన తర్వాత మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తే ఆపద వచ్చినప్పుడు ఏదీ అక్కరకు రాదు.ఒక్కొక్కసారి ఎంత డబ్బు ఉన్నా తినడానికి ఏమీ దొరకని పరిస్థితి ఎదురు కావచ్చు.మనుషులు కూడా అంతే. ఆకలి,ఎదుటి వారితో అవసరం మళ్ళీ మళ్ళీ వస్తాయి.అప్పుడు ఏమనుకుని ఏమి ప్రయోజనం?చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది.

Tuesday, 26 April 2022

ఆపత్కాలంలో ........

                                                              ఎవరికైనా అవసరమైనప్పుడు ధన రూపేణా సహాయం చేస్తేనే  సహాయం చేసినట్లు కాదు.ఆపత్కాలంలో మంచి మనసుతో నాలుగు మంచి మాటలు చెప్పి ఎదుటి వారి మనసులో ఉన్న బాధను తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.ఒక్కొక్క సారి ఈ విధంగా చెప్పే వారు కూడా లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎంతోమంది వారితోపాటు కుటుంబాలని కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నారు.కనుక ఆపత్కాలంలో ఏ చిన్న మాట సాయం చేసినా అది వారికి  ఎంతో ఉపయోగపడుతుంది.

Thursday, 21 April 2022

గులాబీ పొడి

                                                                   నాటు గులాబీ పువ్వులు రేకలు తీసి శుభ్రంగా కడిగి నీడలో ఒక పలుచటి వస్త్రం పై ఆరబెట్టుకోవాలి.రెండు రోజులకు అవి బాగా ఎండిపోతాయి.ఎండిన గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి జల్లించి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ఈ పొడితో మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.గులాబీ పొడిని సర్వ రోగ నివారిణిగా చెప్పవచ్చు. 

                                                                ఒక కప్పు మరిగించిన నీళ్ళల్లో ఒక 1/4 చెంచా గులాబీ రేకుల పొడి వేసి ఒక ని.ఆగి వడకట్టి తేనె,నిమ్మరసం కలిపితే గులాబీ టీ తయారయినట్లే.దీన్ని రోజుకి ఒకసారి తీసుకుంటే ముఖ వర్చస్సు పెరగడమే కాక శరీరాన్ని కూడా శుద్ది చేస్తుంది.

                                                             కొద్దిగా చల్లారిన పాలల్లో సరిపడా గులాబీ పొడి కలిపి పెదవులపై రాస్తే పెదవులు పొడిబారటం తగ్గుతుంది.కొద్దిగా పాలు, మంచి గంధం పొడి,గులాబీ పొడి కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసి ఒక 20 ని. తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం మృదువుగా,మెత్తగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది.రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గులాబీ పొడి వేసుకుని  స్నానం  చేస్తే  చర్మం నిగనిగలాడడమే కాక చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా  ఉంటాయి.

                                                   

   



Monday, 18 April 2022

ఓ బుల్లి పరిష్కారం

                                                                 ఈ రోజుల్లో పెద్ద,చిన్న అనే తేడా లేకుండా తల వెంట్రుకలు ఎక్కువగా  రోజూ రాలిపోతున్నాయి.దీనికి సహజ సిద్ధమైన ఓ బుల్లి పరిష్కారమే ఉల్లినూనె.ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసి రసం తీసి ఒక కప్పు కొబ్బరి నూనె,గుప్పెడు కరివేపాకు,కొద్దిగా మెంతులు  వేసి కరివేపాకు నల్లబడే వరకు వేడిచేసి చల్లార్చి వడకట్టి ఒక సీసాలో పోసుకోవాలి.దీన్ని వారానికి రెండుసార్లు తలకు నూనె ఇంకేలా మర్దన చేయాలి.ఒక అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి.ఈ విధంగా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి తల వెంట్రుకలు ఊడడం ఆగిపోవడంతోపాటు చుండ్రు ఉంటే కూడా తగ్గిపోతుంది.దీనితో వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.  

Wednesday, 13 April 2022

కీరా పుదీనా అల్లం తో చల్లగా

 కీర దోస ముక్కలు  - గుప్పెడు 

పుదీనా ఆకులు - గుప్పెడు 

అల్లం  - చిన్న ముక్క 

నిమ్మరసం  - 2 పెద్ద చెంచాలు 

ఉప్పు - చిటికెడు 

 మిరియాల పొడి  - 1/4 చెంచా 

ఐస్ గడ్డలు  - 4 మన ఇష్టం 

చల్లటి నీళ్ళు  - 1 గ్లాసు  

                                                 ముందుగ కీర,అల్లం ముక్కలు మిక్సీ లో వేసి మెత్తగా అయిన తర్వాత పుదీనా ఆకులు వేసి మెత్తగా చేసి వడకట్టి నిమ్మరసం,ఉప్పు,మిరియాలపొడి వేసి చల్లటి నీళ్ళు (కుండ లేదా కూజా నీళ్ళు వంటే శ్రేష్టం) కలిపి  గ్లాసు అంచున  ఒక నిమ్మ కాయ ముక్క గుండ్రంగా కోసి పెట్టి గ్లాసులో రెండు పుదీనా ఆకులు వేస్తే చల్లటి  కీర పుదీనాతో చల్లగా రుచికరమైన పానీయం తయారైనట్లే.ఇది వేసవిలో పిల్లలకు,పెద్దలకు కూడా చలువ చేస్తుంది.పిల్లలు కీర,పుదీనా అంతగా ఇష్టపడరు కనుక కొద్దిగా తేనె కలిపి ఇలా తయారు చేసి ఇవ్వొచ్చు.దీనిలో ఒక చెంచా నానిన సబ్జా గింజలు కూడా కలుపుకోవచ్చు.ఒక గ్లాసు నీళ్ళకి ఒక గరిటె చొప్పున పెరుగు వేసి కవ్వంతో గిలకొట్టి మజ్జిగ చేసి పైవన్నీ కలిపి చల్లగా వేసవిలో త్రాగవచ్చు. 

Friday, 8 April 2022

సబ్జా గింజలు

                                                  సబ్జా గింజలు రుద్ర జడ అనే మొక్క నుండి తీస్తారు.ఈ మొక్కలు ఇంతకు ముందు రోజుల్లో అందరి ఇళ్ళల్లో ఉండేవి.వీటి  కంకులు ఎండిన తర్వాత గింజలు సేకరించి నిల్వ చేసుకునేవారు.ఇవే సబ్జా గింజలు.వేసవి రాగానే ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం ఇంట్లో అందరికీ అమ్మ,అమ్మమ్మ,నానమ్మలు రోజుకొక రకంగా నిమ్మరసంలో కానీ,సేమ్యా ,సగ్గుబియ్యం పాయసంలో కానీ,ఏదేని పండ్ల రసంలో కానీ ,పాల ఐస్ తయారీలో కానీ నానిన   సబ్జా గింజలు ఒక చెంచా వేసి కలిపి ఇచ్చేవారు.ఇప్పుడు ఇంకా చాలా రకాల వాటిల్లో ఉపయోగిస్తున్నారు.ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాక వేసవిలో దేనిలో కలిపి తీసుకున్నా కూడా రుచితోపాటు చలువ చేస్తుంది.కొద్దిగా ఉప్పు,పటిక బెల్లం పొడి,ఒక చెంచా నానబెట్టిన సబ్జా గింజలు ఒక గ్లాసు చల్లటి నీటిలో కలిపి తీసుకున్నా రుచికరంగా ఉంటుంది.ఇది పిల్లలు అందరికీ ఎంతో ఇష్టమైన పానీయం.వేసవిలో తాటి ముంజెలు,మామిడి కాయలు,సీమ తుమ్మకాయల కోసం పిల్లలు,పెద్దలు  ఎదురు చూచినట్లే చాలామంది ఈ పానీయం కోసం ఎదురు చూస్తుంటారు.

సహజంగా బరువు తగ్గటానికి చిట్కా

                                                       ఒక చెంచా తాజా ధనియాలు ఒక కప్పు నీటిలో వేసి ముప్పావు కప్పు  అయ్యేవరకు మరిగించి వాటంతట అవే చల్లబడే వరకు ఉంచి వడకట్టి  పటిక బెల్లం పొడి సరిపడా కలుపుకుని రోజు ఒకసారి త్రాగాలి.ఇలా ఒక నెల రోజులు చేస్తే సహజంగా బరువు తగ్గుతారు.దీని కోసం ధనియాలు పొడి కానీ నిల్వ ఉన్న ధనియాలు కానీ వాడకూడదు.ధనియాలు పొడి చేసి నిల్వ పెట్టుకుంటే దానిలో ఉన్న సహజ గుణాలు కోల్పోతాయి కనుక తాజా ధనియాలతో మాత్రమే తాయారు చేసుకోవాలి.

Friday, 1 April 2022

శుభకృత్ శుభాకాంక్షలు

                               శుభకృత్ నామ సంవత్సరంలో అందరూ సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాలతో,సకల సిరిసంపదలతో భోగభాగ్యాలతో,పిల్లాపాపలతో,పాడిపంటలతో సరదాసరాదాగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు.



  

కాలేయంలో అదనపు కొవ్వు

                                                                సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్న వారందరికి కాలేయంలో అదనపు కొవ్వు ఉంటుంది.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా,ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.దీనితో కాలేయంలో అదనపు కొవ్వు ఏర్పడుతుంది.ఆహారంలోని విషతుల్యాలను,హానికరమైన రసాయనాలను తొలగించడమే కాక శరీరంలోని కొవ్వులు,రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.జీర్ణ వ్యవస్థ సక్రమమగా పనిచేయలన్నా కాలేయమే కీలక పాత్ర వహిస్తుంది.ఒకప్పుడు కామెర్లు వస్తే కాలేయ సమస్యలు వచ్చేవి.ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ సమస్యలు వస్తున్నాయి.  నిమ్మకాయలు కోసినప్పుడు నిమ్మరసం వాడుకుని గింజలు పడేస్తుంటాము.ఇక నుండి నిమ్మ గింజలను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే బాగుంటుంది.చిటికెడు పొడిని తేనెతో కలిపి ఉదయం,సాయంత్రం తినడం వలన కాలేయంలో ఉన్నఅదనపు కొవ్వు కరగడంతోపాటు  కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుందని దీనితో కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది.నిమ్మ గింజల పొడి తేనెతో తింటే సహజంగా వచ్చే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయట.వీటితోపాటు దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు,నారింజ,అనాస వంటి పండ్లు,బొప్పాయి,అవకాడో,బ్రకోలి,టమోటాలు,కాప్సికంలో అన్ని  రకాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.మధుమేహం ఉన్నవారిలో కూడా కాలేయం లో అదనపు కొవ్వు చేరుతుంది.కనుక ఆహార నియమాలు పాటిస్తూ మంచి  నీళ్ళు ఎక్కువగా త్రాగటం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

Wednesday, 16 March 2022

మొటిమల మచ్చలు

                                                    ముఖంపై మొటిమల తాలుకు మచ్చలు ఈ రోజుల్లో పెద్ద చిన్న తేడా లేకుండా సర్వ సాధారణమై పోయింది.ఈ మచ్చలు పోవడానికి మన ఇంట్లో దొరికే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.దీని కోసం మనము 2 చెంచాల టొమాటో రసం ,ఒక గుప్పెడు తులసి ఆకుల రసం,ఒక పావు చెంచా పసుపు,2 చుక్కల వేప నూనె లేదా టీ ట్రీఆయిల్ వేసి బాగా కలపాలి.తర్వాత ముఖానికి రాసి ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా ప్రతి రోజు చేస్తుంటే ముఖంపై మొటిమల తాలుకా మచ్చలు మాయం.

ముఖం అందంగా మెరవాలంటే.........

 తులసి ఆకుల రసం -  2  చెంచాలు 

కలబంద గుజ్జు   -  2 చెంచాలు 

ముఖం మెరుపు రావాలంటే ఈ రెండు బాగా కలిపి ముఖానికి రాసి ఒక అరగంట ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం అందంగా మెరుస్తూ ఉంటుంది.  

తులసి ఆకు రసం బదులుగా పొడి అయినా వాడుకోవచ్చు.రసం 2 చెంచాలు వాడితే పొడి 1 చెంచా వాడుకోవాలి. 

Tuesday, 1 March 2022

హర హర మహాదేవ

                                                                     భగవంతుని దయవల్ల భక్తులు అందరూ కాస్త ఊపిరి పీల్చుకుని మహా శివరాత్రి సందర్భంగా తగు జాగ్రత్తలతో తెల్లవారుఝాము నుండే అభిషేకాలు చేయించుకోవడానికి బారులు తీరడంతో శివాలయాలన్నీ 'హరహర మహాదేవ శంభో శంకర శివ శివ శంకర' అంటూ మారుమ్రోగిపోతున్నాయి.చుట్టుప్రక్కల వారికి శివ నామస్మరణ వీనుల విందుగా ఉంది.మనస్విని,స్నేహితురాళ్ళ ఇళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండడంతో తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి అందరూ ఒకచోట చేరి కబుర్లు మొదలెట్టారు.ఉదయాన్నే లేచి అందరూ కలిసి ఏటికి (కృష్ణా  నదికి) స్నానానికి వెళ్లి ఒకరికొకరు పోటీపడి 108 మునకలు మునిగి ఒడ్డుకు చేరి ఇసుకతో గౌరీదేవిని చేసి పూజించి నీళ్ళల్లో వదిలిపెట్టి అందరినీ చల్లగా కాపాడమని నదీమతల్లికి నమస్కరించి ప్రసాదం తీసుకుని  గట్టెక్కి మెట్టెక్కి అంటూ గట్టు మీదున్న గడ్డి పీకి కొద్ధిగా గోవులకు మేత వేసి  పెద్దవాళ్ళు చెప్పిన మంత్రం చెప్పి దారిలో కనిపించిన రేగుపండ్లు కోసుకుంటూ మధ్యలో శివాలయానికి  వెళ్ళి ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత క్రొత్త దుస్తులు ధరించి ఇరుగుపొరుగు పెద్దవాళ్ళతో కలిసి అందరూ ప్రక్క ఊరిలో రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళకు ఎడ్ల బండ్లు ఎక్కి వెళ్ళి ప్రోద్దుపోయేదాకా సరదాగా అటుఇటు తిరిగి రకరకాల ఆట వస్తువులు కొనుక్కోవడం,హరికథలు,బుర్రకథలు,పిట్టకథలు  వింటూ ఏ తెల్లవారుఝాముకో ఇంటికి రావడం ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవో కదా!అని మురిసిపోతూ ఒకరికి ఒకరు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అలాగే నేను కూడా నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ మున్ముందు అందరూ సంతోషంగా,సుఖంగా,ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యఅష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Friday, 14 January 2022

కొంగ్రొత్త వెలుగులు,శుభాకాంక్షలు

                                                              భోగ భాగ్యాలను ఇచ్చే భోగి ,సరదాను ఇచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ మన అందరికీ  క్రొత్త సంవత్సరంలో కొంగ్రొత్త వెలుగులు నింపాలని,సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సదా భగవంతుడు ప్రసాదించాలని,పాడి పంటలతో,ధన ధాన్యాలతో రైతులు అందరూ చల్లగా ఉండాలని,భోగిమంటలు,గంగిరెద్దులు,హరిదాసుల ఆటపాటలతో,ముంగిట రకరకాల రంగవల్లులతో గొబ్బెమ్మలతో,గుమ్మానికి మామిడి తోరణాలతో,గడపకు పసుపు కుంకుమలతో ,చెరుకు  గడలు,తేగలు,కమ్మని పిండి వంటల ఘుమఘుమలతో,సరదాగా,సంతోషంగా మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియచేస్తూ పెద్దలు,పిన్నలు ఆనందోత్సాహాలతో వారి వారి సంప్రదాయాన్ననుసరించి  పండుగ జరుపుకోవాలని,మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు సంక్రాంతి,కనుమ,ముక్కనుమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.   
                                   
                                                       
                          

                                            సర్వేజనా సుఖినోభవంతు