Tuesday, 6 May 2014

ఆరంభ సూరత్వం

            అర్పిత్ అన్నిపనులు తానే ఎవరి సహాయము లేకుండా చేయగలననే ధీమాగా ఆరంభసూరత్వంతో మొదలుపెడతాడు.మొదట ఉన్నంత ఉత్సాహం తర్వాత ఉండదు.అందువలన అన్నిపనులు మధ్యలోనే వదిలేస్తుంటాడు.మళ్ళీ ఇంకొకపని మొదలెడతాడు.
వాళ్ళ టీచరు రెండు,మూడుసార్లు చూసి అర్పిత్ ని పిలిచి నువ్వు ఒక పని పూర్తికాకుండానే ఇంకొకపనిమొదలు
పెడుతున్నావు.అలా చేయకూడదు.ఏపనీ పూర్తికాదు.ఒకపని పూర్తయినతర్వాత ఇంకొకపని మొదలుపెడితే చక్కగా పూర్తి చేయగలుగుతావు అనిచెప్పింది.నీకు కావాల్సింది ఆరంభసూరత్వంకాదు.ఏపనైనా సకాలంలో సక్రమంగా సంపూర్తిగా చేయగలిగినవాడే గొప్ప.అవసరమయినప్పుడు ఎవరిసహాయం తీసుకున్న తప్పులేదు.ఈవిషయం జీవితాంతం గుర్తుపెట్టుకో వృద్దిలోకి వస్తావు అని టీచరు కోప్పడకుండా సౌమ్యంగా
అర్పిత్ కి చెప్పింది.సరే టీచర్ అని కృతజ్ఞతలు తెలిపి తనతప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నాడు.     

Monday, 5 May 2014

రాళ్ళు,రప్పలు

    రాజేంద్ర,రవీంద్ర అన్నదమ్ములు.దైవదర్శనానికి వెళ్ళినా,ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులను,అక్కను తీసుకుని
కుటుంబసమేతంగా వెళ్ళేవాళ్ళు.పదహారు సంవత్సరాలక్రితం ఒకసారి షిర్డీవెళ్లారు.బాబాదర్శనం అయినతర్వాత నాసిక్,త్రయంబక్,శనిసింగణాపూర్,రాముడు,సీత అరణ్యవాసం చేసినప్పుడు నివసించినగుహ చూశారు.
అక్కడనుండి ఎల్లోరా,ఔరంగాబాద్ ,ఘ్రుష్నేస్వర్ వెళ్లారు.తిరిగి హైదరాబాదు వచ్చినతర్వాత యాదగిరిగుట్ట,బాసర వెళ్లారు.హైదరాబాదులో చూడవలసినవి తల్లిదండ్రులకు చూపెట్టారు.వీటన్నిటికి పదిరోజులు పట్టింది.ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలుచేసి అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా మాటలసందర్భంలోజ్యోతిర్లింగాలకు అభిషేకాలతో సహా అన్నీచక్కగాచేశాము. అజంతా చాలాదూరం కనుక సమయంలేకపోవటంవలన వెళ్ళలేకపోయాము అనుకున్నారు.
  రాజేంద్ర,రవీంద్రల నాన్నగారు ఉన్నట్టుండి' చూపించారులే రాళ్ళు,రప్పలు'అన్నారు. అన్నదమ్ములిద్దరూ ఏమి మాట్లాడాలో తెలియక ఒకరి ముఖం ఒకరు  చూసుకున్నారు. కొడుకులు ఇద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టిమరీ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే' భలే మాట్లాడారులే' అని తోడుకోడళ్ళు నవ్వుకున్నారు.



Sunday, 4 May 2014

నవ్వు దివ్యఔషధం

      ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం.ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు అందరూ హాయిగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.ఎన్నో భాషలు,ఎన్నోరకాల పలకరింపులు  ఉన్నా చూడచక్కని చిరునవ్వే అన్నింటినీ మించినది.ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉంటే
అందంగా కనిపించటమేకాక,గంభీరంగా ఉండేవాళ్ళకన్నాఎంతో ప్రశాంతంగా,ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉంటారు.నవ్వు శరీరానికి ఎంతో తేలికైన మంచి వ్యాయామం.నవ్వటానికి మన శరీరంలోని కండరాలు పెద్దగా శ్రమ పడనక్కరలేదు.అదే కోపం తెచ్చుకోవటానికయితే శరీరకండరాలు ఎక్కువ శ్రమపడాలి.కోపం తగ్గించుకుని నవ్వుతూ ఉండాలి.అలాగని అనవసరంగా నవ్వకూడదనుకోండి.నవ్వు శరీరంలో ఆక్సిజన్ శాతాన్నిపెంచి,ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లను విడుదల చేయటంవలన రోగనిరోధకశక్తి పెరిగిఅనారోగ్యాలు దరిచేరకుండా చేస్తుంది.
నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఇంతకు ముందు మాట.నవ్వు ఎన్నో విధాల మేలు అనేది ఇప్పటి మాట.అందుకే నవ్వొక దివ్యౌషధం.'నవ్వటం ఒక భోగం ..నవ్వకపోవటం ఒక రోగం'అనేది నిజం.హాయిగా
నవ్వండి అందరినీ నవ్వించండి.

Saturday, 3 May 2014

సైగల భాష

         కుముదిని కూతురుతో కలిసి పెళ్ళికి బెంగుళూరు వెళ్ళింది. పెళ్ళి అయినతర్వాత వచ్చేటప్పుడు రైలు బయలుదేరిన తర్వాత కొంచెంసేపటికి ఒక  స్టేషన్లో గుంపుగా కొంతమంది విద్యార్ధులు ఎక్కారు.ట్రైనింగ్ నిమిత్తం
వేరే ఊరు వెళ్తున్నామని చెప్పారు.ఎక్కిన దగ్గరనుండి వాళ్ళల్లో ఒకతను కుముదిని కూతుర్ని తొంగి తొంగి
చూస్తున్నాడు.కుముదిని కొంచెం సేపు మాట్లాడకుండా ఊరుకుని వాడి దగ్గరకు వెళ్ళి ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నావు?అని గదమాయించి అడిగింది.ఏభాషలో మాట్లాడినా నాకు అర్ధం కావట్లేదు అంటున్నాడు.
చివరకు ఒరియా తప్ప ఏమీ రాదు అన్నాడు.సరే సైగలకు ఏ లంగ్వాజ్ తో పనిలేదు కదా!అని నా కూతురు
వైపు చూస్తే ఊరుకోను అని సైగ చేసి  తర్జని తో బెదిరించింది.దాంతో వాడు మళ్ళీ చూడలేదు.  

Friday, 2 May 2014

ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు

        ఉషశ్రీ బంధువుల్లో సావిత్రి అనే పెద్దావిడ ఉంది.వాళ్ళింటి దగ్గర కానీ,బంధువుల్లోకానీపెద్ద ముత్తయిదువ అని పూజలకు,పారాయణాలకు,పెళ్లిళ్లకు,పేరంటాళ్ళకు ఎవరు పిలిచినా తరతమ భేదం లేకుండా హాజరవుతూ ఉండేది.ఒక పెళ్ళిలో అందరూ కూర్చునిఉన్నప్పుడు ఏమిటండీ ఈమధ్య ఎక్కడా కనిపించటం లేదు అని అందరూ అడిగారు.ఏమిచెప్పమంటారండీ ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్లుంది నాపని అంది.అదేమిటండీ అలా మాట్లాడుతున్నారు అన్నారు అందరూ.ఈమధ్య మా ఆయన క్రొత్త వ్యాపారం మొదలుపెట్టారు.ఆయన ఊళ్ళు తిరుగుతూ నన్నుమా అమ్మాయి ఇంట్లో వదిలి వెళ్తున్నారు.అందుకని రాలేకపోతున్నాను అని చెప్పింది.కృష్ణా,రామా అంటూ ఇక్కడ కాలక్షేపం వేరు,అక్కడి కాలక్షేపం వేరు అయినా తప్పని పరిస్థితి అని వాపోయింది.

రైల్లో ధీర వనిత

        లోచన కొడుకు పెళ్ళయి రెండునెలలు అయింది.ఉద్యోగరీత్యా చెన్నయ్ లో ఉంటాడు.కాపురం పెట్టిద్దామని లోచన కోడల్ని,కోడలు చెల్లెల్ని,వియ్యపురాలిని తీసుకుని రైల్లో చెన్నయికి బయల్దేరింది.మగవాళ్ళు బిజీగా
ఉండటంవలన ఆడవాళ్ళు బయల్దేరారు.మిగతావాళ్ళు భయపడుతుంటే లోచన ధైర్యం చెప్పి నాకు నిద్రపట్టదు
అందుకని నేను చూస్తూఉంటానులే మీరు నిద్రపొండి అనిచెప్పింది.లలిత అందరినీ గమనిస్తూ ఉంది.ఒకతను
సీటులో కుర్చోలేనట్లుగా కదలటము సెల్ ఫోనులో ఏదోచూస్తున్నట్లు నటిస్తున్నాడు.లోచనగమనించగా
అర్ధమయినది ఏమిటంటే వాడు అందరూ నిద్రపోతున్నారో లేదోనని సెల్ కెమేరాతో చూస్తున్నాడు.రైలు ఒంగోలు దగ్గరకు వస్తుందనగా నిద్రపోతున్నలోచన కోడలిమెడలోనుండి గొలుసు లాగటానికి పట్టుకున్నాడు.లోచన
మెలుకువగా ఉందనివాడు ఊహించలేదు.లోచన భద్రకాళిలా ఒరేయ్ అంటూ అరిచేసరికి కోడలులేచి దొంగ
దొంగ అనిఅరవటం మొదలెట్టింది.వాడు కంగారుపడి రైలు ఆగుతుండగానే స్టేషన్లో దిగేశాడు.గుర్తుపట్టరనుకొని
రైలు బయల్దేరగానే వేరే భోగీలోనుండి వచ్చి అదే సీటులో కూర్చున్నాడు.ఇదుగోవీడే దొంగ అనిచెప్తే అందరూ తలా ఒకదెబ్బ వేసి టి.సి వస్తే కంప్లైయింట్ రాసుకుని రైల్వే పోలీసులకు అప్పచెప్పమంటే చేస్తాను,చెప్తాను అంటున్నాడు కానీ కదలటంలేదు.మీరు కోర్టుకు వెళ్ళాల్సొస్తుంది అంటూ ఎదోఒకటి చెప్తున్నాడు.ఫిర్యాదు చెయ్యాల్సిందే అంటే ప్రక్క స్టేషన్లో దిగి ఫిర్యాదు చేసి  తర్వాత రైల్లో రండి అంటున్నాడు.
                లోచనకు ఫోటోలు తీయటం హాబీ.దొంగని,దొంగకూర్చున్నసీటుని,టి.సినిసాక్ష్యానికి  చుట్టుప్రక్కలవాళ్ళను ఫోటోలు తీసింది.అప్పుడు టి.సి వచ్చి మీరు తర్వాతయినా ఫిర్యాదు చేసేట్లున్నారు.
 దయచేసి డిలీట్ చేయండి మేడమ్ అన్నాడు. పోలీసులకు వాడిని అప్పచెప్పి ఫిర్యాదు తీసుకునేవరకు డిలీట్ చెయ్యను అని చెప్పింది.అప్పుడు పోలీసులను తీసుకొచ్చి వాడిని అప్పచెప్పి ఫిర్యాదు తీసుకున్నారు.అదికాదు మేడమ్ ఫోటోలు డిలీట్ చెయ్యమంటే లోచన అదే మీ కుటుంబానికి ఇదే పరిస్థితి వస్తే
బాద్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తారా? రెండు గంటల తర్వాత మేము దిగిపోతాము మీరెవరో,మేమెవరో మీ డ్యూటీ మీరు సక్రమంగా చెయ్యండి ఆడవాళ్ళు ఏమిచేస్తారులే అని నిమ్మకునీరెత్తినట్లు కూర్చుంటే మీఉద్యోగాలు
ఊడిపోతాయి అంది.మిగిలిన వాళ్ళు కూడా వంతపాడారు.అప్పుడు టి.సి నాది ఈ భోగీలో పని కాదు మీకో నమస్కారం అని వెళ్ళిపోయాడు.





Thursday, 1 May 2014

మందారమొక్కకు పిచ్చుకగూడు

          చైత్ర ఇంటిప్రక్కన జానకమ్మగారిల్లు.ఇంటిముందు ఖాళీస్థలంలోమొక్కలు నాటారు.మందారమొక్క కాస్త   ఏపుగా పెరిగింది.జానకమ్మ దంపతులు కొడుకుల దగ్గరకు విదేశాలకు వెళ్ళి వచ్చేటప్పటికి మందార ఆకుల్లో
బయటకు కనిపించకుండా ఒక చిన్ని పిచ్చుకగూడు అల్లింది.జానకమ్మ రోజు గమనిస్తుండేది.వీళ్ళు లేచేటప్పటికి ఏమీ కనిపించేవికాదు.సాయంత్రము ఆరుగంటలకు జానకమ్మ దూరంనుండి గమనించగా
రెండు చిన్నచిన్నఅందమైన పిచ్చుకలు గూటిలో ఉన్నాయి.రెండురోజులతర్వాత మూడు చిన్నగుడ్లు పెట్టాయి.
కొన్నిరోజులకు పొదిగి పిల్లలను చేసినాయి.భలే ముద్దుగా ఉన్న పిల్లలు బయటకు వచ్చాయి.పెద్దవి పిల్లలకు
ఆహారం తెచ్చి పెట్టటం వాటిఆలనపాలన చూచేవిధానం మురిపెంగా చూడటంతోనే జానకమ్మకు పొద్దుగడిచి పోయేది.సిటీలో మందార మొక్కకు గూడు అల్లి పిల్లలను పెట్టిన పిచ్చుకలజంటను,పిల్లలను చూడటానికి
అందరూ వచ్చేవాళ్ళు.సిటీలో పిల్లలకు నిజమైన పిచ్చుకగూడు తెలియదుకదా అందుకని పిల్లలను తీసుకొచ్చి
తల్లిదండ్రులు చూయించేవారు.