Monday, 12 May 2014

జగమంతకుటుంబం

          సతీష్ కుటుంబం చాలాపెద్దది.ఐదుగురు అక్కచెల్లెళ్ళు,ఐదుగురు అన్నదమ్ములు.సతీష్ అందరికన్నా చిన్నవాడు.సతీష్ చిన్నప్పటినుండి అల్లరిచిల్లరిగానే ఉండేవాడు.పెద్దవాడై,పెళ్ళైనతర్వాతకూడా అతనుమారలేదు.
ఇద్దరుబిడ్డల తండ్రి అయ్యాడు.వాళ్లపోషణార్ధం ఎన్నోఅబద్దాలు చెప్పిడబ్బు సంపాదించేవాడు.అతనుచెప్పే అబద్దాలు
ఎవరు నమ్మటంలేదు కనుక క్రొత్తఅవతారం ఎత్తాడు.బంగారపుబిస్కట్లు తక్కువధరకు ఇప్పిస్తానని అందరిదగ్గర
డబ్బు తీసుకోవటం మొదలుపెట్టాడు.ఇతనిమోసానికి ఎంతోమంది బలయ్యారు.కొంతమంది వదిలేసినా అందరూ ఊరుకోరుకదా.పట్టుకుని ఒకసారి కొట్టారు.మీడబ్బుమీకు ఇస్తాను అనిచెప్పి ఎవరికీ కన్పించకుండా కుటుంబంతో
సహా పారిపోయాడు.ఇతని ఆచూకీకోసం సతీష్ కుటుంబాన్నినానాప్రశ్నలతో,ఎన్నోరకాలుగా  ఇబ్బందులు పెట్టేవాళ్ళు.చాలాసంవత్సరలతర్వాత అందరూ మర్చిపోయుంటారని స్వంత ఊరురావటం మొదలుపెడితే వాళ్ళ
కుటుంబంలోని వాళ్ళు వాళ్ళింటికి రానీయలేదు."జగమంతకుటుంబం నాది ఏకాకి జీవితం నాది"అనిపాడుకుంటూ
ఆపాటను ఫోను కి రింగుటోనుగా పెట్టుకున్నాడు.అంతకన్నా గత్యంతరంలేదు కనుక అలాచేసాడు.పిచ్చిపనులు చేయటంవలన కుటుంబానికి,అందరకీ దూరమయ్యాడు.

Friday, 9 May 2014

అతి సర్వత్ర వర్జయేత్

               రమణి చిన్నప్పటినుండి బొద్దుగా ఉండేది.పెళ్ళయి పిల్లలు పుట్టినతర్వాత ఇంకా బొద్దుగా తయారయింది.
పిల్లలు స్కూలుకి, భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పనీపాటా లేక టి.వి.పెట్టుకుని చిప్స్ తింటూ,చల్లని పానీయాలు త్రాగుతూ నూటయాభై కిలోలు బరువు పెరిగింది.అసలే ఎత్తు తక్కువ.చూడటానికి గున్నేనుగు లాగా తయారైంది.అక్కా నేను గున్న ఏనుగులాగా ఉన్నానా?లేక పిప్పళ్ళబస్తా లాగా ఉన్నానా?అని తనమీద తనే జోకులేసుకునేది.తిండిమాత్రం తగ్గించేదికాదు.నడవటానికి కూడా ఇబ్బందిపడేది.కొలెస్టరాల్,రక్తపోటు రావటంవలన బరువుతగ్గాలని వైద్యులు సూచించారు.ఆకలికి తట్టుకోలేదు,తినకుండా ఉండలేదు కనుక ఇలాఅయితే ముందు ముందు ప్రాణానికే ప్రమాదమని వైద్యులు బేరియాటిక్ సర్జరీ చేయాలని చెప్పారు.రమణికి ఆసుపత్రికి వెళ్ళటం ఇష్టం ఉండదు.ఆపరేషన్ అంటే విపరీతమైన భయం.ఆధునిక తరహాలో ఆపరేషన్లు చేస్తున్నారు.ఇంటికి తొందరగావెళ్ళొచ్చు.నువ్వు అందరిలాగా మాములుగా తిరగొచ్చు.నీభయం ప్రాణంకన్నాఎక్కువ కాదుకదా!గుండెకు కూడా మంచిది కాదు బ్రతుక్కికూడా ప్రమాదం అన్నారు కనుక చేయక తప్పదు.ఏమీ భయంలేదు అని అందరూ నచ్చచెప్తే సరేనంది.అలా మూడుసార్లు ఆపరేషన్లు చేశారు.సర్జరీ చేయటంవల్లఎక్కువ తినలేదు.తిన్నావాంతులవుతాయి.అతిగా తినకపోతే ఈతిప్పలు వచ్చేవి కాదు కదా!అయినా రమణి తినగలిగినంత ఎప్పటికప్పుడు గంట గంటకీ తింటూ ఉండటం వలన ఏమాత్రం బరువు తగ్గలేదు.అన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఉపయోగంలేదు.ముందే జాగ్రత్తగా బరువు పెరగకుండా ఉంటే ఈసమస్య వచ్చేదికాదు.అనారోగ్యం వచ్చిన తర్వాత భాధపడేకన్నా రాకముందే జాగ్రత్తపడాలి.అందుకే పెద్దలు "అతి సర్వత్ర వర్జయేత్"అన్నారు.













గిజిగాళ్ళు

          ప్రీతిక సిటీలోఉన్నా పల్లెలోఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది.వాళ్ళకాలనీ చుట్టుప్రక్కల రెండు,మూడు కిలోమీటర్లవరకు పచ్చదనంతో ఉంటుంది.ఎక్కడా వర్షం లేకపోయినప్పటికి వీళ్ళకు వర్షం పడుతూ ఉంటుంది.
ఆవాతావరణానికి ఎక్కడెక్కడి పిట్టలు,గిజిగాళ్ళు అంటే పిచ్చుకలు వస్తూఉంటాయి.ఊరపిచ్చుకలు పల్లెల్లోనే
ఎక్కువగా కనిపించటంలేదు.ఇక్కడ తలుపు తీసిఉంటే ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి.ప్రీతిక ఖాళీగా వున్నప్పుడల్లా వీటిని చూడటంతోనే కాలక్షేపం సరిపోతుంది.ఎన్నోరంగులవి చిన్నచిన్న పిట్టలు,పెద్దవి, పసుపు,నలుపు,పొగాకురంగు,పెసరపట్టురంగు,పైనగోధుమరంగు క్రిందపసుపురంగు,నలుపుఎరుపుచుక్కలతో
ఉన్నవి వస్తూవుంటాయి.ఒకరకంపిట్ట అయితే సన్నగావున్న ముక్కుతో పువ్వును చీల్చిపువ్వులోని
మకరంద్రాన్ని గ్రోలుతుంటుంది.తెల్లవారుజామున ఐదుగంటలనుండి సాయంత్రం ఆరుగంటలవరకు అనేకరకాల
అరుపులు వినిపిస్తుంటాయి.ప్రీతిక వాటికి గింజలు వెయ్యటం,నీళ్ళు పెట్టటం చేస్తుంటుంది.గిజిగాళ్ళు అంతరించిపోతున్న నేపధ్యంలో వాటిని కాపాడవలసిందిగా పర్యావరణవేత్తలు కోరుతున్నారు.మనంకూడా
శ్రమపడాల్సినపనేమీ కాదుకనుక వాటికి కొంచెంగింజలు,నీళ్ళు పెడితే కొన్నిరోజులకు అలవాటుపడతాయి.  

శంఖిణి

         మంజుల కుటుంబం ఎప్పుడు ఇండిపెండెంట్ ఇంట్లోనే ఉండేవాళ్ళు.మంజుల భర్తకి,పిల్లలకు కూడా
అపార్ట్ మెంట్ అంటే ఇష్టం ఉండేదికాదు.దేనిలోనయినా మంచి,చెడు రెండు ఉంటాయి.అందరూ కలిసికట్టుగా
ఉంటే ఆసంతోషం వేరు.లేదంటే చాలా ఇబ్బంది.అనుకోకుండా వాళ్ళ అబ్బాయి కోసం ఒకసారి అపార్ట్ మెంట్
తీసుకోవలసి వచ్చింది.ఒక్కో అంతస్తుకు నాలుగు ఏఫ్లాట్ కాఫ్లాట్ సంబంధం లేదుఅని తీసుకున్నారు.బహుశా
జీవితంలో మొదటిసారి చివరిసారి కూడా అదే కావచ్చు.మరిచిపోలేని అనుభవం.వీళ్ళ ఎదురు ఫ్లాట్ లో ఒక విచిత్ర కుటుంబం ఉండేది.ఉండేది ముగ్గురేకానీ ముగ్గురూముగ్గురే.వచ్చి గంటలుగంటలు గొప్పలు చెప్తుండేది.
నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను.నాది పడవంత కారు అనేది.ఆవస్తువు ఉందా?ఈవస్తువు ఉందా?
అంటూ తీసుకుని ఇచ్చేదికాదు.ఇచ్చినా అది పనిచేసేదికాదు.ఇనార్బిట్ కెల్దాం,నోవాటెల్ లో ఉమెన్ ఎక్స్పో ఉంది
వెళ్దామా?అంటూ కారుకీస్ తెచ్చి చివరకు మంజులకారులో బయల్దేరేది.వాళ్ళఅమ్మాయి అబ్బాయిలతో
తిరుగుతుండేది.ఈవిడలేనప్పుడు ఆయనతోపాటు వేరే వాళ్ళు గంటలుగంటలు ఉండేవాళ్ళు.ఆయనలేనప్పుడు
ఈవిడకోసం అర్థరాత్రి,అపరాత్రని లేకుండా ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు.ఈవ్యవహారం మంజులకుటుంబానికి ఇబ్బందికరంగాఉంది.ప్రక్కఫ్లాట్లో ఏమిజరుగుతుందో కూడా పట్టించుకోని పరిస్థితి.ఎప్పుడంటే అప్పుడు
శంఖిణిలా ఈమె మనింటికి వచ్చికూర్చుంటుంది.మనకెందుకొచ్చిన అపార్ట్ మెంట్ గోల ఖాళీ చేసేద్దామని
ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని వెళ్ళిపోయారు.

ఆర్దిక సలహాదారు

            వినమ్రకు అమ్మే సలహాదారు.వినమ్ర అమ్మవిమలాదేవి చాలాతెలివితేటలుకలది.ఏవిషయంలోనయినా
 వినమ్ర అమ్మ సలహాలేనిదే ఏపనీ చేయదు.రోజు రెండు,మూడుసార్లు ఫోనుచేసి అమ్మా ఆవిషయం అలా చేశాను ఈవిషయం ఇలా అనిచెప్పనిదే నిద్రపట్టదు.పొదుపుమంత్రం,ఆర్ధికలావాదేవీలు విమలమ్మగారికి వెన్నతో పెట్టిన  విద్య.వినమ్ర కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనానిర్ణయం తీసుకున్నాచివరగా అది మంచి నిర్ణయమా,కాదా? ఆపని లాభమా?నష్టమా?ఆపని చేసినందువలన ఏమైనా సమస్యలుంటాయా?ఇంకా
ఏమైనా మార్పులు చేయాలా అనేది విమలదేవిగారు చెప్పాల్సిందే.ఆమెమాట ఇంట్లో అందరికీ వేదవాక్కు.
'పెద్దల మాట చద్ది మూట' అన్నట్లు విమలదేవిగారి పిల్లలు,చుట్టుప్రక్కలవాళ్ళు కూడా ఆమె సలహాకోసం వస్తుంటారు.

మాతృదేవోభవ

         మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.అమ్మ అన్న మాటే ఎంతో పవిత్రమైనది.ఆప్యాయతకు,మమతానురాగాలకు మారుపేరు అమ్మ.ఎక్కడఉన్నా ప్రతిక్షణం మన గురించి ఆలోచించేది అమ్మ.తొలిఅడుగునుండి మనవెన్నంటి ఉండేది అమ్మ.మాతృదేవోభవ,పితృదేవోభవ,గురుదేవోభవ
అనితొలిపాఠం నేర్చుకున్నాబిడ్డలకు ఆదిగురువు అమ్మ.అమ్మ గురించి ఎంత వ్రాసినా తక్కువే.బిడ్డలకు ఏకష్టం  కలగకుండా కొంత వయస్సు వచ్చేవరకు అమ్మ చూస్తుంది.తర్వాత అమ్మకు ఏకష్టం కలగకుండా చూడాల్సిన
 బాధ్యత బిడ్డలది.ప్రతిఅమ్మ తనబిడ్డలు బాగోగుల తర్వాతే తనఆరోగ్యం కూడా అనుకుంటుంది.అందుకని కొంత
వయస్సు వచ్చినతర్వాత ఎన్నిపనులున్నాసరే ఎప్పటికప్పుడు అమ్మఆరోగ్యంగురించి ప్రత్యేకశ్రద్ద తీసుకోవాల్సిన బాధ్యత బిడ్డలది.

Thursday, 8 May 2014

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

         రంజితాదేవిగారిది సాంప్రదాయ కుటుంబం.బోజనసమయంలోఇంటికి ఎవరువచ్చినా భోజనంపెట్టటం ఆనవాయితీ.టీ,కాఫీ,టిఫిన్ మామూలే.వ్యవసాయకుటుంబం కనుక పనివాళ్ళకు,వచ్చినవాళ్ళకు టీ ఇవ్వటం
సంగతి చెప్పనక్కరలేదు.వీరికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి.అమ్మాయి పెళ్లయింది పిల్లలు.వాళ్ళతో ఏసమస్య లేదు.అబ్బాయి పెళ్ళిచేస్తే కోడలు చేదోడువాదోడుగా ఉంటుందని, పద్దతులు తేడాఉన్నా మారుతుందని
డబ్బుదేముందిలే చదువుకున్నఅమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారు.సరే ఈడుజోడు బాగానే
ఉందని పెళ్ళి చేసారు.అప్పటినుండి సమస్యలు మొదలయ్యాయి.ఇంటికి ఎవరన్నావచ్చినా పలకరించేదికాదు.
భువినుండి స్వర్గానికి వచ్చాననుకునేదో ఏమో ఏ.సి.గదిలోనుండి బయటకు వచ్చేదికాదు.మాఇంటికి ఎవరన్నా
వచ్చినా టీ,కాఫీ ఇవ్వము.పన్నెండున్నర్ర దాటితే భోజనంచేయమనము అనిచెప్పింది.అక్కడవేరు ఇక్కడవేరు
ఇక్కడి పద్ధతులకు నువ్వు అలవాటు పడాలి అంటే నేను మారలేనండీ అనేది.మా ఇంటికి ఎవరు వచ్చినామేము మాట్లాడము.వాళ్ళే వచ్చివెళ్ళిపోతారు అనేది.కోడలు చేదోడుగా ఉంటుందనుకుంటే కొడుకుతోపాటు కోడలికి
అత్తగారు వండి వార్చాల్సోచ్చింది.పెళ్ళయి ఇద్దరుబిడ్డల్ని కన్నా ఇప్పటికీ పూర్తిగా మారలేదు.ఆమె పద్దతికి ఎవరయినా మారాల్సిందే.ఇంకో విచిత్రమేమిటంటే కొడుకుల పెళ్ళిళ్ళయిన తర్వాత కూతుళ్ళు కన్నవారింటికి
రాకూడదు అనేది.తనపిల్లలను ఆడపిల్లలు లేకుండా ఒక్కడే కొడుకు ఉన్న ఇంటికి కోడళ్ళుగా పంపిస్తానని
చెపుతుంది.పాతిక సంవత్సరాలయినా ఇంటిభాద్యత పూర్తిగా తీసుకోదు.పెద్దవయసైనా రంజితదేవిగారికే
తప్పటంలేదు.