Sunday, 18 May 2014

డబ్బుపోయి శనివదిలింది

                     కార్తీక్ 2014 ఎన్నికలలో తప్పనిపరిస్థితులలో ఒకపార్టీ తరఫున పోటీచేయవలసి వచ్చింది.జనం
ఇంటికివచ్చి మీటింగులు పెట్టి పొద్దుపోయేవరకు సోదిచెప్పి ఇళ్ళకు వెళ్ళేవాళ్ళు.వాళ్ళకు టీ,టిఫిన్లు,కూల్ డ్రింకులు
సప్లయిచేయటంతో డబ్బుఖర్చవటమే కాక సమయం వృధాఅయ్యేది.ఆపార్టీ అంటే ఇష్టంలేకపోయినా కార్తీక్ అంటే ఉన్నఅభిమానంతో చాలామంది ఓటు వేశారు.అయినా కొద్దిపాటి తేడాతో ఓడిపోయాడు.ఈలోపు కార్తీక్ దగ్గర చాలా  డబ్బు మంచినీళ్ళప్రాయంలా ఖర్చయింది.అయినా కార్తీక్ బాధపడలేదు.ఇంతటితోనే పోయింది లేకపోతే ఈఐదు సంవత్సరాలు సమయం వృధా అవటమేకాక నానాఇబ్బంది పడవలసి వచ్చేది అని కార్తీక్ సంతోషించాడు.ఇంతకు
ముందు "డబ్బుపోయి శనిపట్టింది" అని శాస్త్రం.ఇప్పుడు కార్తీక్ క్రొత్తగా"డబ్బుపోయి శనివదిలింది"అనుకున్నాడు.

ముగ్గు కర్ర

              లక్ష్మమ్మ అన్నవరం దగ్గర ఒకచిన్నఅందమైన పల్లెటూరులో వుంటుంది.ఆఊరిలో దాదాపుగా అందరికీ    చక్కగా,అందంగా ముగ్గులు వెయ్యటంవచ్చు.పెద్దపెద్దముగ్గులు అందంగా వేయటమనేది ఒకకళ.అదికూడా  అందరికీ వంటబట్టదు.లక్ష్మమ్మ,పిల్లలు రోజు తెల్లవారుజామున ఆవుపేడతో కళ్ళాపుకొట్టి,పెద్దపెద్దముగ్గులు వేస్తారు.వీళ్ళవాకిలి పచ్చగా తెల్లటిముగ్గుతో చూపరులను ఆకట్టుకుంటుంది.లక్ష్మమ్మ ఇంటిప్రక్క వాళ్ళఅమ్మాయి
రోజాకి అన్నిపనులు వచ్చుకానీ "ముగ్గుకర్ర" వెయ్యటం కూడా రాదు.అంటే తిన్నగా ముగ్గుతో గీతగీయటం కూడారాదు.రోజాకి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించారు.ఆఊరిలో కోడలికి వాకిట్లో ముగ్గులు వెయ్యడం రాకపోతే చాలాతప్పు.ఆవిషయం వీళ్ళకు తెలియదు.ఒకరోజు వాళ్ళఅత్తగారు రోజా వాకిట్లో ముగ్గువేసిరా అంది.నాకు ముగ్గువెయ్యటంరాదని రోజా అందివ్వ ముగ్గువెయ్యటం రాకపొవడమేమిటి?అని కొడుకు,భర్త ఇంటికి వచ్చినతర్వాత చెప్పి నానారాద్దాంతంచేసి ముగ్గులు నేర్చుకుని,వెయ్యటం వచ్చినతర్వాత కాపురానికిరా అప్పటివరకు పుట్టింట్లో ఉండమని పంపించేశారు.మాఅమ్మాయికి ముగ్గులురావని నేర్చుకున్నతర్వాత అత్తారింటికి రమ్మని పుట్టింటికి పంపారు.నువ్వు మాఅమ్మాయికి ముగ్గులు నేర్పమని లక్ష్మమ్మను అడిగింది.ఇదేమి చోద్యం ఈరోజుల్లో పిల్లను ముగ్గులకోసం పుట్టింటికి పంపటంఏమిటి?అని ముగ్గులు నేర్పి రోజాని కాపురానికి పంపారు.  
  

Saturday, 17 May 2014

వజ్రాయుధం

               2014 ఎన్నికలు ఒక నిశ్శబ్దసమరం.నోటితో మాట్లాడకుండా ఓటుఅనే వజ్రాయుధంతో వేటువేసి విజ్ఞతతో ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు.ముందే ఊహించినా ఫలితాలువచ్చేవరకూ ఉత్కంటే.ఎవరికి ఎక్కడ పట్టం కట్టాలో
అక్కడ బ్రహ్మరథం పట్టారు.ఎప్పటిలా అదేమాపార్టీ అని ఒకదానికి పరిమితమవ్వకుండా ఆలోచించి ఎన్నిక చేశారు.
కొన్నిచోట్ల ప్రలోభాలకు లొంగిపోయినాఎక్కువమంది విచక్షణతో, సమర్థవంతంగా నాయకులను ఎన్నుకున్నారు.
అలాగే నాయకులు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎన్నికల ముందు చెప్పినమాటలు
నిలబెట్టుకుని,అవినీతికి స్వస్తిపలికి,నీచరాజకీయలను అంతమొందించి,ప్రజోపయోగమైన పనులు చేపడుతూ సమర్ధతతో రాష్ట్రాలను,దేశాన్నిప్రతిభావంతంగా ముందుకు నడిపించాలని ఆశిద్దాం.   

Friday, 16 May 2014

వేసవిలో చల్లచల్లగా .....

1)సబ్జాగింజలను నీళ్ళల్లో వేయాలి.బాగా నానినతర్వాత చల్లటినీటిలో పంచదార కలుపుకుని త్రాగాలి.
2)పుదీనా ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చాలి.ఇష్టమైన వాళ్ళు పచ్చిఆకులు వేసుకోవచ్చు.దీనిలో తేనే,నిమ్మరసం కలిపి త్రాగాలి.
3)జాల్జీర నీరు త్రాగాలి.ఇంట్లో చేసుకోలేకపోతే జాల్జీరపౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది.
4)రాగిజావ తయారుచేసి పాలుకానీ,మజ్జిగ కానీ కలిపి త్రాగాలి.
5 )లస్సీ,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
6)నీటిశాతం ఎక్కువగా ఉన్నపండ్లు అంటే పుచ్చకాయ,తర్బుజ తినాలి.రసం రూపంలోనయినా త్రాగొచ్చు.
7)కొబ్బరి నీరు త్రాగటం వేసవిలో చాలామంచిది.
8)తాటి ముంజెలు వేసవిలోనే దొరుకుతాయి కనుక తినటంవలన చాలా ఉపయోగాలున్నాయి.కోలెస్టరాల్ ని నియంత్రిస్తుంది.శరీరానికి చలువ చేస్తుంది.
9)టీకోలా అంటే కొంచెం నీళ్ళల్లో టీపొడి వేసి మరిగించి వడకట్టి దానిలో చల్లటినీరుపోసి పంచదార వేసి కలిపితే లైట్
పొగాకు,నారింజరంగు కాకుండా మంచి రంగులో పానీయము తయారౌతుంది అదే టీకోలా.మనం వేసే పొడిని బట్టి రంగు వస్తుంది.
10)వేసవిలో మామిడికాయలు ప్రత్యేకం కనుక మరీ ఎక్కువగా తినకూడదు. వేడి కనుక మితంగా తీసుకోవాలి. 

Thursday, 15 May 2014

కల్లు తాగిన కోతి

            సౌగంధిని ఒక ఉన్నత కార్యనిర్వహణాధికారి.తనవృత్తిని దైవంగా భావించి పక్కాప్రణాళికతో పనులు చేస్తుంది.ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా తనబృందంలోని నాయకులను అస్సలు ఊరుకోదు.అందరికన్నా
తనబృందం ముందంజలో ఉండాలనుకుంటుంది.ఈక్రమంలో అందరిమీద "కల్లు తాగిన కోతి"లా అరుస్తుంటుంది.
ఈమెలోఇంకొక చెడ్డగుణం ఏమిటంటే తనకు ఇంటాబయటా ఏమైనా చిరాకు వచ్చినా అదేవిధంగా అరుస్తుంది.
ఇంటివిషయాలు ఇంట్లో వదిలేయాలి.కార్యాలయం విషయాలు కార్యాలయంలో వదిలేయాలి.అప్పుడు ఎవరికీ
ఇబ్బంది ఉండదు.ఎవరి మనసు నొచ్చుకోదు.అందరూ గౌరవభావంతో ఉంటారు.ఇంట్లో ప్రేమగా ఉంటారు.మనకు
చిరాకుగా ఉందని ఎదుటివాళ్ళమీద అరిస్తే ఎంతమంచివాళ్లకయినా,ఎంతఉన్నతపదవిలోఉన్నా విలువ,గౌరవం ఉండదు.పైకి నవ్వు పులుముకున్నామనసులో తేలికభావం ఉంటుంది. 

స్పూర్తి

              ప్రణీత పిల్లలను వైద్యశాస్త్రం చదివించటానికి స్పూర్తి ప్రణీత అమ్మమ్మ.ఆరోజుల్లోనే తనకొడుకును వైద్యవిద్య చదువుకోమని ప్రోత్సహించింది.వైద్యవృత్తి పవిత్రమైనది.ఎంతోమందికి  సేవచేసి ప్రాణదానం చేసేభాగ్యంకలుగుతుంది.
కస్టపడి చదివి మంచివైద్యుడుగా పేరు తెచ్చుకోవాలి అనిచెప్పేది.అలాగే చక్కగా చదివి మంచివైద్యుడుగా పేరుతెచ్చుకుని అమ్మమాట విని అమ్మసంతోషపడేలా చేశాడు.ఈవిషయం చిన్నప్పటినుండి వినటం వలన ప్రణీతకు కూడా వైద్యవిద్య అంటే ఆసక్తి.దానికి తోడు పిల్లలకు కూడా అదే ఇష్టం.అందుకని తన ఇద్దరు పిల్లలను వైద్యవిద్యను అభ్యసించమని చెప్పింది.చదవాలంటే చాలాకష్టమైనప్పటికి,జీవితంలో నిలదొక్కుకోవటానికి ఎక్కువ
సమయం పట్టినప్పటికీ పదవీవిరమణలేకుండా ఓపికఉన్నన్నిరోజులు ప్రజలకుసేవచేసే అవకాశంఉంటుంది.పైగా
వైద్యవిద్య ఎంతో విలువైనది,గౌరవప్రదమైనది.ఇటీవలి కాలంలో త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపటం వలన వైద్యుల కొరత ఏర్పడనుంది.ప్రణీత అమ్మమ్మ స్పూర్తి వలన ప్రణీత కూడా తనపిల్లలను మంచి వైద్యులుగా తీర్చిదిద్దుతుంది.   

Monday, 12 May 2014

నవ్విన నాపచేను

                జయేష్ చిన్నప్పుడు సన్నగా గాలివీస్తే పడిపోయేటట్లుండేవాడు.జయేష్ పెద్దమ్మకొడుకు సుభాష్ బలంగా ఉండేవాడు.ఇద్దరు దాదాపు ఒకే వయస్సు.జయేష్ తాతగారు జయేష్ కన్నా సుభాష్ ప్రయోజకుడు
అవుతాడు వీడు పుష్టిగా ఉన్నాడు చదువుకోవటానికి శక్తి ఉంటుంది.జయేష్ పీలగా ఉండటంవలన చదవగలిగే
శక్తి లేక ప్రయోజకుడవటం కష్టం అని జోస్యం చెప్పేవారు.సుభాష్ గొప్పగా ఫీలయ్యేవాడు.చివరకు సుభాష్
పదోతరగతి పాసవ్వలేకపోయాడు.చదువు ఆపేసి చిన్నఉద్యోగంలో స్థిరపడ్డాడు.జయేష్ పట్టుదలగా చదివి
వైద్యవృత్తిలో స్థిరపడి పెద్దఆసుపత్రి కట్టించి మంచివైద్యుడుగా పేరుతెచ్చుకున్నాడు."నవ్విన నాపచేనుపండింది"
అని శాస్త్రం.అలాగే చిన్నప్పుడు చదుకోవటం కష్టం అన్నవాళ్ళే జయేష్ ప్రయోజకత్వాన్ని మెచ్చుకుంటున్నారు.