Wednesday, 4 June 2014

వెఱ్రిపప్ప

             సిటీకి దగ్గరలోఉన్న రెండు పల్లెల్లో ఒకపల్లెలోని వాళ్ళు చాలామంది మంచి చదువులు చదువుకొని వేరే
సిటీల్లోను,వేరేదేశాలలో స్థిరపడ్డారు.ఇంకొకపల్లెలోని వాళ్ళు కొద్దిమంది అప్పుడప్పుడే పెద్దచదువులు పూర్తిచేశారు.
జానకిది చదువుకున్నవాళ్ళున్నపల్లె.జానకి బాగా చదువుకుని మంచిపద్దతుల్లో పెరిగినపిల్ల.జానకిని చదువుకోని
వాళ్లున్నపల్లెలోని చదువుకున్న అబ్బాయికిచ్చి పెళ్ళిచేశారు.సిటీకి అడుగుదూరంలో ఉన్నాజానకి అత్తవారింటికి వెళ్ళేటప్పటికి వాళ్ళింట్లో వాళ్ళ భాష కొంచెం తేడాగా ఉండేది.స్పూన్లు అనటానికి బదులుగా స్కూన్లు అని,గరిటని
గంటి అనిఅనేవాళ్ళు.ఇంకాకొన్ని అలాగే మాట్లాడేవాళ్ళు.జానకి ఎలాగయితే కష్టపడి ఆఅలవాట్లన్నీ మాన్పించి
మంచి భాష అలవాటు చేసింది.ఆవెఱ్రిపప్పలను మార్చటం చాలా కష్టం వాళ్ళు ఎవరుచెప్పినా వినేరకం కాదు అని
 అందరూ అన్నారు.జానకి దాన్ని చాలెంజ్ గా తీసుకుని నేను మార్చగలను అని వాళ్ళను మార్చి చూపించింది.
ఆశ్చర్యం ఏమిటంటే ఆ వెఱ్రి పప్పలు తెలివితేటలు నేర్చుకుని,వేషభాషలు మార్చుకుని జానకి వాళ్ళను మోసంచేసి
జానకినే"వెఱ్రి పప్పను"చేసేశారు.వాళ్ళను బాగుచేసి తను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లయింది జానకి పరిస్థితి.
   

దరిద్రపు అలవాటు

          ఇష్రిత ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు.తన పనేదో తను చేసుకుంటూ సహోద్యోగులు కనిపిస్తే నిష్కల్మషంగా     చిరునవ్వుతో పలకరించటమే తప్ప బాతాఖానీ కొట్టదు.అలాంటిది ఒకరోజు కారిడార్లో వెళ్తుండగా తన పేరు
వినిపించింది.ఏమిటోనని నిలబడేసరికి కొంతమంది కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు.ఇంతకీ దాని సారాంశమేమిటంటే ఇష్రితకు గర్వమనీ,ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదనీ అనుకుంటున్నారు.అదేమిటి?
నేను ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తుంటాను కదా!ఆరకంగా మాట్లాడుకోవటమేమిటి? అనుకుంది.
ఉన్నతవిద్యనభ్యసించి కూడా నలుగురూ మాట్లాడుకునేటప్పుడు వేరేవాళ్ళగురించి తప్పుగా మాట్లాడుకోవడం
అంత "దరిద్రపు అలవాటు"ఇంకొకటి ఉండదు.స్నేహంగా ఉంటూనే వాళ్ళ వెనుక ఏదోఒకటి ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు.ఇప్పుడు ఇదొక చెత్త ఫాషనయిపోయింది.ఈఅజ్ఞానం నుండి ఎప్పుడు బయటపడతారో ఏమో? 

Tuesday, 3 June 2014

తొలిసారి- మలిసారి

           అద్విక తొమ్మిదోతరగతి చదువుతోంది.మొట్టమొదటగా స్కూలులో చేర్చినప్పుడు అమ్మానాన్న తరగతిగదిలోనికి పంపించి బయటకు రాగానే పరుగెత్తుకుంటూ రెండుసార్లు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది.
మళ్ళీ పంపిస్తారేమోనని చెట్లచాటున దాక్కుంది.ఇంతలో వాళ్ళ తాతగారు వచ్చి నేను పంపిస్తాను రమ్మని
ఎత్తుకుని తీసుకెళ్ళారు.మళ్ళీపరుగు లంకించుకుందామనుకునేసరికి ఎత్తుకుని వీపుమీద గట్టిగా ఒక్కటిచ్చారు.
ఇక అంతటితో ఏడ్చుకుంటూ కదలకమెదలక కూర్చుండిపోయింది.కానీ అంత చిన్నవయసులో కూడా అద్వికకు
బాగా కోపమొచ్చింది.తాతగారితో మాట్లాడకుండా అలిగి నానా హంగామా చేసింది.ఆయన ఇంకెప్పుడుకొట్టను అని మాటిస్తేగానీ మామూలవలేదు.అద్వికను వాళ్ళ తాతగారు కొట్టడం అదే" తొలిసారి-మలిసారి."

సుత్తాయి

         ఊళ్ళల్లో అసలు పేర్లకన్నాపెట్టుడు పేర్లతోనే ఎక్కువ పిలుస్తుంటారు.చిన్నప్పుడు కానీ,కొంచెం పెద్దయిన తర్వాత కానీ చేసిన చిలిపిపనులు కానీ,చెడ్డపనులు కానీ గుర్తుపెట్టుకుని మరీ ఒకపేరు పెట్టేసి పిలుస్తుంటారు.
ఈసుత్తాయి అనేపేరు కూడా అలాంటిదే.అసలుపేరు శేఖర్ అయితే చిన్నప్పుడు ఒకపెద్దాయన అల్లరి చేస్తుంటే
గట్టిగా తిట్టి,కొట్టటానికి వెంటపడేసరికి శేఖర్కి కోపమొచ్చిఒకసుత్తి తీసుకుని ఆపెద్దాయన తలపై కొట్టటానికి
ప్రయత్నించేసరికి ప్రక్కన ఉన్నాయన పట్టుకుని ఏరా!వేలేడంతలేవు సుత్తితెచ్చి పెద్దాచిన్నాలేకుండా తలపై
కొడదామనుకుంటున్నావా?అని శేఖర్ ని పట్టుకుని నాలుగంటించి అంటే నాలుగు దెబ్బలు వేసి రేపటినుండి
వీడిని "సుత్తాయి"అని పిలవండిరా అని హుకుం జారీచేశాడు.ఇక అప్పటినుండి శేఖర్ పెళ్ళయి పిల్లలు మంచి
ఉద్యోగాలలో స్థిరపడినా అసలుపేరుతో పిలవకుండా పెట్టుడు పేరుతోనే అందరూ పిలుస్తారు.




































Monday, 2 June 2014

లాలీ వచ్చిందోచ్

         శిరోమణి నల్లగా,పొడవుగా ఉంటుంది.పోలికలు కాస్త ఫర్వాలేదు కానీ తనకు తానే నాఅంత అందగత్తె ప్రపంచంలో ఎక్కడా లేదనుకుంటుంది.తెలివిగా,చక్కగా మాట్లాడాననుకుని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎదుటి
వాళ్ళను అవమానపరుస్తుంటుంది.తనుమాత్రం ఫోనుచేయదు.కానీఎదుటివాళ్ళు చేస్తేమాత్రంగంటలు గంటలు
మాట్లాడుతుంది.చిన్నప్పుడైతే లారీని లాలీ అన్నా ఫర్వాలేదు కానీ పెద్దయిన తర్వాత కూడా లారీ అనటానికి బదులుగా" లాలీ" అనే అంటుంది.కబుర్లు మాత్రం బోలెడు చెప్తుంటుంది.చిన్నప్పుడు పెద్దయిన తర్వాత వెంట్రుకను పెళ్లి చేసుకుంటానని,చెత్త కుప్పను పెళ్ళి చేసుకుంటానని చెప్పేది.పెద్దయినా కూడా అలాగే అత్తిపిత్తి ఆలోచనలు అంటే సొల్లుకబుర్లు చెప్తుంటుంది.అందుకే అందరూ శిరోమణి రాగానే రారా ఏమిటి విశేషాలు? అంటూనే ఏదైనా
మనసులో బాధపడుతుందేమో అనుకోకుండా మన"లాలీ వచ్చిందోచ్"అంటూ నవ్వుతుంటారు.





















Sunday, 1 June 2014

పక్షపాతం

             కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపట్ల పక్షపాతం చూపిస్తుంటారు.అందరినీ ఒకేరకంగా కనిపెంచినా ఒక
బిడ్డను ఒకరకంగా ఇంకొకబిడ్డను ఇంకొక రకంగా చూస్తుంటారు.తల్లిదండ్రులంటే పక్షపాతం లేకుండా ఎంతమంది
బిడ్డలున్నాఅందరినీ సమానంగా చూడగలగాలి లేదంటే ఒక్క బిడ్డతో సరిపెట్టుకుని వాళ్ళనే చూచుకోవాలి.సుచిత్రకు
తెలిసిన ఒకామెకు ఇద్దరు ఆడపిల్లలు.ఇద్దరికీ ఒక సంవత్సరమే తేడా అయినా పన్నెండేళ్ళ చిన్నపిల్లను ఒళ్లో పడుకోబెట్టుకుని మాచిన్నాడిని ఏమ్మన్నా అన్నావంటే ఊరుకోను అని పెద్దపిల్లను బెదిరించి చిన్నపిల్లకు ముద్దులు పెడుతుంటుంది.అప్పుడు పెద్ద అమ్మాయి హావభావాలను గమనించి ఉంటే అసలు తల్లి అలా ప్రవర్తించదు.తల్లే చెల్లంటే ఈర్ష్య పుట్టేలా చేతులారా చేసినట్లవుతుంది.తల్లి ఇద్దరినీ సమానమైన ప్రేమతో చూడాలి.ఈరకంగా ఎవరూ పక్షపాతం చూపకూడదు.పిల్లలు పెద్దయినతర్వాత ఈర్ష్య,అసూయా,ద్వేషం మనసులో ఏర్పడకుండా అక్కాచెల్లెళ్ళు,
అక్కాతమ్ముళ్ళు,అన్నదమ్ములు,అన్నాచెల్లెళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళనుబట్టే,వాళ్ళు చేసిన అలవాట్లనుబట్టే  ఒకరికొకరు ప్రేమ,ఆప్యాయత,అనురాగాలతో ఉంటారు.
        

పాలల్లో తోడు

           శంకరరావు నిరుపేద కుటుంబంలో పుట్టాడు.సరిగ్గా చదువుకోకుండా ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు.పెద్ద అయిన తర్వాత బాగా సోమరితనం అలవాటయి పోయింది.కష్టపడి పనిచేయకుండా పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ పేకాటరాయుళ్ళ దగ్గర కూర్చోవటానికి అలవాటుపడ్డాడు.ఊరికే ఎవరూ కుర్చోబెట్టుకోరు కదా
అందుకని వాళ్ళకు అవసరమైన పనులు అంటే సిగరెట్లు,మందు అన్నీ తెప్పించుకునేవాళ్ళు.పోలీసులు వస్తే చెప్పటానికి బయట కాపలా పెట్టేవాళ్ళు.వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.అంతే తప్ప వేరే పని చేసుకుందామనే ఆలోచన ఉండేది కాదు.పేకాటరాయుళ్ళకు ఇతను లేకుండా పని జరిగేదికాదు.పాలల్లో తోడు వేయనిదేపెరుగు తోడుకోనట్లుగా శంకరరావు లేనిదే ఆట మొదలెట్టరని ఇతన్ని" పాలల్లో తోడు" అని అందరూ పిలవటం మొదలు పెట్టారు.ఇక అతని అసలుపేరు కనుమరుగై పాలల్లో తోడుగా స్థిరపడిపోయాడు.