జానకమ్మ మనుమళ్ళు,మనుమరాళ్ళు అందరూ అమెరికాలో ఉంటున్నారు.జానకమ్మ అక్క సంతానం,మనవ సంతానం కూడా ఉద్యోగ రీత్యా భారతదేశంలోనే వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు.అందరూ ఉన్నత స్థానాలలోనే ఉన్నారు.జానకమ్మ మనవరాలి పెళ్ళికి అందరూ తప్పకుండా రావాలని అమెరికా నుండి కూడా అందరూ వస్తున్నారని మరీ మరీ చెప్పింది.చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళిలో అందరూ కలిసి మాట్లాడుకోవచ్చని ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు.ఇంతా కష్టపడి వస్తే జానకమ్మ మనవళ్ళు,మనవరాళ్ళు తెల్లారి లేచిన దగ్గర నుండి ముఖ పుస్తకాల్లో ఛాయాచిత్రాలు చూస్తూనే ఉంటారు.ఎదురుగా వున్నవాళ్ళు కూడా ఎవరో తెలియనట్లు ఎవరినీ పలుకరించకుండా ఏటో చూస్తూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.అమెరికాలో డాలర్లు సంపాదించుతున్నామని మీకన్నా మేమే గొప్ప అని నిలువెల్లా గర్వంతో విర్రవీగి పోతున్నారు.అక్కడ చిన్న ఉద్యోగం చేసినా,మెతుకు పోతే బతుకు పోతుందేమో అన్నట్లుగా బతికినా ఇక్కడ ఎవరికీ తెలియదులే అనే ధీమా.ఒకవేళ చాలా డబ్బు పోగేసుకున్నా ఎవరికీ వాళ్ళే తింటారు,ఖర్చు పెట్టుకుంటారు.ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదు.ఎప్పుడైనా ఒకసారి కనిపించే బంధువులతో ప్రేమగా ఒక మాట మాట్లాడితే చాలు కదా!దీని భాగ్యానికి చోద్యాలు.పెళ్ళిలో ఇదో పెద్ద చర్చ.మొత్తానికి జానకమ్మ ఒదిన జానకమ్మను అందరిలో అడగనే అడిగేసింది.ఏమిటే ఆ పిల్లలకు అంత మిడిసిపాటు?నువ్వు రావాల్సిందే అన్నావని పనులన్నీ పక్కనపెట్టి వస్తే ఇదా ప్రతిఫలం అంటూ దులిపేసింది.పాపం జానకమ్మ బిక్కచచ్చిపోయింది.తను మాత్రం ఏమి చేయగలదు.తనదీ అదే పరిస్థితి.బయటకు చెప్పుకోలేదు కదా.!ఇదండీ నేటి కొత్త పోకడ.
Friday, 26 August 2016
Monday, 22 August 2016
వేడెక్కిన నీళ్ళు
మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ వాహనాన్ని అయినా ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటాము.ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఎండలు మండిపోతున్నాయి.ఈ నేపధ్యంలో వాహనంలో పెట్టిన ప్లాస్టిక్ సీసాలో నీళ్ళు వేడెక్కిపోతాయి.తిరిగి రాగానే దాహం వేసి గోరువెచ్చగా అయిన నీళ్ళను తాగుతాము.ఎండలో ఉన్న ప్పుడు ప్లాస్టిక్ సీసా వేడెక్కి తయారీకి ఉపయోగించిన పదార్ధాలు కరిగి ఆ రసాయనాలు నీళ్ళల్లో కలిసిపోతాయి.ఆ నీటిని మనం తాగటం వలన కాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.కనుక ప్లాస్టిక్ సీసాలో వేడెక్కిన నీటిని తాగక పోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
కొంటె కోణంగి
సత్యజిత్ మహా కొంటె కోణంగి.చిన్నప్పటి నుండి అన్నీ తుంటరి పనులు చేస్తుండేవాడు.పల్లెల్లో గేదెలు ఈనిన నెల తర్వాత నుండి దూడలు తిరుగుతూ, గెంతులు వేస్తూ పచ్చగడ్డి కొరకటం అలవాటు పడతాయని వాటిని వదిలేసి ఉంచేవారు.పిల్లలందరూ బుజ్జాయి అంటూ దాని వెనుకబడి పరుగెత్తుతూ ఆటలు ఆడేవాళ్ళు.ఐదేళ్ళప్పుడు ఒకసారి సత్యజిత్ ఆడుతూ మధ్యలో పాసు పోసుకోవడానికి వెళ్ళి పోస్తుపోస్తూ దాన్ని తీసికెళ్ళి దూడ నోట్లో పెట్టేశాడు.ఇంతలో పెద్దవాళ్ళు చూచి ఒరే!దూడ కొరికితే చచ్చిపోతావు అంటూ దూడ నోరు తెరిచి పట్టుకుని వాడిని అవతలికి పంపారు.ఇది మచ్చుకి మాత్రమే.అన్నీ ఇటువంటి కొంటె పనులు చేస్తుంటే అందరూ కొంటెగాడు అనటం మొదలెట్టారు.అదే క్రమంగా కొండిగాడు అయ్యాడు.వాడు ఎంత పెద్దయినా అసలు పేరు కన్నా పెద్దవాళ్ళు,దగ్గరి బంధువులు మా కొండిగాడు అనే ఆప్యాయంగా పిలుచుకుంటారు.అలా పిలవొద్దు అంటే చిన్నప్పటి కొంటె పనులు గుర్తు చేస్తారని నవ్వి ఊరుకుంటాడు.
Saturday, 20 August 2016
కిలకిల నవ్వుతూ....
అమెరికాలో ఉన్నఐశ్వర్య చిన్నప్పటి నుండి అమాయకంగా లేడిపిల్లలా గెంతుతూ ముఖాన చెదరని చిరునవ్వుతో సరదాగా సంతోషంగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ గడిపేది.పెళ్ళయి పిల్లలు పుట్టినా ఆ సరదాలు,ముచ్చట్లు పోలేదు. ఐశ్వర్యకు ఒక కొడుకు,కూతురు.ఐదు నెలల కూతురు కూడా ఐశ్వర్య లాగానే ఎప్పుడూ నవ్వుతూ ఏడిపించకుండా ఆడుకుంటుంది.కూతురు పుట్టాక మొదటి రాఖీ పండుగ వచ్చిందని ముచ్చటగా ఐదు నెలల కూతురితో ఐదు ఏళ్ళ కొడుక్కి రాఖీ కట్టించింది.తనకు ఏదో అర్ధమయినట్లు పసిపిల్ల అయినా కిలకిల నవ్వుతూ అమ్మ పట్టుకుంటే అన్నకు రాఖీ కట్టింది.అన్న కూడా ఎంతో బాధ్యతగా చెల్లిని పుట్టినప్పటి నుండి తన చిన్నిఒడిలో పెట్టుకుని ఆడిస్తుంటాడు.అన్నాచెల్లెళ్ళ అనుబంధం అంటే అదేనేమో!వినగానే ముచ్చటేసింది.
నాన్నగా,తాతగా
శ్రీహరి మనస్తత్వం అసలు మంచిది కాదు.ఎదుటివాళ్ళు బాగుంటే చూచి తట్టుకోలేడు.ఏదో ఒకటి కుంటి మాటలు మాట్లాడి వాళ్ళను బాధ పెట్టనిదే మనశ్శాంతి ఉండదు.శ్రీహరి పిల్లలు నాన్నగా అని పిలిచేవాళ్ళు.అదే విధంగా మనవరాళ్ళు కూడా తాతగా అని పిలుస్తుంటారు.వయసులో ఉండగా ఉద్యోగం చేసేటప్పుడు బల్ల కింద చేతులు పెట్టి ఎలాగయితే ఒక స్థలం కొన్నాడు.ఆ స్థలం చేజిక్కించుకోవడం కోసం ఇప్పుడు కొత్తగా కూతురికి నాన్నగారు,మనవరాళ్ళకు తాతగారు అయ్యాడన్న మాట శ్రీహరి.ఏనాడూ గౌరవించని అల్లుడికి మామగారయ్యాడు.నేనంటే గౌరవం పెరిగిందని శ్రీహరి ఛాతీ వెడల్పు అవుతుందేమో కానీ అదంతా స్థల మహత్యం అని పాపం బయటకు చెప్పుకోలేకపోయినా అతని మనసుకు అర్ధమయ్యే ఉంటుంది.శ్రీహరికి ఇది తగిన శాస్తి అనుకున్నాఏంటో?రక్తసంబంధాలకు కూడా అర్ధం లేకుండా పోతుంది.డబ్బు వస్తుందనుకుంటే గౌరవించడం లేదంటే లేదు.
నాకు ఎప్పుడూ కనిపించలేదే?
ఏమండోయ్ ఒకసారి ఇటు రండి మీరు ఎప్పుడయినా ఆకుపచ్చ పావురాల్నిచూశారా?అంటూ అవి తన పక్కనే ఉన్నట్లు వెంటనే రాకపోతే ఎగిరిపోతాయేమో అన్నంత హడావిడిగా రూపాలి భర్తను పిలిచింది.భర్త సాకేత్ కూడా అంతే వేగంగా వచ్చి ఆకుపచ్చ పావురాలా?నాకు ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదే?ఎక్కడ ఉన్నాయి?అంటూ హడావిడిగా వచ్చాడు.వాటిని చూడాలంటే మనం ఆఫ్రికా వెళ్ళాల్సిందే?లేకపోతే ఏ జంతు ప్రదర్శనశాలకో వెళ్ళాలి అంటూ ఒక ఛాయాచిత్రం చూపించింది.ఓస్!ఇంతేనా?నీ హడావిడికి నేను నిజంగానే నీ పక్కనే ఉన్నాయేమో చూద్దామని అనుకున్నాను.తీరా చూస్తే బొమ్మ చూపించావు అన్నాడు.ఎంత అందంగా ఉన్నాయో చూడండి అని రూపాలి అంది.అందంగా ఉన్న మాట వాస్తవమే అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురై నిజాన్ని ఒప్పుకున్నాడు.వాటిని మీరు కూడా చూడండి.
Friday, 19 August 2016
పుణ్య స్త్రీ గా
కృష్ణ వేణి రమణమ్మ గారింట్లో చిన్నప్పటి నుండి పనిచేసేది.తమ్ముడు అంటే ఉన్న పిచ్చి ప్రేమతో తన ఇద్దరు కూతుళ్ళలో పెద్ద అమ్మాయి సునందను పదిహేను ఏళ్ళకే పాతికేళ్ళవాడికి ఇచ్చి కట్టబెట్టింది.దానికితోడు పిల్లలు పుట్టలేదు.అదీ ఒకందుకు మంచిదే అనుకోవాలి.వాడు వ్యసనాల బారినపడి పక్కా తాగుబోతు,తిరుగుబోతుగా తయారయ్యాడు.వ్యసనపరులకు వచ్చినట్లే వాడికీ హెచ్ ఐ వి వచ్చింది.వాడి వల్ల భార్యకు వచ్చింది.అసలే సునంద అభిమానవతి.వ్యాధి వచ్చిందని తెలిసినప్పటి నుండి తలెత్తుకోలేని పరిస్థితి.ఎవరి ముఖము చూడటానికి కూడా ఇష్టపడలేదు.కనీసం పుట్టింటి ముఖం కూడా చూడలేదు.సునంద భర్తని ఆసుపత్రిలో చేర్చారు.వైద్యులు చివరిదశ అని చెప్పగానే కనీసం పుణ్య స్త్రీ గా నయినా చనిపోవాలని ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చి ఉత్తరం వ్రాసి ఉరి వేసుకుని చనిపోయింది.నిండా మూడు పదులన్నా నిండకుండానే తనువు చాలించింది. అయ్యో!ఎవరు చెప్పినా వినకుండా కృష్ణవేణి చదువుకుంటున్న చిన్న పిల్లకు పెళ్ళి చేసి సునంద జీవితం నాశనం చేసిందని రమణమ్మ గారు,చుట్టుపక్కల వాళ్ళే కాక బంధువులు అందరు గొడవ చేశారు.ఇప్పుడు ఎంత మంది అనుకున్నా ప్రయోజనం ఏముంది?చనిపోయిన సునంద ఆత్మ శాంతించాలని అనుకోవటం తప్ప.
Subscribe to:
Posts (Atom)
