Sunday, 4 September 2016

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                               నా బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు,నా తోటి బ్లాగర్లకు,ఏదేశంలో ఉన్నా అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.ఇప్పటినుండయినా అందరం గణేష్ చతుర్ధి సందర్భంగా మట్టి వినాయకుని మాత్రమే పూజించి,తరించి,వినాయక నిమజ్జనం చేసేటప్పుడు నీటి కాలుష్యం తద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మన వంతుగా  పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.సర్వ విఘ్నాలను తొలగించి మనందరికీ విజయాన్ని చేకూర్చాలని,విద్యార్ధులందరికీ విద్య,ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని సదా విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.మట్టి వినాయకుణ్ణి సృజనాత్మకంగా,విభిన్నరూపాలలో ఎలా తయారుచేయాలో విద్యార్ధులకు అవగాహన కలిగించి,స్వహస్తాలతో తయారు చేసి పూజించితే ఎంత బాగుంటుందో వారికి తెలియచెప్పాలి.అప్పుడు మార్పు అందరిలో దానంతట అదే వస్తుంది. 

Friday, 2 September 2016

ఎముకలు గట్టిగా

                                                                   వయసుతో నిమిత్తం లేకుండా నడుం నొప్పులు,మోకాళ్ళ నొప్పులు నిత్యం మనం వింటూనే ఉంటాము.ఇవే కాకుండా వంగి పాదాలు రుద్దుకుంటుంటే చిటుక్కున పట్టేయడం,ఎక్కువ సేపు మెడ వంచి పనిచేస్తే మెడ నొప్పి,బలంగా ఏమైనా తోస్తే వీపు నొప్పి,ఎక్కడో ఒకచోట పట్టేయడం జరుగుతుంది.అదేమంటే వెన్నెముక బలహీనంగా తయారై పూసలు నొక్కుకోవడమో,ఊడిపోవడమో,డిస్క్ పక్కకు తొలగటమో జరిగిందని బెల్టు వేసుకోవడమో లేక శస్త్ర చికిత్స వరకు వెళ్ళటమో జరుగుతుంది.వీటన్నిటికీ కారణం ఎముకలు వెన్నెముక బలహీనంగా తయారవడమే.ఇంతకు ముందు రోజుల్లో నడుము,కాళ్ళ నొప్పులతో ఒకరో,ఇద్దరో బాధ పడేవాళ్ళు.ఇప్పుడు నూటికి ఎనభై మంది ఏదోఒక నొప్పితో బాధ పడుతున్నారు.దీనికి పరిష్కారం ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తినడమే.నువ్వులు,బాదం పప్పులు,పాలు,గుమ్మడి గింజలు,సబ్జా గింజలు,పాలకూర,రాగులు,కొర్రలు,సజ్జలు,యవలు,జొన్నలు వంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.ముందుగా ఒక 15 రోజులు క్రమం తప్పకుండా ఉదయం అల్పాహరంతో పాటు ఒక కప్పు వేడిపాలలో ఒక టేబుల్ స్పూను నువ్వులు,ఒక 1/2 టేబుల్ స్పూను గుమ్మడి గింజలు పొడిచేసి,2 స్పూనులు తేనె కలిపి తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి.వ్యాయామం చేసేటప్పుడు ఎవరికి వారు చేయగలిగినంత వరకు మాత్రమే చేయాలి.బలవంతాన చేతులు,కాళ్ళు,నడుము వంచి చెయ్యకూడదు.లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

వంటింటి గట్టు శుభ్రంగా.......

                                                              పిండి వంటలు చేసినప్పుడు వంటింటి గట్టు ఎంత శుభ్రంగా కడిగినా ఎంతో కొంత జిడ్డుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.అటువంటప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు,కొద్దిగా సోడా ఉప్పు,కొంచెం సర్ఫు కలిపి గట్టుపై చల్లి కొద్దిగా నీళ్ళు చల్లుతూ పీచుతో రుద్దాలి.ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా జిడ్డు వదిలి వంటింటి గట్టు శుభ్రంగా ఉంటుంది.చీమలు కూడా రాకుండా ఉంటాయి. 

Thursday, 1 September 2016

ముక్కలు నల్లబడకుండా.......

                                                                 బంగాళదుంప,యాపిల్,వంకాయ,పచ్చి అరటి కాయ ముక్కలు కోస్తూ ఉన్నప్పుడే నల్లగా మారిపోతుంటాయి.అలా నల్లగా మారిపోకుండా ఉండాలంటే చల్లటి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ముక్కలు వేస్తే తాజాగా,తెల్లగా ఉంటాయి.

Wednesday, 31 August 2016

శ్రమ తక్కువ లాభం ఎక్కువ

                                                        ఎప్పుడూ వంగిపోయి నడవడం,భయంతో చేతులు ముడుచుకున్నట్లు కుర్చీలో కూర్చుంటే మనకు తెలియకుండానే ఒత్తిడి,అందోళనకు గురవుతున్నట్లన్నమాట.ఈ ఒత్తిడి,ఆందోళన దూరం కావాలంటే రోజూ ఏ సమయంలోనైనా,ఎక్కడైనా ఒక 5 ని.లు నిటారుగా భుజాలు తిన్నగా ఉండేలా చేతులు రెండు నడుముపై ఉంచి నిలబడడం,కొంచెం ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తూ నిలబడడం,వెన్నెముక పూర్తిగా కుర్చీకి ఆనేలా ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవడం చేయాలి.ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తద్వారా ధైర్యంగా ఏ పనైనా చేయగలమని వ్యక్తిత్వ వికాస నిపుణుల ఉవాచ.ఈ పవర్ పోజెస్ చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కనుక ఏ వయసు వారైనా చేయవచ్చు.వ్యాయామంలో ఇదో కొత్త ఒరవడి.శ్రమ తక్కువ లాభం ఎక్కువ.  


         

Tuesday, 30 August 2016

నిస్సత్తువగా ఉన్నప్పుడు......

                                                             ఏదైనా శస్త్రచికిత్స జరిగిన తర్వాత కానీ,జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కానీ శరీరంలో శక్తిని పూర్తిగా కోల్పోయినట్లు నిస్సత్తువగా,నీరసంగా,నిరుత్సాహంగా అనిపిస్తుంది.అడుగు తీసి అడుగు కూడా వేయలేనట్లు కొంచెం పని చేసినా ఆయాసం వస్తూ ఉంటుంది.ఈ పరిస్థితి నుండి బయటా పడాలంటే ఒక చిన్న బీట్ రూట్ ముక్క, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీలో వేసి వడకట్టి దానిలో కొద్దిగా నిమ్మరసం పిండి రోజూ ఒక చిన్నకప్పు రసం తాగాలి.తాగిన కొద్దిసేపటికే కండరాలు శక్తిని పుంజుకుని నిస్సత్తువ తొలగిపోయి ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది.ఇలా కొద్ది రోజులు తాగితే త్వరగా కోలుకుంటారు.

Saturday, 27 August 2016

మాడిపోయిన గిన్నె తెల్లగా ....

                                                          ఒక్కొక్కసారి పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము.గిన్నె నల్లగా మాడిపోయి ఘాటు వాసన వస్తుంటే కానీ గుర్తురాదు.మాడిపోయిన గిన్నె ఒక పట్టాన తెల్లగా రాదు.ఈ రోజుల్లో పని వాళ్ళు కూడా దాన్ని వదిలిద్దామని అనుకోవటం లేదు.సందీప ఇంట్లో పనిమనిషి ఒకసారి వారం రోజులు పోవటం లేదని అలాగే పెట్టింది.చివరకు సందీప కొత్త గిన్నె పడేయటం ఎందుకులే అని కష్టపడి వదిలించింది.తర్వాత రెండుసార్లు వదిలించలేక ఏకంగా గిన్నెలు పడేసింది.సందీప వాళ్ళమ్మతో పాల గిన్నెమాడితే గిన్నెలు చెత్తలో పడేశానని చెప్పింది.మాడిపోయాయని గిన్నెలు పడేయాల్సిన అవసరం లేదు .ఏ పదార్ధం మాడిపోయినా ఆ గిన్నెలో నిండుగా నీళ్ళు పోసి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి బాగా మరిగించాలి.ఒక పావు గంట తర్వాత నీళ్ళు పారబోసి కడిగితే తెల్లగా వస్తుంది నేను అలాగే చేస్తాను ఇంక ముందు నువ్వూ కూడా అలాగే చేసి చూడు తేలికగా పోతుంది అని చెప్పింది.