నా బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు,తోటి బ్లాగర్లకు,నా శ్రేయోభిలాషులకు,విమర్శకులకు,ప్రపంచంలో ఏ దేశంలో స్థిరపడినా కానీ మన భారతదేశపు ముద్దుబిడ్డలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు.ఆ వినాయకస్వామి దయవల్ల ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతూ అన్నింటా విజయాన్ని సాధించాలని,అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో తులతూగుతూ,చేతనైనంతవరకు మంచిపనులు చేస్తూ,తోటివారికి సహాయపడుతూ ఆనందంగా జీవించాలని,ఆస్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంకుంటూ అందరికీ మరోసారి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Wednesday, 12 September 2018
Sunday, 9 September 2018
ఉచిడీ
శస్త్ర చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు వద్దన్న పనే చేస్తూ తిక్క చేష్టలు చేస్తుండేది.బంధువులు,కొత్తవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే మరీ ఎ(హె)చ్చుగా చేసేది.వచ్చిన వాళ్ళు తనని మెచ్చుకోవాలనే తపనతో ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేసేది.వాళ్ళకు మంచినీళ్ళు,తినుబండారాలు నేనే తీసుకెళ్తానని మొండిపట్టు పట్టి అవి మోయలేక ఒక్కొక్కసారి దారిలో పడేసేది.నువ్వు తీసుకెళ్ళలేవు శస్త్రా!అని అమ్మ,అమ్మమ్మ అంటే వినకుండా నేనే ఇస్తానంటూ తయారయ్యేది.వచ్చిన వాళ్ళేమో పోనీలెండి నెమ్మదిగా తనే నేర్చుకుంటుంది అని శస్త్రను వెనకేసుకుని వచ్చేవాళ్ళు.అదుగో చూశారా!మీరే నన్ను ఏపనీ చెయ్యనివ్వడంలేదు.వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు అంటూ వాళ్ళ ఎదుటే ఏడుపు లంకించుకునేది.అదే అలవాటు పెళ్ళయి పిల్లలు పుట్టినా ఇప్పటికీ పోలేదు.ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నా ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే అవే తింగరి వేషాలు.భర్త నీకెందుకు శ్రమ పనివాళ్ళు చూసుకుంటారు కదా శస్త్రా!అంటే ఒక పట్టాన ఉన్నచోట ఉండదు.ఒకచోట కూర్చోదు.బొంగరంలా గిరగిరా తిరుగుతూనే ఉంటుంది.తర్వాత ఉష్....అష్.....అంటూ ఆపసోపాలు పడుతూ ఉంటుంది.ఒకరోజు స్నేహితురాలు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ హుషారుగా ఉండే శస్త్ర కాస్త నీరసంగా కనిపించింది.ఏమిటి అలా ఉన్నావు?అని అడిగింది స్నేహితురాలు.నాకు చిన్నప్పటి నుండి ఉచిడీ ఎక్కువని నీకు తెలుసుగా!అంది. అంటే?ఏముంది చిన్నప్పటి నుండి ఇంటికి ఎవరైనా వచ్చారంటే నాకు ఎ(హె)చ్చు ఎక్కువ కదా! అవసరమున్నా,లేకున్నా ఏదో చెయ్యాలనే తాపత్రయంతో అటుఇటు తిరగటం వలన ఈ తిప్పలు అంది.అప్పుడంటే చిన్నతనం ఇప్పుడు వయసు మీదపడుతోంది కదా! అంది శస్త్ర.
Saturday, 8 September 2018
విషపుగాయ
పాముకు కోరల్లో తేలుకు కొండిలో మాత్రమే విషం వుంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనమే అన్విత్.ఎంతసేపు తన స్వార్ధమే తప్ప వేరే ఆలోచన ఉండదు.దాని కోసం ఏమి చెయ్యడానికైనా చివరికి తోడబుట్టిన వాళ్ళని నష్ట పెట్టడానికి కూడా వెనుక ముందు ఆలోచించడు.అతను అతని భార్య,పిల్లలు ఇద్దరూ మాత్రమే ఒక కుటుంబమని మేము అంటూ అమ్మ,నాన్న,ఇతర కుటుంబసభ్యులతో (అంటే అన్న,చెల్లి కుటుంబ సభ్యులు) కూడా మాట్లాడుతుంటాడు.పోనీ మిగతా వాళ్ళందరితో అనుకూలంగా ఉండకపోయినా తను తన కుటుంబం అన్నా సంతోషంగా ఉన్నారా?అంటే అదేమీలేదు.ఎంతవరకు అన్విత్ భార్యాబిడ్డలు అని ప్రాకులాడడమే తప్ప వాళ్ళు మాత్రం సుతిమతి లేనట్లు ఉంటారు.వాళ్ళల్లో వాళ్ళకే ఒకరికంటే ఒకరు మేమే గొప్ప అని,మా మాటే నెగ్గాలని పోటీ పడుతుంటారు.అతి గారాబంతో పిల్లలు కూడా మొండిగా ఎవరన్నా లెక్కలేకుండా నిర్లక్ష్యంగా తయారయ్యారు.చదువుకోకుండా ఐ పాడ్,లాప్ టాప్ ముందేసుకుని సినిమాలు చూడటమే పనిగా పెట్టుకుని కళాశాలకు కూడా సరిగా వెళ్ళకుండా పరీక్షలు పాసవకుండానే పాసయ్యామని అబద్దాలు చెప్పడం నేర్చుకున్నారు.వాళ్ళను అమ్మ వెనకేసుకుని పిల్లల్ని ఒక్క మాట అననివ్వదు.అమ్మ వాళ్ళను సరిగా చదువుకోమని కానీ పద్దతిగా ఉండమని కానీ చెప్పదు.అన్విత్ తన వాళ్ళకు బుద్దులు చెప్పి సరైన దారిలో పెట్టుకోకుండా అన్న పిల్లలు,చెల్లి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని అన్న,చెల్లివాళ్ళన్నా,వాళ్ళ పిల్లలన్నా ఈర్ష్య పడుతుంటాడు.బంధువుల పెళ్ళికి అన్విత్ చెల్లి,పిన్ని,అత్త వాళ్ళు కలిసి వెళ్లారు.ఏమ్మా!మీ అన్న చిన్నప్పటినుండి విషపుగాయ.తోటి పిల్లలు తన కన్నా బాగున్నా,బాగా చదివినా ఓర్చుకునేవాడు కాదు.ఇప్పుడు మరీ ఎక్కువై పొయిందటగా!వాళ్ళ పిల్లలు చదువుకోకుండా మీ పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారని మీ పైనే కాకుండా మీ పిల్లలమీద కూడా విషం కక్కుతున్నాడటగా!అని అడిగింది.వాడు మారడు.ఎప్పటికీ అంతే అంది.అన్విత్ చెల్లి తన అన్నను అందరిలో చులకన చెయ్యడం బాగోదు కనుక ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.
Tuesday, 4 September 2018
మా ఊరి పిల్ల
కృష్ణవేణి మనుమరాలు యుక్తాన్వితకు ఓణీలు అంటే నూతన వస్త్రాలంకరణ వేడుక ఆడంబరంగా చేద్దామని నెలరోజుల ముందు నుండే బంధువులు అందరినీ పిలిచే పనిలో హడావిడిగా ఉంది.నీలవేణి,కృష్ణవేణి కన్నా వయసులో చిన్నదైనా ఒకే ఊరివాళ్ళు కనుక స్నేహంగా ఉండేవాళ్ళు.నీలవేణి భర్త ఉద్యోగరీత్యా వేరే నగరంలో ఉండడంతో చిరునామా కానీ చరవాణి నంబరు కానీ సరిగా తెలియకపోవడంతో ఎలాగైనా నీలవేణిని పిలవాలని చెల్లెలు ద్వారా రేపు ఉదయం వేడుక అనగా ఈరోజు సాయంత్రం ఫోను చేయించి మాట్లాడింది.అప్పుడు కృష్ణవేణి అమ్మా!ఇప్పుడు పిలిచానని అనుకోకుండా మనవరాలికి ఓణీలు ఇస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి నీలవేణీ అని చెప్పింది.చక్కగా గుర్తుపెట్టుకుని పిలిచిందని నీలవేణి ఎంతో సంతోషపడింది.అంతవరకు బాగానే ఉంది.మీ వీధికి అనుకోకుండా తెలిసిన వాళ్ళను పిలవటానికి వచ్చాము.సరిగా చిరునామా తెలియదు కనుక మా ఊరి పిల్ల ఇక్కడే ఎక్కడో ఉండాలి అని ఆమెను అడిగితే నాకు తెలియదు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాము అంది.ఎంతో ప్రయాసపడి ప్రేమతో కావాలని పిలిచినా మా ఊరి పిల్ల అని అడిగాను అనేసరికి నీలవేణి మనసు చివుక్కుమంది.చిన్న పిల్లలు కాదుగా యాభై సంవత్సరాల ఆమెను పట్టుకుని మా ఊరి పిల్ల అని అడిగింది సరే మళ్ళీ వచ్చి అంత స్నేహంగా ఉండేదల్లా అదే మాట నీలవేణికి చెప్పడం వల్ల బాధ అనిపించి వెళ్ళాలని అనిపించక వేడుకకు వెళ్ళడం మానేసింది.పెద్దావిడ కదా!పోనీలే అని సరిపెట్టుకుని వెళదామని అనుకున్నా మనసు అంగీకరించలేదు.అడిగితే అడిగింది మళ్ళీ వచ్చి అదే మాట ఇలా అన్నాను అని చెప్పకుండా ఉండి ఉంటే పిలిచిందని ఎంతో సంతోషంగా పిలిచినందుకు మాట దక్కించి వెళ్ళి వచ్చేదాన్ని కదా!అని నీలవేణి మనసులో బాధపడింది.మాట్లాడే విధానం చక్కగా ఉంటే అందరికీ ఎంతో సంతోషంగా బాగుంటుంది.ఈ విషయం అనే కాదు కొంతమందికి ఎంత వయసు పెరిగినా మాట్లాడే విధానం చేతకాక లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు.
Sunday, 2 September 2018
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహాదానంద భరితంగా ఎలా మలచుకోవాలో,ప్రతి పనిలో ఆనందాన్ని ఎలా వెదుక్కోవాలో యుగాలనాడే చేసి చూపాడు కృష్ణస్వామి.సమస్య ఎదురైనా అదే చిరునవ్వు,గెలిచినా అదే చిరునవ్వు.కష్టాలు ఎదురైనా సంతోష సాగరంలో ఎలా మునకలు వేయాలో సులువుగా చూపడమే శ్రీకృష్ణ తత్వం.ఆ కృష్ణతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటూ మనమందరమూ కూడా ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Saturday, 1 September 2018
కొర్రబియ్యం పులిహోర
కొర్రబియ్యం - 2 కప్పులు
నీళ్ళు - 3 కప్పులు
కారట్ తురుము 1/2 కప్పు
నిమ్మకాయలు - 2
అల్లం - 2 అంగుళాల ముక్క
పచ్చిమిర్చి - 4
ఉప్పు - సరిపడా
కొత్తమీర తురుము - 1 కప్పు
వేరుశనగ పప్పు - 1/2 కప్పు
తాలింపు కోసం :
ఆవాలు - 2 చెంచాలు
శనగపప్పు -2 చెంచాలు
పసుపు -2 చెంచాలు
మినప్పప్పు -2 చెంచాలు
కరివేపాకు - 1/2 కప్పు
నువ్వుల నూనె - చిన్న గరిటెడు
నీళ్ళు - 3 కప్పులు
కారట్ తురుము 1/2 కప్పు
నిమ్మకాయలు - 2
అల్లం - 2 అంగుళాల ముక్క
పచ్చిమిర్చి - 4
ఉప్పు - సరిపడా
కొత్తమీర తురుము - 1 కప్పు
వేరుశనగ పప్పు - 1/2 కప్పు
తాలింపు కోసం :
ఆవాలు - 2 చెంచాలు
శనగపప్పు -2 చెంచాలు
పసుపు -2 చెంచాలు
మినప్పప్పు -2 చెంచాలు
కరివేపాకు - 1/2 కప్పు
నువ్వుల నూనె - చిన్న గరిటెడు
ముందుగా ఒక కుక్కర్లో కొర్ర బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు వంపి మూడు కప్పుల నీళ్ళు పోసి రెండు గం.ల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి.ఆ తర్వాత పొడిగా ఉండేలా వండి ఒక పక్కన పెట్టుకోవాలి.పొయ్యి వెలిగించి ఒక బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగపప్పు,కరివేపాకు,పసుపు అన్నీ వేసి దోరగా వేయించాలి.తర్వాత కారట్ తురుము వేసి కొద్దిగా వేగాక కొర్రబియ్యం అన్నంతోపాటు ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంటపై కొద్దిసేపు ఉంచాలి.ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం చల్లి కొత్తిమీర వేసి బాగా కలియ తిప్పి దించేయాలి.అంతే రుచికరమైన కొర్ర బియ్యం పులిహోర తయారయినట్లే.వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఆరోగ్య చేతన
ఒకప్పుడు తృణ ధాన్యాల వాడకం ఎక్కువగా ఉండేది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కష్టపడి పనిచేయడం వలన కూడా అధిక బరువు పెరగకుండా చురుకుగా ఆరోగ్యంగా ఉండేవారు.మధ్యలో తృణ ధాన్యాలు బాగుచేసి వండడం కూడా కష్టం కనుక సులువుగా బియ్యంతో తయారు చేసిన పదార్ధాలు వండడం తినడం అలవాటయింది. అందు వలన చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ దాన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ దాని నిమిత్తం అధిక డబ్బు ఖర్చుపెడుతూ,కొంతమంది శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ నానా తంటాలు పడుతున్నారు.దీనితో ఏది ఏమైనా పాతది బంగారం అన్న నిజం తెలుసుకుని మరల తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపడం మొదలెట్టారు.వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని,దీనితో అధిక బరువు తగ్గడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందని పెద్దలు శాస్త్రవేత్తలు చెప్పడంతో మరల అందరూ ఆచరించడం మొదలు పెట్టారు.అదీ కాక రసాయన రహిత తృణ ధాన్యాలు,కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు శుభ్రం చేసినవి బజారులో అమ్ముతున్నారు. కనుక వండడం కూడా తేలికగా ఉంటుంది.అధిక బరువు ఉండడం వలన వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా అనేక గడ్డు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అందువల్ల ఈమధ్య బరువును అదుపులో ఉంచుకోవాలనే ఆలోచన అందరిలోనూ రావడంతో ఆరోగ్యచేతన(హెల్త్ కాన్షస్) ప్రారంభమైంది.ఇది చాలా శుభ పరిణామం.
Subscribe to:
Posts (Atom)

