ముఖంపై మొటిమల తాలుకు మచ్చలు ఈ రోజుల్లో పెద్ద చిన్న తేడా లేకుండా సర్వ సాధారణమై పోయింది.ఈ మచ్చలు పోవడానికి మన ఇంట్లో దొరికే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.దీని కోసం మనము 2 చెంచాల టొమాటో రసం ,ఒక గుప్పెడు తులసి ఆకుల రసం,ఒక పావు చెంచా పసుపు,2 చుక్కల వేప నూనె లేదా టీ ట్రీఆయిల్ వేసి బాగా కలపాలి.తర్వాత ముఖానికి రాసి ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా ప్రతి రోజు చేస్తుంటే ముఖంపై మొటిమల తాలుకా మచ్చలు మాయం.
Wednesday, 16 March 2022
ముఖం అందంగా మెరవాలంటే.........
తులసి ఆకుల రసం - 2 చెంచాలు
కలబంద గుజ్జు - 2 చెంచాలు
ముఖం మెరుపు రావాలంటే ఈ రెండు బాగా కలిపి ముఖానికి రాసి ఒక అరగంట ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం అందంగా మెరుస్తూ ఉంటుంది.
తులసి ఆకు రసం బదులుగా పొడి అయినా వాడుకోవచ్చు.రసం 2 చెంచాలు వాడితే పొడి 1 చెంచా వాడుకోవాలి.
Tuesday, 1 March 2022
హర హర మహాదేవ
భగవంతుని దయవల్ల భక్తులు అందరూ కాస్త ఊపిరి పీల్చుకుని మహా శివరాత్రి సందర్భంగా తగు జాగ్రత్తలతో తెల్లవారుఝాము నుండే అభిషేకాలు చేయించుకోవడానికి బారులు తీరడంతో శివాలయాలన్నీ 'హరహర మహాదేవ శంభో శంకర శివ శివ శంకర' అంటూ మారుమ్రోగిపోతున్నాయి.చుట్టుప్రక్కల వారికి శివ నామస్మరణ వీనుల విందుగా ఉంది.మనస్విని,స్నేహితురాళ్ళ ఇళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండడంతో తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి అందరూ ఒకచోట చేరి కబుర్లు మొదలెట్టారు.ఉదయాన్నే లేచి అందరూ కలిసి ఏటికి (కృష్ణా నదికి) స్నానానికి వెళ్లి ఒకరికొకరు పోటీపడి 108 మునకలు మునిగి ఒడ్డుకు చేరి ఇసుకతో గౌరీదేవిని చేసి పూజించి నీళ్ళల్లో వదిలిపెట్టి అందరినీ చల్లగా కాపాడమని నదీమతల్లికి నమస్కరించి ప్రసాదం తీసుకుని గట్టెక్కి మెట్టెక్కి అంటూ గట్టు మీదున్న గడ్డి పీకి కొద్ధిగా గోవులకు మేత వేసి పెద్దవాళ్ళు చెప్పిన మంత్రం చెప్పి దారిలో కనిపించిన రేగుపండ్లు కోసుకుంటూ మధ్యలో శివాలయానికి వెళ్ళి ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత క్రొత్త దుస్తులు ధరించి ఇరుగుపొరుగు పెద్దవాళ్ళతో కలిసి అందరూ ప్రక్క ఊరిలో రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళకు ఎడ్ల బండ్లు ఎక్కి వెళ్ళి ప్రోద్దుపోయేదాకా సరదాగా అటుఇటు తిరిగి రకరకాల ఆట వస్తువులు కొనుక్కోవడం,హరికథలు,బుర్రకథలు,పిట్టకథలు వింటూ ఏ తెల్లవారుఝాముకో ఇంటికి రావడం ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవో కదా!అని మురిసిపోతూ ఒకరికి ఒకరు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అలాగే నేను కూడా నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ మున్ముందు అందరూ సంతోషంగా,సుఖంగా,ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యఅష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Friday, 14 January 2022
కొంగ్రొత్త వెలుగులు,శుభాకాంక్షలు
Sunday, 26 September 2021
స్నేహం అనే ముసుగు
ఒకరోజు మిహిత భర్తతో కలిసి సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళింది.దారిలో స్నేహితురాలి ఇంటికి వెళ్తే చీకటి పడిపోతుంది కనుక నువ్వు వాళ్ళ ఇంటి వైపు చూడకుండా వచ్చెయ్యమని ముందే హెచ్చరించడంతో తల దించుకుని వచ్చేస్తుండగా స్నేహితురాలి భర్త చరవాణిలో మాట్లాడుతూ వీళ్ళను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.చిన్ననాటి స్నేహితురాలు కావడంతో కాదనలేక మిహిత,భర్తతోసహా తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.వెళ్ళిన కాసేపటికి అమ్మా కూతుళ్ళు ఇద్దరూ చేతితో సైగలు చేసుకుని అమ్మ వంటగదిలోకి వెళ్ళి ఒక నిమ్మకాయ తీసుకుని వచ్చి నీకోసం ఒకటి చెట్టు నుండి రాలింది.రసం తీసుకుని త్రాగమని బలవంతంగా అరచేతిలో పెట్టి వద్దని చెప్పినా వినకుండా చెయ్యి మొత్తం నిమ్మకాయతో రుద్దింది.అంతకు ముందు రోజు గుంటూరు జిల్లా 'కాకాని' వెళ్లి రాహుకాల పూజ చేయించుకుని వచ్చింది.సంకల్పం ఆరోగ్యం బాగుండాలని చెప్పుకుంటే పూజారి అందరూ డబ్బు కావాలని కోరుకుంటారు.నువ్వేంటి?ఆరోగ్యం కావాలంటున్నావు?అని అడుగగా రెండు సంవత్సరముల నుండి ఆమె,ఆమె కుటుంబం మానసిక సమస్యతో బాధ పడుతున్నామని చెప్పిందట.ఆదివారం సాయంత్రం రాహుకాలంలో ఒక పరిహారం చెయ్యమని చెప్పాడట.ఆ విషయం మిహితకు చెప్పకుండా నిన్ను బాబాగారే నా దగ్గరకు పంపి ఉంటారు అంది.అప్పటికీ మిహితకు అనుమానం రాలేదు.అమ్మ నిమ్మకాయ చేతిలో బలవంతాన పెట్టి రుద్దింది.కూతురు రవికల ముక్క పళ్ళు తెచ్చి బొట్టు పెట్టి చేతిలో పెట్టింది.అసలే మిహితకు రాహుకాలం అంటే పట్టింపు.నిమ్మకాయ మేజాబల్ల పై పెట్టి వస్తుంటే అమ్మా కూతుళ్ళు మొహం మాడ్చుకున్నారని బయట పడేయవచ్చులే అని తెచ్చి ఎవరూ తొక్కని స్థలంలో పడేసింది మిహిత.ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే చెయ్యి జిగురుగా దురదగా అనిపించింది.అప్పుడు మిహితకు అనుమానం వచ్చింది.పూజారి దోష పరిహారం చెప్పి ఎవరికైనా ఇస్తే మీ దోషాలు పోతాయని చెప్పి ఉంటాడని మిహిత వెంటనే సిద్ధాంతికి కబురు చేసి విషయం చెప్పగా ఒక నిమ్మకాయ తెచ్చి బలవంతంగా పెట్టడమనేది అనుమానాస్పదంగా ఉంది.మీకు ఏమైనా తేడాగా ఉంటే రాహుకాలంలో రాహుకేతువుల పూజ చేసి,అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి అని చెప్పారు.స్నేహం అనే ముసుగులో తన బాధలు పోవడం కోసం చిన్ననాటి స్నేహితురాలు అలా చేసేసరికి మిహితకు చాలా బాధ అనిపించింది.పైగా బాబాను అడ్డుపెట్టుకోవడం తెలివితక్కువతో కూడిన మూర్ఖత్వం అని మిహిత భావించి ఆవిధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని స్నేహితురాలిని తిరిగి అడగాలని కూడా అనిపించనంత విరక్తి వచ్చేసింది.స్నేహంలో కూడా ఇంత స్వార్ధం దాగి ఉండదాన్ని మిహిత మొదటిసారి చవిచూసింది.
సూచన:ఏదైనా దోష పరిహారం చేసుకోవాలంటే అవి చెయ్యడానికి,తీసుకోవడానికి వేరే వాళ్ళు గుడిలో అందుబాటులో ఉంటారు.వాళ్ళను సంప్రదిస్తే ఏర్పాటు చేస్తారు.దయచేసి తెలిసో తెలియకో ఎవరో చెప్పారని స్వార్ధంతో ఇటువంటి పనులు చేసి స్నేహం అనే ముసుగులో స్నేహితులను,బంధువులను ఎవరూ ఎవరినీ ఇబ్బందుల్లో పడేయకండి. అంతకన్నా దోషం మరొకటి ఉండదు.పాత ఇబ్బంది తొలగే బదులు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక స్నేహం, బంధుత్వాలు చెడిపోతాయి.ఉన్న విలువ,గౌరవం పోగొట్టుకుంటారు.స్నేహితులైనా,బంధువులైనా ఎవరైనా ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త.
Monday, 23 August 2021
పెంచిన ప్రేమ
ఒక నలభై సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళు పిల్లలకు ప్రేమతో మగ పిల్లలను 'మయ్య' కదు తినయ్యా! అని,ఆడ పిల్లలను 'మమ్మ' కదు తినమ్మా అని అంటూ మురిపెంగా గోరు ముద్దలు తినిపించేవారు.ఇప్పటికి చిన్నప్పుడు అక్క పిల్లలను పెంచిన ప్రేమతో ధీరజ్ పిన్ని సవిత ధీరజ్ ని 'మయ్య' అనే అంటుంది.ఇప్పుడు ధీరజ్ వృత్తి పరంగా సాంకేతిక నిపుణుడు.అమెరికాలో ఒక పెద్ద సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నాడు.విదేశాలలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారోజువారీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోక తప్పదు.అక్కడ అది సర్వ సాధారణం అని సవితకు కూడా తెలుసు.అయినా 'మయ్య ' ఇంటా బయటా కూడా ఎంతో కష్టపడతాడు పాపం అని సవిత తన స్నేహితురాళ్ళకు చెప్పి పెంచిన ప్రేమ కదా ! అందుకే నాకు బాధగా ఉంటుంది అని జాలి పడుతూ ఉంటుంది.
Friday, 20 August 2021
వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
శ్రావణ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమే.కానీ స్త్రీలకు మంగళ వారం మంగళ గౌరీ నోములు,శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలకు ఎంతో ప్రత్యేకం.స్త్రీలకు సకల సౌభాగ్యాలను ఇచ్చే వరలక్ష్మి వ్రతం చూచిన వారికి పుణ్యం.చేసిన వారికి సౌభాగ్యం.అలాంటి సకల సౌభాగ్యాలను కలిగించే వరలక్ష్మి దేవి మనందరికీ సకలైశ్వర్యాలను,భోగభాగ్యాలను,సంపూర్ణ ఆయురారోగ్యలను,మానసిక ప్రశాంతతను ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.ఈ గడ్డు కాలంలో ముత్తైదువలు ఎవరూ రాకపోయినా అమ్మవారికి వాయనం ఇచ్చుకుని ప్రశాంతంగా పూజ చేసుకోవడం ఉత్తమం.