Friday, 1 April 2022

శుభకృత్ శుభాకాంక్షలు

                               శుభకృత్ నామ సంవత్సరంలో అందరూ సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాలతో,సకల సిరిసంపదలతో భోగభాగ్యాలతో,పిల్లాపాపలతో,పాడిపంటలతో సరదాసరాదాగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు.



  

కాలేయంలో అదనపు కొవ్వు

                                                                సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్న వారందరికి కాలేయంలో అదనపు కొవ్వు ఉంటుంది.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా,ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.దీనితో కాలేయంలో అదనపు కొవ్వు ఏర్పడుతుంది.ఆహారంలోని విషతుల్యాలను,హానికరమైన రసాయనాలను తొలగించడమే కాక శరీరంలోని కొవ్వులు,రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.జీర్ణ వ్యవస్థ సక్రమమగా పనిచేయలన్నా కాలేయమే కీలక పాత్ర వహిస్తుంది.ఒకప్పుడు కామెర్లు వస్తే కాలేయ సమస్యలు వచ్చేవి.ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ సమస్యలు వస్తున్నాయి.  నిమ్మకాయలు కోసినప్పుడు నిమ్మరసం వాడుకుని గింజలు పడేస్తుంటాము.ఇక నుండి నిమ్మ గింజలను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే బాగుంటుంది.చిటికెడు పొడిని తేనెతో కలిపి ఉదయం,సాయంత్రం తినడం వలన కాలేయంలో ఉన్నఅదనపు కొవ్వు కరగడంతోపాటు  కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుందని దీనితో కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది.నిమ్మ గింజల పొడి తేనెతో తింటే సహజంగా వచ్చే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయట.వీటితోపాటు దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు,నారింజ,అనాస వంటి పండ్లు,బొప్పాయి,అవకాడో,బ్రకోలి,టమోటాలు,కాప్సికంలో అన్ని  రకాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.మధుమేహం ఉన్నవారిలో కూడా కాలేయం లో అదనపు కొవ్వు చేరుతుంది.కనుక ఆహార నియమాలు పాటిస్తూ మంచి  నీళ్ళు ఎక్కువగా త్రాగటం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

Wednesday, 16 March 2022

మొటిమల మచ్చలు

                                                    ముఖంపై మొటిమల తాలుకు మచ్చలు ఈ రోజుల్లో పెద్ద చిన్న తేడా లేకుండా సర్వ సాధారణమై పోయింది.ఈ మచ్చలు పోవడానికి మన ఇంట్లో దొరికే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.దీని కోసం మనము 2 చెంచాల టొమాటో రసం ,ఒక గుప్పెడు తులసి ఆకుల రసం,ఒక పావు చెంచా పసుపు,2 చుక్కల వేప నూనె లేదా టీ ట్రీఆయిల్ వేసి బాగా కలపాలి.తర్వాత ముఖానికి రాసి ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా ప్రతి రోజు చేస్తుంటే ముఖంపై మొటిమల తాలుకా మచ్చలు మాయం.

ముఖం అందంగా మెరవాలంటే.........

 తులసి ఆకుల రసం -  2  చెంచాలు 

కలబంద గుజ్జు   -  2 చెంచాలు 

ముఖం మెరుపు రావాలంటే ఈ రెండు బాగా కలిపి ముఖానికి రాసి ఒక అరగంట ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం అందంగా మెరుస్తూ ఉంటుంది.  

తులసి ఆకు రసం బదులుగా పొడి అయినా వాడుకోవచ్చు.రసం 2 చెంచాలు వాడితే పొడి 1 చెంచా వాడుకోవాలి. 

Tuesday, 1 March 2022

హర హర మహాదేవ

                                                                     భగవంతుని దయవల్ల భక్తులు అందరూ కాస్త ఊపిరి పీల్చుకుని మహా శివరాత్రి సందర్భంగా తగు జాగ్రత్తలతో తెల్లవారుఝాము నుండే అభిషేకాలు చేయించుకోవడానికి బారులు తీరడంతో శివాలయాలన్నీ 'హరహర మహాదేవ శంభో శంకర శివ శివ శంకర' అంటూ మారుమ్రోగిపోతున్నాయి.చుట్టుప్రక్కల వారికి శివ నామస్మరణ వీనుల విందుగా ఉంది.మనస్విని,స్నేహితురాళ్ళ ఇళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండడంతో తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి అందరూ ఒకచోట చేరి కబుర్లు మొదలెట్టారు.ఉదయాన్నే లేచి అందరూ కలిసి ఏటికి (కృష్ణా  నదికి) స్నానానికి వెళ్లి ఒకరికొకరు పోటీపడి 108 మునకలు మునిగి ఒడ్డుకు చేరి ఇసుకతో గౌరీదేవిని చేసి పూజించి నీళ్ళల్లో వదిలిపెట్టి అందరినీ చల్లగా కాపాడమని నదీమతల్లికి నమస్కరించి ప్రసాదం తీసుకుని  గట్టెక్కి మెట్టెక్కి అంటూ గట్టు మీదున్న గడ్డి పీకి కొద్ధిగా గోవులకు మేత వేసి  పెద్దవాళ్ళు చెప్పిన మంత్రం చెప్పి దారిలో కనిపించిన రేగుపండ్లు కోసుకుంటూ మధ్యలో శివాలయానికి  వెళ్ళి ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత క్రొత్త దుస్తులు ధరించి ఇరుగుపొరుగు పెద్దవాళ్ళతో కలిసి అందరూ ప్రక్క ఊరిలో రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళకు ఎడ్ల బండ్లు ఎక్కి వెళ్ళి ప్రోద్దుపోయేదాకా సరదాగా అటుఇటు తిరిగి రకరకాల ఆట వస్తువులు కొనుక్కోవడం,హరికథలు,బుర్రకథలు,పిట్టకథలు  వింటూ ఏ తెల్లవారుఝాముకో ఇంటికి రావడం ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవో కదా!అని మురిసిపోతూ ఒకరికి ఒకరు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అలాగే నేను కూడా నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ మున్ముందు అందరూ సంతోషంగా,సుఖంగా,ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యఅష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Friday, 14 January 2022

కొంగ్రొత్త వెలుగులు,శుభాకాంక్షలు

                                                              భోగ భాగ్యాలను ఇచ్చే భోగి ,సరదాను ఇచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ మన అందరికీ  క్రొత్త సంవత్సరంలో కొంగ్రొత్త వెలుగులు నింపాలని,సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సదా భగవంతుడు ప్రసాదించాలని,పాడి పంటలతో,ధన ధాన్యాలతో రైతులు అందరూ చల్లగా ఉండాలని,భోగిమంటలు,గంగిరెద్దులు,హరిదాసుల ఆటపాటలతో,ముంగిట రకరకాల రంగవల్లులతో గొబ్బెమ్మలతో,గుమ్మానికి మామిడి తోరణాలతో,గడపకు పసుపు కుంకుమలతో ,చెరుకు  గడలు,తేగలు,కమ్మని పిండి వంటల ఘుమఘుమలతో,సరదాగా,సంతోషంగా మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియచేస్తూ పెద్దలు,పిన్నలు ఆనందోత్సాహాలతో వారి వారి సంప్రదాయాన్ననుసరించి  పండుగ జరుపుకోవాలని,మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు సంక్రాంతి,కనుమ,ముక్కనుమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.   
                                   
                                                       
                          

                                            సర్వేజనా సుఖినోభవంతు 

                                                          



 

Sunday, 26 September 2021

స్నేహం అనే ముసుగు

                                             ఒకరోజు మిహిత భర్తతో కలిసి సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళింది.దారిలో స్నేహితురాలి ఇంటికి వెళ్తే చీకటి పడిపోతుంది కనుక నువ్వు వాళ్ళ ఇంటి వైపు చూడకుండా వచ్చెయ్యమని ముందే హెచ్చరించడంతో తల దించుకుని వచ్చేస్తుండగా స్నేహితురాలి భర్త చరవాణిలో మాట్లాడుతూ వీళ్ళను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.చిన్ననాటి స్నేహితురాలు కావడంతో కాదనలేక మిహిత,భర్తతోసహా తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.వెళ్ళిన కాసేపటికి అమ్మా కూతుళ్ళు ఇద్దరూ చేతితో సైగలు చేసుకుని అమ్మ వంటగదిలోకి వెళ్ళి ఒక నిమ్మకాయ తీసుకుని వచ్చి నీకోసం ఒకటి చెట్టు నుండి రాలింది.రసం తీసుకుని త్రాగమని బలవంతంగా అరచేతిలో పెట్టి వద్దని చెప్పినా వినకుండా చెయ్యి మొత్తం నిమ్మకాయతో రుద్దింది.అంతకు ముందు రోజు గుంటూరు జిల్లా 'కాకాని' వెళ్లి రాహుకాల పూజ చేయించుకుని వచ్చింది.సంకల్పం ఆరోగ్యం బాగుండాలని చెప్పుకుంటే పూజారి అందరూ డబ్బు కావాలని కోరుకుంటారు.నువ్వేంటి?ఆరోగ్యం కావాలంటున్నావు?అని అడుగగా రెండు సంవత్సరముల నుండి ఆమె,ఆమె కుటుంబం మానసిక సమస్యతో బాధ పడుతున్నామని చెప్పిందట.ఆదివారం సాయంత్రం రాహుకాలంలో ఒక పరిహారం చెయ్యమని చెప్పాడట.ఆ విషయం మిహితకు చెప్పకుండా నిన్ను బాబాగారే నా దగ్గరకు పంపి ఉంటారు అంది.అప్పటికీ మిహితకు అనుమానం రాలేదు.అమ్మ నిమ్మకాయ చేతిలో బలవంతాన పెట్టి రుద్దింది.కూతురు రవికల ముక్క పళ్ళు తెచ్చి బొట్టు పెట్టి చేతిలో పెట్టింది.అసలే మిహితకు రాహుకాలం అంటే పట్టింపు.నిమ్మకాయ మేజాబల్ల పై పెట్టి వస్తుంటే అమ్మా కూతుళ్ళు మొహం మాడ్చుకున్నారని బయట పడేయవచ్చులే అని తెచ్చి ఎవరూ తొక్కని స్థలంలో పడేసింది మిహిత.ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే చెయ్యి జిగురుగా దురదగా అనిపించింది.అప్పుడు మిహితకు అనుమానం వచ్చింది.పూజారి దోష పరిహారం చెప్పి ఎవరికైనా ఇస్తే మీ దోషాలు పోతాయని చెప్పి ఉంటాడని మిహిత వెంటనే సిద్ధాంతికి కబురు చేసి విషయం చెప్పగా ఒక నిమ్మకాయ తెచ్చి బలవంతంగా పెట్టడమనేది అనుమానాస్పదంగా ఉంది.మీకు ఏమైనా తేడాగా ఉంటే రాహుకాలంలో రాహుకేతువుల పూజ చేసి,అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి అని చెప్పారు.స్నేహం అనే ముసుగులో తన బాధలు పోవడం కోసం చిన్ననాటి స్నేహితురాలు అలా చేసేసరికి మిహితకు చాలా బాధ అనిపించింది.పైగా బాబాను అడ్డుపెట్టుకోవడం తెలివితక్కువతో  కూడిన మూర్ఖత్వం అని మిహిత భావించి ఆవిధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని స్నేహితురాలిని తిరిగి  అడగాలని కూడా అనిపించనంత విరక్తి వచ్చేసింది.స్నేహంలో కూడా ఇంత స్వార్ధం  దాగి ఉండదాన్ని మిహిత మొదటిసారి  చవిచూసింది. 

సూచన:ఏదైనా దోష పరిహారం చేసుకోవాలంటే అవి చెయ్యడానికి,తీసుకోవడానికి వేరే వాళ్ళు గుడిలో అందుబాటులో ఉంటారు.వాళ్ళను సంప్రదిస్తే ఏర్పాటు చేస్తారు.దయచేసి తెలిసో తెలియకో ఎవరో చెప్పారని స్వార్ధంతో ఇటువంటి పనులు చేసి స్నేహం అనే ముసుగులో స్నేహితులను,బంధువులను ఎవరూ ఎవరినీ ఇబ్బందుల్లో పడేయకండి. అంతకన్నా దోషం మరొకటి ఉండదు.పాత ఇబ్బంది తొలగే బదులు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవడమే  కాక  స్నేహం, బంధుత్వాలు చెడిపోతాయి.ఉన్న విలువ,గౌరవం పోగొట్టుకుంటారు.స్నేహితులైనా,బంధువులైనా ఎవరైనా ఇటువంటి వారితో తస్మాత్ జాగ్రత్త.