Monday, 28 April 2014

ఎడారిలో ఒయాసిస్సు

            మౌర్యన్,మౌనిక భార్యాభర్తలు.ఇద్దరూ విదేశాల్లో వైద్యులు.విదేశాలలో ఎవరిపనులు వాళ్ళే చేసుకోవాలి కనుక వీళ్ళిద్దరూ వైద్యవృత్తిలో తీరిక లేకుండా హడావిడిగాఉంటారు ఎలాగో,ఏంటో అని మౌనిక తల్లిదండ్రులు
ఆందోళన పడుతుంటే మౌర్యన్ తల్లిదండ్రులు మీకు ఆబెంగ అక్కరలేదు అనిచెప్పారు.మా అబ్బాయిని సిల్వియా
 తన స్వంత కొడుకు కన్నా ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడుతుంది.మా అబ్బాయి కూడా సిల్వియాతో
ప్రేమగా ఉంటాడు.ఏదోఒక సమయంలో మౌర్యన్ కనిపించకపోతే ఆమెకు నిద్రపట్టదు.మౌర్యన్ బిజీగాఉంటే ఆమే
మౌర్యన్ దగ్గరికి వెళ్తుంది."మై సన్,మై సన్" అంటూ ఉంటుంది.ఆమె ఋణం ఈజన్మలో తీర్చుకోలేనిది అనిచెప్పారు.
                 మౌనిక అక్కడకు వెళ్ళిన తర్వాత కోడలు వచ్చిందని ఎంతో సంతోషపడింది.కూతురు కన్నా ఎక్కువగా చూస్తుంది."మై డాటర్ ఇన్లా"అంటూ అందరికీ చెపుతూ ఉంటుంది.వీళ్ళు హాస్పిటల్ లో రకరకాల పేషెంట్లను చూడాలి కనుక వ్యాధి నిరోధక శక్తి ఉండాలని బలవర్ధకమైన ఆహరం, పానీయాలు తనే స్వయంగా తయారుచేసి ఇద్దరినీ   తినాల్సిందే,తాగాల్సిందే అంటూ హడావిడి చేస్తుంటుంది.ఈరోజుల్లో ఇంత ప్రేమగా  ఉండటం అరుదు.విదేశాలలో మరీ అరుదు.
ఈ యాంత్రికజీవనయానంలో ఎడారిలో ఒయాసిస్సులా సిల్వియా భగవంతుడిచ్చిన వరం.నిజంగా మేము దగ్గర ఉన్నాఅంత శ్రద్దగా చూడగలిగేవాళ్ళం కాదేమో.ఆమె నిస్వార్ధమైన ప్రేమకు ఒక్కొక్కసారి కళ్ళు చెమర్చుతాయి.
మౌనిక సిల్వియా కబుర్లు చెపుతుంటే ఆమె ఋణం ఎన్నటికీ తీర్చలేనిదిఅని మౌనిక తల్లిదండ్రులు అనుకున్నారు.

అగ్నిపర్వతాలు

       ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న దేశం ఇండోనేషియా.ప్రపంచంలో పెద్ద అగ్నిపర్వతం
"లొంబోక్" దీవిలో ఉన్న "రింజిని".దీని ఎత్తు రెండువేల ఏడువందల డెబ్బైఐదు మీటర్లు.ఇండోనేషియాలోని
"కవా ఐజైన్" ఆమ్ల పూరితమైన అగ్నిపర్వతం.ఈ అగ్నిపర్వతం నుండి నిరంతరం సల్ఫర్ వాయువులు విడుదలవుతుంటాయి.దీనినుండి ఎగసిపడే మంటలు,వెలువడే లావా సల్ఫర్ వాయవుల కారణంగా రాత్రిపూట
నీలిరంగులోకి మారి మెరుస్తూ చూపరులకు మైమరపించేలా కనిపిస్తాయి.ఇండోనేషియాలో మొత్తం" 128"
అగ్ని పర్వతాలున్నాయి.

సమాజం

                                        సమాజం మొరిగే కుక్కలాంటిది.
                                        భయపడి పరుగెడితే వెంటపడి
                                        తరుముకుంటూ వస్తుంది.
                                        ధైర్యంగా నిలబడితే తోకముడిచి
                                        పరుగెడుతూ పారిపోతుంది.

నగ్నసత్యాలు

           
1) జీవితం ఒక సమరం లాంటిది.దానిని పూర్తిగా గెలిచినవాడు ఈ ధరాతలంపై ఎవ్వరూ లేరు.
2) మనుషులను విడదీయటానికి ఒకరినుండి మరొకరిని దూరంగాఉంచటానికి విజ్ఞానం రూపొందించిన
గొలుసులే విచారించకుండా ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలు.
3) నీవు సంపాదించే కన్నా తక్కువ ఖర్చు చేయటం నేర్చుకోగలిగితే నిన్ను మించిన ఆర్ధికనిపుణత ఉండదు.
బ్రతుకుతెరువులో మహేంద్రజాలం.
4) కలిమి,కాలం మనిషికి జీవితంలో ప్రధానమైన బరువులు.వాటినిఎలా ఉపయోగించుకోవాలో తెలియకపడే అవస్థలే కష్టాలు.
5) జీవితాన్ని గురించి అతిశయంగా ఊహించుకొనే కొద్దీ అది నిస్సారంగా అనిపిస్తుంది.జీవితాన్ని గురించి ఎంత
తక్కువగా ఊహించుకుంటే అంత నందనవనంలా కనిపిస్తుంది.
6) ముందు నిన్ను నీవు బాగుచేసుకో.మాలిన్యాన్ని అంతటిని తొలగించుకో.మంచి మార్గాన్ని ఏర్పరచుకో.
అప్పుడు ఎవరూ చెప్పకుండానే అందరూ నిన్ను అనుసరిస్తారు.
7) ఆగ్రహంతో గతాన్ని,భయంతో భవిష్యత్తును తిలకించే కంటే ఎరుకతో వర్తమానాన్ని అవలోకించటం మేలు.
8) అవకాశం తనంత తానుగా వచ్చిమన తలుపు తట్టదు.మనం అవకాశాన్ని వెంటాడుతూ దాన్ని
 సద్వినియోగం చేసుకోవాలి.
9) మనం ఇష్టపడే వస్తువులు మనకు దొరకనప్పుడు మనకు దొరికిన వస్తువులనే ఇష్టపడాలి.
10) ఆశయాలు ఆకాశంలోని చుక్కల్లాంటివి.వాటిని మనం అందుకోలేము.కానీ నడిసముద్రంలో నావికునికి దిక్సూచి వలేఈ ఆశయాల సహాయంతో గమ్యం చేరటానికి ప్రయత్నించాలి.

Saturday, 26 April 2014

భావోద్వేగబంధం

     మనీష్ విదేశాలలో ప్రభుత్వవైద్యుడుగా పనిచేస్తూ పైచదువులు చదువుకుంటున్నాడు.ఒకరోజు చెల్సి మనీష్ పనిచేసే ఆసుపత్రికి వైద్యంకోసంవచ్చి పరిచయమైంది.మాట్లాడుతూఉండగా మాటల్లో మనీష్''మామ్''అని
మాట్లాడేసరికి ఆపిలుపు గుండెనుతాకి తన చనిపోయినకొడుకు పిలిచినట్లుగా ఫీలయింది.అప్పటినుండి మనీష్
నే తన స్వంతకొడుకులా చూచుకొంటుంది.చెల్సి తమ్ముడు,చెల్లెళ్ళు కూడా అక్క మనోభావాలను అర్ధం చేసుకుని మనీష్ ని తమ కుటుంబంలో ఒకసభ్యుడిగా పరిగణించి ఎంతో ప్రేమగా ఉంటారు.మనీష్ కూడా వాళ్ళతో అంతే ప్రేమగా ఉంటాడు.చెల్సి స్వంతకొడుక్కి ఎలాసలహాలిస్తుందో అలాగే ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడితే బావుంటుంది ఏది ఎక్కువలాభం వచ్చేది తానే స్వయంగా చూసుకుంటుంది.ఏసమయానికి ఏదితినాలో,
ఏది తినకూడదో,దేనిలో ఎన్ని కేలరీలు ఉన్నాయో,ఏది ఇష్టమో,ఏది అయిష్టమో స్వంత తల్లికన్నాఎక్కువ చెల్సీ  చెపుతుంది.స్వంతతల్లిదండ్రులకన్నా చెల్సీ కే తెలుసు.మనీష్ మనస్తత్వానికి ఏఅమ్మాయిసరిపోతుందో ,ఎవరిని
చేసుకుంటే బాగుంటుందనేది చెల్సి నే నిర్ణయించింది.మనీష్ పెళ్ళి చేసుకున్న అమ్మాయిని స్వంతకోడలిగా చూస్తుంది.స్వంత రక్తసంబంధీకులే అంతప్రేమగా ఉండరు.ఆ ప్రేమ,ఆప్యాయతలకు చలించిపోయి ఒక్కొక్కసారి
 కళ్ళవెంబడి నీళ్ళు తిరుగుతాయి.మనీష్ నాకెలా కొడుకయ్యాడో,నేను మనీష్ కెలా తల్లినయ్యానో తెలుసా?
మాది'' emotional bonding ''అంటే ''భావోద్వేగ బంధం''అని చెల్సి చెప్తుంటుంది.మనీష్ కూడా చెల్సి నాకు స్వంత అమ్మ కన్నా ఎక్కువ అని చెప్తూఉంటాడు.

కుత్సిత స్వభావం

        ఈమధ్య హిమబిందు ఒక స్నేహితురాలింటికి వెళ్ళింది.కుశల ప్రశ్నలు అయినతర్వాత తనకు ఒక సమస్య వచ్చిందని చెప్పింది.నేను మీతోపాటే చదువుకున్నాను,మీతోపాటే డబ్బుకూడా కట్నంగా అత్తారింటికి తీసుకునివెళ్ళాను.మీకేసమస్యలు లేవు.నాకు,నాపిల్లలకు అన్నీ ఎక్కడలేని సమస్యలు వచ్చినాయి
 అని ఏడ్చేసి నాకొచ్చిన కష్టం అందరికీ ఎప్పుడు వస్తుందో? నేనెవరికి ద్రోహం చెయ్యలేదు అయినాఇలా ఉన్నాను అనేసింది.సమస్య వస్తే పరిష్కారమార్గం ఆలోచించాలి లేదా ఎవరోఒకరి సలహాతీసుకోవాలి అంతేగానీ
నాకొచ్చిన కష్టం అందరికీ రావాలి అనుకోవటం ఏమిటి? ఒక కన్ను పోయిందని ఏడిస్తే ఇంకొక కన్ను పోతుందని శాస్త్రం.మనం బాగుండాలి మనతోపాటు అందరూ బాగుండాలి అని భగవంతుని కోరుకోవాలి.నీ ఆలోచనావిధానం
తప్పు.ముందుగా నీఆలోచనల్లో మార్పు తెచ్చుకుని ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే అదే మంచి జరుగుతుంది అని హిమబిందు ఆమెను ఓదార్చింది.నేను ఎవరికీ ద్రోహం చెయ్యలేదు అంటుంది అంతకన్నా
ఎక్కువే కుత్సిత  మనస్తత్వంతో అందరికీ కష్టాలు నాలాగా రావాలని కోరుకుంటుంది.ఆరకంగా ఆలోచించటమేమిటి? అని హిమబిందు విస్తుపోయింది.

మళ్ళీతిరిగిరానిరోజులు

       సునీల,సమత కళాశాలలో కలిసి చదువుకున్నారు.ఇద్దరూ ప్రాణ స్నేహితులు.తర్వాత ఎవరికివారు తీరికలేని జీవితాలు గడిపేస్తున్నారు.చాలాసంవత్సరాల తర్వాత సునీల ఫోను నంబరు ఎలాగో తెలుసుకుంది. సమత సునీలకు ఫోనుచేసి అర్జెంటుగా నీతోమాట్లాడాలి ఎన్నిపనులున్నాసరే వీలుచూసుకుని రా నిన్నుచూచి
చాల రోజులైంది చూడాలనిపిస్తుంది వెంటనే రమ్మని చెప్పింది.ఒత్తిడి పనుల వలన వెంటనే రాలేకపోతున్నాను.
వీలైనంత త్వరగా వస్తాను అని సునీల చెప్పింది.అప్పటివరకు నిన్ను చూడకుండా ఉండాలా?అని బాధపడింది.
ఆ ఆప్యాయతకు సునీల చలించిపోయింది.ఎలాగో ఒకసిటీ నుండి ఇంకొక సిటీకివెళ్ళి అక్కడినుండి రెండుగంటలు
ప్రయాణించి సమత ఇంటికి వెళ్ళింది.ఒకరినొకరు చాల సంవత్సరాలతర్వాత చూసుకోవటంతో సంతోషంతో కళ్ళ
వెంబడి నీళ్ళు వచ్చేసినాయి.చాలా రోజులతర్వాత ఇద్దరూ కళాశాల రోజులు నెమరువేసుకున్నారు.అప్పటి స్నేహితుల గురించి,లెక్చరర్లు గురించి ఒకటేమిటి కబుర్లతో సమయం ఇట్టే గడిచిపోయింది.ఏదిఏమైనా మళ్ళీ
ఆరోజులు తిరిగిరావు.ఏబాదరబందీ లేకుండా,హాయిగా,స్వేచ్చగా,నవ్వుతూ,తుళ్ళుతూ,గెంతుతూ,ఒకరినొకరు
టీజ్ చేస్తూ,ఏ బాధ్యతలు లేకుండా,చదువుకుంటూ గడిపే స్వేచ్చాయుత జీవితం విద్యార్ధి జీవితం.మిగతా జీవితం
అంతా సంతోషంగానే గడిపినా మళ్ళీ తిరిగిరాని రోజులే కళాశాల రోజులు అని సునీల,సమత అభిప్రాయం.