Thursday, 28 November 2019

ముఖంపై మచ్చలు

                                                                        ముఖంపై మచ్చలు,కళ్ళ చుట్టూ ఉన్న నలుపు పోవాలంటే వారానికొకసారి ఒక చెంచా శనగ పిండిలో కొద్దిగా నిమ్మరసం,చిటికెడు పసుపు,కొద్దిగా రామ ములగ అంటే టొమాటో రసం కలిపి ముఖంపై,కంటి చుట్టూ రాయాలి.ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం పైపైన గుండ్రంగా రుద్దుతూ కడగాలి.ఈవిధంగా చేస్తుంటే ముఖానికి,కళ్ళ చుట్టూ రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం మచ్చలు లేకుండా తాజాగా ఉంటుంది.

Wednesday, 27 November 2019

పనికో ప్రణాళిక

                                                                  ముందు పని వెనుక,వెనుక పని ముందు చేసుకోకుండా మన దినచర్య మొదలుకాక ముందే ఆరోజు ఏమేమి పనులు చేయాలో తాపీగా ఆలోచించుకుని పనికో ప్రణాళిక పెట్టుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి.ఎంత కష్టపడినా కానీ పనులు తరగనప్పుడు ఒత్తిడికి గురి కాకుండా రెండు గంటలకోసారి ఒక పావుగంట విశ్రాంతి తీసుకుంటే పనిలో పొరపాట్లు దొర్లకుండా ప్రశాంతంగా పనులు పూర్తిచేయవచ్చు.ఈ విశ్రాంతి సమయంలో సంగీతం వింటూ ఒక పండు తింటూ పచ్చటి ప్రకృతిని చూస్తూ ఉంటే ఒత్తిడి మాయమై మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.దీనితో చకచకా పనులు పూర్తి అవుతాయి.

వేళకు ఓ పండు

                                                               మనలో చాలామంది మహిళలు ఉదయం,సాయంత్రం  పని హడావిడిలో  అల్పాహారం తీసుకోకుండా అశ్రద్ద చేసి ఒక కప్పు కాఫీ లేదా టీ తాగేసి ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటారు.అలా చేయడం వలన క్రమేపీ మనకు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.కనుక అటువంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే ఉదయం,సాయంత్రం తగిన సమయం లేకపోతే అల్పాహారం బదులు ఒక అరటి పండు,యాపిల్,జామ,బొప్పాయి,అనాస ముక్కలు లేదా వేళకు ఏదో ఒక పండు అందుబాటులో వున్నవి తిన్నా సరిపోతుంది.శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.అలాగే ఒక కప్పు పాలు తాగితే ఎముకలు కూడా ధృడంగా తయారౌతాయి.పని ఒత్తిడిగా అనిపించినప్పుడుఒక పావుగంట ఎండలో కూర్చుంటే ఒత్తిడి మటుమాయమౌతుంది.సాయంకాలం లేదా పని మధ్యలో ఆకలిగా  అనిపించినప్పుడు ఏ పకోడీలో,బజ్జీలో తినకుండా క్యారట్,కీరా ముక్కలు,దానిమ్మ,గుమ్మడి,పుచ్చ గింజలు,నానబెట్టిన బాదం,ఎండు ద్రాక్ష వంటివి తింటే పొట్ట నిండడంతోపాటు పోషకాలు అందుతాయి.దీనితో బరువు అదుపులో ఉండి అందంగా,ఆరోగ్యంగా,చర్మం కాంతులీనుతూ ఉన్న వయసు కన్నా తక్కువగా  కనిపిస్తారు.  

Saturday, 26 October 2019

దివ్వె దివ్వె దీపావళి వెలుగులు

                                                       దీపావళి అంటేనే పిల్లల పండుగ.దీపాల పండుగ.పిల్లలు ఎక్కువ దీపాలు ఎవరు ఇంటి ముందు పెడితే వాళ్ళు గొప్ప అని పోటీ పడి మరీ వెలిగించేవారు.ఆ మధ్య కాలంలో కొంత మంది మధ్య మధ్యలో కొవ్వొత్తులు పెట్టడం మొదలెట్టారు.దీపావళికి నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం మంచిదని పెద్దలు,పండితులు చెప్పడంతో ఈమధ్య నూనె దీపాలు వెలిగిస్తున్నారు.దివ్వె దివ్వె దీపావళి అంటూ ఒకప్పుడు పిల్లలందరూ ఒకచోట చేరి సరదాగా ఆటలాడుతూ ఉండేవారు.ఒక నెల ముందు నుండే పిల్లల హడావిడి అంతా ఇంతా కాదు.పెద్దవాళ్ళు కూడా కొంతమంది కలిసి పిల్లల కోసం స్వయంగా చిచ్చుబుడ్లు,మతాబులు,అవ్వాయ్ సువ్వాయ్ లు,దివిటీలు రకరకాలు తయారు చేసి ఇచ్ఛేవాళ్ళు.పిల్లలకు పగలంతా వాటిని ఎండబెట్టే కార్యక్రమం సరిపోయేది.వాటిని అందరూ తలా కాసిని పంచుకునేవాళ్ళు.ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు బయట తెచ్చి టపాకాయలు కాల్చడంతో ప్రమాదాలు జరగటమే కాక అవి సరిగా వెలగకపోవడంతో పాటు శబ్ద కాలుష్యం ఎక్కువైపోవడంతో పిల్లలకు కూడా అంతగా ఆసక్తి ఉండడం లేదు.టపాకాయల రసాయన వాసనలు,శబ్దాల కన్నా దీపాల వెలుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇల్లంతా దీపాల వెలుగులు ప్రకాశించినట్లే లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన యందు ప్రసరించి మీ మా మనందరి జీవితాలు ప్రకాశవంతంగా వెలిగిపోవాలని,ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Friday, 25 October 2019

ధన త్రయోదశి

                                                         రేపు శనివారం త్రయోదశి కలిసి రావడంతో శని త్రయోదశి,మాస శివరాత్రి,ధన త్రయోదశి,నరక చతుర్దశి,వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు అన్నీ కలసి రావడంతో ఎంతో మంచి రోజు.ధన త్రయోదశి నాడు బంగారం కొనుక్కోవాలని నియమం ఏమీ లేదు.వీలయితే కొనుక్కొవచ్చు.లేకపోతే లేదు.కానీ భక్తితో లక్ష్మీ దేవి పూజ చేసుకుంటే మంచిది.మరీ ముఖ్యంగా రేపు ఐదు విధాలుగా పండుగ కలిసి రావడంతో వీలయినవాళ్లు శివాలయం,వైష్ణవాలయాల సందర్శనం చాలా చాలా మంచిది.వీలయితే సమయాన్ని బట్టి తైలాభిషేకం,రుద్రాభిషేకం,అమ్మవార్లకు కుంకుమ పూజలు,వేంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోగలిగితే మరీ మంచిది.వీలు కాని వాళ్ళు ఇంట్లో భక్తితో ఒక నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.ఏదైనా మన మనస్సు తృప్తిని బట్టి చేసుకోవడం అంతే కదా!పనిలో పనిగా ఈ ధన త్రయోదశి మీ,మా,మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని,కొంగ్రొత్త ఆశలు,ఆకాంక్షలు నెరవేరాలని,లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Wednesday, 23 October 2019

మునగాకు ముడి పెసర దోసె

                                                               ప్రతిమ కూతురు విదేశాలలో ఉండడంతో కొన్ని రోజులు వాళ్ళతో ఉండి రావడానికి వెళ్తూ ప్రయాణానికి నెల రోజులు ముందు నుండే కూతురికి తీసుకుని వెళ్ళేవన్నీ సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టింది.అందులో భాగంగా మునగాకు కొమ్మలను కడిగి రెండు రోజులు కాగితంపై వరండాలో వేసి ఆకులు రాలిన తర్వాత వాటిని ఒక పెద్ద పళ్ళెంలో వేసి గలగలలాడేలా నీడలో ఆరబెట్టి పొడి చేసి పట్టుకెళ్ళి ఒక డబ్బాలో భద్రపరిచింది.ఒకరోజు ముడి పెసలు,కొంచెం బియ్యం నానబెట్టి ఉప్పు,అల్లం,పచ్చిమిర్చి మిక్సిలో వేసి జీలకర్ర కలిపి దోసె వేసి దానిపై మునగాకు పొడి,సన్నటి ఉల్లి ముక్కలు పలుచగా చల్లి వేడి వేడిగా ఒక్కొక్క దోసె వేసి ఇస్తుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు.దోసె వేస్తుంటే మునగాకు పొడి వాసన ఘుమఘుమలాడిపోయేది.ప్రతిమ మొదట పిల్లలు ఆమ్మో!మునగాకు చేదు మాకు వద్దు బాబోయ్ అంటారేమో అనుకుంది.కానీ ముడి పెసర దోసె వేసి దానిపై మునగాకు పొడి చల్లడంతో ముక్కుపుటాలు అదిరిపోయేలా వచ్ఛే ఆ సువాసన,లేత పెసరపొట్టు రంగుతో చూడటానికి ఇంపుగా తినడానికి రుచిగా ఎంతో బాగుంటుంది.నోరూరెలా వచ్చిన ఆ ఘుమఘుమలకు మేము సైతం అంటూ మాకు కూడా కావాలని అడిగి మరీ ఎంతో ఇష్టంగా తినడంతో ప్రతిమ చాలా సంతోషించింది.మునగాకులో పోషక విలువలతో పాటు ఔషధీ గుణాలు కలిగి ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం అని తెలిసినా ఎవరికి వారికి  తెలిసి తినడం బాగుంటుంది కదా!అదీ కాక అసలు చేదు కానీ,మునగాకు వాసన అనేదే లేదు.ఎవరికైనా మునగాకు పొడి వేసినట్లు చెప్తే కానీ తెలియదు.భారత దేశం నుండి ఎంతో శ్రమపడి చేసి తీసుకెళ్ళినందుకు ఎంత బాగానో అందరికీ ఉపయోగపడింది.వీలయితే మీరు కూడా ప్రయత్నించండి.ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ  తినాలనిపించేంత అద్భుతమైన రుచి.

కొసమెరుపు:ప్రతిమ మూడు నెలల మనవడు కూడా దోసె వేస్తుంటే ఆ వాసనకు ఊ  ఊ  అంటూ దోసె పైకి వంగి మరీ నోట్లో నుండి లాలాజలం తెచ్చేస్తుంటాడు.పసి పిల్లలకు కూడా ఆ వాసన అంత బాగుందన్న మాట.

Monday, 14 October 2019

చిరుజల్లులు

                                                               అమీలిత మనవరాలు పుట్టడంతో యు .కె లో కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది.వర్షాకాలం మొదలవగానే రోజంతా లేత ఎండ తోపాటు చిరుజల్లులా వర్షం పడుతూనే ఉంటుంది.ఏ కొద్దిసేపో వర్షం ఆగినప్పుడు ఎండ బాగానే వఛ్చినట్లు అనిపించినా  చల్లగానే ఉంటుంది.అదే తన ఊరిలో ఉన్నప్పుడైతే అబ్బా!జిడ్డు వర్షం రోజంతా ఇంట్లో నుండి కాలు బయట పెట్టనీయకుండా రోజంతా పడుతూనే అని విసుక్కునేది.కానీ ఇక్కడ చిరుజల్లులు సర్వ సాధారణం.రాత్రి పగలు తేడా లేకుండా రోజంతా ఆలా పడుతూనే ఉంటాయి.వర్షపు కోటు వేసుకుని ఒక గొడుగు పట్టుకుని ఆడవాళ్లు,మగవాళ్ళు కూడా కుక్కలను వ్యాహ్యాళికి తీసుకు వెళ్తూ ఉంటారు.కుక్కలకు కూడా తడవకుండా పైన ఒక తొడుగు వేసి తాపీగా నడుచుకుంటూ వెళ్తారు.మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు అవడంతో అమీలిత కిటికీ పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటూ మధ్యమధ్యలో టీ తాగుతూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను,చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ వచ్ఛేపోయే వాళ్ళను,వాహనాలను గమనిస్తూ చిన్నప్పుడు చిరుజల్లులలో తడుస్తూ ఆడుకోవటాన్ని గుర్తుచేసుకుంటూ హాయిగా,ప్రశాంతంగా రోజూ చిరుజల్లులను చూస్తూ గడపడం అలవాటైపోయింది.ఇది ఒక మరుపురాని మధురానుభూతి.