సంయుక్త వాళ్ళ బాబు పేరు షానోజ్. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు.ఐదు నెలలకే అత్త,తాత అంటూ చిన్నచిన్నమాటలు చెప్పేవాడు.కూర్చోవటం వచ్చినప్పటి నుండి అందరూ భోజనం చేసేటప్పుడు బాబుని భోజనాల బల్ల మీద కూర్చోపెట్టి తినటం అలవాటు అవుతుందని చిన్న వెండి పళ్ళెంలో కొంచెం పెట్టి ఇచ్చేవాళ్ళు.అన్నప్రాశన అయిన దగ్గర నుండి కూడా టొమాటోచారు కొత్తిమీరతో ఘుమఘుమలాడితేనే తినేవాడు.పెరుగు ప్రక్కన ఎవరైనా తింటున్నా వాంతి చేసుకునేవాడు.ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా పెరుగు అన్నం తినేవాడు కాదు.నడకవచ్చిన దగ్గరనుండి కుర్చీలకు ఉన్ననట్టులు,బోల్టులు ఎక్కడ కనపడితే అక్కడ చేత్తోనే ఊడతీసి ఎక్కడో ఒకచోట పడేసేవాడు.సంయుక్త వాళ్ళు మొదటి అంతస్తులో ఉండేవాళ్ళు.ఇంటితాళాలు క్రింద మొక్కల్లో పైనుండి క్రిందికి పడేస్తుండేవాడు.ఒకసారి రెండురోజులు వెతుక్కుంటే కానీ ఆవిషయం అర్ధంకాలేదు.ఒకరోజు సంయుక్త లోపల ఉండగా మెట్లుదిగి రోడ్డు మీదకు వెళ్ళాడు.బంగారు మొలత్రాడు, చేతులకు వత్తులు,గొలుసులు ఉండేవి.వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల వాళ్ళు ఎవరి బాబో నగలు ఉన్నాయి అని ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆపేశారు.లేకపోతే మెయిన్ రోడ్డుకు వెళ్ళిపోయేవాడు.అప్పుడు ఎవరోఒకరు బాబును చంకన వేసుకుని ఎత్తుకెళ్ళిపోయేవారు.ఎక్కడ పంపు కనిపిస్తే అక్కడ పంపు వదిలేసి నీళ్ళతో ఆటలాడి బట్టలు తడుపుకోనేవాడు.కొంచెం పెద్దయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి అల్లరి చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని అందరూ మనింట్లోనే ఆడుకోండి అని సంయుక్త చెప్పటంతో పొలోమంటూ ఆ వీధిలో ఉన్న పిల్లలు,ప్రక్క వీధిలో పిల్లలు అందరూ వచ్చి ఆటలాడి బాగా అల్లరి చేసేవాళ్ళు.పిల్లలు అందరూ బాట్ లతో ఆటలు ఆడి పిల్లర్లు,పువ్వుల కుండీలు అన్నింటిని పగలకొట్టేవాళ్ళు.ఏడవ తరగతికి వచ్చేటప్పటికి అల్లరి తగ్గింది.చిన్నప్పుడు పిల్లలు చేసిన అల్లరి పిల్లలకు,పెద్దలకు కూడా మధుర జ్ఞాపకాలుగా ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతాయి.తలచుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
No comments:
Post a Comment