Sunday, 31 December 2017
Saturday, 23 December 2017
క్షణం తీరిక దమ్మిడీ ఆదాయం
క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు అనే సామెతను గుర్తు చేసుకోవడానికి అన్నట్లు త్రిపుర ఒక్క క్షణం కూడా ఖాళీగా లేకుండా ఎదో ఒక పని చేస్తూనే ఉండేది.అమ్మా త్రిపురా!ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నువ్వు గుర్తొచ్చి చూచి పోదామని వచ్చాము అంటూ బంధువులు ఒక కుటుంబం తర్వాత ఇంకొక కుటుంబం ఉదయం నుండి రాత్రి వరకు వస్తూనే ఉంటే వారికి వండి వార్చి పెట్టడమే సరిపోయేది.వయసులో ఉన్నప్పుడు సరదాగా బొంగరంలా తిరుగుతూ హడావిడిగా పనులు చేస్తూ,పనివాళ్ళతో చేయిస్తూ సంతోషంగానే ఉండేది.వయసు పెరుగుతున్న కొద్దీ విసుగ్గా గానుగెద్దు జీవితంలా అనిపించడం మొదలు పెట్టింది.అనిపించగానే త్రిపుర వెనక్కు తిరిగి చూస్తే ఏముంది?ఖర్చు,చాకిరీ తప్ప క్షణం తీరిక దమ్మిడీ ఆదాయం లేని జీవితం వెక్కిరిస్తున్నట్లు తోచింది.తిని వెళ్ళిన వాళ్ళే గుర్తు లేనట్లు నటిస్తుంటే తనంటే ప్రేమతో కాదు స్వార్ధంతో ఇంటికి వచ్చేవారని తెలుసుకునేసరికి సగం జీవితం కరిగిపోయింది.వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో వచ్చినా ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాదగా భోజనం పెట్టడం మన సంప్రదాయం,సంస్కారం కనుక త్రిపురకు ఇంటి ఇల్లాలిగా తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చానన్న సంతృప్తి మిగిలింది.
రోజుకొకసారి.....
చలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా చర్మం నునుపుదనం కోల్పోయి పొడిబారుతూ ఉంటుంది.ఈ విధంగా చర్మం పొడిబారకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా చలి బాగా పెరగక ముందే ఒక గిన్నెలో ఒక అర కప్పు లేత కలబంద గుజ్జు,ఒక కప్పు నీళ్ళు,ఒక చెంచా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె బాగా కలిపి ఒక సీసాలో పోసి పెట్టుకోవాలి.దీన్నికొంచెం చేతిలో వేసుకుని రోజుకొకసారి ముఖానికి,మెడకు చేతులకు,పాదాలకు పలుచగా రాసుకుని ఒక పది ని.ల తర్వాత రుద్ది కడగాలి.రోజుకొకసారి ఇలా చేయడం వలన చర్మం గరుకుగా లేకుండా నునుపుగా తయారవుతుంది.
Sunday, 29 October 2017
తప్పొప్పులు ఎంచక
మనకు ఎక్కువ ఆశ్చర్యం,సంతోషము అనిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.ఇలా ఏకకాలంలో సంభ్రమాశ్చర్యం కలిగించే సంఘటనలు రోజూ ఎక్కువగా ఎదురు కాకపోవచ్చు.అందుకే నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలోను తప్పొప్పులు ఎంచక ఏ చిన్న సంతోషకరమైన విషయాన్నైనా చిన్న పిల్లల్లా ఆనందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు,పెద్దల సూచన.ప్రకృతి సౌందర్యాన్ని, నచ్చిన స్నేహితులనో,బంధువులనో అకస్మాత్తుగా చూచినప్పుడు మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది.ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా వీలుకల్పించుకుని సాధ్యమైనంతవరకు అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ,తరచు ఆప్తులను కలిసి మాట్లాడుకుంటూ ఉంటే మనసుకు హాయిగా ఉండి ఉత్సాహంగా పనిచేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
Friday, 27 October 2017
చలికాలంలో చర్మం
చలి మొదలవగానే చాలామందికి చర్మం పొడిబారి పోతుంటుంది.చలికాలంలో కూడా చర్మం మృదువుగా ఉండాలంటే రోజుకి మూడు లీటర్ల నీళ్ళు తప్పనిసరిగా తాగాలి.ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.స్నానానికి పది ని.లు ముందు కొబ్బరి నూనెతో మర్దన చేసి గోరు వెచ్చటి నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి ఆ నీటితో స్నానం చేస్తే తాజాగా బాగుంటుంది.రోజూ యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.ఈ కాలంలో సహజంగా వచ్చే ఒళ్ళు నొప్పుల సమస్య బాధించదు.ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.వారానికి రెండు సార్లు ఒక స్పూను తాజా పెరుగు,తేనె,బాదంపొడి లేదా శనగపిండి కలిపి ముఖానికి,కాళ్ళకు,చేతులకు రాసుకుని 15 ని.ల తర్వాత కడిగేయాలి.సమయం ఉంటే కనీసం వారానికి ఒకసారైనా శరీరం మొత్తానికి ఈ మిశ్రమం రాసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా మెరుస్తూ ఉంటుంది.రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.రోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు బాదం నూనె రాసుకుంటే పొడిబారకుండా మృదువుగా ఉంటాయి.ఇవన్నీ పాటిస్తూ ఈ కాలంలో దొరికే అన్నిరకాల పండ్లు,కూరగాయలు తాజాగా తీసుకుంటుంటే చలికాలంలో చర్మం పొడిబారే సమస్యను అధిగమించవచ్చు.
Thursday, 19 October 2017
బొమ్మలాట
ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ళ పంట.ఇప్పుడు కొంత మందికి పెళ్ళంటే బొమ్మలాట అనడానికి ఇదొక ఉదాహరణ.బొమ్మలపెళ్ళి అనుకోవడానికి ఏమైనా చిన్న పిల్లలకి చేశారా?అంటే అదీ లేదు.ఇద్దరికీ పాతిక సంవత్సరాలు దాటి రెండు మూడేళ్ళు.ఇద్దరూ సాంకేతిక రంగంలో పట్టభద్రులు.నగరంలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.ఇద్దరి తల్లిదండ్రులు ఆకాశం అంత పందిరి,భూదేవి అంత అరుగు వేసి అన్నట్లు ఒకరికొకరు పోటాపోటీగా డబ్బు ఖర్చుపెట్టి ఘనంగాపెళ్ళి చేశారు.పెళ్ళయిన మూడోరోజే అమ్మాయి,అబ్బాయి మేము ఇద్దరమూ విడిపోతామని ఖరాఖండీగా చెప్పేశారు.పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నారా?కారణం ఏమిటి?అంటే కారణం వాళ్ళకే తెలియదు.కలిసి బ్రతకలేము అంతే.మరో మాటకు ఆస్కారము లేదు.పెళ్ళి కుదిరి మూడు నెలలు అయింది.ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా?అంటే దానికి సమాధానం లేదు.వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇంకో జంటకు పెళ్ళయి పదేళ్ళయింది.ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు.ఇద్దరికీ పిల్లలు కావాలి.కానీ వాళ్ళు కలిసి బ్రతలేమని తేలికగా తేల్చి చెప్పేశారు.వీళ్ళు బిడ్డల మానసిక పరిస్థితి,తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచించటం లేదు.వాళ్ళు తల్లిదండ్రుల గురించి పట్టించుకోవటం లేదు.విడిపోవడం కూడా బొమ్మలాటలో బొమ్మల పెళ్ళి చేసినంత తేలిగ్గా అయిపోయింది.
Wednesday, 18 October 2017
Monday, 16 October 2017
సాయీశా ఓ సాయీశా
సాయినాధ శ్రీ సాయినాధ అంటూ ఎంతో భక్తితో మొదలుపెట్టి సాయీశా ఓ సాయిశా అంటూ మనకు అందించిన జానకమ్మ సాయినాధ సంకీర్తనా కుసుమం.
సాయినాధా శ్రీ సాయినాధా మా దేవుడవు నీవేలే సాయినాధా
మా పాపాలను పరిమార్చు సాయినాధా "సా"
గరళమంత ఒక్క గుక్కలో మింగావంటా
మోహినివై దేవతలకు అమృతం పంచావంటా
రక్కసుల దర్పమును అణిచావంటా
ఆ దేవతలను అమరులను చేశావంటా సాయీశా ఓ సాయీశా "సా"
దశరధ నోముల పంట నీవేనంటా
యశోదానందుల ఇంట పెరిగావంటా
కలియుగమున షిర్డీలో వెలిశావంటా
నీ లీలలన్నీ చూసి మేము మురిసేమంటా సాయిశా ఓ సాయిశా "సా"
జగమంతా నిండినదీ నువ్వేనంటా
ఏకమైన నువ్వే అనేకమంటా
గోవిందుని నామాలను పలికితిమయ్యా
గోపాలుడు నువ్వేనని ఎరిగితిమయ్యా సాయిశా ఓ సాయీశా "సా"
బాలుడై షిర్డీకి వచ్చావంటా
సాయీ రమ్మని మహాల్సా పిలిచాడంటా
నీ ఆకలి లక్ష్మీభాయి తీర్చేనంటా
సాయినాధా శ్రీ సాయినాధా మా దేవుడవు నీవేలే సాయినాధా
మా పాపాలను పరిమార్చు సాయినాధా "సా"
గరళమంత ఒక్క గుక్కలో మింగావంటా
మోహినివై దేవతలకు అమృతం పంచావంటా
రక్కసుల దర్పమును అణిచావంటా
ఆ దేవతలను అమరులను చేశావంటా సాయీశా ఓ సాయీశా "సా"
దశరధ నోముల పంట నీవేనంటా
యశోదానందుల ఇంట పెరిగావంటా
కలియుగమున షిర్డీలో వెలిశావంటా
నీ లీలలన్నీ చూసి మేము మురిసేమంటా సాయిశా ఓ సాయిశా "సా"
జగమంతా నిండినదీ నువ్వేనంటా
ఏకమైన నువ్వే అనేకమంటా
గోవిందుని నామాలను పలికితిమయ్యా
గోపాలుడు నువ్వేనని ఎరిగితిమయ్యా సాయిశా ఓ సాయీశా "సా"
బాలుడై షిర్డీకి వచ్చావంటా
సాయీ రమ్మని మహాల్సా పిలిచాడంటా
నీ ఆకలి లక్ష్మీభాయి తీర్చేనంటా
నవ నాణెములు ఆమెకు నువ్విచ్చావంటా సాయీశా ఓ సాయీశా"సా"
Thursday, 12 October 2017
క్రమం తప్పకుండా ......
మెడ,మోచేతులు,మోకాళ్ళు నలుపుదనం తగ్గాలంటే రోజూ క్రమం తప్పకుండా కలబంద గుజ్జు,నిమ్మరసం,తేనె ఒక్కొక్క అర చెంచా చొప్పున బాగా కలిపి పూత వేసి ఒక పది ని.ల తర్వాత నీటితో కడగాలి.ఈ విధంగా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు నలుపు పూర్తిగా తగ్గిపోతుంది.
Friday, 6 October 2017
లక్ష్మమ్మ బుర్రకథ
లక్ష్మమ్మకు అరవై తొమ్మిది సంవత్సరాలు. భర్తకు ప్రభుత్వోద్యోగం.ఇంటా బయటా వంధిమాగదుల్లా క్రింది ఉద్యోగులు వుండేవారు.వయసులో ఉండగా భర్త ఉద్యోగ రీత్యా పలురకాల ఊళ్ళు తిరిగేవారు.ప్రభుత్వోద్యోగం కనుక కార్యాలయంలోని ఉద్యోగులు ఇంటికి వచ్చి వంటతో సహా అన్ని పనులు చేసి భోజనం పళ్ళెంలో పెట్టి మరీ వెళ్ళేవాళ్ళు.హాయిగా సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకుని మహారాణిలా ఠీవిగా,దర్పంగా కుర్చీలో కూర్చుని అలలను చూస్తూ కాలక్షేపం చేసేది.భర్త ఉద్యోగ విరమణ అనంతరం వయసురీత్యా తోడబుట్టిన వాళ్ళు,బంధువులు గుర్తొచ్చారు.లక్ష్మమ్మకు నా భర్త,నేను గొప్ప అనే అహంకారంతో ఎవరితోను సరిగా సత్సంభంధాలు లేవు.ఇప్పుడు తన అవసరానికి అందరినీ కలుపుకుందామని చూస్తుంటే ఎవరికీ వారే అందరూ అంటీ ముట్టనట్లే ఉంటున్నారు.చివరికి తమ్ముడు,మేనకోడలు జాలిపడి మా అందరితో కలిసి పుట్టిన ఊరిలోనే ఉండమని చెప్పగా తనకు ప్రత్యేకంగా ఇల్లు కావాలంది.మేనకోడలు తన స్వంత స్థలంలో ఉండటానికి చిన్న ఇల్లు కట్టించి ఇచ్చింది.వంటమనిషిని,ఇంట్లో పై పనులకు ఒక మనిషిని మాట్లాడింది.మధ్యాహ్నం మూడు గంటలైనా వంట మనిషి వచ్చి పళ్ళెంలో భోజనం పెట్టేవరకు లక్ష్మమ్మ దర్జాగా కుర్చీలో కూర్చునే వుంటుంది.భర్తకు పెట్టదు.తను తినదు.పనిమనిషి రాకపోతే హోటలు నుండి తెప్పిస్తుంది లేదంటే మేనకోడలు పెట్టాలి అంతే కానీ ఆమె వండదు.లక్ష్మమ్మ ఊరికి వచ్చిందని ఎవరైనా ఇంటికి వచ్చారంటే మాత్రం తన చిన్నప్పటి నుండి ఇప్పటివరకు తన జీవితంలో ఎంత దర్జాగా బ్రతికిందో ఒక్క ముక్క వదలకుండా ఏకరువు పెట్టి ఎదుటి వారి బుర్ర తినేస్తుంది. బుర్రకథ చెప్పినట్లు అందంగా మధ్య మధ్యలో పిట్ట కథల్లా జోకులు వేస్తూ అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని విరామం లేకుండా తన కథ వినిపిస్తుంటుంది.
Thursday, 28 September 2017
నేనంటే నేను
రాణి,వాణి చిన్ననాటి స్నేహితులు.పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు.ఇద్దరూ చదువుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళటం,తర్వాత పెళ్ళి,పిల్లలు ఎవరికి వారు పాతిక సంవత్సరాల వరకు కలుసుకోలేకపోయారు.అనుకోకుండా ఒక పెళ్ళిలో రాణికి వీళ్ళతోపాటు కలిసి చదువుకున్న ఇంకొక స్నేహితురాలు కలిసింది.వాణి ప్రస్తావన వచ్చి తనను చూచి చాలా రోజులైంది.ఇప్పుడు ఎలా ఉందో?చిన్నప్పుడు అందరినీ ఆట పట్టించేది అనగానే ఇప్పుడు కూడా అంతేనని వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఉంటారని చరవాణి నంబరు ఇచ్చింది.రాణి ఫోను చేయగానే వాణి ఎంతో సంతోషంగా మాట్లాడి తన ఇంటికి రమ్మని చెప్పింది.రాణి వెళ్ళగానే ఇద్దరు ఆడవాళ్ళు ఎదురుగా వచ్చి రండి రండి అంటూ ఆహ్వానించి నన్ను గుర్తుపట్టావా?నేనే వాణి అని నేనంటే నేను అంటూ మా ఇద్దరిలో వాణి ఎవరో చెప్పాలి అంటూ వెంటపడ్డారు.మధ్యలో వీళ్ళ గొడవ ఏమిటి?అనుకుంటూ మీ ఇద్దరూ కాదు అంటూ ముందుకు వెళ్ళింది రాణి. చిన్నప్పటిలానే వాణి ఆట పట్టించడానికి గోడ వెనుక నక్కి చూస్తుంది.ఇంతలో ఇంకొక ఆమె ఇదుగో వాణి అంటూ వాణిని తీసుకొచ్చింది.దీనికి చిన్నప్పటి చిలిపి చేష్టలు ఇంకా పోలేదు అనుకుంటూ ఉండగానే వాణి నేను ఎంతో కష్టపడి నిన్నటి నుండి వీళ్ళకు తర్ఫీదు ఇచ్చి కాసేపు నిన్ను ఆట పట్టించమంటే నువ్వు మీరు ఇద్దరూ కాదు అంటూ నిమిషంలో తేల్చేశావు నువ్వు ఏమీ మారలేదు అంది.వయసు రీత్యా కాస్త బరువు పెరగడం తప్ప బుద్దులు ఏమీ మారలేదు అనుకున్నారు.అంతే కదా!పుట్టినప్పటి బుద్దులు పుడకతో పోవాల్సిందే!ఎక్కడో ఒకళ్ళు తప్ప అని ఒకరికొకరు నవ్వుకుంటూ చిన్ననాటి కబుర్లు ముచ్చట్లు చెప్పుకున్నారు.
Sunday, 17 September 2017
వామాకు
చిన్నప్పటి నుండి చూడచక్కగా,అందంగా ఉండే వామాకు అంటే బజ్జీలు వేసుకుంటారని అవి తినటానికి ఎంతో రుచిగా ఉంటాయని మాత్రమే తెలుసు.వామాకు వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని ఈమధ్యనే పెదమ్మ కూతురు అక్క ద్వారా తెలిసింది.ఇంటికి రాగానే ఎదురుగా కుండీలో నిండుగా వామాకు నిగనిగలాడుతూ పచ్చిదే తిలానని అనిపించేలా ఉంది.అక్క ఇంటికి వస్తూనే వామాకుని రోజూ వాడుకోవా ఏమిటి?అంది.రోజూ వామాకు బజ్జీలు ఏమి తింటాము?అనగానే అక్క భలేదానివే!దీన్ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంది.నేరుగా పచ్చి ఆకు తింటే పైత్యం ఉండదు. నేను ఆకుల్ని సన్నగా ముక్కలు కోసి,ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి దోసె పిండిలో కలిపి అట్లు వేస్తాను.ఎంత రుచిగా బాగుంటాయో!అంటూ మాట్లాడుతూనే ఒక ఆకు గిల్లి నోట్లో వేసుకుని పరపరా నమిలేస్తూ చెప్పింది.అంతే కాదు కారట్,వామాకు,కొద్దిగా నీళ్ళు కలిపి మిక్సీ లో వేసి రసం తీసి వడకట్టి తాగితే కంటి చూపు మెరుగు పడుతుందని,కారట్,పాలకూర,వామాకు,కొంచెం నీళ్ళు కలిపి రసం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని,కారట్,దానిమ్మ,వామాకు,కొద్దిగా నీరు కలిపి రసం తీసుకుని తాగితే నరాల బలహీనత తగ్గుతుందని,ఇలా ఒక కూరగాయ,ఒక పండు,ఆకుకూర,వామాకు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చాంతాడంత చిట్టా చెప్పింది.అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది బరువు అదుపులో ఉండటంతో ఏ వ్యాధులు రాకుండా శారీరకంగా,మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని,శరీర సౌందర్యం కూడా పెరుగుతుందని అక్క చెప్పింది.కొమ్మ విరిచి గుచ్చినా వామాకు మొక్క వస్తుంది.కుండీలో తేలికగా పెంచుకోవచ్చు.పైగా దీని వాసనకు దోమలు కూడా పారిపోతాయని అక్క చెప్పింది.
Friday, 8 September 2017
మిడి మిడి జ్ఞానం
ఈరోజుల్లో చాలామంది ఎవరికి వారే మాకే అంతా తెలుసు. మేమే గొప్ప.మమ్మల్ని మించిన వారు ఈప్రపంచంలోనే ఎవరూ లేరు అనే అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.స్వార్ధం,అహం పాళ్ళు కూడా ఎక్కువై తమకు తామే బరువుగా తయారు అవుతామని తెలుసుకోవటం లేదు.ముందుగా ఎదుటివాళ్ళు నన్నే పలకరించాలనే అహం.ఒకవేళ తెలిసినవాళ్ళో,బంధువులో మాట్లాడాలని చూచినా చూడనట్లు నటించడం ఎవరైనా అవసరంలోనో,ఆపదలోనో ఉంటే ఇంతకు ముందు వారి సహాయం పొందిఉన్నా కూడా తప్పించుకోవడం ఇలా ఎదుటివారి నుండి ఏదైనా అందుకోవడమే తప్ప అందించడం చేతకాని వారు చివరకు ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎదురవుతుందని ఊహించరు.వీళ్ళు బయట మాత్రమే ఇలా ఉంటారనుకోవడానికి లేదు.అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ దగ్గర కూడా స్వార్ధం.తోడబుట్టిన వాళ్ళను కూడా ఏమార్చి వాళ్ళ ఆస్తులు అన్యాయంగా కొట్టేసి తన భార్య,తన పిల్లలు తాను మాత్రమే పైకి రావాలనే విపరీత మనస్తత్వం.పోనీ ఇన్ని అక్రమాలు చేసినా ప్రశాంతంగా తనవాళ్ళతో బ్రతుకుతున్నారా!అంటే అదీ లేదు.వాళ్ళతోనే ఛీ కొట్టించుకోవడం మామూలే.శాశ్వతంగా ఈ భూమి మీద బ్రతుకుతారా!అంటే అది సాధ్యం కాదు.దీనివల్ల ఎదుటివాళ్ళు కొంత నష్టపోతారేమో?అంతేకానీ చివరకు వాళ్ళే ఎక్కువ నష్టపోతామని అనుకోరు. మనసులోను,చివరకు తమ చుట్టూ కూడా ఎవరూ లేని ఒంటరి బ్రతుకు బ్రతకాల్సి వస్తుందని కలలో కూడా ఊహించరు.వాళ్ళు సంతోషంగా ఉండరు.ఎదుటివాళ్ళు సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు.మనం సంతోషంగా ఉండాలి.మన చుట్టూ ఉన్నవాళ్ళను సంతోషంగా ఉండేలా చేయాలి.అప్పుడే మనకు మనశ్శాంతి అని జ్ఞానోదయం చేద్దామని ఎవరైనా అనుకున్నా నువ్వు చెప్పేదేమిటి?నాకు తెలుసు అనే అహం.ఇన్ని తెలిసినా స్వార్ధం,అహం,భేషజాలు వదులుకోలేకపోవడం దురదృష్టకరం.ఈ అహం,స్వార్ధం,భేషజం అనే అజ్ఞానం నుండి బయటపడి ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు వాళ్ళతోపాటు అందరికీ సంతోషం.
Saturday, 2 September 2017
విజయం మనదే
మనల్ని మనం నమ్మి ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే
అనుకున్నది సాధించగలం.ఏపని అయినా పూర్తి సామర్థ్యంతో ఇష్టంగా కష్టపడి పని చేయాలి.కాస్త పైకి రాగానే ఏదో సాధించామని తోటి మనుషులను లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మన విలువను కోల్పోకూడదు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలన్నట్లు మన చుట్టూ ఉన్నవాళ్ళతో ప్రేమగా ఉంటూనే ఎదుటివాళ్ళను ఎవరి పరిధిలో వాళ్ళను ఉంచాలి. కుట్రలు,కుతంత్రాలు చేయకుండా సరికొత్త సాంకేతికతతో నీతి,నిజాయితీతో కష్టించి పనిచేసే ప్రతిభావంతులను మాత్రమే ఎంచుకోవాలి.ఎప్పుడూ కూడా బంధుప్రీతికి లేశమైనా చోటివ్వకూడదు.ఖచ్చితమైన నియమ నిబంధనలు,సమయపాలన పాటిస్తూనే నొప్పింపక తానొవ్వక అన్న చందాన ఒక క్రమ పద్దతిలో మనం ఎదురుగా ఉన్నాలేకపోయినా క్రమశిక్షణతో చకచకా పనులు జరిగిపోయేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.ఈవిధంగా చక్కటి ప్రణాళికతో ముందుకు అడుగు వేస్తే విజయం మనదే.
Sunday, 27 August 2017
గులాబీ జామ
చిన్నప్పుడు స్రవంతి అమ్మమ్మ వాళ్ళింట్లో తెలుపు,ఎరుపు,గులాబీ జామచెట్లు ఉండేవి.కానీ స్రవంతికి తెలుపు,ఎరుపు జామకాయల కంటే దోర గులాబీ జామకాయ అంటే మహా ఇష్టం.పెద్దయ్యాక నోటికి రుచి,కంటికి ఇంపు మాత్రమే కాక పండు కన్నా పచ్చి,దోరకాయలు తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసి అన్ని రకాలు ఇష్టంగా తినడం మొదలెట్టింది.తను తినడమే కాక స్నేహితులకు కూడా చెప్పి తినేలా ప్రోత్సహిస్తుంది.జామకాయ చర్మ సౌందర్యాన్నిరెట్టింపు చేయడమే కాక రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది.థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పని చేసేలాగా చేస్తుంది.మధుమేహం,బి.పి,గుండె జబ్బు,తరచు జలుబు,దగ్గుతో బాధపడేవాళ్ళకు జామ ఎంతో మంచిదని తెలిసి కుండీలోనే విరగకాసే జామమొక్కలు తెచ్చి స్రవంతి ఇంటి ముంగిట పెట్టింది.తనకు ఎంతో ఇష్టమైన గులాబీ జామలో రామములగ(టొమాటో)లో కన్నా రెట్టింపు లైకోపిన్ ఉండటంతో పర్యవరణ కాలుష్యం నుండి శరీరాన్ని కాపాడుతుందని తెలియడంతో 20 కి.మీ దూరంలో ఉన్న నర్సరీ నుండి తెప్పించి కుండీలో పెట్టింది.ఒక జామ కాయ పది యాపిల్ కాయలతో సమానమని స్రవంతి అమ్మమ్మ చెప్పేది.జామకాయలే కాక జామాకు కూడా దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది.పెద్దపెద్ద ఖాళీ స్థలాల్లో మాత్రమే జామచెట్లు పెంచగలము అనే అపోహను తొలగించి ఆసక్తి ఉంటే చిన్నకుండీలో కూడా ఏమొక్క అయినా పెంచుకోవచ్చని స్రవంతి స్నేహితులకు చెప్పింది.
Thursday, 24 August 2017
Tuesday, 22 August 2017
వజ్రాల పెట్టె
మనసు ఒక వజ్రాల పెట్టె. జాలి,దయ,ప్రేమ,శాంతం,సంతోషం వంటి మంచి భావాలతో మనసు నింపాలి.అంతే కానీ మనసులో కోపం,ద్వేషం,అసూయ వంటి పనికిమాలిన చెత్త నింపకూడదు.దీనివల్ల మనసు ప్రశాంతత కోల్పోయి మనసు అనే వజ్రాల పెట్టె అందవిహీనంగా మారిపోతుంది.మన మనసును బట్టే మన ముఖం కనబడుతుంది. కనుక మనసు మంచి భావాలతో నిండి ఉంటే ప్రశాంతంగా,సంతోషంగా,ఉత్సాహంగా ఉంటుంది.మనసు ప్రశాంతంగా,సంతోషంగా ఉంటే వజ్రలపెట్టె ధగధగ మెరిసినట్లు మన ముఖారవిందం కూడా రెట్టింపు అందంతో మెరిసిపోతుంది.
Monday, 7 August 2017
భావావేశాలు
ప్రస్తుత పరిస్థితులలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో ఎంతో కొంత ఒత్తిడికి లోనవడం జరుగుతుంది.ఒత్తిడితో అలసట,నిరుత్సాహంగా ఉండటమే కాక జీవితం నిస్సారంగా ఉంటుంది.దీనితో మానసికంగా,శారీరకంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.వీటి బారిన పడకుండా తప్పించుకోవాలంటే చీటికీమాటికీ కోపతాపాలు,ఉద్రేకం వంటి భావావేశాలను అదుపులో ఉంచుకోవటమే కాక ప్రతిరోజూ ఒక పావుగంట అయినా తప్పనిసరిగా ధ్యానం చేయాలి.ఈవిధంగా చేయడం వలన శరీరానికి అలసట లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Tuesday, 1 August 2017
నాన్న స్పర్శ
ద్విజ ఇద్దరు పిల్లల తల్లి.ద్విజ,భర్త ఇద్దరూ యంత్ర శాస్త్రంలో పట్టభద్రులు.ద్విజ ఉద్యోగ రీత్యా మొదటి స్థానంలో ఉంటుంది.ఒక బిడ్డకు తల్లి అయ్యే వరకు బాగానే ఉంది.భర్త రెండవ బిడ్డ కావాలంటే తనకు అంతగా ఇష్టం లేకపోయినా సరేనంది.ఒక పాప ఒక బాబు చీకు చింత లేని సంసారం.భర్త ఉద్యోగం చేస్తూనే వ్యాపారం మొదలెట్టి అదనపు డబ్బు సంపాదించడంతో సంతోషంగా రకరకాల వజ్రాలు,వైడూర్యాలు కొనుక్కునేది.రోజులు ఒకే విధంగా వుండవు కదా!భర్తకు వ్యాపారంలో నష్టం వచ్చేసరికి ద్విజ మానసికంగా కుంగిపోయి నన్ను,పిల్లలను నట్టేట ముంచావు అంటూ పెద్ద పెద్దగా ఏడవడం,అరవడం చేస్తుండేది.అమెరికాలో ఉండడంతో భర్త ఎంతో ఓర్పుతో ద్విజకు వైద్యం చేయించి చిన్న పిల్లలను బాధ్యతగా పెంచుతూ ఉద్యోగం చేసేవాడు.వ్యాపారంలో నష్టం వచ్చింది కనుక బిడ్డలకు,నాకు అన్యాయం చేశావు.అందుకే నీకు,నాకు సంబంధం లేదు అంటూ పిల్లలను కూడా తండ్రి దగ్గరకు రానీయకుండా పిచ్చి పనులు చేయడం మొదలెట్టింది.తండ్రి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ కనుక పిల్లలు తండ్రి దగ్గరకు వస్తే బలవంతంగా తీసుకెళ్ళి వేరే గదిలో పెట్టేది.పిల్లల ఏడుపు వినలేక భార్య మానసిక స్థితి సరిగా లేదు కనుక వైద్యుని సలహాతో వేరే ఊరిలో ఉద్యోగానికి వెళ్ళాడు.పిల్లను బాగానే చూస్తుంది కనుక మధ్య మధ్యలో ఇంటికి వచ్చినా ద్విజలో మార్పు రాలేదు. ద్విజ చిన్నప్పటి నుండి తన వైపు నుండే ఆలోచించి తప్పు అయినా ఒప్పు అయినా తనదే ఒప్పు అనేది.వ్యాపారంలో లాభాలు,నష్టాలు సర్వ సాధారణం.లాభాలు వచ్చినన్నాళ్ళు బాగానే ఉంది.నష్టం వచ్చేసరికి నువ్వు నాకొద్దు అంటూ పిల్లల గురించి ఆలోచించకుండా పిల్లలకు నాన్న స్పర్శ తెలియకుండా తనొక్కతే పెంచుదామనే నిర్ణయం తీసుకుంది.పిల్లలు,తండ్రి ఒకళ్ళను ఒక్కళ్ళు వదిలి ఉండలేని పరిస్థితి.తల్లి,తండ్రి అనురాగంతో,ఆనందంగా పెరగాల్సిన పిల్లలు దిగులుగా ఉంటే నాన్నమ్మ కడుపు తరుక్కుపోతోంది.ఏమీ చేయలేని పరిస్థితి.మేము చదువుకున్నాం కనుక మాకు అన్నీ తెలుసు ఎవరూ చెప్పాల్సిన పని లేదు అనే అహంకారం ఒకటి.దాంతో బంగారం లాంటి సంసారం చెడగొట్టుకుని విడిపోయే పరిస్థితి దాపురించింది.
Sunday, 23 July 2017
ఒళ్ళు విరుచుకోవడం
ఒకప్పుడు ఎవరైనా ఒళ్ళు విరుచుకోవడం చూస్తే పెద్దవాళ్ళు ఒళ్ళు విరుచుకుంటే దరిద్రం అంటూ చివాట్లు పెట్టేవారు.లేదంటే వాడికి దిష్టి తగిలింది దిష్టి తీయండిరా అనేవాళ్ళు. ఎవరైనా ఏకబిగిన పనిచేసేకన్నా ప్రతి గంటకు ఒకసారి లేచి ఒళ్ళు విరుచుకుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చని ఇప్పుడు పెద్దలు చెబుతున్నారు.ఏది ఏమైనా ఇది మాత్రం నిజం.మీరూ ఒకసారి ప్రయత్నించండి.
Friday, 21 July 2017
వ్యాధుల నివారిణి - పొట్లకాయ
స్నిగ్ధ కొత్తగా పెళ్ళయి అత్తగారింట్లో అడుగు పెట్టింది.ఇంటి చుట్టూ ఖాళీ స్థలం.దానిలో పద్దతిగా పెంచిన పూలమొక్కలు,కూరగాయలు,ఆకుకూరలు,ఇంకా రకరకాల పండ్ల మొక్కలు చూడటానికి ముచ్చటగా ఉంది.ఇంట్లో అడుగు పెట్టగానే హాయిగా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.రసాయన రహిత కూరగాయలతో చేసిన వంట కనుక భోజనం ఎంతో రుచిగా ఉంది.స్నిగ్ధ అత్తగారు ఒకరోజు స్నిగ్ధను పిలిచి అమ్మాయ్ పెరట్లో ఉన్న పిచ్చిక పొట్లకాయ కోసి తీసుకురా! అంటూ పిలిచారు.ఆవిడ అలా పిలవగానే స్నిగ్ధకు గుండెల్లో రాయి పడినట్లయింది.ఎందుకంటే చిన్నప్పటి నుండి స్నిగ్ధకు పొట్లకాయ వాసన పడదు.కూర కూడా తినదు.అసలు కాయను కూడా పట్టుకోదు.ఆ విషయం చెప్పలేక ముక్కు మూసుకుని పొట్లకాయ కోసి తెచ్చింది.కోడలు అవస్థ గమనించి నీకు ఇష్టం వుండదా!అని అడగ్గానే ముక్కు మూసుకునే తల అడ్డంగా తిప్పింది.ఆవిడ కోడల్నిప్రక్కన కూచోబెట్టుకుని ఓపిగ్గా అమ్మా!పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్త ప్రసరణ సాఫీగా జరగటమే కాక అనేక వ్యాధుల నివారిణి.వాంతులు,విరేచనాలు,జ్వరం వచ్చినప్పుడు,మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు,మూత్రాశయం పనితీరు మెరుగు పరుస్తుంది.గొంతులోని కఫం తగ్గించి శ్వాసకోశ పనితీరు బాగుండేలా చేస్తుందిఅని పొట్లకాయ గురించి కబుర్లు చెప్పి ఒకసారి రుచి చూడమని పొట్లకాయ,పెసరపప్పు కూర చేసి పెట్టారు.స్నిగ్ధ మొదట అయిష్టంగానే తిన్నాఎంతో రుచిగా వుండేసరికి మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుని తినేసింది.చెపితే తప్ప అది పొట్లకాయ కూర అని తెలియనంత రుచిగా ఉంది.దీనితో బరువు కూడా తగ్గటమే కాక వర్షాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధుల నివారిణి అని తెలియటంతో స్నిగ్ధకు పొట్లకాయ అంటే ఉన్న అయిష్టత తొలగిపోయింది.
Tuesday, 18 July 2017
పంటి నొప్పి
ఏ నొప్పి అయినా భరించగలం కానీ పంటి నొప్పి భరించడం చాలా కష్టం.అర్ధరాత్రి,అపరాత్రి నొప్పి వస్తే కష్టం కదా!వైద్యుని దగ్గరకు వెళ్ళేవరకు తాత్కాలికంగా నొప్పి తగ్గాలంటే పచ్చి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ మెత్తగా చేసి నొప్పి ఉన్న పంటిపై కాసేపు ఉంచితే నొప్పి తగ్గుతుంది.
Tuesday, 11 July 2017
చిటికెడు ఉప్పు
కోడిగుడ్లు,బంగాళదుంపలు ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పు వేసి ఉడికిస్తే పై పొట్టు తేలికగా వచ్చేస్తుంది.
కుండ - నోరు
మోహనరావు కొడుకు అంతంత మాత్రం తెలివితేటలు కలవాడు.అందుకని వరుసకు మనవరాళ్ళు అయిన ఉమ,సుమ ఇద్దరిలో ఒకరిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నాడు.అసలే మోహనరావుకు మహా డబ్బు పిచ్చి.అందువలన బుద్దిమంతురాలైన ఉమను వదిలేసి డబ్బుతోపాటు మొండితనం జాస్తిగా ఉన్నసుమను ఎంచుకున్నాడు.తన గొయ్యి తనే తవ్వుకున్నట్లు ఇంట్లో అడుగు పెట్టిన నాటినుండి పిచ్చివేషాలు వేయడం మొదలెట్టింది.రోజూ మోహనరావు వడిలో కూర్చున్నట్లు కూర్చుని కోతి గారాలు పోతూ ఖరీదు గల బట్టలు,నగలు,చరవాణి ఒకటేమిటి?బజారులో ఏది క్రొత్తగా వస్తే అది కావాలని కొనకపోతే అలిగి ఇల్లు పీకి పందిరి వేయడం మొదలు పెట్టింది.మోహనరావు కోడలు గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక ఎక్కడ కొడుకును వదిలేస్తానంటుందోనని కాళ్ళబేరానికి వచ్చి బ్రతిమలాడుతుండేసరికి నెత్తికెక్కి కూర్చుంది.చివరకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినా అలిగి మూతి ముడుచుకుంటుంది.చిన్న వయసు పోనీలే తనే తెలుసుకుంటుందని ఊరుకుంటే అర్ధం చేసుకోవటం లేదు.గోరంత దాన్ని కొండంత చేసి ఊరిలో అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం విన్న మోహనరావు అమ్మకు చిర్రెత్తుకొచ్చింది.కొడుకు దగ్గరకు వెళ్ళి కుండ ముయ్ మూత(మట్టి మూకుడు) ఉంటుంది కానీ నోరు ముయ్య మూత ఏమి ఉంటుంది?ఎవరి నోరు అని ముయ్యగలం?సుమ పిచ్చి వేషాలు వేస్తుంటే కట్టడి చేయాల్సింది పోయి నువ్వు కూడా తానంటే తందాన అని బ్రతిమిలాటలు,వెర్రి వేషాలు ఏమిటి?అంటూ కోప్పడింది.మనవరాలు వరుస కదా!కాస్త అతి చనువుతో అలా చేస్తుంది.అదే తెలుసుకుంటుందిలే!అన్నాడు మోహనరావు.
Thursday, 6 July 2017
కడుపు నొప్పి
మనం తినే ఆహారం సరిపడక ఒక్కొక్కసారి కడుపు నిండుగా ఉన్నట్లు (ఉబ్బరంగా)అనిపిస్తుంది.తీసుకున్నఆహారం సరిగా జీర్ణం కాక కడుపు నొప్పి వస్తుంది.అటువంటప్పుడు ఒక అర అంగుళం దాల్చిన చెక్క ముక్క,1/2 చెంచ వాము,చిటికెడు ఉప్పు ఒక కప్పు నీటిలో వేసి మరిగించి అ నీటిని వడకట్టి గోరువెచ్చగా త్రాగితే వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది.కడుపు నొప్పిగా ఉన్నప్పుడు(గ్యాస్ నొప్పి)పరగడుపున జీలకర్ర (జీరా)ఒక చెంచా నమిలి ఒక గ్లాసు త్రాగగలిగినంత వేడి నీరు త్రాగాలి.4,5 రోజులు ఈ విధంగా చేస్తే క్రమంగా తగ్గిపోతుంది.
మెంతు ఆకు,మెంతులు
రోజువారీ ఆహారంలో మెంతు ఆకు,మెంతులు తీసుకోవడం వలన బరువు తగ్గటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.ప్రతిరోజూ మెంతులు రాత్రి నానబెట్టి పరగడుపున తింటే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు అదుపులో ఉండటమే కాక గుండె ఆరోగ్యంగా ఉంటుంది.మెంతు ఆకు నూరి తలకు పెట్టుకుంటే వెంట్రుకలు నల్లగా మారడమే కాక రాలిపోకుండా ఉంటాయి.తాజా మెంతు ఆకు నూరి ముఖానికి పూత వేయడం వలన మొటిమలు,ముడతలు రాకుండా ఉంటాయి.బంగాళదుంప,టొమాటోతో కలిపి వండటం వలన రుచితో పాటు శరీరం ఎక్కువ ఇనుమును తీసుకుంటుంది.తేనే,నిమ్మరసం,మెంతు పొడి కలిపి తీసుకుంటే దగ్గు,జ్వరం,గొంతు నొప్పి వంటివి తగ్గుముఖం పడతాయి.ఆరోగ్యవంతులే కాక మధుమేహ వ్యాధి ఉన్నవారు మెంతులు,మెంతు ఆకు రోజూ ఏదోక రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది.ఇవే కాక ఇంక ఎన్నో ఉపయోగాలతో పాటు చిరుచేదు ఉన్న మెంతు ఆకు,మెంతులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ఫలితాలు మన స్వంతం చేసుకోవచ్చు.ఇడ్లీ,దోసె,చపాతీల్లో,కూరల్లో లేత మెంతు ఆకు వేసుకుంటే వాటికి అదనపు రుచి వస్తుంది.ఎండబెట్టిన మెంతు ఆకు పెరుగు తాలింపు వేసేటప్పుడు వేసి తాలింపు పెడితే కమ్మని వాసనతోపాటు మంచి రుచిగా ఉంటుంది.
Wednesday, 5 July 2017
పప్పుచారు కన్నా కమ్మగా
ఉలవలు,కందిపప్పు సమానంగా తీసుకుని దోరగా వేయించి మెత్తగా ఉడికించి ఇష్టమైన కూరగాయ ముక్కలు వేసి కాచిన చారు కమ్మగా మామూలు పప్పుచారు కన్నా ఎంతో రుచిగా ఉంటుంది.
Tuesday, 4 July 2017
నిజం నిష్టూరం
నిత్య చిన్నప్పటి నుండి అబద్దాన్ని నిజం అనుకునేలా కథ అల్లి తన తోటి పిల్లలకు,స్నేహితులకు వినిపిస్తూ ఉండేది.కథలు అల్లడమే కాక ఇంట్లో వాళ్ళకు కూడా బాగోలేదని అందుకే బడికి రాలేదని చెప్పేది.నిజమే అనుకుని జాలిపడి నోటు పుస్తకాలు ఇంటికి ఇచ్చేవాళ్ళు.ఇప్పుడు మీ అమ్మకో,అమ్మమ్మకో బాగుందా?అని ఎవరైనా అడిగితే బడికి రావటం ఇష్టం లేక అలా ఊరికే చెప్పాను అనేది.ఓర్నీ!నిజమే అనుకుని నేను చదువుకోకుండా పుస్తకం నిత్య ఇంటికి తెసుకుని వెళ్తానంటే అనవసరంగా ఇచ్చాను అని ఎవరికి వాళ్ళు ఒకరికి ఒకరు చెప్పుకుని పుస్తకాలు ఇవ్వడం మానేశారు.అప్పటి నుండి బడిలోనే వ్రాసుకోవడం మొదలు పెట్టింది.నిత్య అబద్దాలకోరు అని తోటి పిల్లలు చెవులు కొరుక్కునే వాళ్ళు.ముప్పై సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉంటున్ననిత్య ఉన్నట్లుండి స్నేహితురాలి చిరునామా కనుక్కుని వచ్చింది.తనకు,కూతురికి ఆరోగ్యం బాగోలేదని,కొడుకు చెప్పినమాట వినటం లేదని తమ్ముళ్ళు తనతో మాట్లాడటం లేదు అంటూ ఏవేవో కబుర్లు చెప్పింది.చిన్నప్పుడు అసలే అబద్దాలకోరు ఇప్పుడు మారిందో లేదో? అలాగే నిజం చెబుతుందో,అబద్దం చెబుతుందో? నమ్మశక్యం కావటం లేదు అనుకుంది నిత్య స్నేహితురాలు.ఒకవేళ నిజమే అయినా పదిహేను ఏళ్ల వరకు నిత్య గురించి పూర్తిగా తెలుసు కనుక నమ్మలేని పరిస్థితి.తర్వాత ఇంకొక స్నేహితురాలి ద్వారా అది నిజమేనని తెలిసింది. స్నేహితురాలికి నిత్య పరిస్థితి తలచుకుంటే చాలా బాధ అనిపించింది.ఎప్పుడూ అబద్దాలు చెప్పేవాళ్ళు నిజం చెప్పినా ఎవరూ నమ్మలేరు.అబద్దం చెప్పి తాత్కాలికంగా పబ్బం గడిచిపోయిందని సంతోషపడే కన్నా నిజం నిష్టూరంగా అనిపించినా వినటానికి కష్టంగా ఉన్నానిజమే మాట్లాడాలి.
Sunday, 2 July 2017
కోతి చేష్టలు
సీతమ్మకు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు.కూతురికి అరవై సంవత్సరాలు.ఇప్పటికీ అంత వయసు వచ్చినా కూతుర్ని వెంట పెట్టుకుని కోతి - పిల్లను పొట్టకు వేలాడేసుకుని తిరిగినట్లు ఎక్కడకు వెళ్ళినా వెంటేసుకుని తిరుగుతుంది.కొడుకుల ఇళ్ళకు వెళ్ళి పదేసి రోజులుండి ఇద్దరూ ప్రక్కప్రక్కన కూర్చుని కోడళ్ళను అది తినబుద్ది అవుతుంది ఇది తినాలనిపిస్తుంది అంటూ పెత్తనం చెలాయించి ఒకదాని వెంట ఒకటి వండించుకుని తింటూ పది రోజులు వస్తే ఎవడి కోసం వండి పెడుతుంది అంటూ తిన్నది అరిగే వరకు తల్లీకూతుళ్ళు విమర్శిస్తూ ఉంటారు.కోడళ్ళు మర్యాద కోసం నాలుగు రోజులు చాకిరీ చేసి తర్వాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ చేసి పెడుతూ ఉంటారు.కోతి పిల్లను మోసుకుని వచ్చినట్లు తను వచ్చేది కాక కూతుర్ని తీసుకుని ఇళ్ళ ఈరమ్మ మాదిరిగా తిరగటం జబర్దస్తీగా చేయించుకుని తినడం ఎంత వరకు సమంజసం.ప్రేమతో అడిగితే ఇష్టంగా వండి పెడితే తిన్నది అరుగుతుంది అంతేకానీ కష్టంగా ఇష్టం లేకుండా చేసి పెడితే తిన్నది అరగక తల్లీకూతుళ్ళ మాదిరిగా కోతి చేష్టలు చేసి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంటారు.
Friday, 23 June 2017
బొచ్చెలో బొమ్మరాయి
అరవై సంవత్సరాల నాగమణి ఒక్కగానొక్క కోడలు పరమ గయ్యాళి.ఒక్క రోజు కూడా ఆరోగ్యం బాగుండకపోయినా పళ్ళెంలో అన్నం పెట్టి ఎరుగదు సరికదా!ఇంటెడు పని అంటే బట్టలు ఉతికి,గిన్నెలు తోమి ఇల్లు తుడిచి,వంట చేయడంతోసహా నాగమణి చెయ్యాల్సిందే.నాగమణి కోడలు మాత్రం ఊరు మీద బలాదూరుగా ఇంటింటికి తిరిగి కబుర్లు చెప్తూ ఉంటుంది.అయినా ఎవరితో చెప్పుకోకుండా నా కోడలు బంగారం అని చెప్పుకుంటుంది.ఇంటెడు చాకిరీ చేసి పెట్టినా కోడలు ఒకసారి నాగమణిపై కోపం వచ్చి అన్నం సరిగా పెట్టకుండా ఇంటి పైనున్న గదిలో నిర్బందించింది.దానితో ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మకు,తమ్ముళ్ళకు సమాచారం అందించి ఇక్కడే వుంటే మీ ఇంటి ఆడపడుచు ఎక్కువ రోజులు బ్రతకకపోవచ్చు.చిక్కి శల్యమైపోయింది.మీ ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో వెళ్ళి తీసుకుని వచ్చారు.ఒక పదిరోజులు గడిచేసరికి కాస్త ఓపిక వచ్చి అమ్మతో కలిసి మరదళ్ళపై పెత్తనం చేయడం మొదలు పెట్టింది.ఒక్కో తమ్ముడి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉంటే ఏమి మాట్లాడినా,ఏమి చేసినా మర్యాద కోసం ఓపిక పట్టారు.తర్వాత చిన్న మరదలు మీవంట చాలా రుచిగా ఉంటుంది అంటూ ఇద్దర్నీ వంటగదికి పరిమితం చేసింది.పెద్ద మరదలుకు సంస్కారం అడ్డువచ్చి తానే అన్నీవేళకు అందించడంతో పైత్యం ప్రకోపించి భోజనం చేసి తిన్న పళ్ళేలు కడగమని తెచ్చి చేతిలో పెట్టడం మొదలు పెట్టారు.ఒకరోజు పెద్ద కోడలు చెల్లెలు అక్క దగ్గరికి వచ్చింది.ఈ తతంగం అంత చూచి ఈరోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు వున్నారా?అని ఆశ్చర్యపోయి ఆమె కోడలు పళ్ళెం కడగడం మాట దేముడెరుగు కనీసం ఒక్క రోజైనా బొచ్చెలో బొమ్మరాయి కొట్టలేదు కానీ ఇక్కడ పళ్ళేలు కడగమనడం ఎంత వరకు సమంజసం?ఎవరి పళ్ళెం వాళ్ళు కడుక్కొనే రోజుల్లో నువ్వే వాళ్ళను కూర్చోబెట్టి అనవసరంగా నెత్తికెత్తుకుని నువ్వు హైరానా పడుతున్నావు?నువ్వు అనుకున్నట్లు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు.వాళ్ళల్లో మార్పు రాదు నువ్వే మారాలి అని నువ్వు ఒక వారం రోజులు ఎటైనా వెళితే నేను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా సరైన మార్గంలో పెడతాను టూ అక్కకు జ్ఞానబోధ చేసింది.
Wednesday, 21 June 2017
వృధా కాలక్షేపం
వ్యర్ధమైన మాటలతో వృధా కాలక్షేపం చేయకుండా మౌనంగా ధ్యానం చేసుకోవడం అలవరుచుకుంటే మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాక మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Sunday, 18 June 2017
బంగారం,బంగారం
సరళ పల్లెలో సరిగా పంటలు పండకపోవడంతో తనకు వచ్చిన పిండి వంటలు వండి వాటిని అమ్మి డబ్బు సంపాదిద్దామనే ఉద్దేశ్యంతో కుటుంబంతో సహా పట్నం వచ్చింది.సరళ పిండి వంటలు చేయడంలో దిట్ట.ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కొద్ది పెట్టుబడితో కొంచెం కొంచెం వండి చుట్టుప్రక్కల వాళ్ళకు రుచి చూపించింది.శుచిగా,రుచిగా చేయడంతో అందరూ మెచ్చి ఎవరికి అవసరమైనవి వాళ్ళు చేసిపెట్టమని అడగడం మొదలు పెట్టారు.దానితో సరళ వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్దిలోకి వచ్చింది.దీనితో ఒక ప్రక్కన రకరకాల పచ్చళ్ళు తయారుచేసి అమ్మడం ప్రారంభించింది.అత్త,మామ,భర్త,సరళ అందరూ కష్టపడటంతో వ్యాపారం బాగా సాగుతుంది.ఫలానా చిరునామాలో పిండి వంటలు రుచిగా వున్నాయని తెలిసి రాకేశ్ వెళ్ళాడు.అక్కడ చాలామంది ఉండటంతో ఒక 5 ని.లు కూర్చున్నాడు.ఈలోగా ఒక్కతే అందరికీ ప్యాక్ చేసి ఇవ్వడం కష్టంగా వుండి సరళ బంగారం,బంగారం ఒకసారి వచ్చి నాకు కాస్త సాయం చెయ్యమని ఎవరినో పిలిచింది.చిన్న పిల్లాడు వస్తాడేమో అనుకుంటే సన్నగా రివటలా గాలికి పడిపోయేలా ఉన్నతను హడావిడిగా వచ్చాడు.కూర్చుంటే లేవడానికి ఇబ్బంది పడే సరళ నాభర్త అనగానే అందరూ సరళ భర్తను చూచి ఆశ్చర్యపోవడంతోపాటు భలే ముద్దుగా పిలుచుకుంటుందని అనుకున్నారు.అందరితోపాటు రాకేశ్ కూడా ఆశ్చర్యపోయాడు.
Saturday, 10 June 2017
పిలవని పేరంటం
ఏపనైనా రోజు ఒకే విధంగా చేస్తుంటే విసుగు పిలవని పేరంటంలా వస్తుంది.అదే పనిని రోజుకో విధంగా కొద్ది మార్పులతో విభిన్నంగా చేయటానికి ప్రయత్నిస్తుంటే కొత్త పని చేస్తున్నామన్న భావనతో విసుగు మన దరి చేరకుండా ఉంటుంది.
Tuesday, 6 June 2017
నామోషీ
ఎప్పుడూ ఎంతో సంతోషంగా అందరినీ పలుకరిస్తూ గలగల మాట్లాడే రాజమ్మ అకస్మాత్తుగా,దిగులుగా,నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటుంది.విజయ్ అమ్మమ్మను చూడాలనిపించి ఊరు వెళ్ళాడు.అమ్మమ్మ హుషారుగా లేదేంటి?అని అమ్మను అడిగాడు.అమ్మమ్మకు ఈమధ్య వినిపించడం లేదు.వైద్యుని వద్దకు తీసుకెళ్ళి వినికిడి యంత్రం పెట్టిద్దామంటే నామోషీ అనుకుంటుంది.నాకు బాగానే వినపడుతుంది.మీకేమైనా చెవుడు వచ్చిందేమో!అని గట్టి గట్టిగా పోట్లాడుతుంది అని చెప్పింది.విజయ్ దగ్గరకు వెళ్ళి ఎన్నిసార్లు పలకరించినా ఊ,ఆ అని అనటంలేదు.ఏమిటి?అమ్మమ్మా ఎన్నిసార్లు పిలిచినా మాట్లాడకుండా కూర్చున్నావేంటి?అంటే గయ్యిమంటూ కుర్చోక గంతులు వెయ్యమంటావా? అని అరిచింది.తనకు వినిపించటం లేదు అని ఒప్పుకోవటానికి నామోషీగా అనిపించి ఆ బాధను అరవటం ద్వారా వ్యక్తపరుస్తుందిలే అనుకున్నాడు విజయ్.నాలుగు రోజులకు సర్దుకుని వినపడక ఇబ్బందిగా అనిపించి వైద్యుని వద్దకు వెళ్ళి వినికిడి యంత్రం పెట్టుకుని మునుపటిలా సరదాగా ఉంటే బాగుంటుందని తనంతట తానే నిర్ణయించుకుంటే ఏ సమస్య ఉండదు.ప్రస్తుతం నిరాశలో కొట్టుమిట్టాడుతుంది.అమ్మమ్మను ఇప్పుడు కదిలించకపోవడమే మంచిది అనుకున్నాడు విజయ్.
Saturday, 3 June 2017
అప్పిచ్చువాడు
అప్పిచ్చువాడు వైద్యుడు అన్నది ఒకప్పటి మాట.యశ్వంత్ ఆపదలో ఉన్నాను.అత్యవసరంగా ఒక లక్ష రూపాయలు సర్దితే రెండు రోజుల్లో తెచ్చి ఇస్తానని వరుసకు బాబాయి రాఘవయ్య గారి వద్దకు వచ్చాడు.రెండు రోజుల్లో ఇస్తానన్నాడని ఎరువుల కోసం దాచిపెట్టిన డబ్బు తెచ్చి ఇచ్చారు.పది రోజులైనా యశ్వంత్ డబ్బు తెచ్చి ఇవ్వలేదు సరికదా అసలు మనిషే కనిపించడం మానేశాడు.ఎప్పుడు కబురు చసినా ఇంట్లో లేడనే సమాధానం వస్తుంది.అప్పటికే దొరికినచోటల్లా మాయమాటలు చెప్పి డబ్బు తీసుకుని ఊరి నిండా అప్పులే చేశాడని తెలిసింది.డబ్బు చేజారింది కనుక చేసేదిలేక రాఘవయ్యగారు ఒకతన్ని ఇంటివద్ద కాపలా పెట్టి వెళ్ళి అడగ్గా
ఇప్పుడే ఇంటికి తెచ్చి ఇస్తానని నమ్మబలికాడు.నిజమేననుకుంటే మళ్ళీ పత్తా లేకుండా పోయాడు.కష్టంలో ఉన్నానంటే ఎరువుల కోసం దాచిన డబ్బు ఇస్తే మాట తప్పడమే కాక బ్రతిమాలవలసి వస్తుంది అని రాఘవయ్య గారు బాధపడ్డారు.చివరకు ఎలాగోలా పట్టుకుంటే బాబాయ్ అడగగానే ఆలోచించకుండా డబ్బు ఇచ్చేయ్యడమేనా?ఎప్పుడో ఒకసారి నాకు డబ్బు వచ్చినప్పుడు ఇస్తాలే అప్పుడు తీసుకో అని దబాయింపు.ఆపదలో వున్నానని అన్నావు కదరా?అంటే నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు.ఈరోజుల్లో డబ్బు అప్పిచ్చువాడు పిచ్చివాడు అన్నమాట.అన్నమాటేముంది ఉన్నమాటే.వడ్డీకి ఆశపడకపోయినా చేబదులు అంటే ఇచ్చిన రాఘవయ్యగారు లాగా అనేక మంది యశ్వంత్ లాంటి వాళ్ళ మాటలకు మోసపోయి ఇబ్బందులపాలు అవుతున్నారు.కనుక యశ్వంత్ లాంటి వాళ్ళతో జాగ్రత్త.
భగభగలకు తగినట్లు
ఎండ భగభగలాడుతోంది.శరీరంలోని నీరు చెమట రూపంలో వెళ్ళిపోతుంది కనుక అందుకు తగినట్లు మనం కూడా నీరు అధికంగా ఉండే పండ్లు,కూరగాయలు,బార్లీ,నీళ్ళు,సబ్జా నీళ్ళు,మజ్జిగ,కొబ్బరి నీళ్ళు,చెరకు రసం,పంచదార లేని పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.దాహంగా ఉన్నా లేకున్నామంచి నీళ్ళు తాగుతూ ఉండాలి.మసాలాలు తగ్గించటమే కాకుండా బయటి ఆహార పదార్ధాలు తినకపోవడం మంచిది.ఎండా కాలంలో వడదెబ్బ బారినుండి తప్పించుకోవచ్చు.
మామిడికాయ హల్వా
తియ్యని మామిడికాయ గుజ్జు - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 కప్పు
పంచదార - 1 1/2 కప్పు
పాలు - 1 1/2 కప్పు
నీళ్ళు - 1 1/2 కప్పు
యాలకుల పొడి - 1/4 స్పూను
జీడిపప్పు - 5
కిస్ మిస్ - 5
నెయ్యి - కొద్దిగా
బొంబాయి రవ్వ - 1 కప్పు
పంచదార - 1 1/2 కప్పు
పాలు - 1 1/2 కప్పు
నీళ్ళు - 1 1/2 కప్పు
యాలకుల పొడి - 1/4 స్పూను
జీడిపప్పు - 5
కిస్ మిస్ - 5
నెయ్యి - కొద్దిగా
మామిడికాయను కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ లో ఉడికించి మిక్సీలో మెత్తటి గుజ్జులాగా చేయాలి.ఒక బాణాలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు,కిస్ మిస్ వేసి వేయించి ఒక ప్రక్కన పెట్టాలి.తర్వాత బొంబాయి రవ్వ వేయించుకోవాలి.ఒక గిన్నెలో పాలు,నీళ్ళు కలిపి మరిగించి పంచదార వేసి కరిగిన తర్వాత రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ కట్టకుండా కలియ తిప్పాలి.చివరలో యాలకుల పొడి వేసి కలిపాలి.హల్వా కొద్దిగా దగ్గర పడుతుండగా పొయ్యి కట్టేయాలి.ఇది చల్లారిన తర్వాత దానిలో మామిడికాయ గుజ్జు,జీడిపప్పు,కిస్ మిస్ వేసి బాగా కలిసేలా తిప్పాలి.అంతే రుచికరమైన మామిడికాయ హల్వా తయారయినట్లే.
Friday, 2 June 2017
ఆ నవ్వు
అక్కా!ఇంతకు ముందు డబ్బుఅప్పుగా తీసుకుని కనపడితే ఎక్కడ అడుగుతారోనని వాళ్ళకు సమాధానం చెప్పాల్సివస్తుందని ముఖం చాటేసేవాళ్ళు.ఈమధ్య కొంతమంది మాట్లాడితే మనకు ఏమి వస్తుంది,సమయం దండుగ కాకపోతే అన్నట్లు వింతగా ప్రవర్తిస్తున్నారు.బాగా తెలిసినవాళ్లు కదా!అని నవ్వు ముఖం పెట్టి ఆప్యాయంగా ఒక మాట మాట్లాడదామని అనుకుంటే చూచీ చూడనట్లు చూచి ముఖం చాటుచేసి వెళ్ళిపోతున్నారు.ఒకవేళ గుర్తు పట్టకపోతే గుర్తు చేస్తాం కదా!లేకపోతే ఆ విధంగా ప్రవర్తించడం నవ నాగరికత అనుకుంటున్నారో ఏమో?తెలియదు కానీ ఎరగనట్లు దూరంగా వెళ్ళిపోతున్నారు.నవ్వితే వాళ్ళ సొమ్మంతా ఏదో పోతుంది అన్నట్లు నాకయితే చూడటానికి విచిత్రంగా ఉంటుంది అని చెప్పింది రోష్న.నవ్వితే డబ్బు ఖర్చు అయిపోతుంది అనుకోవటానికి నవ్వు డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా!నవ్వితే భోగం,నవ్వకపోతే రోగం అన్నట్లు ఒకరికి ఒకరు పరిచయాలున్నప్పుడు మాట్లాడే సమయం లేకపోతే మనసారా ఒక నవ్వు నవ్వండి. అంతే కానీ ఇదేమిటి?పరిచయం ఉండి కూడా ముఖం చాటేస్తున్నారు అనుకోకుండా మనసారా ఒక నవ్వు నవ్వితే ఆ నవ్వు ఎదుటివారికి మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది.ఇంకొంతమంది మనతో ఏదైనా అవసరం ఉంటే మాత్రం ముఖం చింకి చేట అంత చేసుకుని ముఖం అంతా నవ్వు పులుముకుని హి హి హి అంటూ పరుగెత్తుకుని వస్తారు.ఉదయం పని చేసి పెడితే సాయంత్రానికి షరా మాములే.దయచేసి అవసరానికి నవ్వు పులుముకోకుండా మనసారా నవ్వితే బంధాలు బలపడటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
Wednesday, 31 May 2017
తాళంచెవి పట్టేసిందా?
తాళంచెవి పట్టేసి తిరగటం లేదా?కంగారు పడాల్సిన అవసరం లేదు.కొద్దిగా వెనిగర్ తీసుకుని దానిలో వేసి త్రిప్పితే వెంటనే తేలికగా తిరుగుతుంది.నట్టులు,బోల్టులు తుప్పుపట్టి కదలకపోయినా వెనిగర్ వేయగానే వెంటనే వదులు అవుతాయి.
సెల్ఫీ పాప
సహజంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళను అనుకరిస్తూ ఉంటారు.స్రష్ట చురుకైన 11 నెలల పసిపాప.పడుతూ,లేస్తూ,నడుస్తూ,పరుగెడుతూ,బోసి నవ్వులు నవ్వుతూ,అల్లరి చేస్తూ వద్దంటే అరుస్తూ పెద్దవాళ్ళు కొత్తగా ఏ పని చేస్తే ఆ పనిని తాను చేయడానికి ప్రయత్నిస్తూ అనుకరణ చేస్తుంది.స్రష్ట పిన్నిసెలవులకు వచ్చింది.అందరూ కలిసి ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి వెళ్ళారు.స్రష్ట ఫోటో తీయాలంటే కుదురుగా కూర్చోకుండా ఒకటే ఏడుస్తుండేది.అలాంటిది పిన్ని చరవాణిలో అందరినీ సెల్ఫీ తీయడానికి ఇటు చూడు అనగానే ఏడవడం ఆపేసి మరీ చూస్తుండేది.చరవాణిని ఎదురుగా పెట్టి చూడడం బాగా నచ్చినట్లుంది.అప్పటి నుండి ఎవరి చేతిలో చరవాణి ఉన్నా తీసుకుని ఎదురుగా పెట్టి చేతిని అటూఇటూ జరుపుతూ ఫోటో తీస్తున్నట్లు పోజు పెట్టి కిలకిల నవ్వడం మొదలుపెట్టింది.అంతటితో స్రష్ట ఇంట్లో అందరికీ ముద్దుగా సెల్ఫీ పాప అయిపోయింది.
Monday, 29 May 2017
ఎల్లప్పుడు మీవెంటే
ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాతావరణం ఒక ప్రదేశానికి ఇంకొక ప్రదేశానికి మారుతూ ఉంటుంది కదా!దీనితో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది.పెదవులు ఎండిపోయి పొట్టులేచినట్లుగా,కళావిహీనంగా తయారవుతాయి.అందుకే ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్,లిప్ బామ్ తప్పనిసరిగా మీవెంట తీసుకెళ్ళాలి.వీలయితే ఒక క్రీమ్ కూడా వెంటే అట్టిపెట్టుకోవడం మంచిది.మధ్యమధ్యలో ముఖం కడిగి తుడుచుకుని ముఖానికి,చేతులకు,పెదవులకు రాసుకుంటే ఎలాంటి వాతావరణంలో అయినా చర్మం,పెదవులు తేమను కోల్పోకుండా,చర్మం,పెదవులు పగలకుండా అందంగా ఉంటాయి.వీటితోపాటు మంచినీళ్ళ సీసా తీసుకెళ్లడం మాత్రం మరిచిపోకండి.
Sunday, 28 May 2017
పుచ్చపువ్వు
ఆద్య పదకొండు నెలల చిన్నారి.బుడిబుడి నడకలు నడుస్తూ పడుతూ లేస్తూ అప్పుడే పరుగెట్టడం మొదలుపెట్టింది.ఇంతలో మొదటి పుట్టినరోజు రానే వచ్చింది.వేరే దేశంలో ఉండటంతో బాబాయి,మేనమామలు ఆద్యను చూడటానికి రాలేకపోయారు. పుట్టినరోజుకు ఎట్టి పరిస్థితులలో రావాల్సిందేనంటూ ఆద్య తల్లిదండ్రులు పట్టుబట్టడంతో నానమ్మ,అమ్మమ్మ,తాతయ్యలు,బాబాయి,పిన్ని,మేనమామ,అత్త వేరే దేశాల నుండి ఆ సమయానికి వెళ్ళారు.ఆద్య ఆడుకుంటూ మధ్యమధ్యలో వెళ్ళి మేనమామ భార్యను సంబ్రమాశ్చర్యాలతో నిష్కల్మషంగా కళ్ళు విప్పార్చి పుచ్చ పువ్వులా మొహం ఇంత చేసుకుని ఎక్కడి కక్కడ చూస్తూ నిలబడుతుంది.ఇదేంటి?ఈపిల్ల ఇలా చూస్తుంది అనుకుంది మేనమామ భార్య.సాయంత్రం ఆద్యకు కావాల్సిన బట్టలు కొనడానికి షాపింగ్ మాల్ కు అందరూ వెళ్లారు.అక్కడ కూడా తెల్లగా అందంగా ఉన్న శ్వేత జాతీయుల దగ్గరకు వెళ్ళి అలాగే చూస్తుంటే వాళ్ళు ముద్దుగా ఉంది అంటూ మురిసిపోతున్నారు.ఆ వయసుకే ఆద్యకు అందం అంటే ఏమిటో తెలిసిందన్నమాట!
పాలిష్ అయిపోయిందా?
బూట్లకు వాడే పాలిష్ అయిపోయిందా?కంగారు పడకండి.చిన్న స్పాంజి ముక్కపై చేతులు శుభ్రపరచే ద్రవం తీసుకుని బూట్లకు పాలిష్ లాగా వాడుకోవచ్చు.చక్కగా మెరుస్తాయి.
స్వర్ణ పల్లకీలోన
ఓం సాయి రాం
స్వర్ణ పల్లకీలో సాయి వచ్చెసంబరములు అంబరము తాకెనంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తన స్వర్ణ పల్లకీలోన సాయి దేవుడొచ్చె
పుష్ప వర్షంబును దేవతలు కురిపించె "సా"
ఆ కనులు కురిపించె కరణామృతమ్ము
ఆ నవ్వులో ఉంది వరాలజల్లు
ఆ అభయహస్తంబు ఆపన్నులగాంచె
ఆ దివ్యరూపంబు హరిహరుల తలపించె"సా"
ఆబాలగోపాలం హరి నామమునుజేసె
అది నేనే అనుచు ఆ సాయి తలయూచె
అంగరంగ వైభవముగా అందరూ
ఆ సాయిబాబాకు హారతులు పట్టంగ "సా"
స్వర్ణ పల్లకీలో సాయి వచ్చెసంబరములు అంబరము తాకెనంటూ జయంతమ్మ వ్రాసుకున్న సాయినాధ సంకీర్తన స్వర్ణ పల్లకీలోన సాయి దేవుడొచ్చె
సంబరములు చూడ అంబరమును తాకె
జయ జయ ధ్వానాలు జనులంతా చేసెపుష్ప వర్షంబును దేవతలు కురిపించె "సా"
ఆ కనులు కురిపించె కరణామృతమ్ము
ఆ నవ్వులో ఉంది వరాలజల్లు
ఆ అభయహస్తంబు ఆపన్నులగాంచె
ఆ దివ్యరూపంబు హరిహరుల తలపించె"సా"
ఆబాలగోపాలం హరి నామమునుజేసె
అది నేనే అనుచు ఆ సాయి తలయూచె
అంగరంగ వైభవముగా అందరూ
ఆ సాయిబాబాకు హారతులు పట్టంగ "సా"
Wednesday, 24 May 2017
మొక్కలు ఏపుగా పెరగాలంటే
అరటిపండు పైన ఉండే తోలు ఎండబెట్టి మట్టిలో కలిపి గులాబీ మొక్కల్లో కానీ,మరే మొక్కలకు వేసినా మొక్కలు ఏపుగా పెరిగి పువ్వులు చక్కగా పూస్తాయి.పువ్వులు పూయని మొక్కలైతే ఏపుగా అందంగా పెరుగుతాయి.ఇది మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.
Tuesday, 16 May 2017
ఎండలు బాబోయ్ ఎండలు
45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఎండలు బాబోయ్ ఎండలు వీటిని తట్టుకుని ఎలా నిలబడాలి?వేడిని హాంఫట్ చేసి శరీరానికి వెంటనే శక్తినిచ్చే పానీయాలు ఏమేమి ఉన్నాయో అని ఆలోచిస్తుంటే చిన్నప్పుడు జేజమ్మ,అమ్మమ్మ,నానమ్మ,అమ్మ వేసవి కాలంలో ప్రత్యేకంగా ఇచ్చే పానీయాలు వరుసగా గుర్తొచ్చాయి.అప్పట్లో ఎంతో ఓపికగా పిల్లలందరికీ సమయానికి అన్నీ తయారు చేసి వట్టి వేళ్ళ చాపలు వేలాడేసిన తాటాకు పందిళ్ళ క్రింద కూర్చోబెట్టి అందరూ అన్ని రకాల పానీయాలు తాగేవరకు కబుర్లు,కథలు చెప్తూ వడదెబ్బ తగలకుండా కాపాడేవాళ్ళు.అవేంటంటే లేవగానే అందరికీ తాగగలిగినన్ని చల్లటి కుండలో మంచి నీళ్ళు తాగించి తర్వాత రాత్రి పాలుపోసి దానిలో అన్నం వేసి తోడుబెట్టిన పెరుగు అన్నంలో ఉల్లిపాయ వేసి ఇష్టమైన వాళ్ళకు పెట్టడం లేదా ఇడ్లీ మాత్రమే అల్పాహారం పెట్టి తక్కువ నూనెతో తయారుచేసిన కూరలతో శాకాహార భోజనం పెట్టి మధ్య మధ్యలో చల్లటి మంచి నీళ్ళు అందిస్తూ,4 నుండి 5 గం.లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్ళు (సబ్జాగింజలు 4-5 గం.లు నానబెట్టాలి).తేనెతో కానీ,బెల్లంతో కానీ నిమ్మరసం,పంచదార కలిపి కానీ,ఏదైనా పండ్లరసంలో(సపోటా,మామిడి,అనాస,బత్తాయి)కానీ కలిపి ఇచ్చేవాళ్ళు.ఏ రకమైన రుచి వుండదు కనుక నానబెట్టిన సబ్జా గింజలు దేనిలో అయినా ఇట్టే కలిసిపోతాయి.తాటి ముంజెలు,ఈత, సీమతుమ్మకాయలు,నేరేడుపండ్లు,కీరదోస,దోస,జామ,పుచ్చకాయ,కర్భూజాముక్కలు,రాగిజావ,మజ్జిగ(నిమ్మకాయ మజ్జిగ,మసాలా మజ్జిగ,పుదీనా మజ్జిగ,ఉప్పు పంచదార మజ్జిగ ఇలా ఎన్నెన్నో రకాలు),జల్ జీరా,చింత పండు రసం,పచ్చి,పండు మామిడి కాయల రసం,పుదీనా రసం ఒక్కొక్కటి ఒక్కోసారి ఇస్తూ వడదెబ్బకు వచ్చే జలుబు,దగ్గు,జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడేవాళ్ళు.ఆరోజుల్లో ఈరోజుల్లోలాగా చల్లటి గాలి తగలడానికి యంత్రాలు కూడా లేవు కదా!తాటిఆకులు,వట్టివేళ్ళతో చేసిన విసనకర్రలతో విసురుకుంటూ హాయిగా అందరూ కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు.అన్నీ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు.మనం కూడా మన పిల్లలకి తాజా పండ్ల రసాలతోపాటు పై విధంగా సాధ్యమైనంత వరకు ఇవ్వగలిగితే వేసవిని జయించినట్లే.మనకు ఇవన్నీ తెలియజేసినందుకు మనం మన పెద్దవాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ వేసవిని జయిద్దాం.
Thursday, 11 May 2017
పల్లకి వచ్చేనండీ
అదిగదిగో సాయి దేవుడు మేళాలు,తాళాలతో పల్లకీలో వచ్చేనండీ అంటూ కోలాహలంగా భజన చేస్తూ భక్తితో జయంతమ్మ పాడుకున్నసాయి సంకీర్తనా కుసుమం.
ఓం శ్రీ సాయి రాం
అదిగదిగో పల్లకీ వచ్చేనండీ
మన సాయి దేవుడు అందు వచ్చేనండీ
మేళాలు,తాళాలు,భాజాభజంత్రీలు
కోలాహలంగా కోలాటములతో "అ"
ముక్కోటి దేవతలు ముందు నడువంగా
ముత్తైదువలంతా హారతులు పట్టంగా
ముసి ముసి నవ్వుల మోహన రూపుడు "అ"
ధవళ వస్త్రములతో ధగధగ మెరయుచు
దీనుల పాలిట కల్ప వృక్షములాగా
శివుని పోలిన సాయి చిందులే వేయుచు"అ"
తాత లాగా నిన్ను దీవించ వచ్చాడు
తండ్రిలా నిన్నెపుడు కాపాడుతుంటాడు
నీబిడ్డ లాగా కొంగట్టుకుని నువ్వెక్కడుంటే అక్కడుంటాడు"అ"
Wednesday, 10 May 2017
ఖూనీ
దానిమ్మ కాయల వ్యాపారి మూడు చక్రాల బండిలో కాయలు వేసుకొచ్చి నాలుగురోడ్ల కూడలిలో బండి ఆపి తోట నుండి నేరుగా వచ్చిన దానెమ్మ కాయలమ్మా!రండమ్మా!రండి.మీ ఇంటి ముందుకి వచ్చిందమ్మా బండి ఎర్ర ఎర్రని గింజల దానెమ్మ అంటూ చెవికోసిన మేకలా ని. అయినా విరామ సమయం లేకుండా మైక్ లో అరవడం మొదలు పెట్టాడు.రుచిత పనిమనిషి మంగిని కాయలు నిగనిగలాడుతూ కనపడుతున్నాయి వెళ్ళి ఒక డజను తీసుకురమ్మని చెప్పింది.దానికి మంగి దానెమ్మ,దీనెమ్మ అన్న చందంగా దానిమ్మను ఖూనీ చేసి అరుస్తున్నాడు ఏంటమ్మా? తెలుగోడు అయ్యుండి భాషను ఖూనీ చేయడమేంటమ్మా?అంటూ వెళ్ళి దానిమ్మ కాయలు అనడం నేర్పి అదే మాట మైక్ లో అరిచేవరకు నిలబడి అప్పుడు కాయలు తెచ్చింది.చాలా సమయం పట్టింది ఏమిటి? అంటే భాషను ఖూనీ చేస్తే వినలేక పోయానమ్మా!అందుకే వాడికి పలకటం నేర్పించి వచ్చాను అంది.మంగి భాషాభిమానానికి నిజంగా ముచ్చటేసింది.ఈమార్పు అందరిలో వస్తే మాతృ భాషలో పలికే అక్షర దోషాలు తొలగుతాయి.
Tuesday, 9 May 2017
కలా?నిజమా?
కొద్దిగా గడ్డ పెరుగు,కొద్దిగా టొమాటో గుజ్జు తీసుకుని బాగా కలిపి ముఖానికి మెడకు,చేతులకు రాసుకుని ఒక పావుగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి.ఇలా చేయడం వలన చర్మం పైనున్న మురికి,నలుపుదనం తగ్గి చర్మం మెరుస్తూ కళగా ఉంటుంది.ఒక గంట సబ్బు ఉపయోగించకుండా కొద్దిగా శనగ పిండి తీసుకుని ముఖం,మెడ,చేతులు రుద్ది కడిగితే మనకు మనమే ఇది కలా?నిజమా?అని ఆశ్చర్యపోయేలా చర్మం నునుపుగా తయారవుతుంది.
Friday, 28 April 2017
కోతికి ధన్యవాదాలు
సరస్వతి చిన్ననాటి స్నేహితురాళ్ళతో కలిసి ఒక వారం రోజులు విహార యాత్రలకు వెళ్ళింది.ఆ నేపధ్యంలో దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అందరూ ఒకచోట కూర్చున్నారు.అక్కడ కోతులు బాగా ఉన్నాయి.ఒక కోతి అందరికన్నా వెనుకగా కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చి చేతికి తగిలించుకున్న సంచిపై చెయ్యి వేసి ఇవ్వమని సైగ చేస్తుంటే కోతి ఎక్కడ తన సంచి పడేస్తుందో అన్న భయంతో ఇవ్వకుండా ఆమె నా దగ్గర ఏమీ లేవమ్మా!అని పదేపదే మాట్లాడుతుంటే ముందు కూర్చున్న వాళ్ళకి అర్ధం కాలేదు.వెనక్కి తిరిగి చూసేసరికి కోతి సంచి పట్టుకుని ఇవ్వమని భీష్మించుకుని కూర్చుంది.అందరూ సంచి ఇవ్వమనేసరికి ఆమె ఇచ్చేసింది.కోతి వైనంగా సంచిని తెరచి అందులో ఉన్నడబ్బు,చరవాణి తీసి పక్కన పడేసింది.ఆహారం కోసమో ఏమో?సంచి మొత్తం వెతికి ఏమీ లేకపోయేసరికి అక్కడ పడేసి వెళ్ళిపోయింది.సరస్వతి స్నేహితురాలు బ్రతుకు జీవుడా!అనుకుంటూ తనను,తన సంచిని ఏమీ చేయనందుకు కోతికి ధన్యవాదాలు చెప్పింది.
ఓటి మోత
మనలో చాలా మందిది నిద్ర లేస్తూనే ఉరుకులు పరుగుల జీవితం.మనం మెలుకువగా ఉన్న సమయంలో సగం గంటలు ఎక్కడ పనిచేసినా దాదాపు కూర్చుని చేసే పని.శారీరకంగా ఏ మాత్రం శ్రమ ఉండదు.జీవితం హాయిగా ఉన్నట్లే ఉంటుంది.దీని వల్ల ఏదో ఒకరోజు హృదయం ఓటి మోత మోగుతుంది.అధిక రక్త ప్రసరణ,కొలెస్టరాల్ పెరగటం,మధుమేహం ఒక్కొక్కటిగా పలకరిస్తూ చివరకు గుండె పోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది.ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే పనిలోనే పని చేస్తూనే ఎవరికి వారే వాళ్ళకు అనుకూలంగా ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించుకోవాలి.రోజు మొత్తంలో ఒక అరగంట శ్రమ చేసినా గుండెను కాపాడుకోవచ్చు.విరామ సమయంలో కొద్ది దూరం నడవాలి.ప్రతి పనికి ఎదుటివారిపై ఆధారపడకుండా నాలుగు అడుగులు వేసి స్వంతంగా పని చేసుకోటం,లిఫ్ట్మె ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి.ఇవన్నీ తూ.చ తప్పకుండా పాటిస్తే ఓటి మోత లేకుండా గుండెతోపాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
పార్శ్వ నొప్పికి....
రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ద్రాక్షరసం తాగటం వల్ల పార్శ్వనొప్పి తగ్గుతుంది.రోజూ కొన్ని ద్రాక్ష పళ్ళు ఏదో ఒక సమయంలో నోట్లో వేసుకోవటం వలన నిద్రలేమి,తలనొప్పి వంటి వాటితోపాటు రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.త్వరగా ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి.తినే ముందు ఉప్పునీటిలో వేసి ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడగటం మాత్రం మరచిపోకండి.శుభ్రంగా కడిగిన ద్రాక్ష పళ్ళు మాత్రమే తినాలి.
Thursday, 27 April 2017
అందరిలో అందంగా
ముఖంపై చర్మం నిగనిగలాడాలంటే ఏదో ఒక క్రీమ్ రాసుకోవడం కాకుండా కొన్ని పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.ఆహారంలో మార్పులతోపాటు సహజ సిద్దమైన పూతలు వేసుకుంటూ నీరెండలో నడక,వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ పరగడుపున కారట్,దానిమ్మ రసం తాగాలి.రోజూ తప్పనిసరిగా పది,పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి.ఉదయం,సాయంత్రం లేత ఎండలో కాసేపు ఉండాలి.మధ్యాహ్నం ఎండ చర్మాన్ని కాంతి విహీనం చేస్తుంది.తాజా పండ్లు,కూరగాయలు తినాలి.ఉదయం నిమ్మరసం కానీ గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోవాలి.ముఖానికి సహజ సిద్దమైన బొప్పాయి,కారట్,అరటి పండు,కమల,నారింజ వంటి పాక్స్ వేసుకోవాలి. వేసుకునే ముందు ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడగాలి లేదా ఐసుగడ్డలతో శుభ్రం చేయాలి.ఇలా చేస్తే ముఖం నిగనిగ లాడుతూ అందరిలో అందంగా కనిపించడం ఖాయం.
Tuesday, 25 April 2017
చల్లని తల్లి
వేసవిలో ఉల్లి చల్లని తల్లిలా ఆదుకుంటుంది.ముక్కలు తరిగేటప్పుడు ఏడిపించే ఉల్లిపాయ వ్యాధి నిరోధక శక్తిని పెంచి వేసవిలో వచ్చే అనేక సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది.రోజూ ఆహారంలో ఏరూపంలో తీసుకున్నా శరీరానికి చలువ చేసి ఆరోగ్యంతోపాటు వేసవిలో వడదెబ్బ నుండి సైతం రక్షిస్తుంది.
చర్మం ఆరోగ్యంగా
ఒక స్పూను దోసకాయ రసం,ఒక స్పూను నిమ్మ రసం,ఒక స్పూను గులాబీ నీళ్ళు అన్నీ కలిపి ముఖానికి రాసుకుని ఒక పది ని.ల తర్వాత చల్లటి నీటితో ముఖాన్నిశుభ్రంగా కడగాలి.వేసవిలో ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Wednesday, 19 April 2017
గొప్ప మనసు
పార్వతమ్మ గారికి 90 సంవత్సరాలు ఉంటాయి.తల్లిదండ్రులు లేని అనాధ బాలికలకు చదువు సంధ్యలు చెప్పించడానికి,వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వారి బాగోగులు చూడటానికి కొంత మంది పెద్దలు సమిష్టిగా సేవాభావంతో ముందుకు వచ్చి ఒక సమితిగా ఏర్పడి పూర్తిగా సేవకే అంకితమయ్యారని తెలిసింది.తనకు తానుగా వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనలేదు కనుక వారిని ఇంటికి పిలిపించి తన వంతుగా పిల్లలకు ఉపయోగించమని కొంత మొత్తాన్ని అందజేసింది.కొంత మంది రెండు చేతులా సంపాదించే వాళ్ళు కూడా ఎదుటి వారికి చేతనైన సహాయం చేద్దామని అనుకోని రోజులు.అటువంటిది పార్వతమ్మ గారు సహృద్భావంతో ఆలోచించి భవిష్యత్ప్రణాళికకు ఉపయోగపడే విధంగా ఇవ్వటంతో అందరూ ఆమె కల్మషం లేని మనసును వేనోళ్ళ కొనియాడారు.ఇంతే కాక ఆమె చనిపోయిన తర్వాత వైద్య విద్యార్ధులకు ఉపయోగపడేలా తన పార్ధివ దేహాన్ని వైద్య విద్యాలయానికి ఇస్తానని సంతకాలు పెట్టి ఇచ్చింది.అక్కడికి వచ్చిన వారందరూ అమ్మా!మీ జన్మ ధన్యమైంది.మీది గొప్ప మనసు అని పార్వతమ్మ గారిని మెచ్చుకున్నారు.
Sunday, 16 April 2017
పప్పీ భోజనాలు
రోహిణి ఇంటినిండా బంధువులు.నిమిషం తీరిక లేదు.అసలే ఆదివారం.వంట ఇంటి నిండా గిన్నెలు.పనిమనిషి లక్ష్మి ఎగనామం.తాపీగా తర్వాత రోజు ఉదయం పనికి వచ్చింది.లక్ష్మీ చుట్టాలు వస్తారని తెలుసు కదా!నిన్నంతా పనికి రాలేదే?అని అడిగితే వద్దామనే అనుకున్నాను అమ్మా! కొద్ది దూరం రాగానే మావాళ్ళందరు రాములోరి కళ్యాణం జరిగింది కదా!అక్కడ పప్పీ భోజనాలు పెడుతున్నారు వెళదాం రమ్మని తీసుకుని వెళ్లారు.అక్కడ చాలామంది ఉండటంతో ఆలస్యం అయిపోయింది అందుకే రాలేకపోయాను అని చెప్పింది.కొత్తగా ఈ పప్పీ భోజనాలు ఏంటి?అంటే టేబులు,కుర్చీలు వేసి పెట్టే భోజనాలని మేము పప్పీ భోజనాలు అంటాము అని చెప్పింది.నిలబడి తినాలంటే కష్టం కదమ్మా అందుకే పప్పీ భోజనాలనగానే నేను కూడా వెళ్ళాను.నిమిషంలో పని అంతా చక్కబెట్టేస్తాను.మీరు కంగారు పడకండి అని తేలిగ్గా చెప్పేసింది.రోహిణి కూడా లక్ష్మి చెప్పిన తీరుకి నవ్వుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంది.
Wednesday, 12 April 2017
వినుడు వినుడు
విను వినుడు శ్రీ చరితము ఆలకించిన ఆచరించిన ధన్యులమయ్యెదము అంటూ జయంతమ్మ భక్తితో వ్రాసుకున్న
సాయినాధ సంకీర్తనా కుసుమం
జై సాయి రాం జై జై సాయి రాం
వినుడు వినుడు శ్రీ సాయి చరితము వినుడీ జనులారా
ఆలకించిన ఆచరించిన ఐశ్వర్యములనొసగే సాయి చరిత "వి"
కలియుగమందున కులమతమ్ముల కుమ్ములాట పెరిగే
సిరికి చెప్పి ఆ హరియే స్వయముగా భువికి తానేవచ్చే"భు" "వి"
పెళ్ళి బృందంతో బాలునివలె ఆ షిరిడీ పురి చేరే
గుర్తించిన ఆ మహాల్సాపతి సాయీ అని పిలిచే "సా" "వి"
అన్ని మతమ్ముల సారమొక్కటని ఆచరించి చూపే
ఆపన్నులను ఆదుకొనుటకై ధుని నుండి ఊదీ నిచ్చే "ధు"
వెలిగించెను ఆ పావనమూర్తి నీటితో జ్యోతులను
అచ్చెరువొంది ఆ పురజనులు దైవముగ కొలిచే "దై" "వి"
తన దరి చేరిన ప్రజలందరికీ సుఖశాంతుల నొసగే
చక్రధారియై వెలిగే తానే సాధు రూపుదాల్చే"సా"
ధర్మ మార్గమున నడిపించుటకై సద్గురినిగా మారే
జీవకోటిలో తేజము తానై జగములెల్ల నిండే"జ" "వి"
Monday, 10 April 2017
హెచ్చరికలు
మన శరీరం కంప్యూటర్ ని మించిన మహాయంత్రం.మనమే అనవసరంగా మితిమీరిన పనులు వేళాపాళా లేకుండా చేస్తూ శరీరాన్ని అతిగా కష్టపెడుతూ ఉంటాము.అయినా మన శరీరం అప్రమత్తంగా ఉంటూ మనకు హాని చేసే ప్రతిదాన్ని మన మనసు,మెదడు తిరస్కరిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.మనకు నిద్ర చాలకపోతే నిద్ర వస్తున్నట్లుగా ఉండడం,అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం వంటివి.అయినా మనం ఆ హెచ్చరికలు పట్టించుకోక తిరుగుతూ ఇబ్బందుల్లో పడుతూ ఉంటాము.అందుకే ఒత్తిడి ఎక్కువై దిగులు,అందోళన పడుతూ లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటూ ఉంటాము.సానుకూల ధృక్పదంతో చేయగలిగినంత పనిచేస్తూ వుంటే ఒత్తిడి దరిచేరకుండా ఉండటమే కాక ఆత్మస్థైర్యం పెరిగి అభివృద్ది దానంతట అదే వస్తుంది.సరిపడా పోషకాహారం తీసుకుంటూ హాయిగా ఏ ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోతుంటే అప్పుడు శరీరం అనే మహాయంత్రం మన మాట విని శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము.
Friday, 7 April 2017
గుర్తుందా?
నిర్మల తమ్ముడు మన ఊరిలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నాము.మీరిద్దరూ తప్పకుండా రావాలి అని చెప్పగానే పుట్టిన ఊరు,చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కొంగొత్త ఉత్సాహంతో తయారయి భర్తతో కలిసి వెళ్ళింది.చిన్ననాటి స్నేహితులు,ఇరుగుపొరుగు,ఊరి వారందరు ఎంతో ఆప్యాయంగా పలుకరించారు.ఇంతలో ఒకతను వచ్చి నువ్వు నిమ్మీ కదూ!పోలికలను బట్టి నువ్వేనని పలుకరిద్దామని వచ్చాను.నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పి ముప్పై సంవత్సరాల క్రితం మనం ఒకే గొడుగులో వెళ్ళాము గుర్తుందా?అని అడిగాడు.అంత చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యం అనిపించినా ఒక ని. నిర్మల బిత్తరపోయి ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టేసరికి నువ్వు అప్పుడు చిన్నపిల్లవి గుర్తుండక పోవచ్చులే అన్నాడు.కాసేపు కుశల పశ్నలు వేసి ఎంత హడావిడిగా వచ్చాడో అంతే హడావిడిగా వెళ్ళిపోయాడు.
Thursday, 6 April 2017
కుక్కరులో పెద్ద మంట
చారుమతి పొయ్యమీద కుక్కరు పెట్టి కొద్దిగా నూనె వేసి ఎవరో పిలిచినట్లుంటే వరండాలోకి వెళ్ళింది.2 ని.ల్లోనే వంటగదిలోకి వచ్చేటప్పటికి కుక్కరులో నుండి అడుగు ఎత్తున పెద్ద మంట వస్తుంది.మంట ఉన్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు.అసలు ఎందుకు అలా వస్తుందో అర్ధంకాక ఏమి చేయాలో తోచక ధైర్యం చేసి గభాల్న కుక్కరు పిడి పట్టుకుని సింకులో నీళ్ళ గిన్నె వుంటే దానిలో కుక్కరును బోర్లించి నీళ్ళల్లో ముంచేసింది.కుక్కరు బాగా వేడెక్కి ఉండటంతో నీళ్ళల్లో వేసిన కొద్ది సేపటికి కానీ మంట తగ్గలేదు.పొయ్యి పక్కనే చెక్కతో చేసిన అలమర ఉంది.పొయ్యి కట్టేసి వెళ్తే ఈ తిప్పలు తప్పేవి కదా!కొద్దిగా ఆలస్యం జరిగినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.కొంతలో కొంత నయం.హమ్మయ్య!ఈ రోజు పెద్ద గండం గడిచింది అని చారుమతి సంతోషపడింది.
సూచన:వంట చేసేటప్పుడు ఎవరయినా వచ్చినా పొయ్యి కట్టేసి వెళ్తే పదార్ధాలు మాడిపోకుండా ఉండటమే కాక పైన
చెప్పినటువంటి ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు రాకుండా వుంటాయి.
Wednesday, 5 April 2017
పుల్ల ఐసు
మనలో చాలామంది పుల్ల ఐసు అంటే ఇష్టపడనివారు అంటూ ఉండరు.తులసికి అయితే చెప్పలేనంత ఇష్టం.తులసి అంటే నలుగురు మగపిల్లల తర్వాత లేకలేక ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులతోపాటు అన్నదమ్ములకు కూడా చెల్లెలంటే ప్రాణం.అన్నలతో పాటు వాళ్ళ భార్యలకు కూడా ఆడపడుచు అంటే మహా ఇష్టం.స్వగ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆడపడుచుకు ఒంట్లో వేడిని హరించి శరీరాన్ని చల్లబరిచే సబ్జా గింజలు చల్లిన పుల్ల ఐసు అంటే మరీ ఇష్టమని పక్క ఊరినుండి ప్రత్యేకంగా తెప్పిస్తూ ఉంటారు.తులసితోపాటు ఒదినలు ఇరుగు పొరుగు అందరూ అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ నీరు కారిపోకుండా మధ్యమధ్యలో పుల్ల ఐసు నోట్లో పెట్టి ఆ ఐసు గొంతు దిగుతుంటే శరీరమంతా చల్లచల్లగా అయిపోతుంటే ఎంతో హాయిగా వేసవి సాయంకాలాలు గడిపేస్తూ ఉంటారు.పుల్ల ఐసు అంటే ఇష్టమైన వాళ్ళకు మాత్రమే ఆ రుచి అందులో ఉండే మజా తెలుస్తుంది.
Tuesday, 4 April 2017
శ్రవణం స్మరణం కీర్తన
ఓం సాయి రాం
ప్రతి నిత్యం శ్రవణం స్మరణం భక్తితో కీర్తన చేయమంటూ జయంతమ్మ వ్రాసుకున్ననవవిధసంకీర్తనా కుసుమం
శ్రవణం చేయుము గురుచరితం
స్మరణం చేయుము ఓంకారం
కీర్తన చేయుము హరినామం
పూజలు చేయుము ప్రతినిత్యం
వందనమర్పించుము సూర్యునికి
దాసుడవే ఎప్పుడు దేవునికి
పాదసేవలు చేయుము గురువులకు
సఖ్యము చేయుము కృష్ణునితో
ప్రతి నిత్యం శ్రవణం స్మరణం భక్తితో కీర్తన చేయమంటూ జయంతమ్మ వ్రాసుకున్ననవవిధసంకీర్తనా కుసుమం
శ్రవణం చేయుము గురుచరితం
స్మరణం చేయుము ఓంకారం
కీర్తన చేయుము హరినామం
పూజలు చేయుము ప్రతినిత్యం
వందనమర్పించుము సూర్యునికి
దాసుడవే ఎప్పుడు దేవునికి
పాదసేవలు చేయుము గురువులకు
సఖ్యము చేయుము కృష్ణునితో
ఆత్మ నివేదన చేయుము పరమాత్మునికి
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నామన దేశవాసులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.శ్రీ సీతారామ లక్ష్మణ అంజనేయ స్వాముల దయామృత కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై విరివిగా ప్రసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Monday, 3 April 2017
కత్తి తెచ్చిన తంటా
అచ్చమ్మ,లచ్చమ్మ అక్కచెల్లెళ్ళు.వీళ్ళిద్దరి ఇంటి పక్కనే యాదమ్మ నివాసం.ఒక రోజు అచ్చమ్మ యాదమ్మ వద్ద కట్టెలు కొట్టే కత్తి తీసుకుని ఎన్నిరోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో యాదమ్మ వెళ్ళి కత్తి తిరిగి ఇవ్వమని అడిగింది.కత్తి తిరిగి ఇవ్వకపోగా నేను తిరిగి ఇచ్చేవరకు నువ్వు ఆగకుండా నన్ను అడగటం ఏమిటి?అంటూ పోట్లాడటం మొదలెట్టింది.ఇంతలో లచ్చమ్మ అక్కకు వంత పాడుతూ గొడవకు దిగింది.మాటా మాటా పెరిగి అచ్చమ్మ,లచ్చమ్మ కలిసి యాదమ్మను పెద్ద వయసు అనికూడా చూడకుండా విపరీతంగా కొట్టారు.అర్ధరాత్రి కనుక చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ తెలియదు.కత్తి తీసుకుని తిరిగి ఇవ్వకపోగా కొట్టారని ఉదయానే అక్కాచెల్లెళ్ళపై యాదమ్మ కేసు పెట్టింది.పోలీసులు వచ్చి అక్కాచెల్లెళ్ళను స్టేషనుకు తీసుకుని వెళ్ళారు.ఏమి జరిగిందో అర్ధం కాక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కత్తికోసం కుస్తీ పట్లు పట్టి స్టేషనుకు వెళ్ళేవరకు వచ్చిన వ్యవహారాన్నితెలుసుకుని కత్తి తెచ్చిన తంటా ఇదంతా అనుకుంటూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు నెమ్మదిగా జారుకున్నారు.
శరణు అందాం
ఓం సాయి శ్రీ సాయి అంటూ సాయి చరణాలకు శరణు అందాం అని భక్తితో జయతమ్మ వ్రాసుకున్నసాయి సంకీర్తన
ఓం సాయి రాం
ఓం సాయి శ్రీ సాయి అందాం అందాం
ఆ సాయి రూపాలు కందాం కందాం"ఓం"
షిరిడీకి మనమంతా వెళదాం వెళదాం
బాబాకు సేవలు చేద్దాం చేద్దాం "ఓం"
అందరం అభిషేకం చేద్దాం చేద్దాం
స్వామి అలంకరణ మనం చూద్దాం చూద్దాం"ఓం"
పూల హారాలు మనము వేద్దాం వేద్దాం
ధూప దీప హారతులిద్దాం యిద్దాం"ఓం"
నిత్య పూజలు మనము చేద్దాం చేద్దాం
ఓం సాయి రాం
ఓం సాయి శ్రీ సాయి అందాం అందాం
ఆ సాయి రూపాలు కందాం కందాం"ఓం"
షిరిడీకి మనమంతా వెళదాం వెళదాం
బాబాకు సేవలు చేద్దాం చేద్దాం "ఓం"
అందరం అభిషేకం చేద్దాం చేద్దాం
స్వామి అలంకరణ మనం చూద్దాం చూద్దాం"ఓం"
పూల హారాలు మనము వేద్దాం వేద్దాం
ధూప దీప హారతులిద్దాం యిద్దాం"ఓం"
నిత్య పూజలు మనము చేద్దాం చేద్దాం
సాయి చరణాలకు శరణు అందాం అందాం"ఓం"
Thursday, 30 March 2017
ఎవరు పిలిచారమ్మా!
శ్రీ సాయి రాం సాయీ అనగానే వచ్చి నీ వెంటే నేనున్నానీ భారమంతా నాదే అనే సాయికి భక్తితో జయంతమ్మ సమర్పించిన సాయినాధ సంకీర్తనా కుసుమం
ఎవరు పిలిచారమ్మా సాయి అని వచ్చినిలిచాడు ఏమి కావాలనినీ భారమంతా నాదేనని ధుని సాక్షిగా చెప్పుచున్నానని "ఎ"
నా చరిత చదివించి నా లీల చూపించి నా బాటలో నిన్ను నడిపించుచూ
నన్ను నమ్మితే చాలు నలుదిక్కులానిలిచి కనురెప్పలా నిన్ను కాపాడతానని "ఎ"
తల్లితండ్రి నేనేనని నీగురువు నేనేనని నీ చెంతనే నేను వున్నానని
ఏ చోట నీవున్న నీలో నేనే వుండి నాదరికి నిన్ను చేర్చుకుంటానని "ఎ"
"
Tuesday, 28 March 2017
తోడు నీడ
నీ హృదయంలో ఉన్న దైవమే నీకు ఎప్పుడూ తోడునీడ అంటూ జయంతమ్మ వ్రాసుకున్నసంకీర్తనా కుసుమం
సాయి రాం
గృహమేగా నీకు దేవాలయం
నీ హృదయంలో ఉన్నది ఆ దైవం
తెలుసుకుని మసులుకుని సాగిపో
నీ జీవితమే సార్ధకమ్ము చేసుకో "గృ"
ప్రకృతియంత పరమాత్మ నిండియుండగా
ప్రతిజీవి భగవంతుని రూపామేగా
ప్రహ్లాదుని బాటలో పయనించుమురా
ప్రతిమనిషి జీవితము ధన్యమగునురా "గృ"
పరమాత్ముని నామాలను స్మరియింపుమురా
భగవంతుని మదిలోనే ధ్యానించుమురా
అణువణువునా అతడేయని తెలుసుకొనుమురా
ఆ దైవమే నీకు ఎప్పుడూ తోడు నీడరా"గృ"
సాయి రాం
గృహమేగా నీకు దేవాలయం
నీ హృదయంలో ఉన్నది ఆ దైవం
తెలుసుకుని మసులుకుని సాగిపో
నీ జీవితమే సార్ధకమ్ము చేసుకో "గృ"
ప్రకృతియంత పరమాత్మ నిండియుండగా
ప్రతిజీవి భగవంతుని రూపామేగా
ప్రహ్లాదుని బాటలో పయనించుమురా
ప్రతిమనిషి జీవితము ధన్యమగునురా "గృ"
పరమాత్ముని నామాలను స్మరియింపుమురా
భగవంతుని మదిలోనే ధ్యానించుమురా
అణువణువునా అతడేయని తెలుసుకొనుమురా
ఆ దైవమే నీకు ఎప్పుడూ తోడు నీడరా"గృ"
విలువ పోగొట్టుకున్నట్లే
ఈమధ్య కొంత మందికి ఎదుటి మనుషులంటే మాటల్లో చెప్పలేనంత నిర్లక్ష్యంగా ఉంటుంది.మీదేముంది?మీ అందరికన్నా మేమే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఎవరికి ఉండే గొప్ప వారికి ఉంటుంది.ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.అది అర్ధం చేసుకుని మాట్లాడటం బాగుంటుంది.మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోమని పెద్దల ఉవాచ.కొంతమందికి పైత్యం ఎంత వెర్రితలలు వేస్తుందంటే చెప్పటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.మర్యాదగా ఫోను చేసి మామ్మగారు ఉన్నారండీ?అని అడిగితే ఆ!ముందు నువ్వెవరో అర్ధమయ్యేలా?చెప్పు ఆ తర్వాత మామ్మగారు ఇంట్లో ఉన్నారో లేదో అప్పుడు నేనెవరో?చెప్తాను అని గయ్యి గయ్యమని అరవటం మొదలెట్టింది.ఏమి మాట్లాడాలో ఫోను చేసిన ఆమెకు తెలియక ఠక్కున పోను పెట్టేసింది.సమయానికి వెళ్ళిన ఆడపడుచుతో ఇదేమిటి ఒదినా?నేను ఫలానా అని మామ్మగారితో మాట్లాడాలి ఉన్నారా? అంటే గయ్యాళితనంగా అరుస్తుంది అంటూ బాధపడింది.బాధపడకు ఈరోజుల్లో ఈవిధంగా మాట్లాడటం ఫ్యాషన్ అని అనుకుంటున్నారు.అమర్యాదగా మాట్లాడితే ఎదుటివారు ఏమనుకుంటారో?అనే జ్ఞానం లేకుండా పోతుంది.మనకు ఎంత డబ్బు ఉన్నా పదవులు ఉన్నాఎదుటి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడటం పద్ధతి.పెరుగుట విరుగుట కొరకే అని గర్వం పెరిగిన కొద్దీ ఉన్న విలువ పోగొట్టుకున్నట్లే అని వాళ్ళకు అనుభవమైతే కానీ తెలియదు.
సూచన:మన బాధ వంటిదే ఎదుటి వారి బాధ అనుకుంటే ఈ తిప్పలు వుండవు.
సూచన:మన బాధ వంటిదే ఎదుటి వారి బాధ అనుకుంటే ఈ తిప్పలు వుండవు.
Friday, 24 March 2017
మతిమరుపు
మతిమరుపు మనుషులకు వస్తుందని తెలుసు కానీ విద్యుత్తుతో పని చేసే వస్తువులకు కూడా వస్తుందని సుచిత్రకు ఈమధ్యనే తెలిసింది.సుచిత్ర ఇంటిలో మైక్రో వేవ్ ఎన్ని ని.లు అమర్చి పెట్టినా ఒక ని.పని చేసి ఆగిపోవటం మొదలు పెట్టింది.మైక్రో వేవ్ రిపేరు చేసే అతన్ని పిలిస్తే మొత్తం తీసి చూచి అమ్మా దీనికి (మెమరీ లాస్) మతిమరుపు వచ్చింది అని చెప్పాడు.సుచిత్ర మైక్రో వేవ్ కి మతిమరుపు రావటం ఏమిటి?విడ్డూరంగా అనేసరికి అవునమ్మా!దీనిలో ఒక పానెల్ ఉంటుంది.దానిలో ఒక భాగం పోయింది అందువల్ల అలా జరుగుతుంది.వందలో ఒకదానికి మాత్రమే ఇలా జరుగుతుంది.ఒకవేళ ఆ భాగం తెచ్చి వేసినా కూడా పనిచేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు.అని విపులంగా చెప్పాడు.సుచిత్ర అయ్యో రామచంద్రా!పాతిక వేలు పోసి నిన్న గాక మొన్న కోన్నానే అంటూ తెగ బాధ పడి పోయింది
Thursday, 23 March 2017
ఓంకార రూపా
ఓంకార రూపా శ్రీ సాయి శరణు శరణు శ్రీ సాయి అంటూ జయంతమ్మ భక్తితో వ్రాసుకున్న సాయినాధ సంకీర్తనా కుసుమం
ఓంకార రూపా శ్రీ సాయీ త్రిమూర్తి రూపా శ్రీ సాయీ
దత్తావతారా శ్రీసాయీ భక్తవత్సలా శ్రీసాయీ
భవభయ హరుడే శ్రీ సాయీ కైలాసనాధుడు శ్రీ సాయీ
పద్మనాభుడే శ్రీ సాయీ పతిత పావనుడు శ్రీ సాయీ
ధర్మము నీవే శ్రీ సాయీ తేజము నీవే శ్రీ సాయీ
జ్ఞానము నీవే శ్రీ సాయీ పాండురంగడే శ్రీ సాయీ
కౌసల్య తనయుడు శ్రీ సాయీ దేవకీ తనయా శ్రీ సాయీ
అనసూయ సుతుడే శ్రీ సాయీ అంజని పుత్రా శ్రీ సాయీ
దశరధ నందన శ్రీ సాయీ దయగల తండ్రివి శ్రీ సాయీ
నందనందనా శ్రీ సాయీ నారాయణుడే శ్రీ సాయీ
సద్గురు రూపా శ్రీ సాయీ సగుణ స్వరూపా శ్రీ సాయీ
అభయ ప్రదాతా శ్రీ సాయీ శరణం శరణం శ్రీ సాయీ
ఓంకార రూపా శ్రీ సాయీ త్రిమూర్తి రూపా శ్రీ సాయీ
దత్తావతారా శ్రీసాయీ భక్తవత్సలా శ్రీసాయీ
భవభయ హరుడే శ్రీ సాయీ కైలాసనాధుడు శ్రీ సాయీ
పద్మనాభుడే శ్రీ సాయీ పతిత పావనుడు శ్రీ సాయీ
ధర్మము నీవే శ్రీ సాయీ తేజము నీవే శ్రీ సాయీ
జ్ఞానము నీవే శ్రీ సాయీ పాండురంగడే శ్రీ సాయీ
కౌసల్య తనయుడు శ్రీ సాయీ దేవకీ తనయా శ్రీ సాయీ
అనసూయ సుతుడే శ్రీ సాయీ అంజని పుత్రా శ్రీ సాయీ
దశరధ నందన శ్రీ సాయీ దయగల తండ్రివి శ్రీ సాయీ
నందనందనా శ్రీ సాయీ నారాయణుడే శ్రీ సాయీ
సద్గురు రూపా శ్రీ సాయీ సగుణ స్వరూపా శ్రీ సాయీ
అభయ ప్రదాతా శ్రీ సాయీ శరణం శరణం శ్రీ సాయీ
Subscribe to:
Posts (Atom)