ఆడపిల్ల అన్నాక కూసింత అక్షరజ్ఞానం ఉండాలి అనేది రామతులశమ్మ గారి వాదన.ఇది యాభై సంవత్సరాల క్రితం మాట.ఆశ్చర్యంగా ఉంది కదూ!ఇది నిజం.ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు,ఇద్దరు మగ పిల్లలు.ఆమెకు చదువంటే చాలా ఇష్టం.మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను కూడా చదివించాలని కోరిక.ఆ రోజుల్లో వాళ్ళ ఊరికి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు.బడికి పంపాలంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి.లేదంటే నగరంలోని బడికి పంపి వసతిగృహాల్లో పెట్టాల్సిందే.రామతులశమ్మ గారు పిల్లలు నడిచి వెళ్ళడం కష్టం కనుక రెండో దానివైపు మొగ్గి భర్తను ఒప్పించి నగరంలో పేరుమోసిన పాఠశాలలో చేర్చారు.అప్పటికి ఒప్పుకుని పిల్లలను నగరంలోని బడిలో చేర్చినా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక భర్త తరపు కుటుంబీకులు ఆడపిల్లలను నగరంలో చదివించడం అవసరమా?అంటూ భర్తను ఒత్తిడి చేసేసరికి ఆయన కొంచెం మెత్తబడేవారు.తులసీ అంత డబ్బు ఖర్చు పెట్టి ఆడ పిల్లలను అంత దూరం పంపించడం ఎందుకు?ఇంటికి తీసుకొచ్చేద్దాము అనేవారు.రామతులశమ్మ గారు పిల్లలను ఎలాగైనా చదివించాలనే పట్టుదలతో తనకు పుట్టింటివారు ఇచ్చిన పొలం కౌలు డబ్బులు తనకోసం ఖర్చుపెట్టుకోకుండా పిల్లల చదువుల కోసం వెచ్చించి చదివించింది.అమ్మా!మీరు బాగా చదువుకుని మీకున్న అక్షరాజ్ఞానాన్ని నలుగురికీ పంచాలి అని తల్లి చెప్పటంతో పిల్లలు కష్టపడి చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు.చిన్నమ్మాయి బాగా తెలివి కలది, చురుకైనది.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే బడికి వచ్చే వారికి మాత్రమే పాఠాలు చెప్పగలము అని సామాజిక సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తన చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే వారికి చదువు ప్రాధాన్యతను వివరించి ప్రభుత్వం తరఫున ఉన్న పధకాల గురించి అనేకసార్లు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి ఎలాగైనా పిల్లలను చదివించేలా ప్రోత్సహిస్తుంది.ముఖ్యంగా ఆడవాళ్లకు పొదుపు పధకాల గురించి చెప్పి వాటివల్ల పొందే లాభాలు,వాటిని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అని వివరించి,వారికి చేతివృత్తులు నేర్పించి ఆదాయమార్గాన్ని సూచిస్తుంది.ఇంతటితో ఊరుకోక ప్రభుత్వం నుండి కూడా వారికి అన్నీ సక్రమంగా అందేలాగా చూస్తుంది.ఇదంతా చెయ్యడానికి చాలా కష్టపడినా ఇప్పుడు అందరికీ ఆమె ఆరాధ్య దైవం.నేను ఈరకంగా మాట్లాడి ఇవన్నీ చేస్తున్నానంటే అమ్మ ప్రసాదించిన అక్షరజ్ఞానం.ఇదంతా అమ్మ చలవ అంటుంది చిన్నమ్మాయి సునీత.అమ్మ చనిపోయిన సందర్భంగా స్నేహితుల వద్ద బాధపడుతూ ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటు చదువుకుని ఉద్యోగం చేసి తమకంటూ ఆదాయం సమకూర్చుకోవాలన్న తపనను గుర్తుచేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంది.అనుకోకుండా చిన్నకొడుకు విదేశాలకు వెళ్ళడంతో ఆ అవకాశం సునీతకు దక్కింది.తర్వాత కొడుకు అయ్యో అమ్మా!నేను సమయానికి దగ్గర లేకపోయనే అంటూ ఉన్నపళానా పరుగెత్తుకుని వచ్చాడు.ఎంతో బాగా చూసుకునే కొడుకు దగ్గర లేడనే బాధ తప్ప చివరి పదిరోజులు పనివాళ్ళు ఉన్నా చిన్నకూతురు సమక్షంలో,కూతురి సేవలతో తృప్తిగా కన్ను మూసింది.అదే అమ్మ ఆత్మకు శాంతి.అమ్మ ఋణం ఎవరూ తీర్చుకో లేనిది.కూతురుగా సునీత అమ్మకు సేవచేసి అమ్మ ఋణం కొంతైనా తీర్చుకుంది.సునీత మాత్రమే కాదు.చివరి రోజుల్లో ఎంత మంది ఉన్నా పిల్లలు దగ్గర ఉన్న దారి వేరు.సాధ్యమైనంతవరకు మనమందరమూ కూడా తల్లిదండ్రుల ఋణం కొంతైనా తీర్చుకుంటే మనకు పెద్దవాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంటుంది.అదే ఘన నివాళి.తర్వాతి కార్యక్రమాలు ఎంత ఘనంగా చేశామన్నది ముఖ్యం కాదు.
No comments:
Post a Comment