కాకర కాయ పేరు చెప్పగానే చాలామంది ముఖం చిట్లించి చేదు పుట్ట మేము అసలు తినము అంటూ ఉంటారు.కాకరకాయ చేదు అన్నమాటే కానీ పోషక విలువల పరంగా ఎన్నో ప్రయోజనాలున్న అమృత తుల్యమైన కాయ.చాట భారతం ఎందుకని అన్నీ చెప్పటం లేదు.వర్షాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే కాకర కాయ తప్పనిసరిగా తినాలి. కాకర కాయతో చేదు తెలియకుండా రకరకాల వంటలు చేయవచ్చు.కాకరకాయ అంటే నా కెంతో ఇష్టం అంటూ బామ్మ చెప్పిన కాకరకాయ కబుర్లు.అఖిల ఒకరోజు బామ్మ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని టెలిఫోను చేసింది.కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఏమి కూరలు వండావు మనవరాలా?అంది బామ్మ.నీకు ఇష్టమైన కాకరకాయ చేశాను బామ్మా!అనగానే ఎంతో సంతోషంగా తనకు ఎంత ఇష్టమో చెప్పడం మొదలుపెట్టింది బామ్మ.నా చిన్నప్పుడు మాకు కాకర తోటలు ఉండేవి.వాటితో మా అమ్మ కాకర కాయ బెల్లం వేసిన అంట(చిక్కటి)పులుసు,ఇగురు,కొద్దిగా ఉడికించి ఎండలో పెట్టి చేసిన వేపుడు,పప్పుల పొడులు దట్టించి చేసిన కాయ కూర,వెల్లుల్లి,ఎండు మిరపకాయలు నూరి చేసిన కూరలు ఇష్టం అని రోజూ కాకరకాయ కూర లేనిదే ముద్ద దిగేది కాదని చెప్పింది.ఆఖరికి ఆకుల మీద కూర్చున్నప్పుడు కూడా పేచీ పెట్టి కాకరకాయ కూర పెడితేనే ఏదైనా తింటానంటే తప్పక మా అమ్మ పెట్టింది.నాకు ఇష్టం అనే కాదమ్మా!ఎవరైనా కాకరకాయ సరిగ్గా వండుకుని తింటే ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మంచిది.నేను ఈరోజు ఇంత గట్టిగా ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా,ఎనభై అయిదు ఏళ్ళు ఉన్నా నాపని నేను చేసుకుంటున్నానంటే అదే కారణం.అన్నట్లు మీ ఆయనకు,పిల్లలకు కూడా కాకరకాయ తినడం అలవాటు చెయ్యి అని బామ్మ అఖిలతో చెప్పింది.తప్పకుండా చేస్తాను.ఉంటాను బామ్మా అంటూ అఖిల ఫోను పెట్టేసింది.
No comments:
Post a Comment