ఈమధ్య చదువుకున్న పిల్లలు కూడా చిన్నచిన్న వాటికి గొడవ పడి విడాకులు వరకు వెళ్లి కాపురాలు కూల్చేసుకుంటున్నారు.దానికి తోడు పెద్దల వత్తాసు.వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళను రెచ్చగొట్టడం అంత అవసరమా?మన కాపురం బాగుండాలి.మన స్వార్ధం కోసం పిల్లల కాపురం చెడిపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఉంటున్నారు కొంతమంది.ఓపిక ఉండగానే కష్టపడకుండా పిల్లల మీద వాలిపోయి గొడవలు సృష్టిస్తున్నారు. మారోజుల్లో నేను మీఅమ్మను కొట్టాను.నువ్వు కూడా నీభార్యను కొట్టు అనడం సమంజసమా? ఇంత చేసి చెప్పిన వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు అరవై ఏళ్ళు వచ్చినా ఒక్కపూట కూడా విడిగా ఉండలేరు.వినేవాళ్ళు ఉంటే చెప్పుడు మాటలు కొంతమంది మంచిచెడు ఆలోచించకుండా చెప్తూనే ఉంటారు.పిల్లలు ఏదన్నా తెలిసో తెలియకో గొడవ పడి మాట మాట పెరిగి పోట్లాడుకుంటే సర్దిచెప్పి వాళ్ళ కాపురం చక్కదిద్దాల్సింది పోయి గొడవ పెద్దది చెయ్యడం సంస్కారమేనా?ఎంతవరకు సబబు?నేనే గొప్ప నాకన్నీ తెలుసు అనుకోవటం తప్ప అక్కడ ఏమీలేదు.ఈరోజుల్లో కూడా బయట ఉద్యోగం చేసి,ఇంటెడు పని చేసి ఇంటిల్లిపాదికీ సపర్యలు చేయాలంటే కష్టం కదా!అందరూ కలసి మెలసి తలా ఒక పని చేసుకుంటేనే సంసారం చూడ ముచ్చటగా ఉంటుంది.కాపురం అన్న తర్వాత ఒకరికొకరు సర్దుకుని ఒకరిమాట ఒకరు వింటుంటే,భార్యాభర్తలు ఇద్దరి మధ్య వేలు కూడా పెట్టలేనంతగా వివాహబంధం గట్టిగా ఉన్నప్పుడు ఎవరెన్ని గొడవలు పెడదామనుకున్నా ఎవరూ ఏమీ చేయలేరు.అసలు చెప్పుడు మాటలు వినటమంత తెలివి తక్కువ తనం మరొకటి ఉండదని అర్ధం చేసుకోవాలి.వాటివల్ల లేనిపోని తలనొప్పి తెచ్చుకోవటమేకానీ,లాభం ఏమీ ఉండదని,మంచి మాటలు తప్ప ఏది ఎవరు చెప్పినా అందులో మంచి,చెడు ఆలోచించకుండా చెప్పినవన్నీ విని గొడవలు పడకూడదని తెలుసుకోవాలి.తమ స్వంత తెలివితేటలను ఉపయోగించి స్వతంత్రంగా ఆలోచించి తమ పండంటి సంసారాన్ని పచ్చగా ఎలా నిలబెట్టుకోవాలో ఎవరికి వారే నేర్చుకోవాలి.భార్య,పిల్లలుతల్లిదండ్రులు,అత్తమామలు,అక్కచెల్లెళ్ళు,బావమరుదులు,అన్నవదినలు,ఎవరికిచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చి గుడ్డిప్రేమతో ఎదుటి వారి మాటలు వినకుండా మన సూటీన మనం పోతే ఆ సంసారం హుందాగా,చూడ చక్కగా ఉంటుంది.మాటామాటా పెరిగినప్పుడు ఒకరి కొకరు వాదించుకుని ఆ మాటలు మనసును గాయపరిచి తర్వాత బాధపడేకన్నా ఆసమయంలో కాసేపు మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు.అప్పుడు ఆ మౌనమే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది.మౌనంగా ఉన్నంత మాత్రాన ఎదుటివారికి తలొగ్గినట్లు కాదు.మౌనంగా గుడ్లు మిటకరించి చూస్తావేమిటి?అనేవాళ్ళు ఉన్నారు.ఆవేశంలో మాట తూలడం సహజం.ఆ మాటను మరల వెనక్కు తీసుకోవడం కష్టం.కనుక ఒకరికొకరు అరుచుకుని గొడవ పెద్దది చేసుకుని నీదే తప్పు అంటే నీదే తప్పు అనుకునే కన్నామౌనంగా ఉండడంఇద్దరికీ,అందరికీ కూడా మంచిది.ఎవరి వారు ఎదుటి వాళ్ళదే తప్పుగా కనపడొచ్చు.కానీ ఇద్దరిలో ఎంతో కొంత తేడా ఉంటేనే గొడవ మొదలవుతుంది.వీరావేశం తగ్గిన తర్వాత గొడవ ఎందుకు వచ్చింది?ఎవరిదీ లోపం అనే దాని గురించి ఆలోచించి విపులంగా మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేసి విడాకుల వరకు వెళ్ళకుండా వాళ్ళవాళ్ళ లోపాలు సరిదిద్దుకుంటే సంసారాలు పచ్చగా ఉంటాయి.ఇల్లు,సంసారం,మనసు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి.ఇంతకీ చాలాసార్లు అసలు కారణం అంటూ ఏమీ లేకుండానే చిన్నచిన్న వాటినే పెద్దది చేసుకుంటారు.తీరిగ్గా ఆలోచిస్తే ఏమీ ఉండదు.వడ్ల గింజలో బియ్యపు గింజ తప్ప.ఇప్పటి తరం కాస్త కోపం,తొందరపాటుతనం తగ్గించుకుని చెప్పుడు మాటలు వినకుండా ఉంటే సంసారాలు పచ్చగా బాగుంటాయి.
Thanks for it inspiring stories...Indu Garu....u r great...
ReplyDeleteThank you
ReplyDelete