Tuesday, 3 July 2018

సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే

                                                            మన రోజువారీ ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.కాలానుగుణంగా లభించే వాటిని తాజాగా వీలయితే ఇంట్లోనే పండించుకుని తినగలిగితే మనకు సరిపడా పోషక పదార్ధాలు సమకూరి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లో వుంటుంది.దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు.మనకు ఉన్నంత స్థలంలోనే నేలమెడ కానీ కుండీలలో కానీ,సంచుల్లో కానీ ఎప్పటికప్పుడు ఆకుకూరల విత్తనాలు చల్లుకోవచ్చు.చిన్న కుండీలో కూరగాయల విత్తనాలు చల్లి కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెద్ద కుండీలలో పెట్టుకోవచ్చు.పండ్ల మొక్కలు తక్కువ ఎత్తులో విరివిగా కాసేవి తెచ్చి పెంచుకోవచ్చు.సొర,బీర,పొట్ల,కాకర వంటి తీగ జాతి మొక్కలను తొట్టిలో విత్తనాలు పెట్టి కాస్త తీగ వచ్చిన తర్వాత తాడుకట్టి పైకి పాకించవచ్చు.తెగుళ్ళు రాకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న   వేప కాషాయం, వెల్లుల్లి కాషాయం,లవంగాల కషాయం వంటివి చల్లుకుంటే పురుగుల బెడద లేకుండా ఉంటుంది.రసాయనాలు చల్లకుండా రసాయన రహిత తాజా ఇంటి పంట మన స్వంతం అవుతుంది.రుచికరమైన ఆకుకూరలు,కాయగూరలు,పండ్లు వాడుకోవచ్చు.దీనితోపాటు రోజు ఉదయం,సాయంత్రం ఒక అరగంట మొక్కలలో తిరిగితే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.స్వంతంగా మన చేతి మీదుగా మొక్కలను పెంచి,పోషించి  అవి మనకు అందించిన ఆకులు,కాయలు,పండ్లు కోస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం.ఆ రుచి,ఆ సంతృప్తి ఎంతో విలువైనది.వీటితోపాటు పువ్వుల మొక్కలు వేసుకుంటే తోట అందంగా ఉంటుంది.సంవత్సరం పొడుగునా వాడుకోవటానికి వీలుగా  విత్తనాలు ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.

No comments:

Post a Comment